13, సెప్టెంబర్ 2012, గురువారం

పద్య రచన - 111

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

 1. కారు నెక్కగ నెంచిన ' సన్నకారు '
  బండి వేషము మారిచె దండి గాను
  గానుగెద్దును బూనిచి తాను సాగ
  రథము నెక్కెనుగా మనో రథము దీర.

  రిప్లయితొలగించండి
 2. పరమేశుని వాహనమై
  పరమాదృతి గన్న నీదు వైభవ మయ్యో!
  తిరగబడె నిటుల పుంగవ
  వరమా! హాస్యాస్పదంబు బ్రతుకు ధరిత్రిన్

  రిప్లయితొలగించండి
 3. అయ్యా శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
  శుభాశీస్సులు.
  మీ పద్యము బాగున్నది. మొదటి పాదములో "యతి"ని గౌరవించలేదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 4. చమురు ధరలు జేరె చయ్యన నింగికి
  కారు గలుగు వారు బారు మనగ
  కారు లోన కుర్రకారు ప్రయాణించి
  రెద్దు పూన్చి చమురు వద్దనుచును.

  రిప్లయితొలగించండి
 5. గుండు మధుసూదన్ గారి పద్యములు....

  తే.గీ.
  ఎద్దు పైనెక్క మొదట; నా యెద్దు నెడ్ల
  బండి యాయెను; తదుపరి బండ్లు తైల
  యంత్ర వాహనములు; ధూమ యంత్ర వాహ
  నములు; జల వాయు గతి వాహనములు వచ్చె!


  కం.
  ధనము కొలఁది బండ్లుండును!
  ధనమున్న విమాన మెక్కు; ధన మేదినచో,
  తన యెద్దుల బండి కిడును
  ఘన వేషము తైలశకట ఘనత నిడు నిటుల్!

  రిప్లయితొలగించండి

 6. ఎద్దు బండది చూ చుట కద్భు తంబు
  గొలుపు చుండె ను మీ దన గొడుగు వలెను
  బస్సు మోడలు పైకప్పు బాగు గుండి
  పధికు డొక్కడె యె క్కియు పయన మయ్యె .

  రిప్లయితొలగించండి
 7. ధరను మండెడు పెట్రోలు త్రాగు ననదు
  కుడితి నీరైన చాలును కడుపు నింపు
  యెద్దుపై దిరుగు శివుడన ముద్దు గాను
  ఈసు కంటెను మనమేమి తీసి పోము
  కారు లేకున్న లోటేమి కారు చౌక !

  రిప్లయితొలగించండి
 8. శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యమును చూచితిని.
  1వ పాదములో యతిని మరిచిపోయేరు.
  3వ పాదములో బాగుగుండి అనే ప్రయోగము శ్రవణ సౌఖ్యముగా లేదు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ సరస్వత్యై నమః:
  మిత్రులారా! శుభాశీస్సులు. ఈనాటి పద్యరచనలో లక్ష్యము: వింత యెద్దుబండి. మంచి పద్యములు వచ్చుచున్నవి. అందరికీ శుభాభినందనలు.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
  సన్న కారు జీవితాల సరదా తీర్చే విధముగా నున్నది అని చమత్కరించేరు. సొగసుగా నున్నది.

  శ్రీ మిస్సన్న గారు:
  చమురు ధరలు పెరుగుటను గుర్తు చేసేరు. ఇదీ ఒక చౌక ఉపాయమే మరి. ఉత్తమమైన పద్యము.

  శ్రీ గుండు మధుసూదన్ గారు:
  వివిధములగు వాహనములను మొదటి పద్యములో క్రమక్రమముగా వినియోగించుటను ఉటంకించేరు. 2వ పద్యములో ధనముంటే విమానము లేకుంటే ఏదో చౌక విధానమని సెలవిచ్చేరు. ప్రశంసనీయమైన పద్యము.

  శ్రీ సుబ్బా రావు గారు:
  అద్భుతముగా తయారు చేయబడిన సంకర జాతి బండిని ప్రస్తావించేరు. ఉత్తమముగా నున్నది.

  శ్రీమతి రాజేశ్వరి గారు:
  ఈశ్వరుడే ఎద్దుపై తిరుగుతున్నాడు. ఆయనతో ఈసు కాదు గాని ఎంతో చౌక విధానము కదా అని సెలవిచ్చేరు. ఇంపైన పద్యము.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. డా. ఏల్చూరి వారికి శుభాశీస్సులు. మీ అన్నపూర్ణా శంకరుల లీలా వర్ణనముపై మా సమీక్షను చూడండి ఈ పద్యములో:

  తరుణీ! భిక్ష నొసంగవే యచలజాతా! అన్నపూర్ణా! యనన్
  పరమాన్నంబును దివ్య భక్ష్యములతో వడ్డించె సంప్రీతితో
  పరమేశుం డతిప్రీతు డయ్యెనట సంభావింప నీలీల నే
  ల్చురి వంశోద్వహ! నీ నివాళులును సంశోభిల్లె పద్యాకృతిన్

  రిప్లయితొలగించండి
 11. డా. ఏల్చూరి వారూ! శుభాశీస్సులు.
  చిన్న సవరణ. మీ (అన్నపూర్ణ లీల) 2వ పద్యములో 4వ పాదములో ఒక అక్షరము "న" ఎక్కువగా పడుట టైపు పొరపాటుగా భావించుచున్నాను. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ నేమాని వారికి ధన్య వాదములు. ఉదయం పూరణ చేసి కార్యాలయమునకు వెళ్ళినాను. మీరు సూచించిన సవరణ ఇప్పుడే చూసి సవరించు చున్నాను.

  కారు పై మోజు గల ' సన్నకారు ' రైతు
  బండి వేషము మారిచె దండి గాను
  గానుగెద్దును బూనిచి తాను సాగ
  రథము నెక్కెనుగా మనోరథము దీర.

  రిప్లయితొలగించండి
 13. పూజ్యశ్రీ పండిత నేమాని గురుదేవులకు
  విహితానేక ప్రణామములతో,

  పావన మగు భావనమున
  దీవెన లొసఁగిన సరస్వతీనిర్మలపుం
  భావితమూర్తికి బుధసం
  భావితకీర్తికిని మీకుఁ బ్రణతిశతంబుల్.

  విధేయుఁడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి 14. కారులో షికారు కిపుడు కడు ప్రియమ్ము
  ఇంధనపు వెల యాకస మెత్తు పెరిగె
  నిదియె బాగుగా నున్నది యెద్దు బండి
  కారుగా మార్చి పయనింప గరము సుఖము.

  రిప్లయితొలగించండి

 15. 'ఆక్సు'కార్టు మీద అందముగానొక్క
  'ఫోర్డు' ఫ్రేము నుంచి పొలుపుగాను
  'ఆక్సుఫోర్డు' యనుచు యాబండినిన్ బిల్చి
  మురిసి రోడ్న తిరిగె మువురు శ్యామ!

  (Based on a joke I read where a 'Ford' car pulled by an 'Ox' in India during British times is called 'Oxford')

  సందేహము: ముగ్గురిని 'మువురు' అని వ్రాయవచ్చా?? 'అమవశనిశి' లాంటి ప్రయోగము కాదు కదా? :-)  రిప్లయితొలగించండి
 16. 'తడి'లేక నెద్దుఁగట్టుకు
  నడుపంజూడంగ దాని నడుముల్ విరుగున్
  ముడి వాహనముగ నమ్మియుఁ
  వడిగల రెండెడ్ల బండి బడయుట మేలౌ!
  (తడి అంటే పెట్రోలన్న భావముతో)

  రిప్లయితొలగించండి
 17. శ్రీ సరస్వత్యై నమః:
  మిత్రులారా!
  నిన్నటి పద్యరచన - మిగిలిన పద్యములు.
  అందరికీ శుభాభినందనలు.

  డా. కమనీయం గారు:
  ఇంధనపు ధరలు ధగ ధగమంటున్నాయి. కారు షికారు ఖరీదు హెచ్చినది. బండి కారు బాగుగనున్నది అన్నారు. ఉత్తమమైన పద్యము.

  శ్రీ పుష్యం గారు:
  బాగుగ నున్నదండీ మీ "ఆక్స్ ఫర్డ్" బండి ప్రస్తావన. ముగ్గురు - మువ్వురు - ముగురు - మువురు అనవచ్చు. పద్యము ప్రశంసనీయముగా నున్నది.

  శ్రీ సహదేవుడు గారు:
  తడిలేని వేళలో ఒక ఎద్దును పోషించుటే కష్టము కదా - 2 ఎడ్లను ఏలాగున పోషించగలము? సరే ఆ తీరును చూడండి. పద్యము సొగసుగా నున్నది.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 18. గురువర్యులకు వందనములు.
  ఆర్యా!
  ధన్యవాదములు.
  నా పద్యములో తడి అంటే పెట్రోల్ అన్న భావమని క్రింద కనబరచాను.స్వస్తి.

  రిప్లయితొలగించండి
 19. ముగ్గురిని 'మువురు' అని వ్రాయవచ్చా అన్న సంశయం వచ్చింది శ్రీపుష్యంగారికి.
  మువురు సంగత సందిగ్ధం.
  ముగురు అని హాయిగా వ్రాయవచ్చును. ఇబ్బంది లేదు. మీకు పనికి వస్తుంది సందర్భానికి.

  కం. పగరకు వెన్నిచ్చినచో
  నగరే నిను మగతనంపు నాయకు లెల్లన్
  ముగు రాడువార మైతిమి
  వగపేటికి జలక మాడ వచ్చిన వేళన్

  ( ఖడ్గతిక్కన యుద్ధం మధ్యలో ఇంటికి వచ్చినపుడు ఆతనిని భార్యా తల్లీ కూడా పౌరుషం రెట్టింఛేలా మాటలాడి మరలా యుధ్ధానికి పంపుతారు. పై పద్యం ఖడ్గతిక్కన భార్య పాత్రకు కవి వ్రాసినది. )

  రిప్లయితొలగించండి