27, సెప్టెంబర్ 2012, గురువారం

సమస్యాపూరణం - 834 (ద్రోణుఁ డొక్కఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
ద్రోణుఁ డొక్కఁడు దుష్టచతుష్టయమున.
ఈ సమస్యను సూచించిన
కందుల వరప్రసాద్ గారికి
ధన్యవాదాలు.

29 కామెంట్‌లు:

  1. భారతమ్మును చదువుట భార మిపుడు
    "టీవి షో "లోన నొక్కడు ఠీవి గాను
    చెప్పె ప్రశ్నకు బదులును సిగ్గు లేక
    "ద్రోణుఁ డొక్కఁడు దుష్టచతుష్టయమున"

    రిప్లయితొలగించండి
  2. ద్రోణుడొక్కడు దుష్టచతుష్టయమున
    కుచిత విశ్వాస పాత్రులై యొప్పు యోధ
    వరులలో నిల్చి సేనాధిపతిగ నలరె
    నైదు దినములు కడు భీకరాహవమున

    రిప్లయితొలగించండి
  3. తెర దీసినంతనే బలె
    పరువిడుచు రచింతువుకద పద్యములు బళా
    సరసకవీ! దీవించెద
    నరుసముతో మిమ్ము గోలి హనుమఛ్ఛాస్త్రీ!

    రిప్లయితొలగించండి
  4. భీష్ము డస్త్రముల్ విడువగ భీరులైరి
    కౌరవుల కిక దిక్కుగా కానుపించె
    ద్రోణుఁ డొక్కఁడు దుష్టచతుష్టయమున
    గోడు హెచ్చెను గెలుపుపై గుబులు పుట్టె.

    రిప్లయితొలగించండి

  5. శ్రీ గురువులకు, పెద్దలకు
    ప్రణామములు!

    వరప్రసాద్ గారి సమస్య ద్రోణుని జీవితానికి సమీక్షగా ఉన్నది!

    దుర్యోధనుని కంటె దుర్యోగవశుఁ డౌచు బ్రాహ్మ్యమ్ము వీడి క్షాత్త్రమ్ము నూనె
    రాధేయు కంటె దురాధేయుఁ డై నిరాయుధుపైని నాయుధ ముద్ధరించె
    దుశ్శాసనుని కంటె దుశ్శాసనుం డయి నిశ్శాత్రవతఁ దక్కె నిష్క్రియముగ
    శకుని కంటెను నపశకునాక్షదక్షుఁడై ధర్మపక్ష ముడిగి దాయఁగాచెఁ

    జాపగురుఁ డయ్యు న్యాయ్యమ్ముఁ జాపఁజుట్టి
    వ్యూహములు వన్నె నీతినిర్వ్యూహకముగఁ
    గీడు మొత్తముఁ దా నయి; లేఁడు గాని
    ద్రోణుఁ డొక్కఁడు దుష్టచతుష్టయమున.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
    గురువుగారికి ధన్యవాదములు
    ఈ ప్రశంసలు శ్రీ నేమాని వారికి ,గురువు గారికి జెందుగాక . నా వంటి పామరునకు శ్రీ నేమాని వారి
    శ్రీమదధ్యాత్మ రామాయణము చదివిన పిమ్మట పద్య రచన తెలియ వచ్చె , గురువు గారు నా పిచ్చి పద్యములను చదివి, తప్పులను సవరించి నన్నింతటి వాడను జేసినారు . వీరికి నేను సదా కృతజ్ఞు డను. నాతప్పు లను ఎత్తి జూపి మార్గదర్శకము జేయమని మీ పాద పద్మములకు ప్రణమిల్లి కోరు చుంటిని. మీ అడుగులో అడుగు వేసి నడచుటకు ధైర్యమును ,శక్తినిమ్మని ప్రార్థిస్తూ .

    పెద్దలందరికి ప్రణామములు
    శ్రీ గోలి వారి పూరణను జూచి నవ్వుకోంటిమి.
    ( ద్రోణుడు = మన్మోహన్ సింగ్ , దుష్ట చతుష్ట యము = కాంగ్రెస్ పెద్దలు ) ఆ భావముతో నిచ్చిని గురువు గారు .
    ---------
    ద్రోణు డొక్కడు దుష్ట చతుష్టయము న
    జేర , దుశ్శాస నాధులు సిరులు గోరి
    గురువు స్థానమిచ్చి వెనుక గొయ్యి త్రవ్వి
    వాత బెట్టగా , యున్నటి వన్నె తగ్గె


    రిప్లయితొలగించండి
  7. వేల కొలదిగ విమతుల నేల కూ ల్చె

    ద్రోణు డొక్కడు, దుష్ట చతు ష్ట యమున

    కర్ణ దుస్స సే ను మొదలుగా నతి బల

    వంతు లరయ రా రా జున కెంతొ హితులు .



    రిప్లయితొలగించండి
  8. సరసముగ కందుల వరప్రసాదు గారు
    మంచి దొక్క సమస్య సూచించినారు
    సుకరముగ సమర్థముగ నేల్చూరి వారు
    విమలమతి పూరణమ్ము గావించినారు

    రిప్లయితొలగించండి
  9. శ్రీ గురువులకు ప్రణామములు!

    ఎప్పుడో విస్మరించిన కవిత్వరచనోద్యమాన్ని మళ్ళీ మీ అనర్ఘమైన ఆశీర్వాదదోహదం వల్ల చేపట్టగలిగాను.

    నే మానితి మును, గవితా
    నేమాని కొఱకుఁ దపించి; నేఁటికిఁ గంటిన్
    నే మానితముగఁ బండిత
    నేమాని కవీంద్ర! మిమ్ము నెమ్మి దలిర్పన్.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి

  10. ద్రోణునిఁ గూర్చి పౌరులు సంభాషించుకొనుచున్న సందర్భము)

    ద్రోణుఁ డొక్కఁడు పాండవ తుష్టిఁ బెంచు,
    సభ్యతనుఁ గని, వెలుఁ గొందు సరణి నేర్పు!
    ద్రోణుఁ డొక్కఁడు దుష్ట చతుష్టయమున
    వక్రతలఁ గని, నడతల సరణి మార్చు!

    రిప్లయితొలగించండి
  11. " ద్రోణు డొక్కడు దుష్ట చతుష్టయమున
    నందు రెరుగక, కాదందు నతడు లేడు,
    శకుని, రారాజు,దూర్త దుశ్శాసనుండు,
    వీర కర్ణుడీ నలుగురే పిశునులందు."

    రిప్లయితొలగించండి
  12. ఉప్పు తిన్నట్టి ఋణమున నూడి గమ్ముఁ
    జేయ వలెనంచుఁదలవంచి చిక్కె నపుడు
    ద్రోణు డొక్కడు దుష్టచతుష్టయమున
    సర్వ సేనాధి పత్యము నిర్వ హించ

    రిప్లయితొలగించండి
  13. ఒక్క వైపు పాండవ వీరు లొక్క వైపు
    ద్రోణు డొక్కడు ; దుష్ట చతుష్టయమున
    నొక్క డైన దుర్యోధను డొక్క వైపు
    వలలు డొక వైపు నిలిచిరి - కలను లోన

    రిప్లయితొలగించండి
  14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నిజమే! టీవీ షోలల్లో అప్పుడప్పుడు మన పురాణేతిహాసాల గురించి వేసిన ప్రశ్నలకు వచ్చే సమాధానాలను వింటే మతి పోతుంది. చక్కని పూరణ.
    నేమాని వారు మెచ్చుకున్నట్లు ‘తెర దీయగానే’ అంత వేగంగా స్పందిస్తూ నిర్దోషంగా, ప్రశంసనీయంగా పూరణలు, పద్యాలను వ్రాస్తున్న మీ ప్రతిభకు జోహార్లు.

    ఇచ్చిన వెనువెంటనె కడు
    ముచ్చటగ సమస్యలకును పూరణములనే
    మెచ్చుగఁ జేసెద వని నే
    నచ్చెరు వందెదను గోలి హనుమచ్ఛాస్త్రీ!
    *
    పండిత నేమాని వారూ,
    ‘పదిదినంబులు భీష్ముఁ డాహవభారకుండు గురుండు పం
    చదివసంబులు....’ పద్యాన్ని గుర్తుకుతెచ్చిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    గోలి వారిని, కందుల వారిని మెచ్చుకున్న మీ పద్యాలు వారిని ప్రోత్సాహించే విధంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    నిజంగా ఈనాటి మీ పూరణ అత్యద్భుతంగా ఉంది. శబ్దాలంకార శోభితమై అలరిస్తున్నది. ముఖ్యంగా దుర్యోగవశుఁడు, దురాధేయుఁడు, దుశ్శాసనుఁడు, అపశకునాక్షదక్షుఁడు శబ్దాల ప్రయోగం అలరించింది. ధన్యవాదాలు.
    నేమాని వారిపై యమకాలంకారంతో చెప్పిన పద్యం మనోహరంగా ఉంది.
    *
    వరప్రసాద్ గారూ,
    వ్యంగ్యాత్మకమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ద్రోణుడి ఉభయపార్శ్వాలను ప్రస్తావించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మీనారాయణ గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని గారు, శంకర గురు వర్యులకు నమస్కారములు. మీయొక్క ఆశీర్వచనములు, ప్రోత్సాహములే మాకు కొండంత బలము. ధన్యవాదములు. వరప్రసాదు గారూ ! ధన్యవాదములు.

    తెర తీయగనే వ్రాసెద
    "సరసకవి " నినే నటంచు శ్లాఘించిన మీ
    చరణములకు నా జోతలు
    సరి "తీయగ" నేను వ్రాతు సత్కృప తోడన్.

    రిప్లయితొలగించండి




  16. విదుర,గాంగేయ,కృపులును,వృద్ధ గురువు
    ద్రోణుడొక్కడు ,దుష్టచతుష్టయమున
    కెంత హితము చెప్పినగాని సుంత వినరు
    యెవరి కర్మను దప్పింప నెవరి వశము ?

    రిప్లయితొలగించండి




  17. విదుర,గాంగేయ,కృపులును,వృద్ధ గురువు
    ద్రోణుడొక్కడు ,దుష్టచతుష్టయమున
    కెంత హితము చెప్పినగాని సుంత వినరు
    యెవరి కర్మను దప్పింప నెవరి వశము ?

    రిప్లయితొలగించండి
  18. గురువుగారూ ధన్యవాదాలు.
    నిజంగా శ్రీ ఏల్చూరి వారి పూరణ అపురూపం. అద్భుతం.
    వారు సరస్వతీ పుత్రులు. వారి పరిచయం మాకొక వరం.
    శ్రీ గోలి వారు నేమాని పండితార్యుల ప్రశంశకు నూటికి నూరు పాళ్ళూ అర్హులు.

    రిప్లయితొలగించండి
  19. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _______________________________

    ద్రౌణి యాకలి తీర్చగా;- దానమిడుము
    ద్రోణి నొకదాని నంచును - ద్రుపదు వేడె
    ద్రోణు డొక్కడు ! దుష్టచ- తుష్టయమున
    ద్రోవదిని చిన్నబుచ్చిన - ద్రోహ చింత
    ద్రుణులు పొందిరి రణమున - దుర్మరణము !
    _______________________________
    ద్రౌణి = అశ్వత్థామ
    ద్రోణి = పాడియావు
    ద్రోవది = ద్రౌపది
    ద్రుణులు= దుష్టులు

    రిప్లయితొలగించండి
  20. మిత్రులారా!
    శుభాశీస్సులు

    మన బ్లాగున కాభరణం
    బనదగు నేల్చూరి సంస్కృతాంధ్రమ్ములలో
    నెనలేని పండితుడు కవి
    యని గూర్తు శుభాశిషముల నరుసము మెరయన్

    సముచితమగు సాధన ని
    త్యము జేయుచునుండ శైలి యద్భుతముగ ను
    త్తమ రీతుల నలరుట త
    థ్యము కద! రారండు సుకవులారా! వేడ్కన్

    రిప్లయితొలగించండి

  21. పండితకవిమిత్రులు ఏల్చూరి మురళీధర రావు గారూ! తమరి సమస్యాపూరణం చక్కని ప్రౌఢిమతో నాలంకారికతతో శబ్దగాంభీర్యతతో నలరారుచున్నది. అభినందనలు! మీ వంటి పండిత కవులతో పరిచయభాగ్య మేర్పడినందుల కెంతేని యానందకరముగనున్నద. ధన్యవాదములు మఱియు శుభాకాంక్షలతో...భవదీయమిత్రుఁడు
    గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
  22. కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘వినరు + ఎవరు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వాక్యావసానంబున సంధిలేమి దోషంబుగాదని యార్యులండ్రు’ అన్నందున ఆ పాదాన్ని ‘ఎవరు’ అని ప్రారంభించవచ్చు.
    *
    వసంత కిశోర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి


  23. శ్రీ శంకరయ్య గారికి ,నమస్తే.మీ సూచనలను గ్రహించుచున్నాను.ధన్యవాదములు.ఇందరు ఉద్దండ పండితులమధ్య సాహసించి వ్రాస్తున్నాను.కొంచెం సహజ ప్రతిభ,ఉత్సాహం ఉండుటవలన.

    రిప్లయితొలగించండి
  24. శ్రీ గురువులకు, పెద్దలకు
    ప్రణామములు!

    నిన్నటి రచనకు దయతో ఆదరమేదురోక్తులు పలికిన మీ అందఱికి పేరుపేరున ధన్యవాదాలను సమర్పించుకొంటున్నాను.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  25. goli vaari speed chustunte nijamuga ascharyamu kalugaka manadu..anta takkuva time lo..vari yokka virupu..chamatkaram..matalajimmikkulu..prasalu..chadivi anadinchvalasinade kaani..varninchanalavi kaadu..sarswati kataksham ayanaku ilane ellappudu prasarinchuchu vundalani manasphurti ga korukuntunnamu..inka enno ilanti puranalanu..mundutarala variki andinchalani..meeyokka sahitya sevanu..konasaginchela aa yokka amma varini aseerva dinchmani vedukontu...oka abhimani..

    రిప్లయితొలగించండి