2, ఫిబ్రవరి 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1312 (పరశురాముఁడు నిర్జించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పరశురాముఁడు నిర్జించెఁ బాండవులను.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:

 1. కక్ష దీరగ ఖండించి క్షత్రియులను
  వరుస బలుమారు లలనాడు ధరణి నిట్లు
  పరశురాముడు నిర్జించె, బాండవులను
  గాసి బరచెను కురురాజు మోసమూని.

  రిప్లయితొలగించండి
 2. పద్యముల వ్రాయ నేర్చిన బాలు డొకడు
  గజిబిజిగ పద్య భాగాలు కలుపుచుండె
  నందులో నొక పాద మిట్లమరె వినుడు
  పరశురాముడు నిర్జించె బాండవులను

  రిప్లయితొలగించండి

 3. దశావతారములందు విష్ణువు :

  మత్స్య రూపమంది మరి సౌమకుని జంపె,
  కూర్మరూపమందు కూర్మినెఱపె.
  శ్రీవరాహముగను సాల్వుని పరిమార్చె,
  వామనునిగ బలిని పరిభవించె.

  నారసింహునిగను నరుల బాధలు దీర్చె,
  రావణుని వధించె రామునిగను.
  రాజ్యపతుల పరశురాముడు నిర్జించె,
  పాండవులను గాచె మాధవుండు.

  అవతరించినపుడు యందరి క్షేమంబు
  లరయుచుండు విష్ణుడార్తిహరుడు.
  కనుక భక్తితోడ కమలాక్షు సేవించి
  సుఖములొందుమింక సుజనులార !

  ( సాల్వుడు = రాక్షసుడు)

  రిప్లయితొలగించండి

 4. రాజు లనబడు ప్రతి యొక్కరాజు నిలను
  పరశురాముడు నిర్జించె ,పాండవులను
  పంపె నడవికి జూదాన పణము గెలిచి
  దుష్ట దుర్యోధనాదులు దుష్ట మతిని

  రిప్లయితొలగించండి
 5. ప్రాస యతినియమములను పలుక నేర్చి
  నట్టి పసిపాఠకుండనె నాతురగతిఁ
  బరశురాముఁడు నిర్జించెఁ బాండవులను
  అర్థ మేమొ తెలియదు నా కయ్యవారు!

  రిప్లయితొలగించండి
 6. పగను రగులుచు పరశువు బట్టి మౌని
  ఇరువదియెకమారులుధర ణీపతులను
  పరశురాముడు నిర్జించె, బాండవులను
  గాచె కృష్ణుడు బలుమారు కరుణ తోడ

  రిప్లయితొలగించండి
 7. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  ==============*==================
  పరశు రాముడు నిర్జించె బాంధవులను
  వ్రాసె నిటులనో విద్యార్థి రయముగాను
  పరశు రాముడు నిర్జించె బాండవులను
  తప్పు దెలిపె గురువుగారు నొప్పగాను!(గొప్పగాను)

  రిప్లయితొలగించండి
 8. ధీరగుణధాము శ్రీరాము తేజములను
  జగతికెరిగింపదలచె సంశయములేక
  పరుశరాముఁడు, నిర్జించెఁ బాండవులను
  సైంధవుఁడు యర్జునుఁడు లేని సమయమందు

  రిప్లయితొలగించండి
 9. కక్షతోడను వెదకియు క్షత్రియులను
  పరశురాముడు నిర్జించె, బాండవులను
  కౌరవులుగెల్వ జాలక కదన మందు
  నంత మొందిరి కురు వంశ మంత మాయె.

  రిప్లయితొలగించండి
 10. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  చదివి గ్రంథమ్ము లనవెన్నొ చాల సార్లు
  కడగి కంఠస్థముంజేయ బడని కతన
  బలికె సభలోన భ్రమపడి పండితుండు
  పరశురాముఁడు నిర్జించెఁ బాండవులను.

  రిప్లయితొలగించండి
 11. పరశురాముడు నిర్జించె బాండవులను
  వ్రాసి జూపెను గురువుకి బాలుడొకడు
  తిట్టి తప్పని జెప్పుచు తెలిపె నిటుల
  పరశురాముడు నిర్జించె పాలకులను

  రిప్లయితొలగించండి
 12. మరొక పూరణ

  రామచంద్రుడు నిర్జించె రావణు నని
  కడగి పలుసార్లు యెదురేగి క్షత్రియులను
  పరశురాముఁడు నిర్జించెఁ ; బాండవులను
  గాచె కృష్ణుడు ధర్మమే కారణముగ

  రిప్లయితొలగించండి
 13. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు
  శoకరయ్య గారికి వందనములు

  ధర్మభ్రష్టులు దుర్మదుల్ ధరణిపతుల
  పరశురాముడు నిర్జి౦చె. పాండవులను
  ధర్మయుతులను బ్రోచి యధర్మపరుల
  కౌరవాదుల శిక్షించె కంస రిపువు

  రిప్లయితొలగించండి
 14. కర్ణుని గురువు గా పేరు గాంచె నెవరొ?
  వారె రాజుల పగబట్టి పోరు నందు,
  కృష్ణ మూర్తిగా నెవరిని గెలువ జూచె
  పరశురాముడు నిర్జించెఁ, బాండవులను
  నిన్నటి పూరణ :-
  ఆ యహల్య శిలగ రోట నమరెనేమొ?
  తాత మిగులమెచ్చికొనె నీ ఱాతి రోలు
  రామ యని దంచ రంజిల్లి రామ యనుచు
  పోటు పోటున కొకసారి పాట గాను
  రామ రామ యనెడి నోరు ఱాతి రోలు
  మొన్నటీ పూరణ :-
  మొద్దబ్బాయిని గురువు దగ్గర జేర్చ గా భార్య భర్త ను రమ్మన్నట్లు...
  గండ్రలు బలుకకు తనయుని
  గుండ్రేవుల గురువు తీర్చు గొలువున నిడగా
  బండ్రాయిఁ బోలు పుత్రుని
  తండ్రీ , రమ్మనుచు బిలిచె తరుణి తన పతిన్!

  రిప్లయితొలగించండి
 15. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ ‘తికమక’ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
  *
  మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
  విష్ణువుయొక్క అవతార తత్త్వాన్ని వివరిసూ, విరుపుతో చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
  ‘సోమకు’ని ‘సౌమకు’ డన్నారు. వరాహావతారఘట్టంలో ‘సాల్వుడు’ ఎక్కడినుండి వచ్చాడు? ‘అపుడు + అందరి’ అన్నప్పుడు యడాగమం రాదు. ఆ పాదాన్ని ‘అవతరించినప్పు డందరి క్షేమంబు’ అనండి.
  *
  సుబ్బారావు గారూ,
  విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘దుర్యోధనాదులు’ అన్నారు కనుక ‘పంపి రడవికి...’ అనండి.
  *
  చంద్రశేఖర్ గారూ,
  మీ ‘సెటైర్’ రూప పూరణ బాగుంది. అభినందనలు.
  ‘పాండవులను + అర్థము’ అని విసంధిగా వ్రాసారు. అక్కడ ‘పాండవుల న/నంగ నర్థ మెఱుంగ నే నయ్యవారు’ అందామా?
  *
  శైలజ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణ రెండవ పాదంలో యతి తప్పింది. ఆ పాదాన్ని ‘ఇరువదియెకమారులు ధరణీశవితతి’ అనండి.
  రెండవ పూరణలో ‘గురువుకు’ అనవలసింది ‘గురువుకి’ అన్నారు. పద్యం చివర ‘పాలకులను’ అన్నచోట ‘పార్థివులను’ అంటే బాగుంటుందేమో!
  *
  వరప్రసాద్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  కాని పరశురాముడు చంపింది బాంధవులను కాదు కదా!
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  బ్రాంతిమూలకమైన పొరపాటుగా మీ మొదటి పూరణ, విరుపుతో రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు.
  పరశురాముని క్షత్రియధ్వంసము రామరావణ సంగ్రామం కంటె ముందే జరిగినది కదా!
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది.
  నిన్నటి, మొన్నటి సమస్యలకు మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. నేటి తరమున చదువుల మేటి ననుచు
  పాఠ మీరోజు వినుడంచు భార తమ్ము
  పరశు రాముడు నిర్జించె బాండ వులను
  యింత కంటెను నేముంది కొంత వినుడు

  రిప్లయితొలగించండి
 17. మాస్టారూ, సవరణకు ధన్యవాదాలు. సెటైర్ కాదండీ, చిన్నప్పుడు తెలుగు వ్యాకరణం నేర్చుకొనే రోజులలో పదాలకి అర్థాలు తెలియక గణాలు సరిపోయే విధంగా ఏదోలా వ్రాసి గౌరీనాథ శాస్త్రి మాస్టారి చేత తిట్లు తినేవాళ్ళం. తిట్టటంకూడా బాగా ఆలంకారికంగా తిట్టేవారు :-) తెలియక నవ్వుకొనేవాళ్ళం.

  రిప్లయితొలగించండి
 18. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
  గారికి వందనములు .

  మరియొకపూరణ :

  జామదగ్న్యని రహి గన్న సత్త్వు డెవరు ?
  రక్కసుల నేమి జేసెను రామచంద్రు ?
  డెవరినోడి౦చినారు కౌరవులుపాళి ?
  పరశురాముడు .నిర్జి౦చె .పాండవులను

  రిప్లయితొలగించండి
 19. గురువు గారికి నమస్సులు.
  నేను వ్రాసిన పద్యములో సాల్వుడు అనగా రాక్షసుడు అనే అర్థంతో ఉపయోగించాను. అలాగే, యడాగమం గురించి నాకు ఇంకా పూర్తి అవగాహన రాలేదు. తప్పు దిద్దుకున్నాను. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 20. తే: తల్లి యాజ్ఞను పాటించి ధరణి పతుల
  పరశు రాముడు నిర్జించె, పండవులను
  కాచి కాపాడె ప్రేమతో కంసవైరి,
  ధర్మ సంస్థాప నార్థమై ధరకు వచ్చి


  a.Satyanarayana rddy

  రిప్లయితొలగించండి
 21. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ పూరణ సలక్షణంగా, చక్కగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి