18, సెప్టెంబర్ 2012, మంగళవారం

పద్య రచన - 116

నైరృతుడు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
సీ.
నరవాహనుండు బంధుర ఖడ్గహస్తుండు
          వరచర్మధరుఁడు కర్బురశరీరుఁ
డతుల జగద్రక్షణాంచత్కృపానిధి
          చటులోగ్ర యామినీ సంచరుండు
సన్మార్గరోధి దుష్టనిశాచరవ్రాత
          వారకుం డురుబలాధారకుండు
నురుతరకుటిల నీలోన్నత కేశుండు
          నికషావధూమణీ నిత్యరతుఁడు
తే.గీ.
మహిత బలవైభవోద్దండ మండితుండు
కింకిణీరవ భూషణాలంకృతుండు
మృదులవచనుండు నైరృతి మీకు నొసఁగు
చిరతరారూఢ భోగ విశేషములను.
(అజ్ఞాతకవి - శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ‘చాటుపద్య మణిమంజరి’ నుండి)

5 కామెంట్‌లు:

  1. -: నిరృతి పూర్వజన్మ కథ :-

    ఆ.వె.
    నిరృతి గత భవమునఁ బింగాక్షుఁ డను బోయ
    యయి యహింసఁ బూని యటవి నుండె!
    నతని పిన్న తండ్రి యట బాటసారులఁ
    గొల్లకొట్టి ధనము కూడఁబెట్టు!(1)

    కం.
    ఒకనాఁ డతండు నది పా
    యక తెరువరిఁ గొల్లకొట్టె ననుచర యుతుఁడై;
    "యకటా! ననుఁ గాపాడుఁడు;
    నొకఁడనుఁ గాఁ జూచి వీర లొక్కట నన్నున్ (2)

    తే.గీ.
    దోచుకొనఁ జూచుచుండిరి; తొందరఁగను
    నన్నుఁ గాపాడుఁ"డని నంత నతని కడకుఁ
    జనియుఁ బింగాక్షుఁ డనియె "నో పిన్నతండ్రి!
    బాటసారిని విడు" మని వలుకఁ గానె;(3)

    కం.
    కోపమున, సఖులుఁ జూడఁగఁ
    బాపమ్మని యెంచకుండ బాలునిఁ జంపెన్!
    శాపమొ, యనుగ్రహమ్మో?
    యా పసివాఁ డట్లు చచ్చి, యా నిరృతుఁ డయెన్!!(4)

    తే.గీ.
    పరుల కుపకారమునుఁ జేసి స్వర్గతుఁడయి,
    పుణ్య వశమున నిరృతిగఁ బుట్టి, యష్ట
    దిక్పతులలో నొకండయి, స్థిర యశుఁడయెఁ!
    బరుల కుపకారమునుఁ జేయ, భాగ్య మిదియ!!(5)

    రిప్లయితొలగించండి
  2. నైరుతీపతీ!
    నిల్ప భారపు టెత్తులన్ నీవు మాకు
    కీర్తి సుప్రతిష్టల ధనపార్తి దీర్చి
    యాదు కొనుమయ్య యస్రప! యాతు ధాన!
    యుల్లమందైన నినుఁబల్ల ముంచ సామి!

    రిప్లయితొలగించండి
  3. శ్రీ గురువులకు, పెద్దలకు
    ప్రణామములు!

    “శవభక్షకుఁడ వీవు! జనులను జీవచ్ఛవములుగా మార్చు నీ బంట్ల మేము!
    అస్రపుం డవు స్వామి! యార్తుల రక్తమ్ము పెట్టుబడిగ మేము పెరిగినాము!
    హింసాభిమానివి! హింసలో పట్టభద్రులమైన మమ్ము సేవలకుఁ గొనుము!
    ఆత్మరక్షకుఁడవు! ఆ యాత్మరక్షణఁ గోరియే నీ యండఁ జేరినాము!

    ఎంత పుణ్యజనుఁడవు! నీ పొంత భక్తి
    నిలచితిమి; కరుణింపు మో నిరృతినాథ!”
    యంచు నిన్నుఁ బ్రార్థించు “నాయకుల” కొఱకు
    “పదవు”లను గూర్చినా వోయి! ప్రణతిఁ గొమ్ము!

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  4. గుండు మధుసూదన్ గారూ,
    ‘పరుల కుపకారమునుఁ జేయ, భాగ్య మిదియ’ అంటూ నిరృతి పూర్వ వృత్తాంతాన్ని మనోహరంగా వర్ణించారు. బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
    ‘ధనపార్తి"? అది ధనపు + ఆర్తి యా? టుగాగమం రావాలి కదా! ‘కీర్తి సుప్రతిష్ఠల నిడి యార్తి దీర్చి’ అని నా సవరణ...
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    నిరృతి ప్రాశస్త్యాన్నీ, ప్రభావాన్ని వ్యంగ్యాత్మకంగా చిత్రించిన మీ పద్యం ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. గురువుగారికి నమస్సులు,
    ధన్యవాదాలుతెలియచేసుకొంటు నా పద్య 2వ పాదాన్నిట్లు సవరిస్తే బాగుంటుందేమొ పరిశీళించ ప్రార్థన:

    'కీర్తి , సుప్రతిష్ట , ధనపుటార్తి దీర్చి'

    రిప్లయితొలగించండి