29, సెప్టెంబర్ 2012, శనివారం

సమస్యాపూరణం - 836 (అరువది యేండ్లు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
అరువది యేండ్లు నిండినవి యక్షరముల్ వడి దిద్దగావలెన్.
(ఆకాశవాణి సౌజన్యంతో...)

30 కామెంట్‌లు:

  1. అరువది యేండ్లు నిండినవి యక్షరముల్ వడి దిద్దగా వలెన్
    వరమతి నేర్వగాదగును వ్యాకరణంబను చింతలేలరా?
    స్థిరమగు భక్తితో నెదను దేవుని సేవలొనర్చి పొందుమా
    సరగున మోక్షమన్న గురు శంకరు పాదము లాశ్రయించెదన్

    రిప్లయితొలగించండి
  2. నేమాని పండితార్యా భజగోవింద శ్లోక భావాన్ని పొదిగిన మీ పూరణ మనోహరంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  3. పరువము నాడు తెల్గు నతి భారముగా మది దల్చి నానుగా
    తిరిగితి దేశ దేశ ములు తీరుగ నిప్పుడు చేరినా ను నా
    భరతమునందు నాంధ్ర మున భాగ్యమె కోరిక గల్గె నేర్వగన్
    అరువది యేండ్లు నిండినవి యక్షరముల్ వడి దిద్దగా వలెన్

    రిప్లయితొలగించండి
  4. అరువది యేండ్లు నిండినవి యక్షరముల్ వడి దిద్దగావలెన్
    గురు లఘు భేదముల్ తెలిసి కూరిమి పద్యము లల్లగావలెన్
    వరమతి నంచు సత్కవన భావన గల్గితిరేని శంకరా
    భరణము బ్లాగు మీకిదియె స్వాగతవాక్యము పల్కు ప్రేమతో

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    చెన్నపురిలో :

    01)
    _________________________________________

    అరిగితి నేను చెన్నపుర - మచ్చట స్వేచ్ఛను కోలు పోతి , నేన్
    అరవము రాని కారణము - నయ్యెడ మాటల నాడలేక; నా
    కరవము నేర్వగా వలయు - నాశయె కల్గె , నిరాశ జెంద కేన్
    అరువది యేండ్లు నిండినవి - యక్షరముల్ వడి దిద్దగావలెన్
    అరమర లేక నా యెడను - హాయిగ మాటల నాడు కోసమై
    అరగడ మంచు నా యెదుట - యల్పపు మాటల నెవ్వరాడినన్ !
    _________________________________________
    అరగడము = వృద్ధుడు

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు,గురువుగారికి ధన్యవాదములు దెలుపుచు
    =======***=======
    అరువది యేండ్లు నిండినను నక్షర ధారలు శంకరార్య చే
    స్థిరముగ పారు మేండుగను,జేయును సత్కవులెల్ల పూరణల్
    భరణము శంకరాభరణ బ్లాగునకున్, త్వరితమ్ముగా కవుల్
    కరువది యేండ్లు నిండినవి,యక్షరముల్ వడి దిద్దగా వలెన్

    రిప్లయితొలగించండి
  7. మన తెలుగు భాష కొన్ని వేలయేండ్ల క్రిందటిది. ఇటీవల వచ్చిన కొన్ని వస్తువుల పేర్లను ( కంప్యూటరు, మౌసు, లాప్టాప్ వంటి వాటికి మనము ఆంగ్లపదములనే వాడుతున్నాము కదా. ఇటువంటి వాటికి మన తెలుగులో అక్షర రూపాన్ని కల్పించాలని. ఈ భావాన్ని ప్రతిబింబిస్తూ.............

    వరలుచునున్న శ్రేష్ఠమగువాచకముల్ కవితాప్రభంధముల్
    మెరసిన తెల్గుభాషకును మీరిన వస్తుచయంబుచూడగాన్
    సరియగు చక్కనైన పదజాలమునేఱక పల్కుచుంటిమే
    యరువది, యేండ్లు నిండినవి యక్షరముల్ వడి దిద్దగావలెన్.

    అరువు + అది = అరువది ( అప్పు తెచ్చుకోవడము )
    యేండ్లు = కొన్ని సంవత్సరములు
    దిద్దు = సరిదిద్దు,



    రిప్లయితొలగించండి

  8. ఒక నిరక్షరాస్య రైతు స్వగతం :

    అరకను బట్టి దున్నితి సహాయము లేక ప్రభుత్వ మీయకన్
    కరణము వ్రాసె పద్దులను కారణ మేమది ? వేలి ముద్రలే
    ఉరమున నొక్క యక్షరము నోపక యిన్ని దినంబు లుంటినే !
    అరువది యేండ్లు నిండినవి యక్షరముల్ వడి దిద్దగా వలెన్.

    రిప్లయితొలగించండి
  9. నిరతము నాంగ్ల భాష నతి నేర్పుననేర్చితి నింత కాలము
    న్నెరుగక తెల్గు భాష మది నెంతగనో విలపించు చుంటి నే
    సరగున నేర్చు కొందు కడు చక్కని తీయని తెల్గుభాష నా
    కరువది ఏండ్లు నిడినవి యక్షరముల్ వడి దిద్దగా వలెన్

    రిప్లయితొలగించండి
  10. ఎరుగము పాఠశాల మొగమెన్నడు బాల్యమునందు కూటికై
    పరువము జారిపోయె పనిపాటలతో వినుమన్న యూరిలో
    తెరచిరి రాత్రిపూట బడి తెమ్మిటు బల్పము పల్క పొత్తమున్
    అరువది యేండ్లు నిండినవి యక్షరముల్ వడి దిద్దగా వలెన్.

    రిప్లయితొలగించండి
  11. అరువది యేండ్లు నిండిన వయస్సున పెండిలియయ్యె దంపతుల్
    మురియుచు నేగుచుండునెడ ముచ్చట లొందగ ప్రేమయాత్రకున్
    జిరునగవొల్క నొక్క కవి చెన్నుగ చంపకమాల కూర్చెబో
    యరువది యేండ్లు నిండినవి యక్షరముల్ వడి దిద్దగా వలెన్

    రిప్లయితొలగించండి
  12. పరువము దాటిపోయినది భారము చెందెను భాధ్యతల్ నిలన్
    కరములు మోడ్చి యెన్నడును కన్నులు మూసి తలంచ లేదునిన్
    శిరమును వంచి నీదుపద సన్నుతి జేతును ముక్తి నీయగన్
    అరువది యేండ్లు నిండినవి యక్షరముల్ వడి దిద్దగా వలెన్ !

    రిప్లయితొలగించండి
  13. తరుణి! సుపుత్రుఁ గంటి నిదె ధన్యత చేకుఱె నంచు నీవు సం
    బరపడుచుంటివే; యతని ప్రాయము నాలుగు వత్సరమ్ము లీ
    తరుణము పంపఁగా బడికి, దానికి రూప్యము లక్కఱౌను వే
    లరువది; యేండ్లు నిండినవి యక్షరముల్ వడి దిద్దగా వలెన్.

    రిప్లయితొలగించండి
  14. మాస్టరు గారూ ! ఒకటవ తరగతి ఫీజు అరువది వేలు చేశారు.. బాగుంది..

    రిప్లయితొలగించండి
  15. పరులనెదిర్చభారతపు బానిస జీవనమంతరించగా
    నరువది హెచ్చుమీరెనిటనాస్తులఁబెంచెడునేతలుండగన్!
    తరుగదు దాస్య జీవనము,తాడిత పీడితులున్నతిన్ గనన్
    యరువదియేండ్లునిండినవియక్షరముల్ వడి దిద్దగా వలెన్!

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమాని వారూ,
    శంకర భగవత్పాదుల సందేశాన్ని సమస్యా పూరణకు సమర్థంగా వినియోగించారు. చాలా బాగుంది. అభినందనలు.
    మీ రెండవ పూరణలో పరోక్షంగా నాపైన పెద్ద బాధ్యతను పెడుతున్నాను. మీ అవశ్యాచరణీయం. ధన్యవాదాలు.
    వృద్ధాప్యంలో సరసాక్షరాలు దిద్దాలా?మూడవ పూరణ కూడా బాగుంది. చమత్కార భరితంగా ఉంది.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మాతృభూమికి చేరిన తర్వాత మాతృభాష నేర్చుకోవాలని కోరిక కలిగినట్లు చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. పరదేశం వెళ్ళి అక్కడి నిత్యవ్యవహారానికి అక్కడి భాష నేర్వక తప్పదు. వయస్సుతో పనేముంది? చక్కని భావన. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు?
    కానీ... ‘కరువది’...?
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ‘అరువు’ పదాలపై మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    ‘వయోజనవిద్య’ అంశంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీరూ వయోజన విద్యే విషయంగా పూరణ చెప్పారు. చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘బాధ్యతల్ నిలన్’ను ‘బాధ్యతల్ గదా’ అందాం.
    *
    సహదేవుడు గారూ,
    ఇంతకీ నేర్వవలసింది ‘విప్లవాక్షరాలా’? బాగుంది పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    అంతకు ఎక్కువ ఫీజు వసూలు చేసే ఇస్కూళ్ళూ ఉన్నాయష!

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యా ! ధన్యవాదములు !
    మీ పూరణ ముత్త మోత్తమం !

    రిప్లయితొలగించండి
  19. నేమాని వారి స్ఫూర్తితో :

    మత్స్యగంధిని గాంచిన శంతన మహారాజు తన సహచరునితో :

    02)
    _________________________________________

    (ప్రకాశముగ)
    సురలకె సాధ్యమైన బహు - సుందర రూపము గల్గినట్టి యీ
    సురుచిర రూపు జూచి మది - సోలుచు నున్నది దేమి వింతయో
    సురనది నన్ను వీడి జనె; - సోముని వెన్నెల సోకినంతనే
    సురసము రేగు నా మదిని; - శోభన నిమ్మని వారి గోరుమా
    సురముని సాటి వాడవులె - శోభన మొందగ జేయు మాపెతోన్ !
    (స్వగతముగ)
    అరువది యేండ్లు నిండినవి - యక్షరముల్ వడి దిద్దగావలెన్ !
    _________________________________________
    సురసము = తీపి = కోరిక
    శోభన = స్త్రీ = మత్స్యగంధి
    వారు = ఆమె తల్లి దండ్రులు
    శోభనము = కల్యాణము

    రిప్లయితొలగించండి
  20. నాగరాజు రవీందర్ గారి స్ఫూర్తితో :

    ఒకరైతు తన మనసులో :

    03)
    _________________________________________

    మురిపెము నాకు గల్గె మది - ముచ్చట దీర్చెడి విద్య నేర్వగా
    మరకను వ్రేల బెట్టి, పలు, - మార్లు, దళారుల చేత జిక్కుటన్ !
    మరి , యిక , జాగు సేయకను - మాన్యత బెంచెడు , విద్య , వెంటనే
    మరణము వెంట వచ్చి , పరి - మార్చక ముందఱె , నేర్చు కొందు, నేన్ !
    అరువది యేండ్లు నిండినవి - యక్షరముల్ వడి దిద్దగావలెన్ !
    _________________________________________
    మరకను వ్రేల బెట్టుట = వ్రేలితో మరక బెట్టుట(నిశానీ)
    మరణము = మృత్యువు

    రిప్లయితొలగించండి
  21. శంకరార్యుల స్ఫూర్తితో :

    ఒక భర్త తన భార్యతో :

    04)
    _________________________________________

    వరసుతు గంటి వమ్మ, మరి - వానికి నాలుగు వత్సరంబులే !
    విరియగ వాని బుద్ధి, మరి - వేడుక నొందగ జన్మ మంతయున్
    విరివిగ సొమ్ములే గలుగు - పిల్లలు నేర్చెడు విద్య నేర్వగన్
    వెరువక జేర్చగా వలయు - విద్దెల శాలను వేగిరంబుగాన్ !
    విరజుని కోడలిన్ గొలిచి - విద్యను నేర్చుట కక్కరౌను ,వే
    లరువది; యేండ్లు నిండినవి - యక్షరముల్ వడి దిద్దగా వలెన్ !
    _________________________________________
    విరజుని కోడలు = సరస్వతి

    రిప్లయితొలగించండి
  22. మిస్సన్న మహాశయుల స్ఫూర్తితో :

    ఒక వయోజనుని స్వగతం :

    05)
    _________________________________________

    పరుగున బోయి పాఠముల - వల్లెను వేసెడి బాల్య మంతయున్
    భరముగ సాగె నయ్యొ , పని - పాటల యందున జిక్కి నందునన్ !
    పరువము గోలుపోతి, నిక - భాగ్యము గల్గునొ లేదొ యంచు నే
    పరిపరి యైన పట్టు ,బల - పంబును , పల్కను , బట్టి తిచ్చటన్
    పరిజన సంయుతంబుగను - పల్లె ,నిశీధిని , పాఠశాలలోన్
    అరువది యేండ్లు నిండినవి - యక్షరముల్ వడి దిద్దగావలెన్ !
    _________________________________________
    పరిపరియగు = కలత జెందు

    రిప్లయితొలగించండి
  23. ఏం జెప్పినవ్ వసంత భాయ్! మస్తు రంజుగున్నై!

    రిప్లయితొలగించండి




  24. భరమగు నంచు విద్య సముపార్జన జేయగ మానవద్దదే
    వరమగు జీవితమ్మున నపారమనోపరిధీ వికాసమున్
    విరివిగ గ్రొత్త భాషలను విజ్ఞత నేర్వగ గల్గు బూనినన్
    అరువదియేండ్లు నిండినవి యక్షరముల్ వడి దిద్దగా వలెన్.

    రిప్లయితొలగించండి
  25. పరువులు బెట్టి యాంగ్లమున పచ్చడి ముద్దలు మ్రింగుటందునన్
    దరువులు వేయగా కడకు దండుగ మాలిన సేవ వీడగన్
    మెరుగగు మాతృ భాషనిక మెచ్చగ పండిత వంద్యులెల్ల నా
    కరువది యేండ్లు నిండినవి యక్షరముల్ వడి దిద్దగావలెన్

    రిప్లయితొలగించండి