14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

పద్య రచన - 112

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. కట్టు బొట్టులు జూడంగ కాంత లందు
    భారతీయత కనిపించు చీరె గట్ట
    బరువననుచును పోవును పరువననుచు
    పరుల జీన్సును వేతురే తరుణు లార!

    రిప్లయితొలగించండి
  2. అదియొక వస్త్ర విక్రయ మహాద్భుత కేంద్రమునందు జూపులన్
    జెదరగ జేయు దృశ్యముల చిత్రపటమ్మున నవ్య రీతులన్
    సుదతులు వస్త్ర ధారణపు శోభలు చూపుచు నిల్చి యుండి స
    మ్ముదమున బొంగుచున్న గతి పొల్పుగ తద్విభవంబు గాంచుడీ

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
    ‘బరువని + అనుచు, పరువని + అనుచు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ఆ పాదానికి నా సవరణ....
    ‘బరు వనుకొనిన పోవును పరు వటంచు’
    *
    పండిత నేమాని వారూ,
    బట్టల దుకాణం వస్తువుగా మీ పద్యం మనోహరంగా ఉంది.
    ‘ముదమున మీ కవిత్వమున పొల్చు కళావిభవంబు మెచ్చితిన్.’

    రిప్లయితొలగించండి

  4. జిలుగు వెలుగుల కాంతుల చీ ర లోన
    కాంత లందరు నొకపరి కాను పింప
    దివిని విడి చియు వచ్చి రా ? భువికి యనగ
    నూ హ వచ్చెను మదికినా నోయి బాల !

    రిప్లయితొలగించండి
  5. సన్నని జలతారుచీర
    వన్నెలు హొయలున్న వోణి వైనపు పైటల్
    ఎన్నగనీ వయ్యారము
    పన్నగపతికైన తరమె భారతనారీ!

    రిప్లయితొలగించండి
  6. గుండు మధుసూదన్ గారి పద్యము...

    చలిత విశాల నేత్ర యుత శర్వరు లొక్కెడ వస్త్ర కోటులన్
    సులలిత రీతిఁ దాల్చి, మన సోదర రాష్ట్ర విశేష భంగిమల్
    పలువుఱ మెప్పు లందఁగను, భారత సంస్కృతి గొప్పఁ జాటుచున్;
    వలపులఁ జూపుచుండి రట! భారతమాత మనమ్ము గెల్వఁగన్.

    రిప్లయితొలగించండి
  7. అయ్యా! శ్రీ సుబ్బా రావు గారు! శుభాశీస్సులు.
    మీ పద్యము 3వ పదము చివరలో భువికి యనగ అని యడాగమము చేసేరు. భువికిననగ అని నుగాగమము చేయుట సాధువు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. తరుణి జిలుగు వెలుగు పరువంపు నునుసిగ్గు
    ఒంపు సొంపు లందు యింపు గాను
    చీర యంద మిడును నేరీతి ధరియింప
    మధుర భావ మలర మగువ గాదె ?
    -----------------------------------------------------
    నిండు యవ్వనమ్ము నివటి ల్లెడు వయసు
    మెండు చీరె లందు దండి గాను
    కనుల విందు జేయ కాంతల హొయలన్ని
    చీర లందు కనగ సౌరు లనుచు ! !

    రిప్లయితొలగించండి
  9. ప్రతి వధువుకు వంకలు పెట్టే వరునికి, పెళ్ళి చేయటానికి,ఓ పెళ్ళిళ్ళ పేరయ్య వినూత్నమైన 'కన్య స్కోపు' తెచ్చి వరునికిచ్చి ఓ కన్యను చూడమనగ,అందులో ఒకే వధువు భిన్నవస్త్రధారణలతో కనిపించగా ఒప్పుకొని పెళ్ళాడాడన్నభావంతో:

    పిల్లచక్కనైనఁ
    బేరెట్టు వరునికి
    'కన్య స్కోపుఁదెచ్చి గాంచ మనగ
    పిల్లనొక్కతైనపెక్కురీతులఁజూపఁ
    పిల్లనచ్చఁ గట్టె పెళ్ళిళ్లపేరయ్య?

    రిప్లయితొలగించండి
  10. తెలుగు నాతి యొకతె తీరైన కట్టుతో
    ............తమిళ పొన్నొక యామె తగిన తీరు
    కన్నడ శైలితో కాంత యొకర్తుక
    ............కేరళ కుట్టియౌ నారి యొకరు
    పంజాబు కట్టుతో ప్రభలీను నొక యామె
    ...........గుజరాతి పైటతో కోమలియును
    ఈశాన్య వైభవ మింకొకర్తుక జూపె
    ..........మధ్య ప్రదేశపు మహిళ యీమె

    కట్టు బొట్టు తీరు ఘనమగు నందరున్
    చీర సొబగు లిచట చిందె వెలుగు
    ప్రాంత ములను బట్టి పద్ధతు లేవైన
    భరత నారి ప్రాభవమ్ము మిన్న.

    రిప్లయితొలగించండి


  11. 1.భరత దేశమ్ము వైవిధ్య భరితమంచు
    పొగడుదురు విదేశీయులు ;పొలతులిచట
    పలు విధపు చీరకట్టుల ,బసిడినగల
    జూడ ముచ్చట జేసిరి చూపరులకు.
    2.
    పాంచాలదేశపు పావడా ధరియించి
    మురిపించు చున్నది ముద్దుగుమ్మ
    ఆంధ్రదేశపు కోక యందాల గురిపించి
    కనువిందుజేసెను కాంత యొకతె
    తొమ్మిదిగజముల తోరంపు చీరతో
    వయ్యారి మహరాష్ట్ర వనిత యుండె
    వంగదేశపు తీరు ,వస్త్రధారణ తోడ
    మరసిపోయెడినొక్క మెరపుదీగ

    ఆధునిక ధోరణులు కూడ నచట దోచె
    నన్ని రీతుల వేషమ్ము లన్ని రంగు
    లింద్రచాపమ్ము బోలుచు నిచట జేర
    వారి నెంచగా బురుషుల వశమె చెపుడి !

    రిప్లయితొలగించండి
  12. రాజేశ్వరి గారూ పద్యం బాగుంది
    "తరుణి జిలుగు వెలుగు పరువంపు నునుసిగ్గు"

    రిప్లయితొలగించండి
  13. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా: శుభాశీస్సులు.
    పద్య రచన : పడతుల సోయగాలు.

    ఈనాడు మంచి మంచి పద్యాలు లక్ష్యమునకు తగిన రీతిలోనే అందముగా వచ్చేయి. అందరికీ అభినందనలు.

    శ్రీ సుబ్బా రావు గారు:
    జిలుగు వెలుగుల చీరెలలో దేవకాంతలలా ఉన్నారని ప్రశంసించేరు. హాయిగా నున్నది.

    శ్రీ ఫణి ప్రసన్న కుమార్ గారు:
    పన్నగపతి కూడా వర్ణించలేని వయ్యారము నొలికించే భంగిమలను చూచేరు. అలేఖ్య తనూ విలాసము అన్నారు పెద్దన్న గారు. ప్రశస్తముగా నున్నది.

    శ్రీ గుండు మధుసూదన్ గారు:
    మన సోదర రాష్ట్రపు స్త్రీ బృందముగా వర్ణించేరు. సొంపుగా నున్నది.

    శ్రీమతి రాజేశ్వరి గారు:
    2 మంచి పద్యములు చెప్పేరు - జిలుగు వెలుగులను అభివర్ణించుచూ. ప్రశస్తముగా నున్నవి.

    శ్రీ సహదేవుడు గారు:
    కన్యా స్కోపు అనే పరికరమును తెప్పించేరు - పెళ్ళిళ్ళ పేరయ్యల కోసం. అయ్యా! మరి మగధీరుల స్కోపు లేదా? వినూత్నముగా నున్నది.

    శ్రీ మిస్సన్న గారు:
    పలు భాషల కన్యామణుల చీరెకట్ట్లని అభివర్ణించేరు. శ్రేష్ఠముగా నున్నది.

    డా. కమనీయము గారు:
    అద్భుతమైన పద్యములు చెప్పేరు పలు దేశముల యువతులని వర్ణించుచూ.

    స్వస్తి.



    రిప్లయితొలగించండి
  14. నా కందంలో మొదటి పాదం మూడవ గణం జగణం వచ్చినది. పొరపాటు. సరిచేసిన పద్యం క్రింద.
    చిన్నెలు చిందెడు చీరయు
    వన్నెలు హొయలున్న వోణి వైనపు పైటల్
    ఎన్నగనీ వయ్యారము
    పన్నగపతికైన తరమె భారతనారీ!

    రిప్లయితొలగించండి