24, సెప్టెంబర్ 2012, సోమవారం

పద్య రచన - 122

శకుంతల ప్రేమలేఖ
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

24 కామెంట్‌లు:

 1. లక్ష్మీదేవిదేవి గారితో నేను ఏకీభవిస్తున్నాను. ఎంత నిబద్దతో పూరించినా చిత్రానికి తగ్గ పద్య రూపం అపహాస్యానికి దారితీస్తుందనే నా అభిప్రాయము.

  రిప్లయితొలగించండి
 2. పతి దుష్యంతుడు వీటికిన్ జనెను సంభావింపడయ్యెన్ కటా!
  సతి శోకార్త శకుంతలన్ శుభమతుల్ సాధ్వీమణుల్ బంధులా
  తత కారుణ్య మనస్క లాదరముతో దైన్యమ్మునున్ బాపుచున్
  ధృతి గల్పించుచు నుండి రయ్యువిదకున్ బ్రేమాతిరేకాన్వితల్

  రిప్లయితొలగించండి
 3. "ఏమి వ్రాసితివే చెలీ ! ప్రేమలేఖ !
  నిన్ను మరచిన దుష్యంత మన్నెదొరకు ?
  పోయి రావమ్మ ! యొకసారి రాయ సభకు "
  అని శకుంతలతో బల్కి రాడు వాండ్రు.

  రిప్లయితొలగించండి
 4. చెలియను మఱచిన వేళల
  కలిగెడు దుఃఖము కలంచు గాదే, చెలుడా
  వలపుల పలుకుల నిత్తఱి
  సులభత మఱచుటయె వింత; చోద్యము సుమ్మా!

  రిప్లయితొలగించండి
 5. లక్ష్మీదేవి గారూ,
  చంద్రశేఖర్ గారూ,
  మీ అభిప్రాయాలను గౌరవించి ఆచిత్రాన్ని తొలగించి కొత్త చిత్రాన్ని పెట్టే ప్రయత్నం చేస్తుండగా కరెంట్ పోయింది. ఇప్పుడే కరెంటు వచ్చింది. ఇంతసేపు నేనెంతో ఉత్కంఠతో ఉన్నాను. ‘ఆ చిత్రం తొలగిపోయి, కొత్త చిత్రం వచ్చిందో లేదో’ అని.
  *
  అప్పటికీ గుండు మధుసూదన్ గారు మొదటి చిత్రానికి పద్యం వ్రాసి పంపారు కూడా! వారు సెల్‌ఫోన్ ద్వారా పంపడం వల్ల అది నేరుగా బ్లాగులో ప్రకటితం కాలేదు. వారి పద్యాన్ని బ్లాగులో ప్రచురించలేకపోతున్నందుకు క్షంతవ్యుణ్ణి.
  *
  కేవలం చిత్రం చూసి అది ‘శకుంతల లేఖ వ్రాస్తున్న దృశ్యం’ అని గుర్తించిన నేమాని వారి ప్రతిభకు నమస్సులు. తరువాతి కవిమిత్రులు వారినే అనుసరించారని నమ్ముతున్నాను.

  రిప్లయితొలగించండి

 6. చిత్ర మద్దాని జూ డుడు చెలియ లార!
  విరహ వేదన నొందె ను వీ క్ష ణంబు
  రాజు దుష్యంతు రాక కై రామ యపుడు
  ప్రేమ లేఖను వ్రాసెను ప్రియుని కొఱకు .

  రిప్లయితొలగించండి
 7. గురువుగారు,
  నేనే వెంటనే గుర్తించగా, పండితుల వంటి గ్రంథకర్తలు గుర్తించలేకపోవడమేం గురువు గారు, మాకూ కరెంట్ పోవడంతో పద్యమునాలస్యంగా ప్రచురించగలిగినాను.

  రిప్లయితొలగించండి


 8. మ.
  “అనివార్యమ్మయి యా శకుంతలను దుష్యంతుండు కళ్యాణమై
  చనఁగన్ బోవుచు ముద్రికం దొడిగి, యా సత్యాత్మకుం డెంతకున్
  దన దారం బిలువంగ రాఁ డిటకు! లేదా యేమి రాగమ్ము నా
  తనికిన్? బూనెనొ కిన్క యెట్టి కతనో? ధర్మమ్ము కాదిద్దియున్!”(1)
  తే.గీ.
  వనిని యనసూయయుం బ్రియంవదయు నిట్లు
  పలుకుచుండఁగ వినియు నా వన్య రమణి
  యగు శకుంతల కినుకతో ననియె "నేమె!
  నా విభుఁడు మాట తప్పక నన్ను వేగ
  పురికి రప్పించు, నిజముగా! పొండు, పొండు!(2)
  కం.
  అని తరిమి యా శకుంతల
  తన నాథునిఁ దలఁచి, సుంత తాపమధికమై;
  మన మందలి దు:ఖమ్మును
  గనిపింపఁగ నీయకుండఁ గణ్వుని కుటిలో;(3)
  ఆ.వె.
  చని, యట మఱి యుండఁ జాలక బయటకు
  వచ్చి యేడ్చుచుండ, పరుగు తోడఁ
  జెలులు వచ్చి, యడుగఁ జింతను దిగమ్రింగి,
  "లేఖ వ్రాతు నిపుడు, ఱిచ్చ యేల?(4)
  కం.
  కమ్మను దె"మ్మని యమ్ముది
  తమ్మెయి నమ్మంగఁ బలుకఁ, దాఁ దెచ్చి యిడన్;
  కమ్మ పయి వ్రాసె నేదో
  యమ్ముని పట్టి యటఁ దన్మయోత్సుక హృదియై!(5)

  రిప్లయితొలగించండి
 9. మిత్రులారా!
  చి. డా. ఏల్చూరి మురళీధర రావు గారు పై చిత్రములోని శకుంతల ప్రక్కల నున్నవారు అవివాహితలేనని "సాధ్వీమణులు" అనుట సరికాదని మంచి సూచన చేసేరు. వారికి అభినందనలు. నా పద్యమును ఈ విధముగా సరిజేయుచున్నాను.

  పతి దుష్యంతుడు వీటికిన్ జనెను సంభావింపడయ్యెన్ కటా!
  సతి శోకార్త శకుంతలన్ విమల భాషాభూషణల్ బంధులా
  తత కారుణ్య మనస్క లాదరముతో దైన్యమ్మునున్ బాపుచున్
  ధృతి కల్పించుచు నుండి రయ్యువిదకున్ బ్రేమాతిరేకమ్ముతో

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. మాస్టారూ, విషయం చిన్నదే అయినా, మా మాట మన్నించినందుకు ధన్యవాదాలు. శకుంతల చిత్రం మా చిన్ననాటి స్కూలు నాటకాన్ని తలపిస్తోంది.

  రిప్లయితొలగించండి
 11. పండిత నేమాని వారూ,
  దృశ్యానికి తగిన మనోహరమైన పద్యం చెప్పారు. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ ఖండిక మనోహరంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. చెంగట నిల్చి బాసలను చేతను చేయిని వైచి చేసియున్
  అంగుళి జేర్చి యుంగరము నన్నిటి దోచిన రాజ శేఖరా
  రంగుల బావ జాలములు రాలుచు నుండెను రార బ్రోవ నీ
  యంగన తప్పుజేసెనని యందరు నందురురాకపోయి నన్

  రిప్లయితొలగించండి
 13. వలపుల మురిపెము లొలుకుచు
  తలపులు మది నిండ నింపి తావెడలె నొకో !
  కలతలు రేపగ నీమది
  నెలతరొ నీవెట్లు మనగ నిత్తరి నిలలో ?

  రిప్లయితొలగించండి
 14. ఆట బొమ్మగ దలచెనో మాట దప్పె
  మనసుతో నిట్లు చెలగాట మాడ దగునె ?
  గారవమ్మున పెండ్లాడె గాంధర్వ విధి
  యింత మాయను బడితి నేనెంత దాన ?

  రిప్లయితొలగించండి
 15. పాంధుడుగా వచ్చి నృపతి
  గాంధర్వ గతిన్ గ్రహించి కరమును కడు మో-
  హాంధత ముంచెను నను సఖి
  బంధము గురుతెరుగ జేతు వ్రాసెద లేఖన్.

  ఓరాజా వేటాడుచు
  నారామము జేర వచ్చి యబలన్ నన్నో
  వీరా కరమును బట్టవె
  తారను చంద్రుండు వోలె తమకము మీరన్ .

  నను జేకొని మురిపించితి
  వను రాగపు సంద్ర మందు నవధులు లేకన్
  తనియగ ముంచితి వకటా
  చని మరచితి వేమి యన్ని సంగతులు నృపా.

  ఈ వీటను నేనొం టిగ
  పూవిల్తుడు బాధ పెట్ట పొగులుచు నుంటిన్
  రా వేగమె చేకొన నన్
  నీవే పతి గతియు నాకు నిజముగ రాజా.

  అని లేఖ నా శకుంతల
  యనువగు నొక పత్రమందు ననురాగముతో
  తన ప్రియుని కొరకు వ్రాసెను
  కనుడది యీ మదిని దోచు ఘన చిత్రమునన్.  రిప్లయితొలగించండి
 16. రాజేశ్వరి నేదునూరి గారూ పద్యం బాగుంది.
  "వలపుల మురిపెము లొలుకుచు
  తలపులు మది నిండ నింపి తావెడలె నొకో !

  రిప్లయితొలగించండి
 17. తల్లిదండ్రులెరుగనితరుణినేను
  ముద్దుమురిపెమ్ముజూపగఁబొంగి పోయి
  మనువు గాంధర్వమైననుమౌని నైతి
  బేగి గొంపోవ నారాజ సాగి రమ్మ
  నుచు శకుంతలలేఖలోనుడువ,చివర
  నతివ కన్నీటి సంతక మతికె నంత

  రిప్లయితొలగించండి


 18. ఈ చిత్రం (శకుంతల-లేఖ )ప్రసిద్ధ చిత్రకారుడు రాజా రవివర్మ చిత్రించినది.అందరికీ తెలిసినదే.దీనినే ఆయన మరొక రకంగా కూడా చిత్రించాడు.

  విరహవేదన ప్రియునికి విన్నవింప
  పత్రమున లేఖ రచియించు ప్రణయరాణి
  మధురమైన భావముల మైమరచి చెలులు
  కనుగొనంగ శకుంతల వనము లోన.

  చెలి ప్రియంవద ,యనసూయ చెంతజేరి
  యూరడింప శకుంతల యొక్క పత్ర
  మున రచించెను జాలిగా ననుయముగను
  ప్రియుని వేగమే రమ్మని పిలువనంప

  రిప్లయితొలగించండి


 19. ఈ చిత్రం (శకుంతల-లేఖ )ప్రసిద్ధ చిత్రకారుడు రాజా రవివర్మ చిత్రించినది.అందరికీ తెలిసినదే.దీనినే ఆయన మరొక రకంగా కూడా చిత్రించాడు.

  విరహవేదన ప్రియునికి విన్నవింప
  పత్రమున లేఖ రచియించు ప్రణయరాణి
  మధురమైన భావముల మైమరచి చెలులు
  కనుగొనంగ శకుంతల వనము లోన.

  చెలి ప్రియంవద ,యనసూయ చెంతజేరి
  యూరడింప శకుంతల యొక్క పత్ర
  మున రచించెను జాలిగా ననుయముగను
  ప్రియుని వేగమే రమ్మని పిలువనంప

  రిప్లయితొలగించండి
 20. కమనీయం గారూ మీ పద్యం బాగుంది.

  విరహవేదన ప్రియునికి విన్నవింప
  పత్రమున లేఖ రచియించు ప్రణయరాణి

  రిప్లయితొలగించండి