26, సెప్టెంబర్ 2012, బుధవారం

సమస్యాపూరణం - 833 (పిల్లి మహాగ్రహంబునను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
పిల్లి మహాగ్రహంబునను బెబ్బులిపై కుఱికెన్ వధింపఁగన్.
ఈ సమస్యను పంపిన
ఏల్చూరి మురళీధర రావు గారికి
ధన్యవాదాలు.

26 కామెంట్‌లు:

  1. ఎల్లెడ దైవముండునని హెచ్చగు నమ్మిక తోడనప్పుడా
    పిల్లడు చెప్ప క్రోధమున బెద్దగ ప్రేలుచు చూపుమన్న, నా
    నల్లని వాడె స్తంభమున నాడగుపించగ నారసింహుడై;
    జెల్లెనొ యాయువన్న విధి "జిక్కెను శత్రువ"టంచు దల్చి, యా
    పిల్లి మహాగ్రహంబునను బెబ్బులిపై కుఱికెన్ వధింపఁగన్.

    గురువుగారు,
    మళ్ళీ కొన్ని రోజులు శలవు.

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    పూర్వం కాశీ యాత్ర చేస్తూ ఒక యోధుడు :

    01)
    _________________________________________

    వెళ్ళుచు , కాశి యాత్ర, కొక - వీరుడు కానన బాట లందునన్
    పెళ్ళము తోడు రాగ , దుర - పిల్లెడు పిల్లల బుజ్జగింపుచున్
    పిల్లల తోడ గూడి పెను - వృక్షపు నీడను సేద దీరగా
    పెళ్ళున మీద బడ్డ నొక - వేగిని గాంచి , నిరాయుధుండు, చూ (కో )
    పిల్లి , మహాగ్రహంబునను - బెబ్బులి పై కుఱికెన్ వధింపఁగన్ !
    _________________________________________
    చూపిల్లి = చూచి
    కోపిల్లి = కోపగించి

    రిప్లయితొలగించండి
  3. అల్లదె పాండు పుత్రులు మహా గహనమ్మున పాదచారులై
    మెల్లగ పోవుచుండ పులి మీద పడన్ పొదచాటు నుండి భీ-
    తిల్లెను కృష్ణ దాని గని ధీరుడు భీముడు ఖడ్గమూని కో-
    పిల్లి మహాగ్రహంబునను బెబ్బులిపై కుఱికెన్ వధింపఁగన్.

    రిప్లయితొలగించండి
  4. తన ఊరిమీద పడి అశాంతిని రేపుతున్న యొక బెబ్బులిని చంపడానికుత్సాహించిన ఒక వీరుడు.........

    పిల్లలు పెద్దలంచు నొక భేదములేక నిరంతరంబు నా
    పల్లెలయందు భీతిగొలుపంగ జరించియశాంతినింపగా
    నుల్లమునందు నిశ్చయము నొందెను వీరుడొకండు తాను కో
    పిల్లి మహాగ్రహంబునను బెబ్బులిపైకురుకెన్ వధింపగన్.

    రిప్లయితొలగించండి
  5. గురువుగారూ,

    కోపిల్లి మహాగ్రహంబునను అని పూరించినప్పుడు పునరుక్తి దోషము వస్తుందేమోనని నా అనుమానము.

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యా !
    పై ప్రయోగాలు

    చూపిల్లి = చూచి
    కోపిల్లి = కోపగించి
    తప్పయితే

    దూపిల్లి = దుఃఖిస్తూ(జి ఎన్ రెడ్డి గారి నిఘంటువు)
    వాడుకోవచ్చు !

    రిప్లయితొలగించండి
  7. చూపిల్లు, కోపిల్లు అనే పదరూపాలు ఉన్నాయా అని సందేహము.
    భాసిల్లు, విలసిల్లు అనే పదములో ఉన్న అర్థానికి, కోపించు అనే పదములో ఉన్న అర్థానికి భేదముంది. స్వతఃసిద్ధమైన, అప్రయత్నంగా అగుపించే గుణానికి భాసిల్లు అనే రూపము.
    కోపం సందర్భానుసారము బయటపడే గుణము కాబట్టి కోపిల్లు కన్నా కోపించు సరియైన పదమై ఉంటుందని నా ఊహ.
    తప్పైతే మన్నించండి.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
    సవరణలకు గురువుగారికి ధన్యవాదములు
    ----
    బల్లులు జేర మెల్లగను- బల్లల క్రిందుగ నక్రమార్జనల్,
    నల్లని వారలండలను - నల్లధనంబున బొంది, బెబ్బులై
    పల్లెలపై బడంగ కడు-పారగ గంజియు జిక్కకుండె ,భి
    తిల్లగ వారు,క్రోధమున -దీనుల ,హీనుల రక్షణా ర్థియై
    పిల్లి మహాగ్రహంబునను బెబ్బులిపైకురుకెన్ వధింపగన్.
    (పిల్లి =saamaanyudu,బెబ్బులి= akramaarkulu)


    రిప్లయితొలగించండి
  9. చల్లగ ద్రోలుచున్ రధము శల్యుడు పల్కెను సూతపుత్ర యీ
    ప్రల్లదమేల గెల్చెదవె పార్థుని కాలుడు నీదు పాలిటన్
    మెల్లగ జారుకొమ్మికను మేలగు ప్రాణము లున్న నవ్వగున్
    పిల్లి మహాగ్రహంబునను బెబ్బులిపై కుఱికెన్ వధింపఁగన్.

    రిప్లయితొలగించండి
  10. పిల్లిని మాంత్రికుండొకడు పెంచి మహాద్భుత శక్తులిచ్చె వ
    ర్తిల్లుచు నుండె నద్ది విపరీత మదమ్మున కాననంబులం
    దెల్లెడలందు దాని నెదిరింపగ నెంచగ వ్యాఘ్రమొం డహో
    పిల్లి మహాగ్రహంబునను బెబ్బులిపై కురికెన్ వధింపగన్

    రిప్లయితొలగించండి
  11. కల్లయె వీరభూమి యిది ఖ్యాతిని గొన్నది పౌరుషమ్మునన్
    పల్లవమైన చేవ యిట భారత నారులు వీరపత్నులున్
    తల్లులు వీరపుత్రులకు తప్పదు భంగము వైరి కల్లదే
    పిల్లి మహాగ్రహంబునను బెబ్బులిపై కుఱికెన్ వధింపఁగన్.

    రిప్లయితొలగించండి

  12. ఉల్లమెలర్ప రాముఁ డతి యుత్సుకతన్ ఘను వాలిఁ గూల్తు నాన్
    దెల్లముఁ జేయ, సూర్య సుతుఁ డిప్పుడ వాలిఁ బిల్చుచున్,
    జల్లఁ బడంగఁ జిత్త మిటు చయ్యన యుద్ధము సేయు కోర్కి ఱం
    పిల్లి, మహాగ్రహంబునను, బెబ్బులి పైకుఱికెన్ వధింపఁగన్!

    రిప్లయితొలగించండి
  13. అయ్యా! శ్రీ మధుసూదన్ గారూ!
    శుభాశీస్సులు.
    మీ పద్యము 1వ పాదములో "రాము డతి యుత్సుకతన్" ప్రయోగమును సవరించాలి. రామవిభు డుత్సుకుతన్ అని మార్చండి. 2వ పాదములో కొన్ని అక్షరములు టైపు అవలేదు. సరిజేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ గురువులకు, పెద్దలకు
    ప్రణామములు!

    ఢిల్లి పురోపకంఠమున డిండిమముల్ మృగయావినోదని
    త్యోల్లసనంబుఁ గూర్చు తఱి యోధవరేణ్యుఁడు షాజహాన్ ధరా
    వల్లభుఁ డుగ్రఖేటకరవాలములం గొని పెంపుమీఱ ఱం
    పిల్లి మహాగ్రహంబునను బెబ్బులిపై కుఱికెన్ వధింపఁగన్.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  15. శ్రీ కందుల వరప్రసాదు గారు: శుభాశీస్సులు.

    శ్రద్ధగా కందుల వరప్రసాదు గారు
    నిత్యమును పద్యరచనమ్ము నెమ్మనమున
    జేయుచుండగ శైలిలో చెప్పదగిన
    విధముగా నభివృద్ధి కన్పించుచుండె

    రిప్లయితొలగించండి
  16. గౌ. పండిత నేమాని వారికి ధన్యవాదములు. రెండవ పాదంలో గణదోషం టైపాటే! సవరించిన నా పూరణ...

    ఉల్లమెలర్ప రామవిభుఁ డుత్సుకతన్ ఘను వాలిఁ గూల్తు నాన్
    దెల్లముఁ జేయ, సూర్య సుతుఁ డిప్పుడ వోయియు వాలిఁ బిల్చుచున్,
    జల్లఁ బడంగఁ జిత్త మిటు చయ్యన యుద్ధము సేయు కోర్కి ఱం
    పిల్లి, మహాగ్రహంబునను, బెబ్బులి పైకుఱికెన్ వధింపఁగన్!

    రిప్లయితొలగించండి
  17. కల్లలు గావు వాస్తవము కాననమందొక మౌని ప్రీతితో
    పిల్లుల దెచ్చి శ్రద్ధగను బెంచెను నిత్యము పాలుపెర్గుతో
    డల్లన పిల్లులందునొక అద్భుత ధైర్యము గర్వమున్న ఓ
    పిల్లి మహాగ్రహంబునను బెబ్బులిపై కురికెన్ వధింపగన్.

    రిప్లయితొలగించండి

  18. గురువులు శ్రీ కంది శంకరయ్య గారు మరియు శ్రీ నేమాని గార్లకు ప్రణామములతో -

    మెల్లన యిండ్లలో జనుచు మీగడ పాలను దొంగిలించి భీ
    తిల్లుచు మూల నక్కుచును దిర్గు బిడాలక మొక్కడున్ వనం
    బెల్లను డాసి జూచుచును బెబ్బులి గహ్వర మందు జొచ్చె నా
    పిల్లి ; మహాగ్రహంబునను బెబ్బులి - పై కుఱికెన్ వధింపగన్

    ఇక్కడ బెబ్బులి ( కర్త ) పిల్లిని చంపడానికి దాని పైకి వురికిందని నా భావం.

    రిప్లయితొలగించండి
  19. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    గతంలో ‘ఆబ్సెంట్ వితౌట్ లీవ్‌లెటర్’ అయితే ఈసారి ‘ఆన్ లీవ్’లో వెళ్తున్నారు!
    *
    వసంత్ కిశోర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    భారతార్థంలో మీ రెండు పూరణలూ బాగున్నవి.
    మీ మూడవ పూరణ కూడా అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ లెప్పుడూ ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతూ ఉంటాయి. వృత్త రచనలోనూ నైపుణ్యం సంపాదించారు. సంతోషం! అభినందనలు.
    నేమాని వారి ప్రశంసను పొందడం ఆనందదాయకం.. మీకూ, నాకూ!
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    వరప్రసాద్ గారిని ఆశీర్వదించిన పద్యానికి ధన్యవాదాలు. ఔత్సాహిక కవులకు మీ ఆశీస్సులు, ప్రశంసలు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ వృత్తలేఖనా సామర్థ్యం నాకు తెలిసిందే. చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.
    ‘మెల్లన యిండ్లలో’ అని కాకుండా ‘మెల్లన నిండ్లలో’ అనండి.

    రిప్లయితొలగించండి
  20. తెల్లని ముష్కరాధములు తెల్గున తేజము రామ రాజునే
    మెల్లగ నమ్మకంబునను మీదట చర్చకు బిల్చి చాటుగా
    నల్లదె బట్టి రూధరట నాశము జేయగ నెంచె, జూడగా
    పిల్లి మహాగ్రహంబునను బెబ్బులిపై కుఱికెన్ వధింపఁగన్.

    రిప్లయితొలగించండి
  21. కల్లును ద్రాగి మైకమున ఘాతకుడొక్కడు దూరెనింటిలో
    బల్లిదుడైన హంతకుని బారిని బిడ్డల గావనెంచి యా
    తల్లి తెగించి వానిపయి దాడికి గత్తిని బట్టె నెట్లనన్
    '' పిల్లి మహాగ్రహంబునను బెబ్బులి పై కురికెన్ వధింపగన్ ''

    రిప్లయితొలగించండి
  22. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అల్లూరిపై వ్రాసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. చెల్లియొ చెల్లకో ఘనుడు చెన్నుగ నూనుచు జందియమ్మునున్
    చెల్లియగూడి మోడి పయి చెండుచు మండుచు దండయాత్రనున్
    గుల్లగ జేతు నిన్ననుచు గొప్పగ తిట్టగ తోచెనిట్టులన్👇
    "పిల్లి మహాగ్రహంబునను బెబ్బులిపై కుఱికెన్ వధింపఁగన్"

    రిప్లయితొలగించండి