13, సెప్టెంబర్ 2012, గురువారం

సమస్యాపూరణం - 821 (బావల భుజియించుటే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
బావల భుజియించుటే శుభావహ మందున్.

25 కామెంట్‌లు:

 1. ఏవేవి విడువ వలెనో
  యే వేళలలో ప్రదేశ మేది విడుచుటో
  యా వర్జ్యంబుల కనిశం
  బావల భుజియించుటే శుభావహమందున్

  రిప్లయితొలగించండి
 2. పండుగకి మామగారి ఇంటికి వచ్చిన ఓ అల్లుడు [వీలైనంత మర్యాదగా] :

  మావాఁ విడు నేఁ బోయెదఁ
  ద్రోవన్ బలుసాకు దిని బతుకవచ్చున్ లే
  దీవంటలఁ దిను ధైర్యం
  బావల భుజియించుటే శుభావహమందున్

  రిప్లయితొలగించండి
 3. గుండు మధుసూదన్ గారి పూరణలు....

  (విష్ణ్వాది దేవతాపూజా వ్రతాదుల ననుష్ఠించు దినములం దుపవసించి, తదుపరి దినమున భోజనాదుల స్వీకరించుట సంప్రదాయ మనుట)
  (1)
  భావించియు మావిభు, సం
  భావించి యుమావిభుఁ, దదుపరి వాగ్విభు నే
  సేవించిన యట్టి సుదినం
  బావల భుజియించుటే శుభావహ మందున్!
  (2)
  (లేక యా పూజా వ్రతాదులు సంపూర్ణముగ నిర్వర్తించి, యుపవాస దీక్ష విడిచిన తదుపరి భుజించుట సంప్రదాయమనుట)

  దేవతల వ్రతము సేయఁగ
  నేవిధి యుపవాసముందు రే వారలు? వా
  రావిధి తదుపరి సమయం
  బావల భుజియించుటే శుభావహ మందున్!

  రిప్లయితొలగించండి
 4. అయ్యా! శ్రీ మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యములు బాగుగనున్నవి. ఈ పాదము --
  "సేవించిన యట్టి సుదినం"
  గణభంగముగ దోచుచున్నది.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 5. ఆవల యీవల నుండియు
  నావలపై యేరు దాటి నడి రేయైనన్ !
  బోవలదన కూటి కొర
  కా [ బా ] వల భుజియించుటే శుభా వహ మందున్!

  రిప్లయితొలగించండి
 6. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య....

  పండిత నేమానివారికి నమస్కారములు! పద్యమున దొరలిన పొరపాటును దెలిపినందులకు ధన్యవాదములు. చిత్తు ప్రతిలో నేను రెండు విధముల వ్రాసినందున దొరలిన పొరపాటిది! మొదట మూఁడవ పాదమును "సేవించి యట్టి సుదినం" గాను; పిదప "సేవించినట్టి సుదినం" గాను వ్రాసితిని. సెల్ లో టైపు చేయునపు డిందలి 'న' , యందలి 'య' కలసిపోయినవి.

  సవరించిన పద్యము:

  భావించియు మావిభు; సం
  భావించి యుమావిభుఁ; దదుపరి వాగ్విభు నే
  సేవించినట్టి సుదినం
  బావల భుజియించుటే శుభావహ మందున్!

  రిప్లయితొలగించండి
 7. ఈవల మాంసాహారము
  నావల శాకాది సాత్త్వికాహారములౌ
  యీ విందులోన సుకరం
  బావల భుజియించుటే శుభావహమందున్

  రిప్లయితొలగించండి
 8.  కొంతమంది కుటుంబ సభ్యులు కలిసి ఒక కారులో ప్రయాణిస్తున్నారు.   అది మధ్యాహ్న భోజనసమయం. టౌనులో ఏదో ఒక హోటల్ కనబడితే కారులోని ఒకతను  అందులో భోజనం చేద్దామని అనగానే, మరొకతను అంటున్నాడు యిలా : 

  " బావా ! చెప్పెదను వినుము ! 
    బావర్చీ యనెడు దాబ బహు బాగుండున్ ! 
    త్రోవలొ తినెదము  ; నగరం 
    బావల  భుజియించుటే శుభావహ మందున్ ! " 

    వివరణ : బావా ! ఊరి బయట దారిలో ఒక మంచి దాబ వుంది. మనం అందులో తినడమే శ్రేయస్కరం !  

  రిప్లయితొలగించండి

 9. నీ వే పొగడితి విప్పుడు
  బావల, భుజి యించు టే శుభా వహ మందున్
  పావన రాముని నామము
  బావలతో కలిసి నీ వు పలికిన పిదపన్ .

  రిప్లయితొలగించండి
 10. శ్రీ సరస్వత్యై నమః:
  మిత్రులారా! శుభాశీస్సులు. ఈనాటి సమస్యను ఏలాగున పూరించుటా అనుకొంటే మంచి మంచి పూరణలే వచ్చుచున్నవి. అందరికీ శుభాభినందనలు.

  శ్రీ రామకృష్ణ గారు:
  మామగార్ని "మావా" వెళ్తాను అంటున్నారు అలిగిన అల్లుడు గారు. శుభం ఆలాగే వెళ్ళనీయండి. బయటి భోజనముతో డబ్బులు వదిలి జబ్బులు వస్తే ఆ సరదా తీరుతుంది. మంచి పూరణ.

  శ్రీ గుండు మధుసూదన్ గారు:
  2 మంచి పద్యములు - భక్తి రసము నిండింది. నోములు, వ్రతాలు, ఉపవాసాలు అయిన తరువాతనే భోజనము చేస్తే బాగుంటుంది. ఇంపైన పూరణ.

  శ్రీమతి రాజేశ్వరి గారు:
  మనము సమస్యమును మార్చలేము. మీ పద్యములో 3వ పాదమును ఇలా మార్చుదాము:
  "పోవలదన శుచిమంతం" - అని. చక్కని పూరణ.

  శ్రీ నాగరాజు రవీందర్ గారు:
  ఊరవతల రోడ్డు ప్రక్క ధాబా బాగుంటుంది అన్నారు వారి అనుభవములో. తథాస్తు. సొగసైన పూరణ.

  శ్రీ సుబ్బా రావు గారు: బావలను పొగిడించేరు - నామకీర్తన చేసిన తరువాతే భోజనము అన్నారు - మంచి విధానమునే అలవాటు చేస్తున్నారు. శుభం భూయాత్. ఉత్తమమైన పూరణ.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ గురువులకు, పెద్దలకు ప్రణామములు!

  జీవికిఁ గర్మఫలంబును
  శ్రీ విశ్వేశ్వరపదాబ్జసీమ నిలిపి దే
  హావరణము వీడి సుఖం
  బావల భుజియించుటే శుభావహ మందున్.

  విధేయుఁడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 12. కేవలము విందు కొఱకని
  తావలచి పిలువ చెలియన తమి గొని యైనన్ !
  బోవలదు పీయూష మిడినం
  [ దా ] బావల భుజి యించుటే శుభావహ మందున్ !

  రిప్లయితొలగించండి
 13. గుండు మధు సూదన్ గారి పూరణ...

  (పౌలము పనులు సేయు కూలీలు మధ్యాహ్న సమయాన భుజించుటకై మా పొలము గట్టునకు రాఁబోఁగా, నా దారిన ముండ్లున్నవని నే నీ విధముగ నందును!)

  "రా వలదీ వైపున; కీ
  త్రోవను ముండ్లున్న వెన్నొ! తొలఁగఁ గదయ్యా!
  పోవయ్య! యీ కుమార్గం
  బావల భుజియించుటే శుభావహ" మందున్!

  రిప్లయితొలగించండి
 14. బావా యిటు రా సుబ్బా-
  రావుకు జ్వరమాయె తినగ రాదిట దోసెల్
  చావడిలో కేగుట సబ-
  బావల భుజియించుటే శుభావహ మందున్

  రిప్లయితొలగించండి
 15. శ్రీ యుతులు గుండు మధుసూదన్ గారికి తెలుగు పద్య ప్రక్రియ మీద ఉన్న మమకారం, ఆ ప్రక్రియలో వారికున్న అభినివేశం, శంకరాభరణంలో పూరణలు చేస్తూ బ్లాగులో కవిమిత్రులన్దరితో వాటిని పంచుకోవడానికి వారు చేస్తూన్న కృషి, తీసుకొంటున్న శ్రమా బహుధా శ్లాఘనీయం. వారికి నా అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. బావా గతికిన యతకదు
  పోవలదులె పిల్ల యింటి భోజన మునకై
  శ్రావణ నిశ్చయ లగ్నం
  బావల భుజియించుటే శుభావహ మందున్

  రిప్లయితొలగించండి
 17. భావించి విఘ్న నాధుని
  పావన భాద్రపదచవితిఁపత్రీ కుడుముల్
  బ్రోవగనిడి నైవేద్యం
  బావలభుజియించుటే శుభావహమందున్!
  (పావన=శుద్ధ)

  రిప్లయితొలగించండి
 18. మిత్రశ్రీ సహదేవుడు గారికి,

  భక్తినిర్భరంగా ఉన్నది మీ పద్యం!

  భావించి విఘ్ననాథునిఁ
  బావన భాద్రపదచవితిఁ బత్రియుఁ గుడుముల్
  బ్రోవఁగ నిడి నైవేద్యం
  బావల భుజియించుటే శుభావహ మందున్!

  అని చదువుకొంటాను.

  సర్వ శుభాకాంక్షలతో,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 19. దేవతలను బూజించియు
  సేవించి యతిథులను దగ జిత్తమ్మున స
  ద్భావముతో గలుగ సుఖం
  బావల ,భుజియించుటే శుభావహ మందున్.

  రిప్లయితొలగించండి
 20. శ్రీవన మాదరి నుండెను
  పావన కార్తికమున మన వనభోజనమా
  కావేరి పుణ్య తీర్ధం
  బావల భుజియించుటే శుభావహమందున్

  రిప్లయితొలగించండి
 21. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య.....

  సుకవి మిత్రులు శ్రీ మిస్సన్న గారు నాపైఁ జూపిన యాదరణమునకుఁ గృతజ్ఞుఁడను. "తెలుఁగుఁ బద్యంబు నిత్యమై తేజరిల్లు" ననెడి యాంధ్ర పద్యకవితా సదస్సు కవి మిత్రులలో నొకఁడనై, పద్యకవితకు నుజ్జ్వల భవిష్యత్తు నందఁజేయవలెననడి యాశయముతోఁ జంద్రుని కొక నూలు పోగు సామెతగ పద్యకవితా సద్యజ్ఞమును కొనసాఁగించుచున్నాను. ఇందు కవి మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారి యీ కృషిలో భాగముగా గురుతుల్యులు పండిత నేమాని వారి వంటి పెద్దలు గ్రంథకర్తలు, కవి పండిత మిత్రులు డా. ఏల్చూరి వారు మఱియు తమ వంటి సుకవి మిత్రు లందఱును ప్రగతి శీల భాగస్వాములే! పద్యకవితా కృషీవలురే! అందఱకు నానందాతిరేకముతో నభివాదముఁ జేయుచున్నాను. కృతజ్ఞుఁడను. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 22. గురువుగారైన శ్రీ ఏల్చూరి వారికి వందనశతమ్ము.ధన్యవాదములతో నా భావన:
  పండితుఁడఁ గాని ననుమీ గుండెల మిత్రుండటంచుఁ గొప్పగ మెచ్చన్
  యండగ సహదేవుని తో
  డుండగఁమురళీ ధరుండు నుర్వికి దిగెనా!?
  అన్నట్లనిపించింది. సదా నా పద్య రచనకు మీ సహకార మందించ ప్రార్థన. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 23. శ్రీ సరస్వత్యై నమః:
  మిత్రులార! శుభాశీస్సులు.
  నిన్నటి సమస్య - మిగిలిన పూరణలు:
  అందరికీ అభినందనలు.
  డా. ఏల్చూరి వారు:
  కర్మఫలమును తనువుపై ధ్యాస వదలి తినమని వేదాంతమును బోధించేరు. మనస్సుపైని కూడా ధ్యాస ఉంచ వలదు. జ్ఞానాగ్నిలోనే వేల్చేద్దాము కర్మలని కర్మఫలాలని. ఆదర్శకముగా నున్నది ఈ పూరణ.

  శ్రీమతి రాజేశ్వరి గారు:
  వీరికి సెలవిచ్చేము - సమస్యను మార్చ రాదు అని. మళ్ళీ అదే బాట పట్టేరు. బాగుగనే ఉన్నది పద్యము.

  శ్రీ గుండు మధుసూదన్ గారు:
  కృషీవలుడు - ముళ్ళబాటలు - జాగ్రత్త అని సెలవిచ్చేరు. సొగసుగా నున్నది.

  శ్రీ మిస్సన్న గారు:
  సుబ్బా రావుగారికి జ్వరము అన్నారు. ఔను సుబ్బా రావు అంటే మీరేగా. వేరే ఎవరికో జ్వరము వచ్చినదా లేక మీకా? వినూత్నమైన భావము.

  శ్రీ గుండా సహదేవుడు గారు:
  భాద్రపద శుద్ధ చతుర్థి ఇంకా రాబోతోంది. ముందుగానే గుర్తు చేసేరు. డా. ఏల్చూరి వారు సూచించేరు కదా సవరణ. పద్యము ఉత్తమముగా నున్నది.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
  గతికితే అతుకదు అనే సామెతను ప్రస్తావించేరు - పెళ్ళి మాటలు అవుతూ ఉండగా తిన రాదుగా. నిశ్చయాల పర్వము అయిన తరువాత వెళ్ళ వచ్చు విందుకి హాయిగా. ప్రశస్తముగా నున్నది.

  డా. కమనీయం గారు:
  దేవతలకు వరివస్యలు, సేవించుట యతిథితతిని చేసిన పిదప తినవచ్చును అని చక్కని సంప్రదాయమును ఉట్టంకించేరు. ప్రశస్తముగా నున్నది.

  చంద్రశేఖర్ గారు:
  కార్తిక వన భోజనములను అప్పుడే ఆవిష్కరించేరు - భోజన ప్రియులా? సరే ఆలాగుననే చేద్దాము. వినూత్నముగ నున్నది.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 24. నమస్కారములు
  గురువులు క్షమిం చాలి . మర్చి పోయాను

  రిప్లయితొలగించండి
 25. "మీ వారు మూషికములే!"
  "మీ వారలు సూకరములు మ్రింగుటలోనన్!" ...
  బావల మరుదుల కలహం
  బావల భుజియించుటే శుభావహ మందున్

  రిప్లయితొలగించండి