10, సెప్టెంబర్ 2012, సోమవారం

పద్య రచన - 108

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. నీమంబొప్పగ పద్మసంభవునకున్ నీడై సదా వాణివై!
    శ్రీమంతుండగు పద్మనాభు నెడదన్ క్రీడించు శ్రీ దేవివై!
    కామారీ తను తాప హారిణివియై! కాత్యాయనీ రూపివై !
    రామా! చిన్మయ రూపిణీ! రసధునీ! రంజిల్లవే నిత్యమున్!

    రిప్లయితొలగించండి
  2. ఓంకార రూపిణీ! యోగేశ్వరేశ్వరీ!
    ....శ్రీ రాజరాజేశ్వరీ! త్రిణయన!
    ఐంకార రూపిణీ! ఆనంద వర్ధినీ!
    ....వాగ్వైభవప్రదా! వర్ణరూప!
    హ్రీంకార రూపిణీ! హిమశైల నందినీ!
    ....అఖిల శక్త్యాత్మికా! అమృతమూర్తి!
    శ్రీంకార రూపిణీ! సింధురాజాత్మజా!
    ....నారాయణప్రియా! వారిజాక్షి!
    సర్వ రూపాత్మికా! దయాసార జలధి!
    సర్వ నామాంచితా! మహాజ్ఞానదాయి!
    సర్వ మంత్రాత్మికా! మహైశ్వర్య! లలిత!
    సర్వ లోకేశ్వరీ! నిన్ను సంస్తుతింతు

    రిప్లయితొలగించండి

  3. కాపాడు మమ్మ !మమ్ముల
    నేపాపము సేసి యెరుగ మే వేళ ల లోన్
    మీ పాద సేవ జేతుము
    మా పాలిట దైవ మీ వె మహ లక్ష్మమ్మా !

    రిప్లయితొలగించండి
  4. వీణను చేతఁ బూని యలివేణిగ బ్రోచిన వాణి రూపమై
    పాణిని శూలమున్నిలిపి భక్తుల గాచిన గౌరి రూపమై
    రాణిగ, మెండుగా ధనపు రాసుల నిచ్చిన లక్ష్మి రూపమై
    జాణవు నిల్చితే ! జనని , సంతత భక్తిని నిల్పు నా మదిన్.

    రిప్లయితొలగించండి
  5. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య....

    మద్గురుతుల్యులు పండీత నేమానివారూ! నేఁటి మీ సీసపద్యము సర్వాత్మిక మేధస్సపచ్ఖక్తి స్వరూపిణియైన జగన్మాతా స్తోత్రము నన్ను భక్తి తన్మయ పులకిత గాత్రునిగ జేసినది! మంత్ర బీజాక్షర పూతమైన యీ పద్యము ప్రతిదిన పూజా సమయ పఠితయోగ్యముగ నున్నది! తమకివే నా ధన్యవాదములు!

    -భవదీయ విధేయుడు,
    గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
  6. అయ్యా! శ్రీ మధుసూదన్ గారూ!
    మీ ప్రశంసలను చూచి సంతోషించేను.
    శుభం భూయాత్.

    రిప్లయితొలగించండి
  7. అయ్యా! శ్రీ సుబ్బా రావు గారూ!
    శుభాశీస్సులు.
    మీ పద్యములో మహలక్ష్మమ్మా! అని వాడేరు. మహాలక్ష్మి అనేదే సాధు రూపము. మహ అని హ్రస్వముతో పదములేదు. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. మా సర్వమంగళాస్తోత్రము నుండి:

    వాణివి నీవు, తామరసపాణివి నీవు, శివార్ధ గాత్రి రు
    ద్రాణివి నీవు, సర్వ శుభదాత్రివి, భక్త వరప్రదాత్రి!, క
    ళ్యాణివి నీవు, నీ యభయ హస్తముతో మము బ్రోవుమమ్మ! గీ
    ర్వాణ గణస్తుతా! పరమ పావన భావన! సర్వమంగళా!

    రిప్లయితొలగించండి
  9. ఎట్టకేలకు ఈ రోజునకు శబ్ద రత్నాకరము, పర్యాయ పదకోశము పుస్తక రత్నాలు తెప్పించుకోగలిగాను. స్ఫూర్తినిస్తున్న శంకరాభరణం బ్లాగు సభ్యులందరికీ, గురువు గారు శ్రీ కంది శంకరయ్య గారికి, పండిత శ్రీ నేమాని వారికి, డా.ఏల్చూరి మురళీధర్ గారికి, పాఠాలు నేర్పిన శ్రీ వసంత కిశోర్ గారికి, అందరికి హృదయ పూర్వక ధన్యవాదములు, నమస్సులు.

    రిప్లయితొలగించండి
  10. మాయా మంత్రము దెలియక
    గాయత్రి వనినమ్మి కొలిచితి కరుణించ గదే !
    ప్రాయేఱు దాట గోరితి
    రాయంచ నడక సొగసుల రాజ్ఞివి తల్లీ !

    రిప్లయితొలగించండి
  11. నేమాని పండితార్యా మీ బీజాక్షర పూతమైన పద్యం శ్రీ మధుసూదన్ గారు చెప్పినట్లు నిత్య పఠనీయంగా భాసిల్లుతోంది.

    రిప్లయితొలగించండి
  12. అమ్మయె ముగ్గురాయె మన యార్తిని జూచిన నెత్తు కొందురే
    కమ్మని ప్రేమ నిచ్చుచును గాతురు భుక్తిని శక్తి యుక్తులన్
    రమ్మని బిల్చి యిచ్చెదరు రంజిల జేతురు జీవితమ్ము నే
    నిమ్ముగ గొల్చు చుందు నను నిత్యము నీమము తప్పకుండగన్.

    రిప్లయితొలగించండి
  13. సత్తాలేనిదె గూడదు
    విత్తము! విద్యలు!నిజమ్మువిశ్వము నందున్!
    చిత్తమున గొల్తుఁగూర్చగ
    నత్తా కోడళ్ళమధ్యనంబా శక్తిన్!

    రిప్లయితొలగించండి
  14. గుండు మధుసూదన్ గారి పద్యము....

    శా.
    చేతన్ వీణ ధరించి, విద్యలొసఁగన్ శ్రీ వాణివై నిల్చి, స
    చ్చేతోమోద విశేష సంపద లిడన్ శ్రీ లక్ష్మివై నిల్చి, యా
    చేతోంశుల్ మొఱ వెట్ట; శక్తి నిడఁగన్ శ్రీ గౌరివై నిల్చి, సత్
    చైతన్య మ్మిడి, యో త్రిదేవి! యిట విశ్వమ్మున్ దగన్ బ్రోవుమా!!

    రిప్లయితొలగించండి
  15. గుండు మధుసూదన్ గారి పద్యము...

    కం.
    వాణీ! వీణా పాణీ!
    పాణి స్థిత సకల విభవ భాస్వ ల్లక్ష్మీ!
    ప్రాణేశార్ధాజిర శ
    ర్వాణీ! ధీ బల ధనాఢ్య! వరదాయి! భజే!!

    రిప్లయితొలగించండి
  16. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా శుభాశీస్సులు.
    పద్యరచనలో ఈనాటి లక్ష్యము: ముగురమ్మల మూలపుటమ్మ. అందరి పద్యములు చక్కగా భక్తిభావముతో రాణించుచున్నవి.

    శ్రీ మిస్సన్న గారు:
    శార్దూల వాహనను ఆవిష్కరింపజేసేరు. ప్రశస్తముగా నున్నది.

    శ్రీ సుబ్బా రావు గారు:
    మహాలక్ష్మిని ఆహ్వానించేరు చిన్న చక్కని కంద పద్యములో. చాల బాగున్నది.

    శ్రీమతి లక్ష్మీ దేవి గారు:
    వాణిగా గౌరిగా లక్ష్మిగా నిలిచిన జననిని ప్రస్తుతించేరు. ప్రశస్తముగా నున్నది.

    శ్రీమతి రాజేశ్వరి గారు:
    గాయత్రీ దేవిని స్తుతించేరు. సొగసుగా నున్నది.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
    మన యార్తిని బాపగ అమ్మయే 3 రూపములు దాల్చెనని సెలవిచ్చేరు. నిజమే. ఇంపుగ నున్నది.

    శ్రీ సహదేవుడు గారు:
    పద్యరచనలో సత్తా చూపుచూ అత్త, కోడలు, అంబలను ప్రార్థించేరు. ఉత్తమముగా నున్నది.

    శ్రీ గుండు మధుసూదన్ గారు:
    ముగురమ్మలకై ఒక శార్దూలమును ఒక అందమైన కందమును సమర్పించేరు. ప్రశస్తముగా నున్నవి.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి




  17. ఆదిపరాశక్తి యద్భుత రూపమ్ము
    తీరుగా నిచట చిత్రింపబడియె
    విద్యాధిదేవిగా వెలసినరూపమ్ము
    కన్నుల విందుగా గానిపించె
    ఐశ్వర్యములకెల్ల యధిదేవతగవెల్గు
    లక్ష్మీ కటాక్షమ్ము లబ్ధమాయె
    అసురసంహారిణి ,యమలస్వరూపిణి
    సర్వమంగళగ దర్శనము నిచ్చె
    అమ్మలనుగన్న యా యమ్మ ,యాదిశక్తి
    జగములన్నిటి నేలెడి శక్తి ,యా త్రి
    మూర్తులకును సంపూర్ణత్వ మొసగ ,నర్ధ
    భాగమై తనరు దేవికి స్వాగతమ్ము.







    రిప్లయితొలగించండి