12, సెప్టెంబర్ 2012, బుధవారం

సమస్యాపూరణం - 820 (వంక యున్నవాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
వంక యున్నవాఁడు శంకరుండు.

30 కామెంట్‌లు:

  1. వంకలెల్ల దీర్చి బ్రతుకును సుఖముగా
    జరుపుచుండు వాడు శంకరుండు
    ధగ ధగ మను చుండు దళుకులతో నెల
    వంక యున్న వాడు శంకరుండు

    రిప్లయితొలగించండి
  2. కళల సంకేతమ్ము తలపైనె నిలుచుచు
    కంటి మంట లార్ప కలుగెనేమి
    జగతి జనులనెల్ల రక్షించుగా చంద్ర
    వంకయున్నవాడు శంకరుండు

    రిప్లయితొలగించండి
  3. వెండి కొండ పైన వేవేల నృత్యాలు
    మశన మందు దిరుగు మహిమ లనగ
    గళము నందు పాము గంగ చెంతన చంద్ర
    వంక యున్న వాడు శంక రుండు !

    రిప్లయితొలగించండి


  4. ఆర్యా! గతములో ఈ సమస్యను ఇచ్చినారు...

    పండితుండు గాని పామరుడే గాని
    సురలు గాని మరి యసురులు గాని
    పురుగు లైన గాని వర మిచ్చు, భక్తుల
    వంకయున్నవాడు శంకరుండు

    రిప్లయితొలగించండి
  5. చేత నభయ ముద్ర చిరునవ్వు వదనమ్ము
    భక్త పాలనమున బరగు దృష్టి
    దేవి రూప మిట్లు దివ్యమౌ నా కుడి
    వంక యున్న వాడు శంకరుండు

    రిప్లయితొలగించండి
  6. వంకలేని వాడెవఁడు త్రిభువనము లం
    దన్ని వంకలఁ దల తన్ని యన్ని
    సిరులొసగెడి శివుఁడు శీర్షముపై చంద్ర
    వంక యున్నవాఁడు శంకరుండు.

    రిప్లయితొలగించండి
  7. విద్యాసాగర్ అందవోలుబుధవారం, సెప్టెంబర్ 12, 2012 8:58:00 AM

    కంఠమందు విషము కరమందు శూలము
    ఎలుక వాహనమ్ము ఎద జింక చర్మమ్ము
    శిరము పై ధగ ధగ మెరిసెడి వెన్నెల
    వంక యున్న వాడు శంకరుండు

    రిప్లయితొలగించండి
  8. అందవోలువారికి స్వాగతం, శివుడికి ఎలుక వాహనం ఇప్పించారా? బాగుంది.

    రిప్లయితొలగించండి
  9. విద్యాసాగర్ అందవోలుబుధవారం, సెప్టెంబర్ 12, 2012 9:10:00 AM

    సవరించిన పూరణ:
    (మన తెలుగు చంద్ర శేఖర్ గారికి ధన్యవాదాలతో)
    కంఠమందు విషము కరమందు శూలము
    ఎద్దు వాహనమ్ము ఎద జింక చర్మమ్ము
    శిరము పై ధగ ధగ మెరిసెడి వెన్నెల
    వంక యున్న వాడు శంకరుండు

    రిప్లయితొలగించండి
  10. మిత్రులకు శుభాశీస్సులు.

    శ్రీ చంద్రమౌళి గారు:
    మీ పద్యములో - 1వ పాదములో గణభంగము; 3వ పాదములో యతిమైత్రి లేదు. పరిశీలించండి.

    శ్రీమతి రాజేశ్వరి గారు:
    మసనము అనుటకు బదులుగా మశనము అనుట టైపు పొరపాటు కాబోలు.

    శ్రీ విద్యాసాగర్ అందవోలు గారు:
    మీ సవరించిన పద్యములో కూడా 2వ పాదములో గణభంగము ఉన్నది. పరిశీలించండి.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి

  11. సృష్టి కార కుండు సిత భస్మ ధారుడు
    భక్త రక్ష కుండు భవుడు హరుడు
    శిరసు మీద జూడ జిలుగు వె లుగు నెల
    వంక యున్న వాడు శంక రుండు .

    రిప్లయితొలగించండి
  12. ఆకుపూజసేయ నడిగిన వరమిచ్చు
    నీరు ధారపోయ నిలిచిగాచు
    వేల్పులందు వెర్రి వేలుపు తానన్న
    వంక యున్నవాడు శంకరుండు

    రిప్లయితొలగించండి
  13. మిత్రులారా!
    ఈనాటి సమస్య "వంక యున్న వాడు శంకరుండు"
    కొందరి పూరణలలో వంక యున్న వాడు అనే అన్వయము సరిపోతోంది. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి పూరణలో మరియు శ్రీ మిస్సన్న గారి పూరణలో వంకనున్న వాడు శంకరుడు అంటేనే అన్వయము సరిపోయేటట్టుల నున్నది. మిత్రులు జాగ్రత్తగా పరిశీలించి పూరించ వలసనదిగా మనవి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా! శుభాశీస్సులు.

    తరచుగా వచ్చే పొరపాటులు:

    పొరపాటులు ఎవరికైనా వస్తాయి. ఒక మారు 2 మారులు చూచుకొంటే పొరపాటులను అధిగమించ వచ్చును. ఎక్కువగా పొరపాటులకు ఆస్కారము ఇచ్చేవి:
    (1) ఎక్కడ నుగాగమమో లేక ఎక్కడ యడాగమమో అనే విషయము
    (2) సమాసములలో తెలుగు & సంస్కృత పదములను కలుపుటలోను
    (3) వ్యావహారిక పదములను వ్యాకరణ శుద్ధము అనుకొనుటలోను, మొ.వి.

    ఈ మధ్య చాలామంది ఈ పొరపాటులు లేకుండా రచించు చున్నారు అని సంతోషముగా నున్నది. కానీ అప్పుడప్పుడు గుర్తు చేయుట మంచిది కదా. అందుకే ఈ నా హితవాక్కు మరొక్క మారు మీ ముందు నుంచుచున్నాను.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్య గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ,

    baava gaari haasyamu to eenaati purana( shankarayya gaari koraku baava gaarini yaduga )
    ----
    Te:shankarayya gaaru dirugu -jagati namdu
    parama soumyudu, korina- bhaktulakunu
    varamu lidu, shiramuna nela - vamka yunna
    vaadu shamkarumdani balke- baava gaaru

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ
    shankarayya gaaru - jagatinamdu dirugu
    vairi vargamulaku - varamulichchi,
    vaari jeta jikki - parugedu, bhaktula
    vamka yunna vaadu shankarumdu

    రిప్లయితొలగించండి
  17. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా!
    అందరికీ శుభాభినందనలు. అందరి పూరణలు చాలా బాగుగ నున్నవి.

    శ్రీ చంద్రమౌళి గారు:
    కళలకు సంకేతమైన చంద్ర వంక యున్నవానినిగా వర్ణించేరు. ప్రశస్తముగా నున్నది.

    శ్రీమతి రాజేశ్వరి గారు:
    నటరాజు, శ్మశానవాసి, చంద్రవంక యున్న శంకరుని వర్ణించేరు. ఉత్తమముగా నున్నది.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
    అభయ వరద ముద్రలతో దేవి కుడివంక యున్న శంకరుని వర్ణించేరు. సొగసుగా నున్నది.

    శ్రీ చంద్రశేఖర్ గారు:
    చంద్ర వంక శీర్షముపైని గల వాడు, వంకలన్ని దీర్చే వాడు, సిరులొసగెడు శంకరుని చక్కగా వర్ణించేరు. అభినందనీయముగా నున్నది.

    శ్రీ విద్యాసాగర్ అందవోలు గారు:
    శిరముపైని ధగధగల చంద్రవంక గల శివుని సొంపుగా వర్ణించేరు. హాయిగా నున్నది.

    శ్రీ సుబ్బా రావు గారు:
    శిరసు పైని జిలుగు వెలుగుల నెలవంక గల శంకరుని ప్రస్తుతించేరు - సొగసుగా నున్నది.

    శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారు:
    వెర్రి వాడు (భోళా శంకరుడు) అనే వంక గల శంకరుని వర్ణించేరు - వినూత్నముగా నున్నది.

    శ్రీ కందుల వరప్రసాద్ గారు:
    ఒకటి తేటగీతిలో బావగారు అని హాస్యోక్తులతో మరొకటి వైరి వర్గాలకైన వరములిచ్చి భంగపడిన శంకరుని వర్ణించేరు. ఉత్తమముగా నున్నవి.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. సతులఁ గౌర వించ పతులధర్మమ్మంచు
    లోకమెల్లఁదెలుప రూప మందు
    శిరము పైన గంగ శ్రీగౌరి తనెడమ
    వంకయున్నవాడుశంకరుండు!

    రిప్లయితొలగించండి
  19. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.

    మీ పద్యమును చూచేను. అన్వయమునకు ప్రాధాన్యమును ఇచ్చుట లేదు. సతులను గౌరవించుటకు అనే అర్థము స్ఫురించుట లేదు. శ్రీ గౌరి తనెడమ అనే ప్రయోగము బాగులేదు. ఎడమ వంక నున్న (వంకను + ఉన్న) అని అన్వయము. కానీ సమస్య ప్రకారము వంక యున్న అని పూరించాలి. ఈ సూచనలను గమనించి మరొక ప్రయత్నము చేస్తే బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. విద్యాసాగర్ అందవోలుబుధవారం, సెప్టెంబర్ 12, 2012 5:21:00 PM

    తిరిగి సవరింప బడ్డ నా పూరణ:

    కంఠమందు విషము కరమందు శూలము
    ఎలుక వాహనమ్ము ఎడమ గౌరి
    శిరము పై ధగ ధగ మెరిసెడి వెన్నెల
    వంక యున్న వాడు శంకరుండు
    నేమాని వారికి నా కృతఙ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  21. గుండు మధుసూదన్ గారూ,
    ఉదయమే మీరు మీ పూరణను, పద్యాన్ని నా మెయిల్‌కు పంపారు. అయితే నేను ఉదయమే గ్రామాంతరం వెళ్ళి ఇప్పుడే తిరిగివచ్చాను. ఈ మధ్యలో నెట్ సౌకర్యం లేక మీ పద్యాలను బ్లాగులో పెట్టడం ఆలస్యమయింది. మన్నించాలి.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ మహేశ్వరుండు శ్రీశైలనాథుడు
    ఫాలనేత్రుడు కరశూల ధరుడు
    గుబ్బలి విలుకాడు కోకనదుడు నెల
    వంక యున్నవాడు శంకరుండు

    రిప్లయితొలగించండి
  23. గుండు మధుసూదన్ గారి పూరణ....

    నొసట నగ్గి కన్ను; బసుమమ్ము మేనికి;
    పాఁప సరము మెడను; బండి యెద్దు;
    గళము నందు విసము; తలను గంగయు, నెల
    వంక యున్నవాఁడు శంకరుండు!

    రిప్లయితొలగించండి
  24. శ్రీ సరస్వత్యై నమః:
    మరికొన్ని పూరణలు:

    శ్రీ నాగరాజు రవీందర్ గారు:
    చక్కని పదబంధముతో మంచి ధారతో పద్యమును రచించేరు "నెలవంక" అని పూరిస్తూ. చాలా బాగున్నది.

    శ్రీ గుండు మధుసూదన్ గారు:
    చక్కని తేట తెనుగు పదములతో మంచి పద్యమును "నెలవంక" అనే పూరిస్తూ చెప్పేరు. ఉత్తమముగా నున్నది.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  25. ఆర్యా ! ధన్యవాదములు
    ఆ అభయ ముద్రల పూరణ మిస్సన్న గారిది . మీ మెచ్చుకోలు వారికి చెందు గాక

    మీ సూచనతో నాపూరణ సవరణ తో...

    పండితుండు గాని పామరుడే గాని
    సురలు గాని మరి యసురులు గాని
    వాడు వీడు యనక వరమిచ్చు నన్నట్టి
    వంకయున్నవాడు శంకరుండు

    రిప్లయితొలగించండి
  26. పద్యం మీకు నచ్చినందులకు నా ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి

  27. 1.
    అన్ని వంకరలని యాక్షేపణము చేయు
    దక్షు వంటి వారు దర్పమతులు
    పరమశివుని తత్త్వ మరయరు ,భక్తుల
    వంక యున్నవాడు శంకరుండు.

    2.
    నాగభూషణుండు,నగజాప్రియుండును,
    నీలకంధరుండు,ఫాలనేత్రు
    డమర వందితుండు,సుమనోజ్ఞ మగునెల
    వంక యున్నవాడు శంకరుండు.

    రిప్లయితొలగించండి
  28. గురువుగారికి నమస్సులు.
    తమరి సూచన మేరకు మరో ప్రయత్నం:
    అమృతత్వగురుతునాకాశ చంద్రుండు
    నమృతత్వమొసగునంబపతియు
    చంద్రశేఖరుఁడన సంకేతముగనెల
    వంకయున్నవాడుశంకరుండు!

    రిప్లయితొలగించండి
  29. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా! శుభాభినందనలు.
    మరికొన్ని పూరణలను ముచ్చటించుదాము:

    డా. కమనీయము గారు:
    2 మంచి పూరణలు పంపేరు - 1. భక్తుల వంక యున్న శివుడు (2) సుమనోజ్ఞమగు నెలవంక యున్న శివుడు అనే సుమనోజ్ఞమగు పూరణ - ప్రశస్తముగా నున్నవి.

    శ్రీ సహదేవుడు గారు: మీ పద్యము 2వ పాదములో చిన్న టైపు పొరపాటు కూడా దొరలినది. ఆ పాదమును ఇలా మార్చుదాము:
    "అమృత తత్త్వపు చిహ్నమగు బాల చంద్రుండు" అని.

    శ్రీ మిస్సన్న గారు: మీ పేరును ప్రస్తావించుటలో పొరపాటు జరిగినది. మీ పద్యము చాలా భక్తిరసముతో అలరారుచున్నది - నవ్యముగా నున్నది.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
    సర్వ వరప్రసాదుడగు భోళా శంకరునిపై మీ పద్యము హృద్యముగా నున్నది.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి