సింహావలోకనము
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు
పరమర్షి ప్రవరుల్ హృదుల్ తరచి విశ్వక్షేమ సంధాన బం
ధుర వేదాక్షర మంజుమాలికల గన్గొన్నార లిచ్చోట, నాం
తరశక్తిం బురుగొల్పి యెల్ల ప్రకృతిన్ వశ్యంబు గావించి యా
త్మరతిం జొక్కుచుఁ బాడినా రుపనిద్గానంబు లిచ్చోట, దు
ర్ధర భూవాయుజలానలాద్యఖిల భూతవ్రాత లోకాద్భుత
స్పురణమ్ముల్ తృటిలో శరాగ్రములపైఁ బుట్టించి రిచ్చోట, స
త్కరుణోర్మిద్రుతశాంతిసంభరిత మర్త్యశ్రేణి సంజీవనో
ద్ధుర రామాయణ భారతాద్యమృత సూక్తుల్ పొంగె నిచ్చోట, సం
కరతాధిక్కృతిఁ ద్రెస్సి మానవ విధుల్ కట్టేదకుండన్ యశ
స్కర లోకద్వయ శర్మ ధర్మమయ విఖ్యాతాధ్వలేఖల్ నిరం
తర సంచారి జనోత్కరానుగతి క్షుణ్ణంబయ్యె నిచ్చోట, సం
సరణవ్యాప్త రుజాజరామరణ దుస్సాధోగ్రదుఃఖౌఘ ని
స్తరణోపాయ గవేషణోన్మిషిత బోధంబౌచు ద్వీపాంతరాం
తరముల్ ప్రాకిన బౌద్ధధర్మ మది జన్మంబెత్తె నిచ్చోట, దు
ష్కర కారుణ్యము శాంత్యహింస లతిముఖ్యంబౌచు వీరత్వపుం
గురు తించించుక జారుతీరులు గనుంగొంచున్ విజాతీయ ము
ష్కరు లంతంత దురాక్రమక్రమములన్ సాగించి రిచ్చోట, శం
కర రామానుజ ముఖ్యవైదిక జగత్కల్యాణ సారోల్లస
త్పరమార్థం బగు తత్త్వబోధము దెసల్ వ్యాపించి దుర్వారతం
గరుడుల్ గట్టి విశిష్టమై తిరముగాఁ గాలూనె నిచ్చోఁ, బర
స్పర సాహాయ్యపురస్సరం, బపగతేర్ష్యాద్వేష, మన్యోన్య సా
దర సమ్మానన, మప్రతర్కిత విభేదం బక్షయైశ్వర్యమే
దుర, మంగీకృత దేవతావిభవ, మాధూతావలేపాంధ్య, మా
చరితాత్మోచిత వృత్తిసంచిత సముత్సాహోద్యతోద్యోగమై
పరువుం గాంచు నమాయకప్రజ కడుం బ్రాపైన దిచ్చోట, నీ
భరతోర్విన్ - ధనధాన్య సంపదభిశోభాగుర్వియై పొల్చు నీ
భరతోర్విన్ - మదిఁ బ్రాణిమాత్రమును సంభావింప నుఱ్ఱూగు నీ
భరతోర్విన్ - పగవానినే నతిథిగా భావించి సేవించు నీ
భరతోర్విన్ - మహితాత్మగౌరవరతిం బ్రాణంబులేనొడ్డు నీ
భరతోర్విన్ - పరదేశివంచనకళా వ్యాపారపారీణతా
పరిపూర్ణత్వము తా ప్రభుత్వమగుచున్ పాలించి, తూలించి, సొం
పరఁ, జీల్కల్‌పడ, భేదభావ మెడదల్ వ్యాపింప, విద్వేషముల్
పెరుగంగా, జవసత్త్వముల్ తరుగగా, వేషమ్ము భాషన్ సదా
చరణమ్కున్ భ్రమపెట్టి, మారిచి, ప్రజాసంఘమ్ము నిర్వీర్యమున్
చరణాథస్థ్సలిఁ ద్రొక్కిపట్టి, తను హృత్సారంబులం బీల్చి పీ
ల్చి, రసాపేత మొనర్చి, యిచ్చటి లసచ్ఛ్రీ స్వీయదేశం బలం
కరణంబౌ గతిఁ బీట వేసికొని బింకంబొప్పఁ గూర్చుండి రౌ
దొరలై తెల్లమొగాలవా రిచట, నిందున్ స్వత్వ మేనాటికిం
దరుగం బోదని పెక్కుయంత్రముల సంధానంబుతోఁ బాటె వి
స్ఫురితంబౌ నిజదేశ సంస్కృతికి మూపుందట్టి వాహ్యాళి స
ల్పిరి తారిచ్చట - నెట్టి నైపుణులు నే విఖ్యాతశాస్త్రార్థముల్
సరియౌ విద్యలె కాక వారి చదువుల్ వ్రాతల్ మహావిద్యలై
పెరుగం జొచ్చె నిరంతరం బిచట - నే విశ్వేతిహాసంబునం
దరయన్ రాని మహాద్భుతప్రగతిమై నన్యోన్య సౌదర్య సం
భరణం బైన సమైక్యభావము ప్రజా స్వాంతంబుల న్నింపి భీ
కర వహ్నుల్ గురిపించు శత్రు సముదగ్రక్రూర శస్త్రాళికిం
గురియయ్యున్ వెనుకంజ లేని దిటవౌ గుండెల్ పునస్సృష్టి చే
సి రయోద్యర్ఘన శాంతి సంగర మహా సేనానియై వైరి సం
హరణం బెంచని వైర సంహరణ దివ్యాస్త్రం బహింసాఖ్య భా
స్వరరూపంబు ధరించి వెండి మనకున్ స్వాతంత్ర్య మిప్పించు సు
స్థిరుఁడై నిర్మల కర్మయోగి యల గాంధిం గన్న పున్నెంపు బం
డరు విచ్చోటు - విపక్షు లెల్ల గొనియాడం దక్షతాదీక్షలన్
ధర శాసించుచు నుక్కుమానిసి యనం ధైర్యంబుతో నిల్చు తీ
ర్పరియౌ వల్లభభాయి, నాయకమణిప్రౌఢిన్ ప్రజాళీ హృదం
తరముల్ పాయ కజాతశత్రుఁ డని సాంద్రఖ్యాతి నార్జించు నే
ర్పరి రాజేంద్రుఁ, డశేష విశ్వజనతా కళ్యాణ సంపాదనా
దర ధీచాతురి సర్వదిగ్వినుతి పాత్రంబౌచు గాంభీర్య ధై
ర్యరమాస్ఫూర్తి జగత్ప్రియుం డయిన కార్యజ్ఞుండు నెహ్రూ మహా
పురుషుం డాదిగఁ బల్వు రూర్జితమతుల్ పొల్పొంది రిచ్చోట, ని
క్కరణిం బైకొని యెన్ని యున్నత కథాకల్పంబులం బల్కినన్
సరియౌఁ గాని స్వకీయ ధర్మవిధులన్ సర్వాకృతిం గార్యతా
పరతం బూన్పక యీప్సితాభ్యుదయమున్ ప్రాపింపఁగా లేని దు
ర్భరదారిద్ర్యపుఁ దాండవమ్మునకుఁ బెన్ ప్రాపైన దిచ్చోట, ట
క్కరి మాటల్, పరహింస, డంబము, నహంకారంబు, స్వార్థైకత
త్పరతల్, లంచము, లేవగింపులు విలుప్తం బౌనటుల్ గాంచుచున్
ద్వరితానుక్షణ జృంభమాన బహుథా వ్యాకీర్ణ యంత్రోద్గతిన్
హరువౌ భౌతిక శక్తి పొంగులకుఁ దో డాధ్యాత్మిక జ్యోతిరు
ద్గిరదుద్దామ దమక్షమాది సుగుణస్థేమంబు గల్పించుచున్
పెరచూడ్కుల్ మిరుమిట్లుగా విభవమున్ విజ్ఞానమున్ బెంచుచున్
భరతోర్విన్ సకలాత్మ సాక్షి మనుపన్ బ్రార్థింతు నశ్రాంతమున్.