24, సెప్టెంబర్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 831 (భోగమూలము సజ్జన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
భోగమూలము సజ్జనత్యాగ మొకడె.
ఈ సమస్యను సూచించిన
ఏల్చూరి మురళీధర రావు గారికి
ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

  1. సకల విధ బంధమయము సంసార మిద్ది
    భోగ మూలము, సజ్జన! త్యాగ మొకటె
    శాంతి సౌఖ్యమ్ముల నొసంగి యంతిమమున
    మోక్ష ధామము జేర్చు ముముక్షుతతిని

    రిప్లయితొలగించండి
  2. తనువు లవి వేరు గావచ్చు మనము లొకటె
    పతికి పత్నికి మేల్గీళ్ళ పంచు కొనుట
    భోగమూలము సజ్జన! త్యాగ మొకడె
    నొకరికై జేయ మరియొక రొప్పు సతము.

    రిప్లయితొలగించండి
  3. "త్యాగ మొకటె" సరియైన ముగింపా లేక, టైపాటు వల్ల అది "త్యాగ మొకడె" గా ఇవ్వటం జరిగిందా?

    రిప్లయితొలగించండి
  4. శ్రీ చంద్రశేఖర్ గారికి
    నమస్కారములు!

    “ఒకఁడు” అమహదర్థంలో కూడా ఉన్నది. “ధీరత్వం బొకఁడున్ సహాయముగ రాధేయుండు దివ్యాస్త్రసంచారోల్లాసము నూనె ...” భార. ద్రోణ. (5 – 226) అని సూర్యరాయాంధ్ర నిఘంటువు చూపిన తిక్కన గారి ప్రయోగం. "భోగమూలము సజ్జనత్యాగ మొకఁడె" అన్నప్పుడు అమహద్వాచకం.

    సర్వ శుభాకాంక్షలతో,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  5. శ్రీ ఏల్చూరి వారికి ధన్యవాదాలు. మీ సోదాహరణ వివరణ వల్ల క్రొత్త విషయం తెలుసుకొన్నాను. "ఒకఁడు" అనే పదాన్ని అమహదర్థంలో వాడేడప్పుడు యే పూర్వపదమైనా వాడవచ్చా? లేక నియమాలు ఉన్నాయా? ఉదాహరణకి, నిత్యమొకడె, సత్యమొకడె, రుచియొకడె, వారమొకడె, తీరమొకడె ...(లేక పూర్వ పదం ఎల్లప్పుడూ సంస్కృత పదమే అవ్వవలెనా?). వినయపూర్వక కృతజ్ఞతలతో,
    విధేయుడు,
    చంద్రశేఖర్.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని
    వారికి వందన శతకము లొనరించుచు
    కొంగ్రొత్త విషయములను దెలిపిన శ్రీ ఏల్చూరి వారికి ధన్యవాదాలు .
    -----
    సకల సౌకర్యములు బొంద-సంహరించ
    నీతి నవని పయిన నవి -నీతి పరుల
    భోగ మూలము , సజ్జన ,-త్యాగ మొకడె
    నిలుప నీయదు సుఖ శాంతి -నిక్కముగను
    -----
    అన్నాహాజారే అవినీతి పోరాటము పై
    ఆ : భువిని సకల బోగ-మూలము సజ్జన
    త్యాగ , మొకడె నేక -తాటి పైన
    నిలుపగ కదలె నవి -నీతి పరులు నేడు
    నీతి నీతి యనుచు - నింగి వరకు

    రిప్లయితొలగించండి
  7. కంటగనునదె నిత్యము, క్షణిక సుఖమె
    సత్యమనుచును నమ్మెడు జనులకెల్ల
    నింద్రియములిచ్చు సుఖముల యిచ్ఛకలుగ;
    భోగమూలము సజ్జనత్యాగ మొకడె.

    రిప్లయితొలగించండి

  8. తల్లిదండ్రులు, భార్యయుఁ, తనదు సుతులు,
    సంపదలు, మిత్ర బాంధవుల్, సకలములును
    భోగమూలము! సజ్జన! త్యాగమొకఁడె
    సకల మోక్షద! మ్మిది నిత్య సత్య మోయి!

    రిప్లయితొలగించండి
  9. వివిధ జనములు నొందెడు వెతల కర య

    భోగ మూ లము , సజ్జన త్యాగ మొక డె

    దారి తీ యును బాపపు దరికి నిలను

    సకల శుభ ము ల నొసగును సజ్జ నుండు .

    రిప్లయితొలగించండి
  10. శ్రీ చంద్రశేఖర్ గారికి,

    ఈ విధంగా ఎంతో సూక్ష్మదృష్టితో మీరు ప్రయోగాలను అనుశీలిస్తుండటం అభినందనీయంగా ఉన్నది. మీ ప్రశ్నకు సమాధానం:

    అమహద్వాచకమైన “ఒకఁడు” శబ్దాన్ని మీరన్న అన్ని విధాలుగానూ ప్రయోగింపవచ్చును. తిక్కన, నన్నెచోడుడు, పూర్వకవు లందరూ దీనిని మహద్వాచకం గానూ, అమహద్వాచకం గానూ మీరడిగిన అన్ని విధాలుగానూ ప్రయోగించారు. “ఒక్కొకాదులకు డువర్ణంబు పరంబగునపుడు మహదర్థంబున రురువుగాగమంబులను, నవి పరంబగుచోఁ గకారమునకు లోపంబును, కకారాదులకు లోపంబురా డువర్ణకమునకు ద్విత్వయుక్తడువర్ణంబును, అమహదర్థంబునం గకారాదులకు లోపబిందువులును విభాష నగు” అని ప్రౌఢవ్యాకరణంలో శబ్దపరిచ్ఛేదం 81-వ సూత్రం చూడండి: ఆ క్రమంలో “ఒకఁడు”, “ఒక్కఁడు”, “ఒకొఁడు”, “ఒక్కొఁడు”, “ఒండు” అన్నవి అమహద్వాచకరూపాలు.

    ప్రస్తావన వచ్చింది కాబట్టి, మఱొక్క విషయం: నన్నయ గారు మహద్వాచకంగా “ఒక్కరుఁడు” అన్న రూపాన్నే గాని “ఒకఁడు” అన్న రూపాన్ని వాడలేదని; “ఒకఁడు” రూపాన్ని ఆయన కేవలం అమహద్వాచకంగా మాత్రమే ప్రయోగించారని; మనమిప్పుడు వాడుతున్న “ఒకటి” రూపం ఆయనకు అభిమతం కాదని – పెద్దలంటారు. భారతం ముద్రితప్రతులలో కనబడుతున్న అటువంటి పెక్కు రూపాలు నన్నయ గారి నాటి భాషాసంప్రదాయానికి, ప్రాచీన తాళపత్ర పాఠాలకు విరుద్ధమైనవని అభిజ్ఞుల అభిప్రాయం. “త్యాగ మొకఁడె” అన్న వాడుక నన్నయాదిప్రయోగపరిక్షుణ్ణమైన పథమే.

    సర్వ శుభాకాంక్షలతో,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  11. జనన మరణము, సుఖ దుఃఖ సాగరమున
    మూర్ఖమతి మానవుండిల మున్గి తేలు
    నాలు బిడ్డలు తలి దండ్రు లందరోక్క
    భోగ మూలము సజ్జన! త్యాగ మొకడె.
    గండూరి లక్ష్మీనారాయన

    రిప్లయితొలగించండి
  12. శ్రీ ఏల్చూరి వారికి శతకోటి ధన్యవాదాలు. మీ సాధికారిక వివరణ ఒక research thesis లోని paragraph ని తలపిస్తోంది. ఇక మీ వంటి వారి పెద్దల మార్గం అనుసరించటమే తరువాయి.
    విధేయుడు,
    చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని వారూ,
    అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ఆలుమగల సుఖసంసారసూత్రాన్ని చక్కగా వివరిస్తూ మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘ఒకడె + ఒకరిపై’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
    *
    చంద్రశేఖర్ గారూ,
    సందేహం వచ్చింది మీ ఒక్కరికే. కాని దానివలన ఎందరో మిత్రులకు శాస్త్రజ్ఞానం లభించింది. ధన్యవాదాలు.
    సందేహనివృత్తి జరిగిన తర్వాత మీ పూరణ కోసం ఎదురుచూసాను. ఇంతవరకు రాలేదేం?
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    శాస్త్రీయంగా, సాధికారంగా మీరిచ్చిన వివరణ ఎందరికో జ్ఞానదాయకం.
    నన్నయగారి ప్రయోగ వైశిష్ట్యం నాకు క్రొత్త విషయమే. ధన్యవాదాలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ రెండు పూరణలు వైవిధ్యంగా అలరిస్తున్నాయి. అభినందనలు.
    రెండవ పూరణలో అన్వయం ఇబ్బంది పెడుతున్నది.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    ప్రశంసనీయమైన ప్రయత్నం. అభినందనలు.
    మీ పూరణ అసంపూర్ణంగా ఉన్నదేమో చూడండి.

    రిప్లయితొలగించండి
  14. యోగి నేమన తేలెను భోగ మందు
    వదిన నియమమ్ము నాతడు కుదుట పడగ
    మనిషి ప్రణమిల్లి పరితాప మంది తుదకు
    భొగ మూలము సజ్జన త్యాగ మొకడె !

    రిప్లయితొలగించండి
  15. గురువుగారూ అవును అక్కడ యడాగమం ఉండాలి.
    దిద్దుబాటుకు ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  16. రాగ మూలము స్వజనను రాగ మొకడె!
    రోగ మూలము దుర్జన భోగ మొకడె!
    ఆత్మ మూలము ధ్యానము నందుఁగనుటె
    భోగ మూలము సజ్జన! త్యాగ మొకడె!

    రిప్లయితొలగించండి
  17. శ్రీ కంది శంకరయ్య కవి శ్రేష్టులకు నమస్కారములు.
    మీ సూచనకు ధన్యవాదములు'

    " మనుజ జన్మము బహు దుఃఖ మయము సుమ్మి
    అవనిలో బాధలకు హేతువైన నీచ
    భోగ మూలము, సజ్జన ! త్యాగ మొకడె
    మానవుని కష్టములనన్ని మాన్ప గలదు. "

    రిప్లయితొలగించండి
  18. మాస్టారూ, అందరూ లాభపడటమే గదా మన వయోజన విద్యాకేంద్రమైన శంకరాభరణం ముఖ్యోద్దేశ్యము. ధన్యోస్మి. సోమవారం ఉదయం కొంత పని వత్తిడి వల్లపూరించలేకపోయాను.

    రిప్లయితొలగించండి


  19. సకల భవబంధములు సర్వ సంపదలును
    కామితార్థముల్ ,మోహవికారములును
    భోగమూలమ్ము ;సజ్జనత్యాగ మొకటె
    ధర్మపథమును,ముక్తికి దారిచూపు.

    ఇక్కడ 'సజ్జనత్యాగము 'అంటే సజ్జనులను త్యజించడం
    అని కాక ,సజ్జనులు చేసే త్యాగమని అన్వయించి వ్రాసాను.

    రిప్లయితొలగించండి