24, అక్టోబర్ 2012, బుధవారం

సరస్వతీ దండకము

 
సరస్వతీ దండకము

శ్రీ భారతీ! వేదవేదాంత తత్త్వార్థ తేజోవతీ! సర్వ భాషా విశేషాది రత్నాఢ్య సౌవర్ణ భూషాన్వితా! రమ్య సంగీత సాహిత్య ముఖ్యాద్భుతోద్యాన వాటీ విహార ప్రియా! వారిజాతాసనాస్యస్థితా! సుస్థితా! కఛ్ఛపీ దివ్య నిక్వాణ నాదాంచిత వ్యాప్త సర్వాగమా! దేవతానీక సంస్తుత్య భావోన్నతా! భక్త లోకార్థితాశేష విద్యాప్రదా! శారదా! కీరపాణీ! లసద్వేణి!  కళ్యాణి! బ్రహ్మాణి! గీర్వాణి, వాణీ! విరాజద్గుణ శ్రేణి! విద్వన్మణివ్రాత సంపూజితాంఘ్రి ద్వయీ! చిన్మయీ! భక్తితో నీదు తత్త్వంబు ధ్యానించెదన్ నీ మహత్త్వంబు కీర్తించెదన్, నీ పదాబ్జాలు పూజించెదన్  జ్ఞాన వైరాగ్య సంపద్విశేషంబు నిమ్మా, సదా మమ్ము కాపాడు మమ్మా! నమస్తే నమస్తే నమః. 

విజయ దశమి శుభాకాంక్షలతో...

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

5 కామెంట్‌లు:

  1. గన్నవరపు నరసింహ మూర్తిబుధవారం, అక్టోబర్ 24, 2012 10:44:00 AM

    అందరికీ నమస్సులు, దసరా శుభాకాంక్షలు
    అన్నయ్య గారి శారదా దండక మద్భుతము.

    రిప్లయితొలగించండి
  2. మిత్రులందరకూ విజయ దశమి శుభాకాంక్షలు !

    మూర్తీజీ ! బహు కాల దర్శనం ! బావున్నారా ?

    రిప్లయితొలగించండి
  3. పూజ్య గురువులకు ,ప్రణామములు . సరస్వతీ స్తుతి కడు రమ్యముగా నున్నది
    గురువులకు , ప్రియమైన సోదరులకు , విజయ దశమి శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని వారూ,
    మీ ‘సరస్వతీ దండకము’ గంగా ప్రహహంవంటి ధారతో, మధురమైన ఆలంకారిక శోభతో, శబ్దార్థాల సముచిత సమన్వయంతో విరాజిల్లుతూ భక్తిరస ప్రపూర్ణమై మమ్ము ధన్యులను చేసింది. మిత్రులందరి పక్షాన ధన్యవాదాలు.
    *
    గన్నవరపు నరసింహ మూరి గారూ,
    బహుకాలానికి మీ స్పందన తెలియజేసారు. ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. మీ కార్యవ్యగ్రత ఇంకా కొనసాగుతూనే ఉన్నదా?
    *
    స్పందించిన వసంత కిశోర్ గారికి, రాజేశ్వరి అక్కయ్యకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. మిత్రు లందఱికీ మరోసారి దసరా శుభాకాంక్షలు. గురువు గారు చెప్పినట్లు అన్నయ్య గారి సరస్వతీ దండక మొక ఝరీ ప్రవాహమే ! పని వత్తిడి వలన వ్యాఖ్యలు చెయ్యక పోయినా మీ అందఱి పూరణలు తఱచు చదివి ఆనందిస్తూనే ఉన్నాను. కిశోర్ జీ నేను క్షేమమే . మీకు ప్రత్యేకముగా మరోసారి శుభాకాంఖలు.( మనలో మన మాట ! దసరా మామూళ్లు అందఱికీ ముఖ్యముగా విద్యుత్తు శాఖ వారికి సరిగ్గా పంచేసారు కదా ! )

    రిప్లయితొలగించండి