5, సెప్టెంబర్ 2012, బుధవారం

పద్య రచన - 103

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

 1. గురు సర్వేపల్లి సుకుల
  వరమణి వేదాంతవేత్త పరమార్థ ప్రభా
  కరు రాధాకృష్ణుని సా
  దరమతి నే ప్రస్తుతించి దండములిడుదున్

  రిప్లయితొలగించండి
 2. చి. డా. ఏల్చూరి వారికి శుభాశీస్సులు.
  మీరు యోగివరేణ్యులు, దేశికమహోదయులు, ధీమన్మణియైన డా. సర్వేపల్లి వారికి సమర్పించిన నివాళి అపూర్వమైనది, హృద్యంగమమైనది, కవిత్వ శోభాన్వితమైనది. మా అభినందనలు. అందులో ఒక చిన్న సవరణ అవసరము:
  2వ పద్యములో 3వ పాదాదిలో గణభంగము. మీరు సవరిస్తేనే బాగుంటుంది. స్వస్తి.

  రిప్లయితొలగించండి

 3. యోగి పుంగవు డా త డు యుగపు రుషుడు
  వేద విదుడును మఱియును విబుధ వరుడు
  రాధ కృష్ణుని పుట్టుక రాష్ట్ర మంత
  జరుపు కొందు రు ప్రజలెల్ల పర్వముగను .

  రిప్లయితొలగించండి
 4. ఆచార్య వృత్తియం దాదర్శ మూర్తియై
  ....విశ్వవిద్యాలయ పీఠి నలరె
  వేదాంత విజ్ఞాన విభవాభిరాముడై
  ....అఖిల దేశమ్ముల ఖ్యాతి గాంచె
  శాంత్యహింసల నూని స్వాతంత్ర్య సముపార్జ
  ....నోద్యమంబున నిల్చె నొప్పు మీర
  భరతావనీ రాష్ట్రపతి పీఠికే రత్న
  ....భూషణంబన చాల పొల్పు గాంచె
  మాన్యశీలి సర్వేపల్లి మనహితుండు
  ధన్యజీవి రాధాకృష్ణ ధర్మరతుడు
  సాదరమ్మున నాతని సంస్మరించి
  ప్రణతిశతము సమర్పించి ప్రస్తుతింతు

  రిప్లయితొలగించండి
 5. పండిత నేమాని వారూ,
  ధన్యవాదములు.
  ఏల్చూరి వారి పద్యపాదాన్ని ఇలా సవరిస్తే ఎలా ఉంటుంది?
  ‘బో/ ధస్వాంతుం బొనరించెఁ గృష్ణుఁ; డటు గీతార్థంబు బోధించి నీ’

  రిప్లయితొలగించండి
 6. అయ్యా శ్రీ శంకరయ్యా గారూ!శుభాశీస్సులు.
  నేను శ్రీ ఏల్చూరి వారికి అలాగుననే సవరించమని వేరే ఈమెయిల్ చేసేను.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 7. గురుపూజ - సకలోపాధ్యాయ బృందానికి అభివాదములతో -

  వర పాండిత్యము విస్తరిల్లగ మహా వాత్సల్యమేపార , సుం
  దర నానా రుచిరార్థ భావముల విన్నాణంబులింపార , భా
  సుర జన్మాంతర పుణ్యసంచయము లచ్చో దాల్మి బొంగార , సు
  స్థిర సంకల్పము తోడ నిర్మల వచశ్శ్రీ దీప్తి పొల్పొందగా
  కరుణా పూరము జిమ్ము కన్నుగవతో జ్ఞాన ప్రదాశూక్తితో
  గురుపీఠంబున నిల్చి దీక్షగొని సంకోచంబు బోనాడి ని
  బ్బరపుం బల్కుల తోడ శిష్యతతి నిర్వ్యాజానురాగమ్ముతో
  నిరతానందము నొందజేసి ఘన చాంద్రీ పేశల ఖ్యాతి పెం
  పరయన్ గాంచి సరస్వతీ చరణ దీవ్యద్పీఠ నిత్యార్చనో
  ద్ధుర భావంబును బూని , వీనులకు విందుం గూర్చు పాఠంబులన్
  కరమాహ్లాదకరమ్ముగా బలుకు దీక్షా దక్షతల్ జూచి మె
  చ్చిరి సచ్ఛాత్రులు ; పౌర సంచయము రాశీభూత సౌజన్య వై
  ఖరి శ్లాఘించెను తావకీన కృషి ; సాక్షాచ్ఛారదా మూర్తిగా
  గరముల్మోడ్చి నుతించె ; సంతత కృతజ్ఞత్వమ్ము నిండార మే
  లి రథంబొక్కటి దెచ్చి యశ్వతతి నోలిం బ్రక్కకుం ద్రోసి యా
  తురగస్థానములందునన్ నిలిచి సద్యో గౌరవ స్ఫూర్తి ని
  ర్భరమై వెల్గగ దామె తాల్చిరి రథ ప్రాగ్ర్యమ్ము నీ యాదరం
  బరయన్ ఒజ్జకు గాక యింకెవరిన్ బ్రాప్తించు ధాత్రీ స్థలిన్ ?
  సిరికై యాసను వీడి చాత్రతతి నాశీః పూర్వకానంద వా
  గ్ఝరిలో దన్పుచు సర్వ శాస్త్ర నిచయ శ్లాఘిష్ఠ పాండిత్య త
  త్పరుడై శిష్య పరంపరాభ్యుదయ సంధాన ప్రతిజ్ఞాతయై
  పరమానందము తోడ చాత్ర నివహ వ్యక్తిత్వముం దీర్చి పా
  మరునిం బండితు జేయగా గలుగు మర్మంబెన్నగా నొజ్జకే
  ధరపై సొంతము ! తద్గురు ప్రతతిలో ధన్యాత్ముడైనట్టి సం
  స్మరణీయున్ గణియింతు నెమ్మనమునన్ సర్వేపలిన్ పండితున్ !!!

  రిప్లయితొలగించండి
 8. శ్రీయుత ఏల్చూరి మురళీధరరావు గారి కవిత్వము మధుర పద ప్రసన్నమైనది , రమణీయమైనది . వారికి శుభాభినందనలు !

  రిప్లయితొలగించండి
 9. పెద్దలందరికీ ప్రణామములు!

  ఈ శుభదినాన శ్రీ గురువుల ఆశీర్వచనాన్ని అందుకొనటం నా మనస్సుకెంతో నిండుతనాన్ని కూర్చింది. గురుదత్తవిద్యానిష్క్రియం సాధ్యం కాదు కాబట్టి – వారికి నా హృదయాంజలి!

  విద్వత్కవితల్లజులు శ్రీ విష్ణునందన్ గారి సహృద్వచోనిచయానికి వినమ్రుడనై నమస్కరిస్తున్నాను. వారి మత్తేభమాలిక గమనాన్ని అద్ధావాక్కుతో చదువుతుంటే – “నానారాజసందర్శనం”లోని తిరుపతి వేంకటేశ్వరుల మాలికలన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. ఆ కల్పనావైభవానికి, శయ్యావైయాత్యానికి వారికి నా అభినందనలు.

  శ్రీ శంకరయ్య గారు ఈ రోజు తెల్లవారుజామున గుండె గుడి తలుపులు తీసి శ్రీ రాధాకృష్ణ దేశికతల్లజుని రూపధేయాన్ని కన్నులకు కట్టి ఇంతమంది నోట మంగళగీతికలను పలికించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  పైని 1) ముమ్మొదట నాది; 2) ఆ తర్వాత శ్రీ శివ గారు పంపినది – ఆ రెండు పాఠాలను తొలగించివేయ వలసినదిగా శ్రీ శంకరయ్య గారికి నా విన్నపం. పునారచితాన్ని ఈ దిగువన మళ్ళీ సమర్పిస్తున్నాను.

  విధేయుడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 10. ఉపాధ్యాయదినోత్సవ శుభవేళ శ్రీ నేమాని గురుదేవులకు,
  శ్రీ శంకరయ్య గారికి, పెద్దలందరికి ప్రణామములు!

  పద్యంలో శ్రీ గురువులు, శ్రీ శంకరయ్య గారు చేసిన సవరణకు కృతజ్ఞుణ్ణి.

  నీ గళగీతికా శ్రుతివినీతమహార్థపరంపరల్ ప్రతీ
  చీ గురుదేవమౌళిమణిసీమలఁ గోమలసౌమనస్యశో
  భాగురుసౌరభంబుల విభాసిలు వేళల నుల్లసిల్లె నో
  యోగివరేణ్య! దేశికమహోదయ! మా హృదయారవిందముల్.

  ఏ స్వారాజ్యరథంబునన్ నిలిచి యుద్ధేచ్ఛావిరక్తాత్ముఁ డై
  భాస్వద్ధన్వశరంబులన్ విడచు నా పార్థున్ స్వకర్తవ్యబో
  ధస్వాంతున్ బొనరించె గృష్ణుఁ; డటు గీతార్థంబు బోధించి నీ
  వా స్వాతంత్ర్యపు దీక్ష నిచ్చితివి మా కాచంద్రతారార్కమున్.

  భవదుపదేశవాఙ్నిచయభావితభారతభారతీనవం
  నవపథదర్శనం బిపు డనంతసుఖావహమై, నిరంతరం
  బవితథధర్మదీపితశుభాకరమై, భవదీయమూర్తి మా
  కవిరత మో మహాత్మ! హృదయావసథంబుల వెల్గు లీనెడిన్.

  చతురాస్యాస్యచతుష్టయోదితశుభస్వాధ్యాయసంరావమి
  శ్రితనృత్యద్ద్రుహిణాంగనాచరణమంజీరస్వనత్కింకిణీ
  రుతు లెల్లప్పుడు నీ మహోద్యతి కసంరుద్ధప్రియాభ్యున్నతుల్
  ప్రతిపాదించెడి నుత్తరోత్తరశుభప్రారంభశుంభద్గతిన్.

  పూర్వాచార్యనిరుక్తవైదికసుధాంభోరాశిగంభీరిమా
  సర్వజ్ఞాయితమందరామలతపస్సంవిత్కళాపూర్ణ! భ
  ద్రార్వాచీనవటద్రుమూలఫలవిద్యాహృద్యవైశద్యకృ
  త్సర్వేపల్లికులార్ణవర్క్షమణిరాధాకృష్ణధీమన్మణీ!

  విధేయుడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 11. సర్వేపల్లి సుధాంశువు
  గర్వం బిసుమంత లేని ఘనుడగు యొజ్జై
  యుర్విన్ వెలిగెను గురువుల
  పర్వంబున వారి కిడుదు భక్తిని ప్రణతుల్.

  రిప్లయితొలగించండి
 12. పండిత నేమాని వారూ,
  సర్వేపల్లి వారిపై మీ కందం, సీసం రెండూ మెండైన ఆనందాన్ని కలిగించాయి. ధన్యవాదాలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  డా. విష్ణునందన్ గారూ,
  మీ మత్తేభమాలిక అనిర్వచనీయ కావ్యానందాన్ని కలిగించింది. ధన్యవాదాలు.
  *
  ఏల్చూరి మురళీధర రావు గారూ,
  రాధాకృష్ణుల వారిపై మీ పద్యఖండిక మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి