1, సెప్టెంబర్ 2012, శనివారం

సమస్యాపూరణం - 809 (సూతసుతుఁ డర్జునుని జంపి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
సూతసుతుఁ డర్జునుని జంపి ఖ్యాతిఁ గనెను.  

11 కామెంట్‌లు:

  1. మానినీ నేను రణమున మడియుదేని
    నీకు పుత్రు లైదుగురునై నిలువ గలరు
    సూతసుతుఁ డర్జునుని జంపి ఖ్యాతిఁ గనెన
    టన్న సుతులు నీకేవురు నన్ను గూడి.

    రిప్లయితొలగించండి
  2. కృష్ణుడు కుంతితో అన్న మాటలు:
    సూతసుతుఁ డర్జునుని జంపి ఖ్యాతిఁ గనెన
    ను యపవాదు నాకువలదు నొక్కి చెప్పు
    చుంటిని వినుము కుంతి నీ సుతుని సార
    ధిగను నేనుండ నదియు జరుగుట కల్ల!

    రిప్లయితొలగించండి
  3. గుండు మధుసూదన్ గారి పూరణ....

    (తనను పాండవ పక్షమున చేరుమన్నకుంతీదేవితో కర్ణుడు పలికిన సందర్భము)

    "తల్లి! నేనొ? యర్జునుఁడొ? యుద్ధమ్మునందు
    మిగుల; నేవురు మునుపట్లు మిగులుదు రిఁక!
    సూత సుతుఁ డర్జునునిఁ జంపి ఖ్యాతిఁ గనెన
    నియొ, నతఁడె కర్ణుఁ జంపె ననియొ? వినుండు!"

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శంకరయ్య గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ,

    గురువుగారి సవరణలకు ధన్యవాదములు

    దుర్యోధనుని స్వప్నములో "సూత సుతుడర్జునుని జంపెను" అను వార్తను వినెను .

    ఆ : సుర వరు డగు సూత సుతుడర్జునుని జంపి
    ఖ్యాతి గనెను నేడు , ప్రీతి తోడ
    పాచికలను జూపి బలుక శకుని మామ,
    దొలుగ చింత, నృత్యములను జేసె
    ----

    తే: సూత సుతుడర్జునుని జంపి ఖ్యాతి గనెను
    నేటి రణ రంగ మందున దాటి గాను
    శకుని మామ బలుక, సంతసమును బొంది
    కౌరవుల్ నృత్యములు జేసె కలసి మెలసి |

    రిప్లయితొలగించండి

  5. సూ త సుతుడ ర్జునుని జంపి ఖ్యాతి గనెను
    ననె డు మాటల సత్యము లరసి జూ డ
    సూ త సూనుని జంపెను కుంతి కొడుకు
    నిజము నెరుగుము సోదర ! నీ తి పరుడ !

    రిప్లయితొలగించండి
  6. కౌరవులపక్ష మందున కదన మందు
    తమ్ముడైనను జంపగ తఱుమ నెంచ
    సూత సుతుడర్జునుని, జంపి ఖ్యాతి గనెను

    విజయుఁడా కృష్ణమూర్తియే విధముఁదెలుపఁ

    రిప్లయితొలగించండి
  7. పలికె శకుని ముఖప్రీతి పలుకు లౌర!
    అల్లుడా! రిపుల కాయువు చెల్లు చూడు
    సూతసుతు డర్జునుని జంపి ఖ్యాతి గనెన
    టంచు నగరిలో చాటించు టగును వేగ

    రిప్లయితొలగించండి
  8. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా బాగుంది. అభినందనలు.
    అన్నట్టు ‘The other' అని ఎందుకుంటున్నది?
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    సవ్యసాచిలా ఒకే భావాన్ని రెండు వేర్వేరు ఛందాల్లో పూరించిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. అభినందనలు.
    కాని కర్ణుడు ‘సురవరు’డెలా అయ్యాడు?
    ‘కౌరవుల్ నృత్యములు జేసె..’ను ‘కౌరవుల్ నాట్యమాడిరి...’ అందాం.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మూడవ పాదంలో యతి తప్పింది. దానికి ‘సూతసుతుడు చంపెను కుంతి సుతుడు చెలగి’ అని నా సవరణ...
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి




  9. సూతసుతు డర్జునుని జంపి ఖ్యాతి గనెన
    టంచు జనవాక్కు కర్ణపేయముగ వినెడి
    గడియ కెదురు చూతును నేను కర్ణ ,హితుడ,
    మాట నిలబెట్టుకొనుమ యీ పూట నీవు.

    రిప్లయితొలగించండి
  10. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    సుయోధనుని కలలో శకుని పలుకులు :

    01)
    _______________________________

    శుభము ! శుభము సుయోధన !- శుభము నీకు !
    సూతసుతుఁ డర్జునుని జంపి - ఖ్యాతిఁ గనెను !
    సోలిపోయిరి శాత్రవ - శూరులంత !
    శోక మెగసె , నపాండవా - నీక మందు !
    శుద్ధమైనది రాజ్యము - యుద్ధమందు !
    సుగమ మైనది ! నీకిక - సుభగమౌను !
    సోదరుల గూడి పాలించు - శోభనముగ !
    స్వజన మంతయు నత్యంత - సౌఖ్యమొంద !
    _______________________________
    సోలు = నశించు

    రిప్లయితొలగించండి
  11. కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    సుయోధన స్వప్నవృత్తాంతంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి