15, సెప్టెంబర్ 2012, శనివారం

పద్య రచన - 113

ఇంద్రుఁడు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
సీ.
ఐరావ తోచ్చైశ్శ్ర వోధిరూఢుఁడు నీల
          దివ్యదేహుఁడు పూర్వది గ్విభుండు
శతమహాధ్వరకర్త శతకోటిహస్తుండు
          బహు మహాపర్వత పక్షహర్త
సౌందర్యలక్షణానంది శచీప్రియుం
          డనుపమ నందనవన విహారి
శతపత్రనిభ దశశతదీర్ఘ నేత్రుండు
          వారివాహ సమూహ వాహనుండు
తే.గీ.
యుక్త సన్మంత్ర మఘఫలభోక్త నిత్య
మభినవ సుధారసైకపానాభిరతుఁడు
విక్రమక్రమ దేవతా చక్రవర్తి
శ్రీలు మీఱంగ మిమ్ము రక్షించుఁగాత.
(అజ్ఞాత కవి - శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ‘చాటుపద్య మణిమంజరి’ నుండి) 

14 కామెంట్‌లు:

  1. ఇంద్రవజ్ర:
    దేవేంద్ర! దేవాధిప! దివ్యరూపా!
    భావింతు నీ తత్త్వము వజ్రపాణీ!
    కావింతు నీ సంస్తుతి జ్ఞానదాతా!
    ఓ వేదవేద్యా! నను నోమ రావే

    రిప్లయితొలగించండి

  2. దేవ లోకపు నాధుడ !దివ్య పురుష !
    గజము నెక్కిన చిత్రము గాను పించె
    అంద గాడల యందున నంద గాడ !
    అందు కొనుముర వంద నా లందు కొనుము .

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని వారూ! మీ పద్యపు స్ఫూర్తితో నేనో ఇంద్రవజ్రము వ్రాయటానికి ప్రయత్నించాను.

    ఐరావతారూఢ! సహస్రనేత్రా!
    స్వారాజ! హే పూర్వ దిశాధిపాలా!
    హీరాంగధారీ! హరి హే! నగారీ!
    ధారాధరారోహక! దానవారీ!

    రిప్లయితొలగించండి
  4. అయ్యా! శ్రీ ఫణి ప్రసన్న కుమార్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము చాలా బాగుగ ధారాశుద్ధితో పద లాలిత్యముతో అలరారుచున్నది. శుభాభినందనలు. నా పద్యమునకు చిన్న చిన్న మార్పులు చేసి ఇంద్రవంశను చేసేను, గమనించండి.

    ఇంద్రవంశ:
    దేవేంద్ర! దేవాధిప! దివ్య విగ్రహా!
    భావింతు నీ తత్త్వము వజ్రి! వాసవా!
    కావింతు నీ సంస్తుతి జ్ఞానదాయకా!
    ఓ వేదవేద్యా! నను నోమవే ప్రభూ!
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. గురువుగారూ! మీ ఇంద్రవంశ బాగున్నది. మరొక పద్యం.

    వేయికన్నులదేవర వేల్పుఱేడు
    తెల్లటేనుగునెక్కెడు బల్లిదుండు
    కొండకొమ్ములఁ ద్రుంచిన గోటుకాడు
    హయుని తెఱగంటి యెకిమీటి నంజలింతు.

    రిప్లయితొలగించండి
  6. అయ్యె "వైటె లిఫెంటులు" అరెరె ! నేడు !
    వాహనమ్ములు యిలలోన హహహ ! మనకు
    పెరుగు చుండెను యింధన ఖర్చు లన్ని
    ఇంద్ర ! నీవె బెటరు గదా ! యిపుడు జూడ !

    రిప్లయితొలగించండి
  7. ఇంద్రుడైరావతంబెక్కి యింపుగాను!
    సాగుచుండెనోయేసాధ్విఁగౌగిలించ?
    మఱచి గౌతము శాపంబు మరులుగొనెనొ?
    వేయి కళ్ళున్నవైరాగ్యవిధము లేదె?

    రిప్లయితొలగించండి
  8. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి లక్ష్యము: ఐరావతారముపై ఇంద్రుడు.

    శ్రీ సుబ్బా రావు గారు:
    చక్కని తేటగీతిని వ్రాసేరు. 3వ పాదము శ్రవణ సుఖముగా లేదు. ఉత్తమమైన పూరణ.

    శ్రీ ఫణి ప్రసన్న కుమార్ గారు:
    మంచి ధారాశుద్ధితో ఇంద్రవజ్ర వ్రాసేరు. చక్కని తేటతెనుగు పదములతో తేటగీతిని వ్రాసేరు. ప్రశస్తముగా నున్నవి.

    శ్రీ నాగరాజు రవీందర్ గారు:
    వైట్ ఎలిఫెంటును తెరమీదకు తెచ్చేరు. ఇంధనము ధర ఘనముగా పెరుగుచున్నది కాబట్టి. ప్రశస్తముగా నున్నది.

    శ్రీ సహదేవుడు గారు:
    ఇంద్రుడు గౌతముని శాపమును మరచి ఏ సాధ్వి పొందు కోసమో ముస్తాబు అయి వెడలుచున్నట్లు సెలవిచ్చేరు. సొగసుగా నున్నది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి




  9. అష్ట దిక్పాలకులలోన నధికుడతడు ,
    వేల్పులకు రేడు, జగపతి ,వేదమంత్ర
    సంస్తుతుండు ,నైరావత సామజమ్ము
    నెక్కి దర్శన మిచ్చె మహేంద్రు డిచట .

    రిప్లయితొలగించండి
  10. చంద్ర కాంతులు వెద జల్లె నింద్రు కొరకు
    కలువ కన్నెలు వికసించె కనుల విందు
    సురలు నిదురించి యుందురు మరులు గొనుచు
    పయన మాయెను గగనాన పరవ శించి
    ఇంద్రు డైరావ తమ్ముపై యిచ్చ నొంది

    రిప్లయితొలగించండి
  11. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా! శుభాభినందనలు.

    డా. కమనీయం గారు:
    మీరు వ్రాసిన చక్కని పద్యము రమణీయ భావములతో సరళమైన పదబంధములతో అలరారుచున్నది. సామజము పై గల వేదసంస్తుత్యుని చక్కగా వర్ణించేరు. ప్రశంసనీయముగా నున్నది.

    అమ్మ. రాజేశ్వరి గారు:
    మీరు వెన్నెలను రాత్రిని బాగుగ వర్ణించేరు. దేవతలు "అనిమిషులు" అంటే కనులు మూసుకొనరు. ఇంద్రుడు మరులుగొని వెళ్ళుట సహజమే - ఇంద్రుడు ఇంద్రియములకు అధిపతి అంటారు వేదాంతములో. ఉత్తముగా నున్నది మీ పద్యము.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి



  12. శ్రీ గుండు మధుసూదన్ గారు ఒకేసారి అన్ని చందస్సులలో చక్కగా వర్ణించారు.వారికి నా అభినందనలు.

    రిప్లయితొలగించండి


  13. గుండు మధుసూదన్ గారి పద్యములు......
    (పండిత నేమాని వారి సూచనలతో సవరింపబడినవి)....

    నీలైరావతము శ్వేతైరావతముగ మారిన కథ

    స్వాగతవృత్తము:
    స్వాగతమ్ము దివిజాధిప! దేవా!
    వేగ కావఁగదె శ్వేత సువాహా!
    భోగభాగ్యములు పొంపిరి వోవన్
    దేఁ గదే, మఘవ! దీన దయాళూ!

    కరిబృంహితము:
    వాసవుఁడ! కరి బృంహితము విని పజ్జ నునుచఁగ, నచ్చరల్
    హాసమునఁ గడు భోగముల ఘన హర్షమును నిడఁ బాడ, దు
    ర్వాసముని దివి పుష్ప సరమును రంజిలఁగ నిడఁ గాన్కగన్
    వీసమయినను లెక్కనిడకను వేసితివి చవుదంతికిన్!

    గంధగజేంద్రము:
    చేసెను గంధ గజేంద్రము తానే
    వాసనఁ జేరినవౌ భ్రమరాలన్
    వే సనకుండను విఘ్నమిడంగన్
    బూ సరమందలి పూవులు నల్గన్!

    మేఘవిస్ఫూర్జితము:
    మునీంద్రుం డా చేష్టన్ సహనము సెడం బూర్ణ సక్రోధనుండై
    "యనేకాక్షా! నీవున్ సురగణములున్ యష్టి జీవుండ్రు నయ్యున్
    వినీలమ్మౌ మాతంగ సహితముగన్ విఘ్నముల్ గల్గుఁ గాతన్"
    మినుం దాకన్ గంఠధ్వని నుడివెఁ దా మేఘ విస్ఫూర్జితమ్మై!

    మత్త (పంచపాది):
    శాపమ్ముం దా విని చదిరమ్మున్
    గాపట్యమ్మే తన కడ నంచున్
    గాపాడం దూఁకెను కలశాబ్ధిన్
    శాపో'న్మత్త'న్ గని శరధీశుం
    డేపుం జూపెం గరటికిఁ బ్రీతిన్!

    ఇంద్రవంశము:
    ఇంద్రుండు నా శాపమునే వినంగ "మౌ
    నీంద్రా! ననుం బ్రోచియు నీదు శాపమున్
    సాంద్రానుకంపన్ మనసారఁ ద్రిప్పి, దే
    వేంద్రాదులన్ గావుమ యింద్ర వంశమున్!"

    జలదము:
    నా విని మౌనియప్డు కరుణాకరుఁడై
    తా వరమిచ్చెఁ ద్రచ్చఁగ సుధాబ్ధి కడన్
    వేవురు దేవదానవులు పేత్వమునున్
    ద్రావఁగఁ దీఱు నంచు జలదమ్ము వలెన్!

    ఇంద్రవజ్ర(పంచపాది):
    వారంతటన్ వేగమె పాలవెల్లిన్
    జేరంగఁ బోయె న్మఱి చిల్క నంతన్
    క్షీరాబ్ధిలోఁ జూచిరి శ్వేత దంతిన్
    దోరమ్ముఁ బీయూషముఁ దోచె వెంటై
    యీరప్డు కీర్తించిరి యింద్రవజ్రల్!

    -:శుభం భూయాత్:-

    రిప్లయితొలగించండి