16, సెప్టెంబర్ 2012, ఆదివారం

పద్య రచన - 114

అగ్ని
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
సీ.
మేషవాహనుఁడు సుస్మితుఁడు చతుశ్శృంగ
          ధరుఁడు విస్ఫురిత పక్షద్వయుండు
సప్తసంఖ్యార్చిరంచద్బాహు జిహ్వుండు
          మహనీయ పాదపద్మత్రయుండు
స్వాహాస్వధాసతీ సహిత పార్శ్వద్వయుం
          డరుణ సువర్ణ భాస్వర తనుండు
లోహిత మహిత విలోచనుఁ డాజ్యపా
          త్రస్రుక్స్రు వాదికోద్యత కరుండు
తే.గీ.
అఖిల పితృదేవతార్పిత హవ్యకవ్య
ధరుఁడు సర్వతోముఖుఁడు నిత్యశుచి యనలుఁ
డిహపరానందముల నిచ్చి యెల్లవేళ
నంచితోన్నతి మిమ్ము రక్షించుఁగాత. 

(అజ్ఞాత కవి - శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ‘చాటుపద్య మణిమంజరి’ నుండి)
 

27 కామెంట్‌లు:

  1. గుండు మధుసూదన్ గారి పద్యములు......
    (నిన్నటి ‘పద్యరచన’ శీర్షికను మిత్రులు మళ్ళీ దూస్తారో లేదో అన్న సందేహంతో ఈ పద్యాలను ఈనాటి ‘పద్యరచన’లో ప్రకటించమని వారి కోరిక...)

    నీలైరావతము శ్వేతైరావతముగ మారిన కథ

    స్వాగతవృత్తము:
    స్వాగతమ్ము దివిజాధిప! దేవా!
    వేగ కావఁగదె శ్వేత సువాహా!
    భోగభాగ్యములు పొంపిరి వోవన్
    దేఁ గదే, మఘవ! దీన దయాళూ!

    కరిబృంహితము:
    వాసవుఁడ! కరి బృంహితము విని పజ్జ నునుచఁగ, నచ్చరల్
    హాసమునఁ గడు భోగముల ఘన హర్షమును నిడఁ బాడ, దు
    ర్వాసముని దివి పుష్ప సరమును రంజిలఁగ నిడఁ గాన్కగన్
    వీసమయినను లెక్కనిడకను వేసితివి చవుదంతికిన్!

    గంధగజేంద్రము:
    చేసెను గంధ గజేంద్రము తానే
    వాసనఁ జేరినవౌ భ్రమరాల్
    వే సనకుండను విఘ్నమిడంగన్
    బూ సరమందలి పూవులు నల్గన్!

    మేఘవిస్ఫూర్జితము:
    మునీంద్రుం డా చేష్టన్ సహనము సెడం బూర్ణ సక్రోధనుండై
    "యనేకాక్షా! నీవున్ సురగణము యష్టి జీవుండ్రు నయ్యున్
    వినీలమ్మౌ మాతంగ సహితముగన్ విఘ్నముల్ గల్గుఁ గాతన్"
    మినుం దాకన్ గంఠధ్వని నుడివెఁ దా మేఘ విస్ఫూర్జితమ్మై!

    మత్త (పంచపాది):
    శాపమ్ముం దా విని చదిరమ్మున్
    గాపట్యమ్మే తన కడ నంచున్
    గాపాడం దూఁకెను కలశాబ్ధిన్
    శాపో'న్మత్త'న్ గని శరధీశుం
    డేపుం జూపెం గరటికిఁ బ్రీతిన్!

    ఇంద్రవంశము:
    ఇంద్రుండు నా శాపమునే వినంగ "మౌ
    నీంద్రా! ననుం బ్రోచియు నీదు శాపమున్
    సాంద్రానుకంపన్ మనసారఁ ద్రిప్పి, దే
    వేంద్రాదులన్ గావుమ యింద్ర వంశమున్!"

    జలదము:
    నా విని మౌనియప్డు కరుణాకరుఁడై
    తా వరమిచ్చెఁ ద్రచ్చఁగ సుధాబ్ధి కడన్
    వేవురు దేవదానవులు పేత్వమునున్
    ద్రావఁగఁ దీఱు నంచు జలదమ్ము వలెన్!

    ఇంద్రవజ్ర(పంచపాది):
    వారంతటన్ వేగమె పాలవెల్లిన్
    జేరంగఁ బోయె న్మఱి చిల్క నంతన్
    క్షీరాబ్ధిలోఁ జూచిరట శ్వేత దంతిన్
    దోరమ్ముఁ బీయూషమునుఁ దోచె వెంటై
    యీరప్డు కీర్తించి రిదె యింద్రవజ్రల్!

    -:శుభం భూయాత్:-

    రిప్లయితొలగించండి
  2. శ్రీ గుండు మధుసూదన్ గారికి/శ్రీ శంకరయ్య గారికి: శుభాశీస్సులు.
    అమరాధిపతిపై అష్టకము చాల బాగున్నది. అద్భుతమైన రచన. అన్నీ విశేషఛ్ఛందస్సునకు చెందిన పద్యములే. అన్నిటిలోను ఆ పద్యముల పేరులు చేరుట మంచి ప్రయోగము - దీనిని ముద్రాలంకారము అంటారు. పద్యములలో అక్కడక్కడ పొరపాటులు కనుపట్టు చున్నవి. టైపులో కావచ్చును.

    2వ పద్యములో(గంధగజేంద్రము): 2వ పాదము చివరన గణ భంగము.
    4వ పద్యము (మేఘవిస్ఫూర్జితము)లో: 2వ పాదములో గణభంగము.
    8వ పద్యము (ఇంద్రవజ్ర)లో: 3, 4, 5 పాదములలో గణభంగము.

    మీ రచన అత్యంత ప్రశంసనీయముగా నున్నది. ఇది పలువురు ఔత్సాహిక కవులకు మార్గ నిర్దేశకము కాగలదు. మరల మరల మా హృదయపూర్వక అభినందనలు మరియు ఆశీస్సులు.

    శ్రీమధుసూదన సుకవీ!
    ప్రేముడి దీవింతు నిన్ను విద్వన్మణివై
    ఆమోదయోగ్యమగు కవి
    తామధురిమ నింపుమయ్య ధర నిరతంబున్

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. దంటమోముల దేవర తగరు రౌతు
    సప్త జిహ్వుడు హుతభుక్కు సర్వసాక్షి
    జాతవేదుడు కపిలుడు ఛాగరథుడు
    కప్పు దెరువరి ధ్వాంతారి గాలిచూలి

    రిప్లయితొలగించండి

  4. దోయి మొగములు గలిగిన దొరయె సుమ్ము
    మేక వాహను డా తడు మె ఱయు ముఖుడు
    ఆయు ధంబులు చే బూ ని యలరె నచట
    యగ్ని దేవుడు మనలను నాదు కొ ఱకు .

    రిప్లయితొలగించండి
  5. గుండు మధుసూదన్ గారి పద్యము....

    అగ్నిదేవ! బర్హిష్కేష! యజ్ఞబాహు!
    కీలి! కృష్ణాధ్వర! తమోऽరి! కృష్ణవర్మ!
    వాయుసఖ! కృపీటభవ! సువర్ణరేత!
    భుజ్య! హవ్యభుక్! జ్వలన! నమోऽస్తు దేవ!

    రిప్లయితొలగించండి
  6. గుండు మధుసూదన్ గారికి ప్రశంసలు.
    ఈ విశేష ఛందస్సుల లక్షణాలు తెలుపగలరని ఆశిస్తాను. ఏదైనా వెబ్ సైట్ లంకె ఉంటే ఇవ్వగలరు.

    రిప్లయితొలగించండి
  7. గుండు మధుసూదన్ గారూ,
    ఇంద్రునిపై ముద్రాలంకారాలతో విశేషచ్ఛందాలలో మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మేక వాహనుడు’ అన్నప్పుడు సందేహం కలిగింది. ‘మేకః - మేకము’ అని సంస్కృతపదం ఉంది.
    సూర్యరాయాంధ్ర నిఘంటువు ఇది అకారాంత పులింగ శబ్దంగా పేర్కొని ‘మే అని కూయునది - మేఁక’ అనే అర్థాన్నిచ్చి, ఇంకా ఇలా చెప్పింది ‘కల్పద్రుమాది కోశములం దీపదము రాజనిఘంటువులో నున్న దని కలదు. కాని రా.ని.లో లేదు. వ్యుత్పత్తిని బట్టి వ్యాకరణముచే సాధువు గాన గ్రహింపఁబడినది)
    *
    గుండు మధుసూదన్ గారూ,
    స్తుతి రూపమైన మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ గురువులకు, పెద్దలకు
    ప్రణామములు!

    విశ్వంభరాభీలవైశ్వానరజ్వాల కేశాగ్రముల నుండి గింకిరింపఁ
    గరకఠారకఠోరతరపరశ్వథధార కర్మబంధంబుల కాఁకఁ ద్రుంపఁ
    జతురాస్యముఖవినిర్గతచతుఃశ్రుతివచోనిచయంబు గైసేఁత నింపు నింప
    బహుజన్మవాసనోద్వాసనావాసితపద్మంబు జగముల భాసురింప

    ఛాగరాజాధిరూఢుఁ డై యాగశాల
    లందుఁ గొలువుండు దేవుని నభినుతింతుఁ
    బూజ్యపితృదేవనిత్యాన్నభుక్తి కొఱకుఁ
    గవ్యవహుఁ డైన భవ్యుని హవ్యవహుని.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  9. చంద్రశేఖర్ గారూ,
    ఈ విశేషవృత్తాల్లో కొన్నింటిని గతంలో మన బ్లాగులోనే పండిత నేమాని వారు పరిచయం చేసారు. అయినా మీకోసం ఇక్కడ ఇస్తున్నాను.
    1. స్వాగతము - గణములు ర-న-భ-గగ. యతిస్థానం 7. ప్రాస నియమం ఉంది.
    2. కరిబృంహితము - గణములు భ-న-భ-న-భ-న-ర. యతిస్థానం 13. ప్రాసనియమం ఉంది.
    3. గంధగజేంద్రము - గణములు భ-భ-భ-గగ. యతిస్థానం 7. ప్రాసనియమం.
    4. మేఘవిస్ఫూర్జితము -గణములు య-మ-న-స-ర-ర-గ. యతిస్థానం 13. (1,7,13 అక్షరాలకు యతిమైత్రి కూర్చటం కూడా ఉంది). ప్రాసనియమం ఉంది.
    5. మత్త - గణములు మ-భ-స-గ. యతిస్థానం 7. ప్రాసనియమం ఉంది.
    6. ఇంద్రవంశము - త-త-జ-ర. యతిస్థానం 8. ప్రసనియమం ఉంది.
    7. జలదము - భ-ర-న-భ-గ. యతిస్థానం 10. ప్రాసనియమం ఉంది.
    8. ఇంద్రవజ్ర - త-త-జ-గగ. యతిస్థానం 8. ప్రాసనియమం ఉంది.

    రిప్లయితొలగించండి
  10. ఏల్చూరి మురళీధర రావు గారూ,
    అగ్నిదేవుని గురించి అద్భుతమైన పద్యం చెప్పారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య...

    కవిపండితులు ఏల్చూరి మురళీధరుల వారి పద్యము చిక్కని చక్కని పదబంధ వైశిష్ట్యముతో నొప్పారుచున్నది. వారికి నా యభినందనములను దెలుపఁగలరు.

    రిప్లయితొలగించండి
  12. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య....

    "మన తెలుఁగు" గారికి నమస్కారములు. విశేషవృత్తములఁ గూర్చి తెలుసుకోవలెనన్న జిజ్ఞాస మీలో కలిగినందులకు సంతోషము. వాటి వివరము లీ దిగువ నిచ్చుచున్నాను.

    మత్త:
    1)గణములు - మ భ స గ
    2)యతి మైత్రి - 1వ అక్షరము + 7వ అక్షరము
    3)పాదమందలి యక్షరముల సంఖ్య - 10
    4)ప్రాస పాటించవలెను

    స్వాగతము:
    1)గణ. - ర న భ గ గ
    2)య. మై. - 1వ అ. + 7వ అ.
    3)అక్ష. సం. - 11
    4)ప్రాస కలదు

    గంధ గజేంద్రము:
    1)గణ. - భ భ భ గ గ
    2)య. మై. - 1వ అ. + 7వ అ.
    3)అక్ష. సం. - 11
    4)ప్రాస కలదు

    ఇంద్రవజ్ర:
    1)గణ. - త త జ గ గ
    2)య. మై. - 1వ అ. + 8వ అ.
    3)అక్ష. సం. - 11
    4)ప్రాస కలదు

    ఇంద్రవంశము:
    1)గణ. - త త జ ర
    2)య. మై. - 1వ అ. + 8వ అ.
    3)అక్ష. సం. - 12
    4)ప్రాస కలదు

    జలదము:
    1)గణ. - భ ర న భ గ
    2)య. మై. - 1వ అ. + 10వ అ.
    3)అక్ష. సం. - 13
    4)ప్రాస కలదు

    మేఘవిస్ఫూర్జితము:
    1)గణ. - యమనసరరగ
    2)య.మై. - 1వ అ + 13వ అ
    3)అక్ష. సం. - 19
    4)ప్రాస కలదు

    కరిబృంహితము:
    1)గణ. - భనభనభనర
    2)య మై - 1వ అ + 13వఅ
    3)అక్ష సం - 21
    4)ప్రాస కలదు

    పైన తెలిపిన లక్షణములను మనము నందిడుకొని సాధన చేసినచో స్వాధీనము కాఁగలవు. ప్రయత్నించఁగలరు. శుభం భూయాత్.

    రిప్లయితొలగించండి
  13. అగ్ని దేవ సన్నుతింతు నయ్య నీవు లేనిచో
    భగ్న మౌను జీవయాత్ర పావకా వివాహపున్
    లగ్నమందు శ్రద్ధ జేయు లాఁతి లౌకికమ్మునన్
    మగ్నమౌను మా మనమ్ము మత్కృతమ్ము నీ యెడన్.

    రిప్లయితొలగించండి
  14. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి,

    మీ ప్రేమాతిశయముఁ బ
    ద్యప్రణయనదీక్ష నన్నుఁ దావకవాత్స
    ల్యప్రశ్రితుఁ గావించె సు
    ధాప్రేక్షణ శంకరార్య! ధన్యతఁ జెందన్.

    మిత్రశ్రీ గుండు మధుసూదన్ గారికి,

    ఓ మైత్రీమధురహృదయ!
    శ్రీ మధుసూదన సుకవివరేణ్య! భవత్ప్రే
    మామందాదరసౌజ
    న్యామృతసేకమున ధన్యతావధిఁ గాంతున్.

    మాన్యశ్రీ మిస్సన్న గారికి,

    య స్సనిపించెడి భావము
    స్వస్సంస్తవనీయభక్తివాక్తతి సుధాం
    తస్సరణిని మీ కవితను
    మిస్సగుటకు వీలులేదు మిస్సన్నార్యా!

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  15. మాన్యశ్రీ మిస్సన్న గారికి,

    య స్సనిపించెడి భావము
    స్వస్సంస్తవనీయభక్తివాక్తటిని సుధాం
    తస్సరణిని మీ కవితను
    మిస్సగుటకు వీలులేదు మిస్సన్నార్యా!

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  16. సర్వము భక్షించెద విట
    సర్వులకున్ రక్షనిచ్చి సాకెద వయ్యా
    యుర్విని హవ్యము నీయగ
    గీర్వాణుల కిచ్చు నీకు కేలును మోడ్తున్.

    రిప్లయితొలగించండి
  17. మిస్సన్న గారూ,
    లయబద్ధంగా మేలుమేలని తలనూపించిన పద్యం మీది. అభినందనలు.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ధన్యవాదములు.
    మీ ప్రశంసల నెప్పుడు చూచినా ‘కూపనటద్భేకము’ నైపోతాను. కాని మీరన్నట్లు ‘సుధాప్రేక్షణు’డ నని ఒప్పుకుంటాను. నా కళ్ళల్లో కోపం, విసుగు, అసూయ కనిపించవని బంధుమిత్రులు అంటూ ఉంటారు.
    మధుసూదన్, మిస్సన్న గారల గురించిన ప్రశంసాపద్యాలు సౌహార్దపూరితాలై మనోహరంగా ఉన్నాయి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ పండిత నేమాని వారి పద్యములు గానీ, వ్యాఖ్యలు గానీ లేక బ్లాగు ఈరోజు చంద్రుడు లేని ‘అమవస నిసి’ అయింది.

    రిప్లయితొలగించండి
  19. మిస్సన జేసిన పూరణ
    యెస్సని పించెను కనుండు ఏల్చూరిని యా
    శీస్సగు చియ్యది మోద స
    రస్సున మునిగించి తేల్చె రంజుగ వానిన్.

    రిప్లయితొలగించండి
  20. గురువుగారూ ధన్యవాదములు.

    బహుశా నేమాని పండితార్యులు రేపు జరుగబోయే వారి మనుమని వధాన సభా సన్నాహాల్లో ఉన్నారేమో.

    రిప్లయితొలగించండి
  21. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య...
    కవిపండిత మిత్రులు శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారూ,
    భవత్ప్రేమా మందాదర సౌజన్యామృతసేకమున నన్ను ముంచి తేల్చినారు! మీ పద్య మద్భుతముగ నున్నది! మీ చేత మెప్పు లందినందులకుఁ గృతజ్ఞుఁడను. స్వస్తి.
    భవదీయ మిత్రుఁడు
    గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
  22. తేటగీతి(సప్తపది)

    నవ వధువులను గడతేర్చు నడత మాన్పి
    యత్త వారింటి దుష్టుల యాట కట్టు
    ప్రజల యాస్తులన్ గాల్చెడు పథము మాన్పి
    నిరసనలుదెల్పువారల నెలవు వీడు
    శాకముఁదినెడుమేకపు స్వారి తోడ
    మంచిచెడులనె ముఖదోయి నెంచి జూప
    సాంద్ర కరుణార్ద్రహృదయాన సాగు దేవ!

    రిప్లయితొలగించండి
  23. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. అజగు డనుపేర నాజ్యము లందు కొనగ
    హవ్య వాహుడు లేకున్న హవిసు లేదు
    జగతి మనుగడ నిలిపెడి జ్యోతి యనుచు
    సర్వ బక్షకు డీతడు సర్వు డనగ !

    రిప్లయితొలగించండి
  25. రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    మూడవ పాదంలో యతి తప్పింది. ‘జగతి మనుగడ నిలిపెడి జ్వలను డనుచు’ అందాం.

    రిప్లయితొలగించండి
  26. తమ్ముడూ ! ఆరోగ్యం బాగై నందుకు ఆనందంగా ఉంది.[ ఈ మధ్య నాకూ సరిగా లేదు .కంప్యూటర్ , ఫోను , కుడా పనిచేయ ట ల్లేదు . అలా నడిపిస్తున్నాను. ] ధన్య వాదములు .

    రిప్లయితొలగించండి


  27. క్రుద్ధ వైశ్వానర,భయద కోటి శిఖల
    కాల్తువు జగమ్ముల బ్రళయకాలమందు
    శిథిలలోకముల బునః సృష్టి జేయ
    కాళ విధ్వంసన మవశ్యకంబు గాదె.

    పరమేశు ఫాలాక్షి బ్రళయాగ్నివై యుండి,
    వారాశి గర్భాన బడబాగ్ని వైయుండి
    తరుకాష్ఠములలోన దావాగ్నివై యుండి
    జగములందున నీవు సర్వ వ్యాపివి కాదె.

    రిప్లయితొలగించండి