10, సెప్టెంబర్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 818 (శివుఁడవొ మాధవుఁడవొ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
శివుఁడవొ మాధవుఁడవొ సరసిజజన్ముఁడవో.
(ఉదయమే త్యాగరాజు వారి ‘ఎవరని నిర్ణయించిరిరా’ కీర్తన విన్న ప్రభావంతో...)

27 కామెంట్‌లు:

 1. గురువుగారూ ఇక్కడ సరసిజ సూనుడు అంటే ఎవరు?

  రిప్లయితొలగించండి
 2. అవివేకి నైన నేనీ
  భువి జీవుల కెల్ల తండ్రి బోలిన వాడా
  ఎవరని నిను చెప్పంగల
  శివుఁడవొ మాధవుఁడవొ సరసిజసూనుఁడవో

  రిప్లయితొలగించండి
 3. ఎవరికి లోనుండును జగ
  మెవరో మూలము జగతికి నెన్నుచు తండ్రీ
  తవ పాదముల విడువను
  శివుఁడవొ మాధవుఁడవొ సరసిజసూనుఁడవో.

  రిప్లయితొలగించండి
 4. మిస్సన్న గారూ,
  బ్రహ్మ అనే అర్థంలోనే సరసిజసూనుడు అన్నాను. గుండు మధుసూదన్ గారు కూడా ఫోన్ చేసి తమ సందేహాన్ని వెలిబుచ్చి సూనుడు అని కాకుండా సంభవుడు, ఉద్భవుడు మొదలైన పదాలలో ఏదైనా వ్రాయమన్నారు. అందువల్ల సరసిజ జన్ముడవొ ఆని సవరించాను.
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 5. గజేంద్రుని ప్రార్ధన:
  స్తవముల్ జేయగ లేనిక
  భవబంధములు విడిపించు పరమాత్మా! నీ
  వెవరవొ నే నెరుగనురా
  శివుఁడవొ మాధవుఁడవొ సరసిజసూనుఁడవో!

  రిప్లయితొలగించండి
 6. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
  తవ పాదములను విడువను అన్నారు. తవ అని తెలుగులో వాడరు. ఆ పాదమును మార్చుదాము. "భవదంఘ్రి యుగము విడువను" - అని. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 7. గుండు మధుసూదన్ గారి పూరణలు....

  (1)
  ఎవరని నే నినుఁ గొల్తును?
  వివరింపఁగలేను తండ్రి! వేడెదఁ దెలుపన్
  నవరూప మిదేమొ? నీవు
  శివుఁడవొ? మాధవుఁడవొ? సరసిజ జన్ముఁడవో?

  (2)
  నువు సృష్టి స్థితి లయముల
  కెవరై చేసెదవు? నన్నుఁ గృపఁ జూడఁగ నీ
  వెవరవొ? తండ్రీ తెలుపుము!
  శివుఁడవొ? మాధవుఁడవొ? సరసిజ జన్ముఁడవో?

  (3)
  భవ మిడియు, జీవనమ్మిడి,
  భవబంధమ్ములనుఁ ద్రెంచు పరమాత్మా! నీ
  వివరములఁ దెలుపు తండ్రీ!
  శివుఁడవొ?మాధవుఁడవొ? సరసిజ జన్ముఁడవో?

  రిప్లయితొలగించండి
 8. ఎవరని దెలుపుదు నయ్యా!
  భువి ననుదినమును విడువక బ్రోచెదవీవే,
  యవధులు జూడని కృపతో.
  శివుఁడవొ మాధవుఁడవొ సరసిజజన్ముఁడవో.

  రిప్లయితొలగించండి

 9. కవనము వ్రాయుదు నీ పయి
  వివరముగా దెలుపు మయ్య ! వివరము ల న్నీ
  యె వడవొ ,యె చట నివాస మొ
  శివుడ వొ మాధవు డ వొ సరసిజ జన్ము డ వో.


  రిప్లయితొలగించండి
 10. అయ్యా! శ్రీ గుండు మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.
  మీ 1వ పద్యములో 3వ పాదములో గణభంగము - కాస్త సవరించండి.

  2వ పద్యములో 'నువు" అని ప్రారంభించేరు. "నీవు" అనే పదమునకు "నువు" పర్యాయ పదము కాదు. పరిశీలించండి. స్వస్తి.

  అమ్మా! లక్ష్మీదేవి గారూ!
  శుభాశీస్సులు.
  భవచరణాంఘ్రి విడువను.
  భవ అని కాదు - భవత్ లేక భవదీయ అని వాడాలి. చరణ అనినా అంఘ్రి అనినా ఒకటే కదా. ఆ పాదమును ఇలా మార్చుదాము:
  భవదంఘ్రి యుగము విడువను -- స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. మన్నించండి.
  మీ సవరణకు కడు ధన్యవాదములు.

  భవదంఘ్రి యుగము విడువను
  భవ బంధమ్ము విడిపించి పాలింపగ నా
  ధవుడవు నీవని నమ్ముదు.
  శివుఁడవొ మాధవుఁడవొ సరసిజజన్ముఁడవో.

  రిప్లయితొలగించండి
 12. యెవరని యడుగను నిన్నిక
  యెవరైనను జనుల గాచు నిల దైవంబై !
  యెవరికి నెవరను వాడవు
  శివుఁ డవొ మాధవుఁ డవొ సరసిజ జన్ముఁ డవో !

  రిప్లయితొలగించండి
 13. నవ జనన స్థితి లయలక
  దెవరధ్యక్షతవహించి దివిమహియెల్లన్
  నివసింతురొ నడిపింతొరొ
  శివుఁడవొ?మాధవుఁడవొ? సరసిజ జన్ముఁడవో?

  రిప్లయితొలగించండి
 14. ఎవరని యెంతును నిను ?! ఈ
  భవసాగర దరిని జేర్చు భగవంతుడవే !
  ఎవడవు ? నీ వెవడవు? ఆ
  శివుడవొ, మాధవుడవొ, సరసిజ జన్ముడవో !

  రిప్లయితొలగించండి
 15. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.
  చక్కని సవరణ సూచించినారు. సవరణ తో...

  ఎవరికి లోనుండును జగ
  మెవరో మూలము జగతికి నెన్నుచు తండ్రీ
  భవదంఘ్రి యుగము విడువను
  శివుఁడవొ? మాధవుఁడవొ? సరసిజ జన్ముఁడవో?

  రిప్లయితొలగించండి
 16. అవనీ తలంబు ధన్యము
  నవనీతహృదయుడ!సాయి! నమ్మితి మయ్యా!
  యెవరెట్లుగొల్వఁగావవె?
  శివుడవొ?మాధవుడవొ?సరసిజజన్ముడవో?

  రిప్లయితొలగించండి 17. భవతారకమగు రూప
  మ్మెవరైనను నేమొకొ జగదీశ్వరుడె కదా
  యవిరళభక్తిని గొలువగ
  శివుడవొ ,మాధవుడవొ,సరసిజ జన్ముడవో ?

  రిప్లయితొలగించండి
 18. నేటి డాక్టర్ల పని తీరు గురించి:

  భువనమున పురుడు పోయగ,
  భువిలో రోగములుఁ బాప,పుడమి భరము తీ
  ర్ప వివిథ విథముల వెజ్జువు!
  శివుఁడవొ మాధవుఁడవొ సరసిజజన్ముఁడవో!!

  రిప్లయితొలగించండి
 19. శ్రీ సరస్వత్యై నమః:
  మిత్రులార! శుభాశీస్సులు.
  ఈనాటి పూరణలన్నియు భక్తి భావముతో కూడుకొనినవే. చిన్న కందపద్యములే చక్కని ధారతో సాగినవి. అందరికీ అభినందనలు.

  శ్రీ మిస్సన్న గారు:
  తాను అవివేకినని చెప్పుకొన్నారు. తాను జ్ఞానస్వరూపుడయిన ఆత్మ అనే అనుభవము త్వరలో రావాలి. ఉత్తమముగా నున్నది.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
  ఎవరికి లోనుండు జగము అని మొదలిడి సుమారు గజేంద్రుని మొరను తలపింపజేసేరు. ఉత్తమముగా నున్నది.

  శ్రీ చంద్రశేఖర్ గారు:
  గజేంద్రుని మొరనే వినిపింప జేసేరు. తప్పక శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయి ఉండును. ప్రశస్తముగా నున్నది.

  శ్రీ గుండు మధుసూదన్ గారు:
  1. ఏమిటీ నవరూపం; 2. సృష్టి స్థితి లయలు ఎవరికై చేస్తావు; 3.భవమునిడి పెంచే వాడవు అనే 3 విధముల భావములతో వ్రాసిన పద్యములు ప్రశస్తముగా నున్నవి.

  శ్రీమతి లక్ష్మీ దేవి గారు:
  భువి మము నిత్యము బ్రోచేడి వాడవు నీవే యనియు మరియు మాధవుడవౌ నీవే యనియు 2 విధములుగా పూరించేరు రస మాధుర్యముతో నున్నవి.

  సుబ్బా రావు గారు:
  కవనము వ్రాయుదు నీపై అన్నారు - కవనమును ఆ భగవంతుడే వ్రాయించుతాడు - మన చేతిలో కలము వాడే పెట్టి నడిపించును కదా. చాల బాగున్నది.

  శ్రీమతి రాజేశ్వరి గారు:
  జనుల గాచు నిల దైవము నీవే యని సెలవిచ్చేరు. ఇంపుగనున్నది.

  శ్రీ చంద్రమౌళి గారు:
  నవ జనన స్థితి లయముల కధ్యక్షత వహించిన వానిని ఉట్టంకించేరు. ప్రశస్తముగా నున్నది.

  శ్రీ నాగరాజు రవీందర్ గారు:
  భవ సాగరము దరి జేర్చు భగవంతుడవు అన్నారు - సొగసుగా నున్నది.

  శ్రీ సహదేవుడు గారు:
  నవనీత హృదయ సాయీ! అని సాయిని ఆవిష్కరింపజేసేరు. వినూత్నముగా నున్నది.

  డా. కమనీయం గారు:
  భవతారకమగు రూపమును చూచేరు - ధన్యులు. ప్రశస్తముగ నున్నది.

  శ్రీ జిగురు సత్యనారాయణ గారు:
  వైద్యుల వృత్తులను జ్ఞాపకము చేసేరు - ఆ దేవుడు అందరికీ వైద్యుడే కదా -- వైద్యనాథుడన్న, ధన్వంతరి యనినా అతడే. ప్రశస్తముగా నున్నది.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 20. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య....

  శ్రీ పండిత నేమాని వారి శిష్యవాత్సల్యమునకు కృతజ్ఞుడను. సవరించిన నా పూరణములు....

  (1)
  ఎవరని నే నినుఁ గొల్తును?
  వివరింపఁగలేను తండ్రి! వేడెదఁ దెలుపన్
  నవరూపుఁడ వీ వెవఁడవు?
  శివుఁడవొ? మాధవుఁడవొ? సరసిజ జన్ముఁడవో?

  (2)
  భవ! సృష్టి స్థితి లయముల
  కెవరై చేసెదవు? నన్నుఁ గృపఁ జూడఁగ నీ
  వెవరవొ? తండ్రీ తెలుపుము!
  శివుఁడవొ? మాధవుఁడవొ? సరసిజ జన్ముఁడవో?

  (3)
  భవ మిడియు, జీవనమ్మిడి,
  భవబంధమ్ములనుఁ ద్రెంచు పరమాత్మా! నీ
  వివరములఁ దెలుపు తండ్రీ!
  శివుఁడవొ?మాధవుఁడవొ? సరసిజ జన్ముఁడవో?

  రిప్లయితొలగించండి
 21. విద్యాసాగర్ అందవోలుమంగళవారం, సెప్టెంబర్ 11, 2012 8:54:00 AM

  ఎవరని నిను కొల్చెద ని
  న్నెవరితొ నే పోల్చెద నవనిజధవ?యికనీ
  వెవరివొ తెలుపుము తండ్రీ !
  శివుడవొ మాధవుడవొ సరసిజ జన్ముడవో?

  రిప్లయితొలగించండి
 22. అవె! పాతవి! కాల్చితివిగ!
  ధవుడై బీదలను బ్రోచి
  ధనికులు వగచన్
  ఇవె! క్రొ త్తవి! ముద్రించిన
  శివుఁడవొ! మాధవుఁడవొ!సరసిజజన్ముఁడవో!

  ...మోడీ!

  రిప్లయితొలగించండి
 23. కువలయ నేత్రను కాంగ్రెసు
  చవటల నోడించి మొట్టి జగడము లోనన్
  దవడలు బాదిన మోడీ
  శివుఁడవొ మాధవుఁడవొ సరసిజజన్ముఁడవో

  రిప్లయితొలగించండి