21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

పద్య రచన - 119

వాయువు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
సీ.
సకల భూతవ్రాత సంజీవనఖ్యాత
          ముఖ్య మహాప్రాణ మూర్తిధరుఁడు
కర్పూర కస్తూరికా చందనాగరు
          ధూపాది పరిమళ వ్యాపకుండు
ఆత్మానుకూల మహావేగ మృగవాహ
          నారూఢుఁ డఖిల విశ్వాభియాయి
వైశ్వానరప్రభు శాశ్వత సహవాసి
          భీమాంజనేయుల ప్రియజనకుఁడు
తే.గీ.
పశ్చిమోత్తరమధ్య దిగ్భాగ నిరత
పాలనోద్యోగి దేవతాప్రముఖుఁ డెపుడు
వాయుదేవుండు చిరముగా నాయు విచ్చి
మంచి యారోగ్యమున మమ్ము మంచుఁగాత.

(అజ్ఞాతకవి - శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ‘చాటుపద్య మణిమంజరి’ నుండి)

26 కామెంట్‌లు:

  1. మిత్రులకు నమస్కృతులు.
    ‘చాటుపద్య మణిమంజరి’ నుండి సేకరించిన దిక్పతుల స్తుతి పద్యాలను ఆయా పోస్టులలో చేర్చాను. ఆ పద్యాలను చూడవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  2. నమామి భువనప్రాణం
    మహాజవ సమన్వితం
    మృగవాహం మహావీరం
    వాయుదేవం నమామ్యహం

    రిప్లయితొలగించండి
  3. జగతికి ప్రాణము నొసగుచు
    ఖగముల తిండికిని తిండిగను దానగుచున్
    జగమెల్ల నిండి నతడికి
    మిగ భక్తిని నే ప్రణతుల మెండుగ జేతున్.

    రిప్లయితొలగించండి
  4. గంధ వాహుడ! భీ ముని గనిన య య్య !

    మృగము వాహన ! యనిలుడ ! వేగ గమన !

    ఆయు రారోగ్య సంపద లన్ని గలుగు

    వరము నీ యుము నీ కిదె వంద నంబు .

    రిప్లయితొలగించండి
  5. -:వాయవ్య దిక్పాలక చరిత్రము:-

    కం.
    పూతాత్ముండను విప్రుఁడు
    పూతమనమ్ముననుఁ గాశి పురమందునఁ దా
    వీతానుబంధుఁ డయ్యును
    జోతలనిడి తపము శివుని స్తుతులన్ జేసెన్! (1)
    తే.గీ.
    పెక్కు వత్సరములు తపం బివ్విధమునఁ
    జేయ, శివుఁడు సంతోషించి, చిత్తమలర
    దిక్పతిత్త్వమ్ము, పంచమూర్తిత్త్వ,సర్వ
    గత్త్వ, సర్వసత్త్వావబోధత్త్వములిడె! (2)
    తే.గీ.
    పంచమూర్తిత్త్వగత వాయువయ్యు జనుల
    దేహములలోనఁ దానుండి దివ్య జీవ
    నమ్ము నిడియును మనల దినమ్ము దినముఁ
    గాచుచుండెను ప్రాణమౌ గాలి నిడియు! (3)
    కం.
    ప్రాణాపానవ్యానో
    దానసమానాఖ్య పంచ తత్త్వాత్ముండై
    ప్రాణుల లోపల నెపుడున్
    దానై నివసించుచుండు దైవమతండే! (4)
    ఆ.వె.
    ఇట్టి వాయుదేవు నిలఁ బ్రజ నిత్యమ్ము
    సకల పూజలందుఁ బ్రకటముగను
    బరగఁ బూజ సేయ; వరదుఁడు వాయుదే
    వుండు ప్రాణులందు నుండి వెలిఁగె! (5)
    వ.
    ఇట్లు వాయుదేవుండు ప్రాణులలోను, విశ్వమందునను వ్యాపించి, వాయవ్య దిశఁ బాలించుచుండఁ బ్రజలందఱును నతని నిట్లు స్తుతి సేయందొడంగిరి.(6)
    తే.గీ.(మాలిక)
    ప్రాణ! మారు! తానిల! సమీర! ప్రసత్వ!
    వాత! భూతాత్మ! సంహర్ష! వాయు! శుష్మి!
    ఖగ! భృమల! లఘగ! లఘాట! కంపలక్ష్మ!
    దర్వరీక! నభోజాత! తత! తపస్వి!
    శ్వాస! సృక! సృదాకు! సర్వత్రగామి!
    పవన! సప్తమరు! ద్యాతు! ప్రవహ! సరటి!
    సమగతి! సదాగతి! స్పర్శ! ప్రముఖ! సూక!
    శ్వసన! పృశదశ్వ! సృక!జగత్ప్రాణ! లఘటి!
    మాతరిశ్వ! సమీరణ! హే తరస్వి!
    మా శరీరమ్ము నందుండి, మమ్ముఁ గాచి,
    శ్వాసవై, పంచప్రాణమై, సర్వ కాల
    సర్వ విధ శుభకార్య సంస్కార కృతుల
    మమ్ము వీడక యుండు మో మారుతాత్మ! (7)
    వ.
    అని స్తుతించుచుండఁ బవనుండును నత్యంత ప్రమోదుండునై విశ్వప్రజల నందఱను నెల్ల వేళలఁ గాపాడుచుండు. (8)

    లోకా స్సమస్తా స్సుఖినో భవన్తు!
    -:శుభం భూయాత్:-

    రిప్లయితొలగించండి
  6. అయ్యా శ్రీ మధుసూదన్ గారూ!
    శుభాశీస్సులు.
    మీరు వ్రాసిన ఖండిక పాఠకలోకమునకు సుబోధకముగా ప్రశంసనీయముగా నున్నది. 2 పాదములలో గణభంగము గాన వచ్చుచున్నది.
    4వ పద్యము 4వపాదములో బేసి స్థానములో జగణము ఉన్నది.
    7వ పద్యము 5వ పాదములో ఇంద్రగణములు సరిగా లేవు.
    స్వస్తి.

    మిత్రులారా! వాయుదేవుని గూర్చి కొన్ని ముఖ్య విషయములను తెలియ జేయుచున్నాను:

    1. వాయువు పంచ భూతములలో నొకటి. ఆకాశము నుండి వాయువు జనించినది.
    2. పరమేశ్వరుడు - అష్టమూర్తి - వాయువు కూడా పరమేశ్వరుని ఒక రూపమే.
    3. వాయువు జగత్ ప్రాణము కాబట్టి ఉపనిషత్తులు వాయువును బ్రహ్మముగా పరిగణించుచున్నవి. (వాయోర్బ్రహ్మ - అని ఉపనిషద్ వాక్యము).
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. వాయువు లేకను ప్రాణుల
    కాయువు లేదయ్య జగతి గాచెడు దైవం
    బాయన మ్రొక్కుదు క్షణమున్
    బాయక నే శ్వాస తోనె భావన లోనన్.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ పండిత నేమాని వారూ,
    ధన్యవాదములు.
    నాలుగవ పద్యము నాలుగవ పాదములో బేసిగణముగా జగణము లేదు. మరొకసారి పరిశీలించించ మనవి.
    ఏడవ పద్యము ఐదవపాదములో గణభంగం జరిగిన మాట వాస్తవము. నేను చిత్తుప్రతిలోముందు సృదాకు అని వ్రాసి దానిపైన పవమాన అని వ్రాసి టైపు చేయునపుడు పొరపాటున సృదాకు అనియే చేసినాను. ఆ పాదమునకు నా సవరణము ఇది
    ‘శ్వాస! సృక! పవమాన! సర్వత్రగామి!’

    రిప్లయితొలగించండి
  9. భీమాంజనేయ ఘనులన్
    స్వామీ సుతులుగ బడసిన సబలుండవు! యీ
    భూమిన్ వర్షించ వరుణ
    దేముని నేస్తుని గ రావె! దేవా! బ్రోవన్!

    రిప్లయితొలగించండి
  10. వెన్నెల కాంతులు విరియగ
    కన్నియ విరహమ్ము నొంది కలవర పడగన్ !
    చెన్నుడు సంతస మందుచు
    సన్నగ కదలెను వసంత సమీరు డటన్నన్ !

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని వారూ,
    అనుష్టుప్పులో మీ వాయుస్తోత్రం బాగుంది. అభినందనలు.
    మిత్రుల పద్యాలను సునిశితంగా పరిశీలిస్తూ సూచన లిస్తున్నందుకు ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ‘ఖగముల తిండికి తిండి’ చక్కని ప్రయోగం. మంచి పద్యం. అభినందనలు.
    ‘మిగ’...?
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మృగము వాహన!’ అన్నదాన్ని ‘మృగ సువాహన!’ అంటే ఇంకా బాగుంటుందేమో!
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ ‘వాయవ్య దిక్పాలక చరిత్రము’ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘దేముడు’ శబ్దం గ్రామ్యం.
    ‘వరుణ
    స్వామికి నేస్తునిగ రావె! పవనా! బ్రోవన్!’ అని నా సవరణ...
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘సమీరుడు’ అన్నపుడు గణదోషం. ‘వసంత సరయు డటన్నన్’ అందాం. సరయుడు అంటే వాయువు.

    రిప్లయితొలగించండి
  12. రాజేశ్వరి గారూ పద్యం బాగుంది.
    "వెన్నెల కాంతులు విరియగ
    కన్నియ విరహమ్ము నొంది కలవర పడగన్ ! "

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్య గారూ/శ్రీ మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.

    శ్రీ మధుసూదన్ గారి 4వ పద్యములో గణభంగము లేదు. నేనే పొరబడ్డాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. రాజేశ్వరి గారూ

    "వెన్నెల కాంతులు విరియగ
    కన్నియ విరహమ్ము నొంది కలవర పడగన్ !

    "పడగన్" బదులు "పడియెన్" అంటే ఎల్లా ఉంటుంది ?

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని వారూ,
    అది గుండు వారి వ్యాఖ్యే... కాపీ, పేస్ట్ చేసినప్పుడు ‘గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య’ అని టైపు చేయడం మరిచిపోయాను.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. కాలుని సంజ్ఞను కనుగొని
    గాలి బయల్వెడలు తనువు కట్టెగ మారున్
    గాలియె జీవము బ్రహ్మము
    గాలియె పరమేశు రూపు గాలికి జేజే.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ గురువులకు, పెద్దలకు
    ప్రణామములు!

    రాజేశ్వరి గారి కల్పన మనోహరంగా ఉన్నది.

    శ్రీ లక్కరాజు వారికి: ఆర్యా!

    "పడియెన్" అంటే గతార్థత్వం వల్ల, ఏకాశ్రయత్వం వల్ల సర్వజనసాధారణీకరణధర్మం బాధితమవుతుంది. "పడఁగన్" అన్నప్పుడు "పడునట్లుగా" అన్న ఉద్దేశార్థం వల్ల సార్వకాలికం అవుతుంది. అంతే కాక, జ్యోత్స్నాకర్షిత అయిన కలువకన్నె విరహిణి నాయిక; "చెన్నుడు" = అందగాడు చంద్రుడు సంతోషితస్వాంతుడై సమీరసఖుడు తోడుండగా ఆమె భావశబలతకు ఉద్దీపనగా "సన్నగ కదలెను" అన్న మిథ్యా-గమనాభినయం తోడి అర్థాంతరమూ; రమ్యమైన ప్రకృతిదృశ్యమూ భాసిస్తున్నాయి.

    2) లక్ష్మీదేవి గారి "మిగ" భక్తి - ఒప్పో తప్పో కాని, నన్నెచోడ ధూర్జటుల కన్నడ ప్రయోగాల వలె చమత్కారంగా ఉన్నది. "మిగ" కన్నడం. "మిగవుమ్" తమిళం. తెలుగులో "మిక్కిలి", "మిగత", "మిగులు" మొదలైనవి ఆ కుదుట పుట్టినవే!

    ముఖే ముఖే సరస్వతీ!

    రిప్లయితొలగించండి
  18. ఏల్చూరి మురళీధరరావు గారూ నమస్కారములు.
    "పడగన్" కి "పడియెన్" కి తేడా చక్కగా వివరించారు.

    "పడియెన్" అంటే గతార్థత్వం వల్ల, ఏకాశ్రయత్వం వల్ల సర్వజనసాధారణీకరణధర్మం బాధితమవుతుంది.

    రిప్లయితొలగించండి
  19. నమస్కారములు
    నాకు తెలియ కుండానే వ్రాసినా " వివరించి తెలిపిన , శ్రీ లక్కరాజు గారికీ , శ్రీ మురళీ ధర రావు గారికీ ధన్య వాదములు , మరియు కృతజ్ఞతలు .

    రిప్లయితొలగించండి
  20. మిస్సన్న గారూ,
    గాలికి జేజేలు పలికిన మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. మాస్టరు గారూ ! గాలిపై వ్రాసిన నా పద్యాన్ని "గాలికి" వదలి వేశారు.

    రిప్లయితొలగించండి
  22. ‘గాలి’ హనుమచ్ఛాస్త్రి గారూ,
    నిజమే! నేమాని, గుండు వారల వ్యాఖ్యల మధ్య చిక్కుబడి ఊపిరాడక మీ పూరణ చిక్కిపోయిందేమో నా దృష్టికి రాలేదు. మన్నించండి.
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. మాస్టరు గారూ ! "గోలి" ని "గాలి" అన్నారు "గోల" అనలేదు ...ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  24. గురువు గారు, మురళీధరరావుగారు,
    తమరి ప్రోత్సాహక పూరితమైన వాక్కులకు ధన్యవాదములు.
    నాది తెలియక చేసిన ప్రయోగమే.

    సవరణతో.....

    జగతికి ప్రాణము నొసగుచు
    ఖగముల తిండికిని తిండిగను దానగుచున్
    జగమెల్ల నిండి నతడికి
    మిగమీరిన భక్తితోడ మేలగు ప్రణతుల్.

    మీగమీరు = అతిశయించు (ఆంధ్రభారతి నిఘంటువు)

    రిప్లయితొలగించండి
  25. సర్వ జీవుల కాధార ముర్విపైన
    నీవు లేనిదే ప్రాణమ్ము నిలువగలదె
    జలములకు గూడ నీవె గా జన్మనిత్తు
    వనిలదేవ మా ప్రణతుల నందుకొనుము

    H2+O2=H2O(Water)

    రిప్లయితొలగించండి