22, సెప్టెంబర్ 2012, శనివారం

పద్య రచన - 120

కుబే్రుఁడు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
చం.
ఉనికట వెండికొండఁ, దనయుండట రంభకు, యక్షరాజు నా
ధనపుఁ డనన్ బ్రసిద్ధుఁడట, దాపవిభుండట, పుష్పకంబుపైఁ
జనునట, పార్వతీపతికి సంగతికాఁడట యాత్మసంపదల్
పెనుపుగ నిచ్చి హెచ్చుగఁ గుబేరుఁడు మిమ్ము ననుగ్రహించుతన్.

(అజ్ఞాతకవి - శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ‘చాటుపద్య మణిమంజరి’ నుండి)

18 కామెంట్‌లు:

  1. ధనమే సర్వ సుఖమ్ములిచ్చుచును హోదా బెంచు సంఘమ్ములో
    ధనమే లేని యవస్థ కూర్చును మహాదైన్యమ్ము నీ భూమిపై
    ధననాథుండవు యక్షనేతవు సుధీధామా! కుబేరా! యశో
    ధన! విశ్వేశ్వర మిత్రమా! శుభచరిత్రా! నిన్ను సేవించెదన్

    రిప్లయితొలగించండి
  2. మిత్రులారా!
    కుబేరుని గూర్చి అజ్ఞాత కవి పైని చెప్పిన పద్యములో ఆతడు రంభ యొక్క కుమారుడు అని యున్నది. ఇది సందేహాస్పదముగా నున్నది. అధ్యాత్మ రామాయణములో ఈ క్రింది విధముగా నున్నది:

    బ్రహ్మ కుమారుడు : పులస్త్యుడు
    పులస్త్యుడు తృణబిందు అనే రాజర్షి కుమార్తెను వివాహము చేసుకొనగా వారికి విశ్రవసుడు అనెడి కుమారుడు కలిగెను.
    విశ్రవసుడు భరద్వాజ మహర్షి కుమార్తెను వివాహము చేసుకొనగా వారికి వైశ్రవణుడు (కుబేరుడు) అనెడి కుమారుడు కలిగెను. అతడు బ్రహ్మ వంశములోని వాడు, యక్షుల కధిపతి. ధనపతి, దిక్పతి, ఈశ్వరుని హితుడు, పుష్పక విమానమును కలవాడు, అలకాపురి వాని రాజధాని.

    రంభ నలకూబరుని భార్య. అప్సరసలలో నొకతె (దేవ వేశ్య). అందుచేత రంభ కుబేరునికి తల్లి కాదు. మరి భరద్వాజ మహర్షి కుమార్తె పేరు కూడా "రంభ" (వేరొక రంభ) అగునేమో.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. గురువు గారు, మురళీధరరావుగారు,
    తమరి ప్రోత్సాహక పూరితమైన వాక్కులకు ధన్యవాదములు.
    నాది తెలియక చేసిన ప్రయోగమే.

    సవరణతో.....

    జగతికి ప్రాణము నొసగుచు
    ఖగముల తిండికిని తిండిగను దానగుచున్
    జగమెల్ల నిండి నతడికి
    మిగమీరిన భక్తితోడ మేలగు ప్రణతుల్.

    మీగమీరు = అతిశయించు (ఆంధ్రభారతి నిఘంటువు)

    రిప్లయితొలగించండి


  4. రంభ తనయుడ !ధనికుడ

    rambha tanayuda !dhanikuda ! !రాజ మౌళి !

    ప్రియుడ ! దాన విభుండ !కుబేర సామి !

    పుష్ప కం బున యానం బు భూ రి గాను

    జేయు నీ కివె వినతులు సేతు నెపుడు .

    రిప్లయితొలగించండి
  5. కుబేరుని కుమారుడు నలకూబరుడు అని అతడి రంభకు నచ్చినవాడని విన్నాము.

    దేశములేలగల తిరుమ
    లేశునికి ధనము నొసగిన లీలను గనుమా!
    యీశుని మిత్రుండాతడు
    క్లేశముల తొలగ జేయంగ కృపజూపడొకో?

    రిప్లయితొలగించండి
  6. గుణనిధి కుబేరునిగ మారిన కథ
    (శివపురాణాంతర్గతము)
    ప్రథమ జన్మ వృత్తాంతము:
    కం.
    ధరలోన యజ్ఞదత్తుం
    డిరు బుట్టు వొకండు నుండె; నతనికి సుతుఁడొ
    క్కరుఁడు గుణనిధి యను నతఁడు!
    నరయఁగఁ జోరుండు, జారుఁ డతి దుర్హృదుఁడే!(1)
    తే.గీ.
    ప్రతి దినమ్మును దుర్మార్గ వర్తనుఁడయి,
    స్వైర విహరణ సేయుచుఁ జెలఁగుచుండఁ
    దండ్రి సహియింప నోపక తన గృహమును
    వీడి పొమ్మని శాసించ, వెడలె నతఁడు!(2)
    ఆ.వె.
    కూడు, గూడు, కాసుఁ గూడ చేతను లేక
    పస్తులుండ, నొకఁడు పాయసమును
    నచటి దేవళమున నైవేద్యముగ నిడి,
    హరుని మ్రొక్కి, వేడి, యతఁడు వేగ;(3)
    కం.
    గుడి నుండి వెడల, వెంటన
    గుడిలోపలి పాయసమును గుటుకున మ్రింగన్,
    గుడి బయటి భటు లదియుఁ గని,
    కడు వేగిరమునను రాఁగఁ గ్రమ్మె నిరు లటన్!(4)

    కం.
    నైవేద్యమ్మును మ్రింగిన
    యా వైనము కతనఁ గ్రమ్మె నా చీఁకటులున్
    ఠావును విడిచిన గుణనిధి
    వేవిధముల వెతలఁ బడియు విగతాసుఁడు గాన్;(5)
    ఆ.వె.
    అంత శివ భటులును నతనినిఁ గొంపోయి,
    శివుని చెంత నుంప, శివుఁడు దయను
    నిడియె మఱొక జన్మ; నిష్ఠతో జీవించు
    నట్లు వరము నిడియు, నతనిఁ బంపె!(6)
    ద్వితీయ జన్మ వృత్తాంతము:
    ఆ.వె.
    శివుని వర బలాన నటఁ గళింగాధిపుఁ
    డగు నరింధమునకు దముఁ డనియెడి
    పుత్రుఁగా జనించి, భూమినిఁ బాలించి,
    దేవళమ్ములందు దీప పూజ;(7)
    తే.గీ.
    నిత్యమును జేయుచును దాను నిష్ఠతోడఁ
    బూజ సేయుచు; నొకనాఁడు బోయి కాశి,
    యచట విశ్వేశునకుఁ బూజలందఁజేసె;
    నంత శివపార్వతులు మ్రోల నవతరించ;(8)
    (3)
    తే.గీ.
    దముఁడు పార్వతీదేవిఁ బ్రథమము గాను
    గనియు; సౌందర్య వర్ణనమునటఁ జేయ,
    క్రుద్ధ నేత్రయై పార్వతి గుణనిధిఁ గన,
    నొక్క కన్ను వ్రక్కలు గాఁ, నొంటి కంటి;(9)
    ఆ.వె.
    వాఁడు నయ్యె; నంతఁ బార్వతీదేవియు
    "నటులఁ జూచినట్టి యతఁ డెవండు?
    తెలుపుఁ" డనఁగ, శివుఁడు తెలుపఁ, గరుణతో
    నతని కన్ను మఱల నతని కిడియె!(10)
    కం.
    చిఱునగవున శివుఁడప్పుడు
    కరుణఁ గుబేరాభిధ,నలకాపురి నిడి, యు
    త్తర దిక్పతిగ, ధనపతిగ,
    మఱి, తన సన్నిహితునిగను మన్ననఁ జేసెన్!(11)
    వ.
    కుబేరుండంతట నుత్తర దిక్పాలకత్వము నెఱపుచు, నర్హులకు ధనప్రాప్తినిఁ గలిగించుచు, నలకాపురినిఁ బాలించుచు, శివునితో సఖిత్వముఁ బాటించుచు సుఖంబుండె;
    :కుబేర కథ సమాప్తము:
    లోకా స్సమస్తా స్సుఖినో భవన్తు!
    -:శుభం భూయాత్:-

    రిప్లయితొలగించండి
  7. కుబేర వృత్తాంతము...
    కుబేరుని తండ్రి పులస్త్యుడు. తల్లి పేరు ఇలబిల. తండ్రిని కాదని తాత అయిన బ్రహ్మను గురించి తపస్సు చేసాడు. బ్రహ్మ వరం వల్ల నలకూబరుడనే కొడుకును, లోకపాలకత్వాన్ని, ధనేశ్వరత్వాన్ని, శంకరునితో స్నేహాన్ని, లంకాపురాన్ని, పుష్పక మనే విమానాన్ని పొందాడు.
    తనను కాదన్నందుకు పులస్త్యునికి కోపం వచ్చి తన శరీరార్ధభాగంనుండి విశ్రవసుని సృష్టించి కుబేరునికి కీడు చేయమని పంపాడు. ‘‘మహాత్మా! నేను నీ కుమారుణ్ణి” అని చెప్పి సేవలు చేసి, పుష్పోత్కట, మాలిని, పాక అనే యువతులను ఇచ్చాడు.
    విశ్రవసువుకు కైకసి వలన రావణాదులు జన్మించారు. రావణుడు కుబేరునకు సవతి సోదరుడు.
    రాక్షసుల కోరికపై రావణుడు కుబేరుని లంకనుండి తరిమివేయగా అతడు శివుని వద్దకు వెళ్ళాడు. శివుడతనికి అలకాపట్టణాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో శివుని తొడపై కూర్చుని ఉన్న పార్వతి వంక కుబేరుడు ఈర్ష్యతో చూసాడు. అందువలన అతని కన్ను పగిలిపోయింది. కుబేరుడు దుఃఖించి తపస్సు చేసాడు. శివుడు ప్రసన్నుడై అతనికి చూపు ప్రసాదించాడు.
    దుష్కృత్యాలు మానుమని చెప్పడానికి కుబేరుడు ఒక దూతను రావణుని దగ్గరకు పంపాడు. రావణుడా దూతను చంపి, కుబేరునితో యుద్ధం చేసి, అతని పుష్పకాన్ని లాక్కున్నాడు.
    కుబేరునికి నలకూబరునితో పాటు మణిగ్రీవుడనే కుమారుడు ఉన్నాడు.
    (‘పూర్వగాథాలహరి’ నుండి)

    రిప్లయితొలగించండి
  8. కనకపు సింహా సనమున
    ధనపతివై సతి సరసన దర్పము నొందన్ !
    జనుల యెడకష్ట నష్టము
    కనుగొంటి వయెన్న డైన కనకాధి పతీ !

    రిప్లయితొలగించండి
  9. అల వెంకటేశు పెళ్లికి

    కొల చిచ్చావట కుబేర! కోరగ నరువున్!

    యిల దోపిడీల పాలై

    మలమల జనులాకొనంగ మమ్ములఁగనవా?

    రిప్లయితొలగించండి
  10. శ్రీ గుండు మధుసూదన్ గారు/శ్రీ కంది శంకరయ్య గారు : శుభాశీస్సులు.

    కుబేరుని వృత్తాంతమును చూచితిని. బాగుగ నున్నది. టైపు దోషములు కనుపడు చున్నవి.

    2వ పద్యము 2వ పాదములోను, 7వ పద్యము 1వ పాదములోను యతి మైత్రి లేదు.
    9వ పద్యము 4వ పాదములోను 10వ పద్యము 3వ పాదములోను గణభంగము కలదు.
    11వ పద్యము అన్వయము పూర్తి కాలేదు. మంచి ప్రయత్నము కాబట్టి శుభాభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    గుండు వారు తమ సెల్ ఫోన్‌లో టైపు చేసి పంపుతున్నందున టైపాట్లు సంభవిస్తున్నాయి. 9,10వ పద్యాలలో అవి టైపాట్లే...
    *
    గుండు మధుసూదన్ గారూ,
    నేమాని వారి వ్యాఖ్యను గమనించరు కదా!
    2వ పద్యం 2వ పాదానికి నా సవరణ...
    ‘చెడుపనుల నెన్నొ సేయుచుఁ జెలఁగుచుండఁ’
    7వ పద్యం 1వ పాదానికి నా సవరణ...
    ‘శివుని వరబలమ్ముచేఁ గళింగాధిపుఁ’
    9వ పద్యం 4వ పాదంలో ‘వ్రక్కలుగాఁగ’లో ‘గ’టైపు కాలేదు.
    10వ పద్యం 3వ పాదంలో ‘తెలుపఁగ’లో ‘గ’ టైపు కాలేదు.

    రిప్లయితొలగించండి

  12. గౌరవనీయులు పండిత నేమాని వారికి ధన్యవాదములు! తమరు తెలిపిన యైదు దోషములలో మూఁడు టైపాటులే! ఒకటి నా దోషమే! ఇంకొకటి యన్వయదోషమన్నారు; నాకైతే సరిగనే యున్నట్లు
    తోచుచున్నది. సవరణములు:

    1) 2ప. 2పా.
    చెడుగు పనులనుఁ జేయుచుఁ జెలఁగుచుండఁ
    2) 7ప. 1పా.
    శివుని వరబలాన స్థిర కళింగాధిపుఁ
    3) 9ప. 4పా.
    నొక్క కన్ను వ్రక్కలు గాఁగ, నొంటి కంటి;
    4) 10ప. 3పా.
    తెలుపుఁ"డనఁగ శివుఁడు తెలుపఁగఁ, గరుణతో
    5) అన్వయము సరిగనే పూర్తియైనది.
    గౌరవనీయ శంకరయ్యగారికి, పై సవరణలు చేసి, దయతో మరల పద్యములు బ్లాగులో పెట్టఁగలరు. ధన్యవాదములతో...స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. సవరించినది....

    గుణనిధి కుబేరునిగ మారిన కథ
    (శివపురాణాంతర్గతము)
    ప్రథమ జన్మ వృత్తాంతము:
    కం.
    ధరలోన యజ్ఞదత్తుం
    డిరు బుట్టు వొకండు నుండె; నతనికి సుతుఁడొ
    క్కరుఁడు గుణనిధి యను నతఁడు!
    నరయఁగఁ జోరుండు, జారుఁ డతి దుర్హృదుఁడే!(1)
    తే.గీ.
    ప్రతి దినమ్మును దుర్మార్గ వర్తనుఁడయి,
    చెడుగు పనులనుఁ జేయుచుఁ జెలఁగుచుండఁ
    దండ్రి సహియింప నోపక తన గృహమును
    వీడి పొమ్మని శాసించ, వెడలె నతఁడు!(2)
    ఆ.వె.
    కూడు, గూడు, కాసుఁ గూడ చేతను లేక
    పస్తులుండ, నొకఁడు పాయసమును
    నచటి దేవళమున నైవేద్యముగ నిడి,
    హరుని మ్రొక్కి, వేడి, యతఁడు వేగ;(3)
    కం.
    గుడి నుండి వెడల, వెంటన
    గుడిలోపలి పాయసమును గుటుకున మ్రింగన్,
    గుడి బయటి భటు లదియుఁ గని,
    కడు వేగిరమునను రాఁగఁ గ్రమ్మె నిరు లటన్!(4)

    కం.
    నైవేద్యమ్మును మ్రింగిన
    యా వైనము కతనఁ గ్రమ్మె నా చీఁకటులున్
    ఠావును విడిచిన గుణనిధి
    వేవిధముల వెతలఁ బడియు విగతాసుఁడు గాన్;(5)
    ఆ.వె.
    అంత శివ భటులును నతనినిఁ గొంపోయి,
    శివుని చెంత నుంప, శివుఁడు దయను
    నిడియె మఱొక జన్మ; నిష్ఠతో జీవించు
    నట్లు వరము నిడియు, నతనిఁ బంపె!(6)
    ద్వితీయ జన్మ వృత్తాంతము:
    ఆ.వె.
    శివుని వర బలాన స్థిర గళింగాధిపుఁ
    డగు నరింధమునకు దముఁ డనియెడి
    పుత్రుఁగా జనించి, భూమినిఁ బాలించి,
    దేవళమ్ములందు దీప పూజ;(7)
    తే.గీ.
    నిత్యమును జేయుచును దాను నిష్ఠతోడఁ
    బూజ సేయుచు; నొకనాఁడు బోయి కాశి,
    యచట విశ్వేశునకుఁ బూజలందఁజేసె;
    నంత శివపార్వతులు మ్రోల నవతరించ;(8)
    (3)
    తే.గీ.
    దముఁడు పార్వతీదేవిఁ బ్రథమము గాను
    గనియు; సౌందర్య వర్ణనమునటఁ జేయ,
    క్రుద్ధ నేత్రయై పార్వతి గుణనిధిఁ గన,
    నొక్క కన్ను వ్రక్కలు గాఁగ, నొంటి కంటి;(9)
    ఆ.వె.
    వాఁడు నయ్యె; నంతఁ బార్వతీదేవియు
    "నటులఁ జూచినట్టి యతఁ డెవండు?
    తెలుపుఁ" డనఁగ, శివుఁడు తెలుపఁగ, గరుణతో
    నతని కన్ను మఱల నతని కిడియె!(10)
    కం.
    చిఱునగవున శివుఁడప్పుడు
    కరుణఁ గుబేరాభిధ,నలకాపురి నిడి, యు
    త్తర దిక్పతిగ, ధనపతిగ,
    మఱి, తన సన్నిహితునిగను మన్ననఁ జేసెన్!(11)
    వ.
    కుబేరుండంతట నుత్తర దిక్పాలకత్వము నెఱపుచు, నర్హులకు ధనప్రాప్తినిఁ గలిగించుచు, నలకాపురినిఁ బాలించుచు, శివునితో సఖిత్వముఁ బాటించుచు సుఖంబుండె;
    :కుబేర కథ సమాప్తము:
    లోకా స్సమస్తా స్సుఖినో భవన్తు!
    -:శుభం భూయాత్:-

    రిప్లయితొలగించండి
  14. శ్రీ గురువులకు, పెద్దలకు ప్రణామములు!

    ఈ రోజు పనుల ఒత్తిడి వల్ల బ్లాగును ఆలస్యంగా చూడటం జరిగింది.

    “చాటుపద్యమణిమంజరి” లోని కుబేరుని గూర్చిన పై పద్యాన్ని ఈ విధంగా పరిష్కరించి చదువుకోవాలని భావిస్తున్నాను. అర్థదోషం తొలగిపోతుంది. వేటూరి వారి పాఠంలో అరసున్నలు లోపించటమే గాక కొన్ని అక్షరదోషాలు కూడా దొర్లాయి.

    ఉని కఁట వెండికొండ; శ్వశురుం డఁట రంభకు; యక్షరాజు నా
    ధనపుఁ డనన్ బ్రసిద్ధుఁ డఁట; దానవిభుం డఁట; పుష్పకంబుపైఁ
    జను నఁట; పార్వతీపతికి సంగడికాఁ డఁట! యాత్మసంపదల్
    పెనుపుగ నిచ్చి హెచ్చుగఁ గుబేరుఁడు మిమ్ము ననుగ్రహించుతన్.

    అని ఉండాలి. తొలిపాదంలో యతి “దేశీయ యతి” అని పొత్తపి వెంకటరమణ కవి “లక్షణశిరోమణి” (“ఓషధీశార్కనేత్ర భా+సురచరిత్ర”).

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  15. ధనపతి సంపద లిడునని
    ఘనముగ నర్చించ సిరులు కల్గునె నొసటన్
    కనపడని వ్రాత మరచుచు
    వినయము శీలముల మించు విత్తము కలదే.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ ఏల్చూరి వారికి ధన్యవాదాలు. నాకున్న కొన్ని సందేహాలు మీ వివరణ ద్వారా నివృత్తి అయినాయి. దేశీయయతి కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి కవిత్వంలో కూడా చూచిన గుర్తు. ఈ దేశీయ యతి సర్వ సమ్మతమేనా లేక ఒక్కొక్క కవిని బట్టి ప్రయోగించటం జరుగుతోందా? దయచేసి తెలియజేయ గలరు.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ "మన తెలుగు" చంద్రశేఖర్ గారికి,
    నమస్కారం!

    సంధికార్యం లేనందువల్ల, స్వరస్థానం ఉన్నచోటు అంగీకర్తవ్యం కానందువల్ల "దేశీయ యతి" సర్వసమ్మతం కాదనుకొంటాను. లక్షణకర్తలలో ప్రామాణికులైన భీమన, అనంతుడు, అప్పకవి మొదలైనవారెవరూ దీనిని ప్రస్తావింపనేలేదు.

    ఆధునికులైన మహాకవి విశ్వనాథ ఇటువంటి ప్రయోగాలు చేసిన విషయం ఒకప్పుడు వివాదాస్పదమయింది. 1965 ప్రాంతాల శ్రీ రావూరి దొరసామిశర్మ గారు “భారతి”లో వాటిని సమర్థిస్తూ వ్యాసాలు వ్రాశారు.

    ఇతరానేక పూర్వకవులు సైతం దీనిని ప్రయోగించారు. కవిప్రయోగాలు ఉన్నందువల్లనే వాటిని సమర్థించుకోవటానికే పొత్తపి వెంకటరమణ కవి కొంత వివరంగా చెప్పినట్లుంది.

    సర్వ శుభాకాంక్షలతో,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి

  18. ధనమె మూలమ్ము జగతికి ధనము లేని
    మనుజునకు లేదు విలువ యీ మహిని యట్టి
    ధనమునకు నధిపతివైన ధనద ,శంభు
    మిత్ర,అలకాథినాథ,కొమ్మిదియె ప్రణతి.

    శ్రీధరుండైనవానికే సిరుల నప్పు
    నిచ్చ్తి,తుద్వాహవేళలో నెప్పటి కది
    తీరునో యేమొ ,గాని సందేహమొదవె
    వడ్డికాసుల వాని యీ వడ్డిలెక్క .

    నేను చదివినప్రకారం ,పులస్త్యబ్రహ్మ కుమారుడు విశ్రవసుని
    మొదటి భార్య కొడుకు కుబేరుడు.రాక్షస స్త్రీ ఐన రెండవభార్య
    కైకసి ముగ్గురు కొడుకులలో పెద్దవాడు రావణుడు.

    రిప్లయితొలగించండి