20, సెప్టెంబర్ 2012, గురువారం

సమస్యాపూరణం - 827 (ధర్మపాలన కంటె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
ధర్మపాలన కంటెఁ బాతకము లేదు.
ఈ సమస్యను పంపిన ఏల్చూరి మురళీధర రావు గారికి ధన్యవాదాలు.

18 కామెంట్‌లు:

  1. వేదవిహితమై యలరారు విధులనన్ని
    పాలనము జేయుటయె పుణ్యఫలమునిచ్చు.
    పాపరాశిని పెంచగ బ్రతుకునంద
    ధర్మపాలన కంటెఁ బాతకము లేదు.

    రిప్లయితొలగించండి
  2. ధర్మ మన్నిటిఁ బొందను మర్మమనుము
    ధర్మ రాజును రక్షించె ధర్మమెపుడు
    నలుని బాసటగ నిలచె నదియె కనన
    ధర్మపాలన కంటెఁ బాతకము లేదు

    రిప్లయితొలగించండి
  3. ధర్మము జయించు భువి ననృతమ్ము వీగు
    ననెడు సూక్తులు పూర్తిగ నంతమొందె
    స్వార్థరతుల దుశ్చిత్తుల భావము గన
    ధర్మ పాలన కంటె బాతకము లేదు

    రిప్లయితొలగించండి
  4. పుణ్య మెచటను గలుగదు పుడమి మీ ద
    ధర్మ పాలన కంటె బాతకము లేదు
    భూ త హింసను మించిన భూ రి నవల
    ప్రాణ రక్షణ ముఖ్యము ప్రాణి కోటి.

    రిప్లయితొలగించండి
  5. పరమ శ్రేయమ్ము నిజధర్మ పాలనమ్ము
    యశము సుఖ శాంతులును గల్గు నందువలన
    నటులనే నేరికేనియు నవని నన్య
    ధర్మ పాలన కంటె పాతకము లేదు

    రిప్లయితొలగించండి
  6. ధర్మ పాలన వృద్ధి, నధర్మ పాల
    నమ్ము క్షయము నొందించును; నమ్ముఁడిది! య
    ధర్మి దశవక్ర్తుఁ డేమయ్యెఁ? దడవఁగా, న
    ధర్మ పాలన కంటెఁ బాతకము లేదు!

    రిప్లయితొలగించండి
  7. లక్ష్మీదేవి గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ మొదటి పూరణ ఉత్తమంగా ఉంది.
    ‘పరధర్మో భయవహః’ అన్న మీరెండవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. దుర్జనుడు జెప్పు యడిగిన తోడ యిటుల -
    "లేదు యన్యాయమును మించి సాధు గుణము
    ధర్మపాలన కంటె పాతకము లేదు
    నమ్ము ! వ్యర్థము ఋజువర్తనమ్ము సుమ్ము !"

    రిప్లయితొలగించండి
  9. నీతి నియమము లన్నవి నేతి బీర
    ధర్మ మేరీతి రక్షించె ధరణి లోన
    కలి యుగమ్మున ధర్మము గనుట సున్న
    ధర్మ పాలనము కంటెఁ బాతకము లేదు !

    రిప్లయితొలగించండి
  10. శ్రేయ మెపుడు స్వధర్మమ్ము సేయు చుంట
    ప్రాణ త్యాగము కైనను పార రాదు
    మెరుపు లున్నను దలచుచు మెరుగు, పరుల
    ధర్మపాలన కంటెఁ బాతకము లేదు.

    రిప్లయితొలగించండి
  11. గండూరి లక్ష్మీనారాయణగురువారం, సెప్టెంబర్ 20, 2012 9:58:00 PM

    రాజు లెందరో పూర్వము రాజ్యములను
    బ్రజల సంక్షేమ మాశించి పరమ ధర్మ
    పాలన మొనర్చి ప్రఖ్యాతి బడసినా ర
    ధర్మ పాలన కంటె బాతకము కలదె.

    రిప్లయితొలగించండి
  12. నాగరాజు రవీందర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘చెప్పు + అడిగిన, తోడ + ఇటుల’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘చెప్పు నడిగినతోడ నిటుల’ అవుతుంది. ‘లేదు + అన్యాయము’ అన్నప్పుడూ యడాగమం రాదు. ఆ పాదంలో ప్రాసయతి కూడా సర్వజనామోదం కాదు. దధప్రాస క్వాచిత్కంగా కనబడుతుంది. ఎవరో ప్రయోగించారు కదా అని మనమూ ప్రయోగించరాదు.
    *
    మిస్సన్న గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    కాకుంటే మొదటి పాదంలో యతి (చిత్రంగా) తప్పింది! ‘ధర్మజునకు రాజ్యమ్మును ధారపోయ’ అందామా?
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘స్వధర్మో నిధనం శ్రేయః’ అన్న భావాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ మంచి పూరణ చెప్పినారు. అభినందనలు. ‘ప్రాణత్యాగము’ అన్నప్పుడు గణభంగం. అలాగే ‘త్యాగముకు’ అనకుండా ‘త్యాగమునకు’ అనాలి కదా! ‘ప్రాణగండము నందైన పారరాదు’ అంటే ఎలా ఉంటుందంటారు?
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బ్లాగులోకంలోకి మీ రాక సంతోషదాయకం. ధన్యవాదాలు.
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. రామరాజ్యాన ధర్మ విరామ మేది?

    విశ్వమంతయునమ్మెడువిషయ మైన!

    గర్భవతి సతి కంతటి కష్ట మేల?

    ధర్మ పాలన కంటెఁ బాతకములేదు!

    రిప్లయితొలగించండి
  14. సహదేవుడు గారూ,
    ఈరోజు మీ ‘అటెండెన్స్’ పడలేదేమిటా అని చూస్తున్నాను. సంతోషం. చక్కని పూరణ. రాముడు ధరపాలనకు లోబడి భార్యాత్యాగమనే పాతకము చేసాడు. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. గురువు గారూ ! మీ సూచనలకు కృతజ్ఞుడను

    దుర్జనుడు జెప్పు నడిగిన తోడ నిటుల
    "ధర్మ పాలన కంటె పాతకము లేదు
    మోక్షమే లేదు న్యాయ వివక్షునకును
    నమ్ము ! వ్యర్థము ఋజువర్తనమ్ము సుమ్ము !"

    రిప్లయితొలగించండి
  16. గురువుగారూ తప్పు దిద్దినందుకు ధన్యవాదాలు.
    మరింత జాగ్రత్తగా ఉంటాను.

    ధర్మజునకు రాజ్యమ్మును ధారపోయ
    ధర్మ పాలన మిడు నని తగదు పలుక
    మాయ మాటలు గోపాల మాకు వారి
    ధర్మపాలన కంటెఁ బాతకము లేదు

    రిప్లయితొలగించండి
  17. శంకరార్యా ! నాపూరణ లోని దోషమును సరిజేసి చక్కని సవరణ చూపి నందులకు ధన్యవాదములు. మీ సూచనతో..

    శ్రేయ మెపుడు స్వధర్మమ్ము సేయు చుంట
    ప్రాణ గండము నందైన పార రాదు
    మెరుపు లున్నను దలచుచు మెరుగు, పరుల
    ధర్మపాలన కంటెఁ బాతకము లేదు.

    రిప్లయితొలగించండి