24, అక్టోబర్ 2012, బుధవారం

సమస్యాపూరణం - 858 (పండుగ లివి వచ్చు)

కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు, హితులకు
విజయదశమి శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
పండుగ లివి వచ్చు దండుగలకు.

20 కామెంట్‌లు:

  1. ధరణి పండుగులివి వచ్చు దండుగుల కటంచు కొం
    దరు తలంప వచ్చు గాని తప్పు తప్పు సోదరా!
    పరమ సౌఖ్యదములు మనకు పావనములు పండుగుల్
    సరస భావ మలర గనుడు శాంతి సౌఖ్య సంపదల్

    రిప్లయితొలగించండి
  2. విజయద! "శమీ" సమాహ్వయ
    కుజమా! నిను మ్రొక్కునెడల కోర్కులు దీరున్
    విజయములు ప్రాప్తమగునని
    విజయదశమి నాడు గొలుతు వినయమ్మెసగన్

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఒక పండుగ పూట :

    01)
    _______________________________

    పండ్ల కొఱకు క్రొత్త - బండిపై నే బోవ
    బండి నాపి భటుడు - దండు కొనెను
    పండ్ల సొమ్మదంత - దండుగ పాలాయె !
    పండుగ లివి వచ్చు - దండుగలకు !
    _______________________________

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని గారూ
    మీపూరణ చాలా బాగుంది. అభినందదనలు.

    రిప్లయితొలగించండి
  5. పండుగ మామూళ్ళు :

    02)
    _______________________________

    పండుగ నజరాన - పలు విధంబులు జూడ
    పదవి నున్న వార్కి - పంచ వలయు
    బంటు నుండి పెద్ద - పాలకుల వరకు !
    పండుగ లివి వచ్చు - దండుగలకు !
    _______________________________

    రిప్లయితొలగించండి
  6. పండుగ లివి వచ్చు దండు గలకు నన
    మంచి గాదు మనకు మమత లిచ్చు
    బంధు రికము దెలియు భవ బంధము పెరుగు
    పండు గనిన పరమ పావ నంబు

    రిప్లయితొలగించండి
  7. కవి మిత్రులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు.

    నేమాని గురు వర్యులకు ప్రణామములు.
    గురువు గారూ ! మీరు వ్రాసినది ( ధరణి పండుగులివి... ) ఏ పద్యమో నేను తెలుసుకోలేక పోతున్నాను. దయచేసి కొంచెం వివరించండి.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ నాగరాజు రవీందర్ గారికి శుభాశీస్సులు.

    నేను ఈనాడు నింపిన సమస్య "ఉత్సాహ" వృత్తము. దాని గణములు: 7 సూర్యగణములు + 1 గురువు. యతి స్థానము 5వ గణము తొలి యక్షరము. ప్రాస నియమము కలదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. ధన్యవాదములు గురువులకు.

    ముదము శుభము ధనము లదనముగా గూర్చ
    పండుగ లివి వచ్చు ; దండుగులకు
    ధరణి పైన గలరు ధరణీశు లెటులైన
    పన్నులను విధించి ప్రజను జంప.

    రిప్లయితొలగించండి
  10. కవి పండిత మిత్రులకు విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు.
    తే.గీ.
    ధనము వ్యయమైన నేమాయె? దక్కు సుఖము!
    దండి పండుగ లివి వచ్చు దండుగల క
    నుటయ తప్పు! సంస్కృతిని ప్రస్ఫుటముఁ జేయు
    సకల సంతోషదమ్ము లుత్సవములు గద!!

    రిప్లయితొలగించండి
  11. జాతి సంస్కృతి కిల సంబరాలు నిధులు
    చేసికొనవలె నవి కాసులరసి
    గొప్ప పేరు కొఱకు తిప్పలు పడినచో
    పండుగ లివి వచ్చు దండుగలకు .

    రిప్లయితొలగించండి
  12. మిత్రులందరకూ విజయ దశమి శుభాకాంక్షలు !

    పండుగలను కలుగు పరమ సుఖము :

    03)
    _______________________________

    పరిమళించు గృహము - బంధు మిత్రుల తోడ
    పండుగలను కలుగు - పరమ సుఖము !
    పాడి యౌనె యిట్టి - పలుకులు పలుకుట
    "పండుగ లివి వచ్చు - దండుగలకు " !
    _______________________________

    రిప్లయితొలగించండి
  13. నేమాని పండితార్యులు చూపిన అద్భుతమైన బాటలో...

    ఒక సామాన్యుడు భార్యతో..

    ధరలు మండి పోవు చుండె తప్పవాయె ఖర్చులున్
    పెరగ దాయె జీతమేమొ విలువ తగ్గె డబ్బుకున్
    పెరుగుచున్న పిల్ల లకును వెలితి తీర్చ కోరికల్
    తరుణి !పండుగ లివి వచ్చు దండుగలకు చూడగా.

    రిప్లయితొలగించండి
  14. తినెడి తిండి కఱవు తీరైన కొలువేది ?
    ఆలు బిడ్డ లంత యలమ టించ
    మింట నంటు ధరలు వెంట నంటి బిలువ
    పండుగ లివి వచ్చు దండుగ లకు
    ----------------------------------------
    పట్టు బట్ట లేదు పసిడి మాట వలదు
    పిండి వంట లనగ ప్రీతి లేదు
    సగటు మనిషి కేది సంబరమును గాంచ ?
    పండుగ లివి వచ్చు దండుగలకు !

    రిప్లయితొలగించండి
  15. జమ్మి! శమియించు గద కిల్బిషములు గొల్వ
    రామ మూర్తికి ప్రియ వృక్ష రాజ మీవు
    అర్జునుని విల్లు దాచి సహాయ పడిన
    ధారుణీరుహమా నతుల్ దశమి నీకు.

    రిప్లయితొలగించండి
  16. మిత్రులందరికి విజయ దశమి శుభాకాంక్షలు.
    అసలే గొప్ప పండుగ. ఇల్లంతా బంధువులతో, పండుగ ఏర్పాట్లతో హడావుడి. అయినా మిత్రులు వీలు చూసుకొని చక్కని పూరణలు అందించారు. అందరికీ ధన్యవాదాలు.
    *
    నిజం చెప్పమంటారా? ఈనాటి సమస్య నా మనసులోని మాట! అసలే ధనాభావం. పైగా అప్పులు. కేవలం నాఒక్కడి పెన్షన్‌తోనే ఇల్లు గడవాలి. అబ్బాయి సంపాదన లేదు. కొత్తబట్టలు కావాలి. పండుగకు వచ్చిన కూతురి డిమాండ్లు. ఎలా సర్దుబాటు చేయాలా అని టెన్షన్...
    ఇంట ధనము శూన్య, మెటు చూడ నప్పులే,
    కొత్త బట్ట లడిగి కోపగించి
    మొగము ద్రిప్పె బిడ్డ, మోద మెటుల గూర్తు?
    పండుగ లివి వచ్చు దండుగలకు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పద్యం నాలో ‘ఉత్సాహాన్ని’ నింపింది. హితబోధ చేసినట్లుగా ఉంది మీ పూరణ. ధన్యవాదాలు.
    శమీవృక్షంపై మీ పద్యం ప్రశస్తంగా ఉంది.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ మొదటి రెండు పూరణలలో పండుగ దండుగలను వివరించి, మూడవ పూరణలో పండుగ నిండు సుఖాన్నిస్తుందని చక్కని పూరణలను చెప్పారు. మంచి పూరణలు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    పావనమైన పండుగలను గూర్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ‘సంతోషదమ్ము లుత్సవము’లన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    సంపాదన అంతంత మాత్రమైన (నావంటి) సామాన్యుడి వేదనగా మీ పూరణ చాలా బాగుంది. అయినా వేదనను ‘ఉత్సాహం’గా చెప్పిన నైపుణ్యం ప్రశంసనీయం.
    శమీవృక్ష ప్రాశస్త్యాన్ని వర్ణించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణ పద్యాలూ వాస్తవాలను ప్రతిబింబిస్తూ దివ్యంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. తెలుగువారికెన్న తెగవచ్చు పండుగల్
    బంధు జాలమేల భారమట్లు
    కరువుకాటకముల కడుభారతరుణమ్ము
    పండుగలివి వచ్చు దండుగలకు

    రిప్లయితొలగించండి