16, సెప్టెంబర్ 2012, ఆదివారం

దత్తపది - 26 (అల్లము - చింతపండు - కోతిమీర - జీర)

అల్లము - చింతపండు - కోతిమీర - జీర
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.


అవధాని అనిల్ మాడుగుల గారి పూరణ....

అల్లమునీంద్ర సంస్తుతు కటాక్షము నొందగ పాండునందనుల్
త్రెళ్ళున చింత పండునది తేలిక గాలికి లేచిపోయె, హా
యు(ఉ)ల్లము కోతి మీరవలయున్ హరినే స్మరియించి, భక్తి కో
కొల్లగ జీర పాండవులకున్ జయమొందగజేసె చూడుమీ !


(రవి గారికి ధన్యవాదాలతో....)

22 కామెంట్‌లు:

  1. అల్ల ముప్పతిప్పలుఁ బెట్టు మల్లు భీము
    చింత పండుట నెరిఁగిన చెంత వృష్ణి
    సైగజేసె కోతి మీర చెలగి వేగ తొడలు
    జీర నా సుయోధను, గదన్ దూరు మనుచు

    రిప్లయితొలగించండి
  2. అల్ల ముక్కంటి దయతోడ నస్త్రమొందు
    వీడు నీ చింత, పండును విజయ తపము
    రథ పతాకమె కోతి, మీరగ బలంబు
    ధన్వి రిపులఁజీర జయమె ధర్మరాజ!!

    రిప్లయితొలగించండి
  3. గుండుమధుసూదన్ గారి పూరణ....
    (కర్ణ జనన సమయాన కుంతీ భాస్కరుల సంభాషణము)

    సూర్యుఁడు:
    "అల్ల మునిచంద్రు వరమునఁ బిల్లవాఁడు
    ప్రభవ మందె! వలదు చింత! పండు గిదియ!"
    కుంతి:
    "కోరి మంతుఁ జదువ నేను కోతి! మీర
    రవియగా! నేను జీరఁగ రాఁగఁ దగునె?"

    రిప్లయితొలగించండి

  4. భీ ముడు జేసెను బచ్చడి
    ప్రేమగ మఱి చింత పండు బెల్లము ,జీ రన్
    వామును నల్లము కలిపియు
    గోముగ నిక కొత్తి మీ ర కూడను గలి పీ .

    రిప్లయితొలగించండి
  5. చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం ఉంది. సవరిందండి.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘పండు గిదియ’ను ‘పండుగ యిదె’ అనీ, ‘రాఁగఁ దగునె’ను ‘రాఁ దగునొకొ’ అనీ చెపితే ఇంకా బాగుంటుందేమో!
    *
    సుబ్బారావు గారూ,
    చక్కని ఆలోచన. వలలుడిని విషయంగా తీసుకొని మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. అల్ల ముదమందగా కౌరవాధముండు
    కోతి!మీరడె సభలోనఁగొంగులాగి
    వానిఁ జంపఁదీరు చింత,పండుగనుచుఁ
    జీదె పాంచాలి తనగొంతు జీరబోగ!

    రిప్లయితొలగించండి

  7. అల్ల ముప్పుతిప్పలన్ బెట్టె రారాజు;
    యంత పాండవ మది చింత పండె ;
    కోతి మీరె రథము గుర్తుగా ; ప్రభవించె 
    మారుతి కనులందు యెరుపు జీర ! 

    రిప్లయితొలగించండి
  8. అజ్ఞాతవాసం లో భీముడు:
    అల్లము నూరుచుండునపుడయ్యదె వేలువలెన్ దలంచుదా
    నుల్లముఁ బిండునట్లు గొను నూహలు పిండుచు చింతపండునున్
    ఘొల్లున నవ్వి,కేలనుచుఁ గూరలఁ ద్రుంచును కోతిమీరలన్
    జెల్లని వాదులన్ దలచి చేసెడు సాధనొ జీరగుండెలన్

    రిప్లయితొలగించండి
  9. కవి మిత్రుల 'పాకములు ' బహు రుచిగా నున్నవి.

    ద్రౌపది అర్జునునితో...

    అల్ల ముక్కంటి నెదిరిన మల్లు మీరు
    కోతి మీరథమున దీర గొల్వు, దీరు
    చింత, పండుగ గానగు జేసి సమర
    మందు జీరగ పగతుర నపుడె శాంతి.

    రిప్లయితొలగించండి
  10. అల్లము కోతి మీరయును
    జిల్లన చింత పండు జీర చిత్రాన్నము లన్ !
    పుల్లని చారులు జిహ్వకు
    కొల్లలు వండెను వడముడి కొసరి భుజిం పన్ !

    రిప్లయితొలగించండి


  11. స్వామి సౌగంధికా పుష్ప సౌరభమ్ము
    యుల్లమును జేసె కోతి మీరల్ల ముందు
    పోవ నాచింత పండ నా పుణ్య ఫలము
    తెచ్చి నాకీయుడని జీర మచ్చె కంటి

    భీము డేగెను వెదకుచు వృద్ధుడైన
    వానరముగాంచి ద్రోవలో పరిహసించి
    వాలమును పైకి నెట్టగా వలను కాక
    వేడి శరణమ్ము పూవొందు వీలు దెలిసె.

    రిప్లయితొలగించండి
  12. అల్ల ముప్పతిప్పలుఁ బెట్టు మల్లు భీము
    చింత పండువేళ నెరి౦గి నంత వృష్ణి
    చేతిసైగఁ జేసెను వేగ కోతి మీర
    చెలగి యాసుయోధను తొడన్ జీరమనుచు

    రిప్లయితొలగించండి
  13. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘జంపఁదీరు చింత’ అన్నదానిని ‘జంపఁదీరును చింత’ అంటే సరి! బహుశా మీది టైపాటు కావచ్చు!
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మొదటి పాదంలో యతిదోషం. ‘అంత ముప్పు తిప్ప లందించె..’ అందాం. ‘రారాజు + అంత’ అన్నప్పుడు యడాగమం రాదు. అందువల్ల ‘అంత’ను ‘సుంత’ చేద్దాం. ‘కోతి మీర’ను కోతిమీరె అని దత్తపదిలో మార్చరాదు. ‘కోతి మీర’ అన్నా అన్వయదోషం లేదు.
    *
    రామకృష్ణ గారూ,
    గుండెలన్ జీర సాధన చేస్తున్నాడా? బాగు బాగు! చక్కని పూరణ. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఈనాటి మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం బహుధా ప్రశంసనీయం. బాగుంది. అభినందనలు.
    మొదటి రెండు పాదాల్లో గణదోషం. నా సవరణలతో ఆ రెండు పాదాలు....
    ‘అల్లమును కోతి మీరయు
    జిల్లనగా చింతపండు జీరాన్నములన్...’
    (ఇక్కడ జీరాన్నము అంటే జీరారైస్ కాదు. జీరకము ఉంది కాని జీర(ము) లేదు. జీరా శబ్దానికి చక్కెరపాకము అనే అర్థం ఉంది. కాబట్టి జీరాన్నము అంటే చక్కెర పాకముతో కలిసిన అన్నం అని అర్థం చెప్పుకోవాలి)
    *
    మిస్సన్న గారూ,
    మొదటి పద్యంలోనే దత్తపదిని సమర్థవంతంగా పూరించారు. బాగుంది. అభినందనలు.
    ‘సౌరభమ్ము + ఉల్లమును’ అన్నపుడు యడాగమం రాదు. ‘సౌరభ మది/ యుల్లమును...’ అందాం.
    *
    చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య...

    శ్రీ శంకరయ్యగారికి నమోవాకములు! మీరు నాపద్యమునకు సూచించిన సవరణములు నద్భుతముగ నున్నవి. తమరు సవరణములు సూచించినందులకు ధన్యవాదములు! కృతజ్ఞుఁడను.

    రిప్లయితొలగించండి
  15. రవి గారి పూరణ....

    అల్ల మురారి మాధవుని న్యాయము నెంపక మట్టువెట్టగా
    చెల్లగ లేక సోలితిరి చిక్కులు దాల్చిరి, చింత పండెఁ బో
    ఉల్లము కోతి; మీరలకు నొల్లవిఁ జేసిక యేగుదెంచిరే,
    చిల్లరపూజ సేయనిటుఁ జీరుడి సేనల భండనంబునన్.

    రిప్లయితొలగించండి




  16. అల్ల ముద్దుల సతి కోర్కె ననిలసుతుడు,
    పయనమాయెను హిమవంత పర్వతమున
    పండు కోతిమీరగ నడ్డుపడెను ,లేక
    చింత పండుకొనియె దాని జీర ,భీము
    డనియె నీ తోక తీయు నా కడ్డు తొలగ.

    రిప్లయితొలగించండి
  17. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    మిత్రులందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు !

    సౌగంధికోపాఖ్యానం :

    01)
    _______________________________

    అల్ల మురిపెంపు సతి గోర - యామె చింత
    పండు నట్లుగ జేయగా - పర్వతముల
    పయన మైనట్టి భీముని - వనము నందు
    జీర వలె నేల జీరాడు - చిత్రమైన
    వాల మడ్డముగా జాపి - పండు కోతి
    మీర లేనట్టి భీముని - మేల మాడ;
    పావనని యెంచి , ప్రార్థించి - పవన సుతుడు
    పథము నెరిగెను; సౌగంధ - వనము జేరి
    పూవులను దెచ్చె పూబోణి - పొంగు నటుల !
    _______________________________

    రిప్లయితొలగించండి
  18. కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘నీ తోక తీయు నా కడ్డు తొలగ’ అన్నదానిని ‘నీ తోక తొలగించు మడ్డు తొలగ’ అందాం.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ ‘సౌగంధికోపాఖ్యానం’ బాగుంది. అభినందనలు.
    ‘సతి గోర నామె’ అనీ, ‘పావనిగ నెంచి’ అని నా సవరణలు... ‘కోరన్ + ఆమె’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘పావని + అని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.

    రిప్లయితొలగించండి