3, ఫిబ్రవరి 2014, సోమవారం

సమస్యాపూరణం - 1313 (రాత్రి యర్ఘ్య మిడెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాత్రి యర్ఘ్య మిడెను రవికి ద్విజుఁడు.

36 కామెంట్‌లు:

  1. భానునిగతికడ్డుపడుచున్న మందేహ
    రాక్షసభయమునుతెరపగ గంగఁ
    స్నానమాచరించి సద్భక్తితో భళి
    రా! త్రియర్ఘ్యమిడెను రవికి ద్విజుడు |

    రిప్లయితొలగించండి
  2. రాత్రి యర్ఘ్యమిచ్చె రవికి ద్విజుడు తన
    స్వప్నమందు భక్తి శ్రద్ధ లలర
    రవియు ప్రీతుడగుచు బ్రాహ్మణునకునిచ్చె
    నమిత యోగరాశు లద్భుతముగ

    రిప్లయితొలగించండి
  3. శ్రీ రఘురాం గారు:

    త్రి + అర్ఘ్యము అని సంధి చేయునపుడు యణాదేశ సంధి ప్రకారము త్ర్యర్ఘ్యము అగును కదా. వివరించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. భక్తి మీరి నంత పరమేశు పూజించి
    సమయ మెఱుగ నట్టి సంత సమున
    రాత్రి యర్ఘ్య మిడెను రవికి ద్విజు డనంగ
    మోద మంది యినుడు ముక్తి నిడగ

    రిప్లయితొలగించండి

  5. గ్రామమున అర్ఘ్య మొనరించి
    ఫ్లైటు నెక్కి నడురేతిరి న్యూ యార్కు
    చేరి అయ్యరె ఇక నేనేమి చేతు ననుకుని
    రాత్రి యర్ఘ్య మిడెను రవికి ద్విజుడు !


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. మోముఁ గడిగి తూర్పు ముగుద నుదుట బొట్టుఁ
    దాల్చినటుల వచ్చెఁ దమ్మిఱేఁడు,
    కనులు విచ్చె జగతి, కడచిపోయెను గద
    రాత్రి, యర్ఘ్య మిడెను రవికి ద్విజుఁడు.

    రిప్లయితొలగించండి
  7. గూడ రఘురామ్ గారూ,
    మంచి భావంతో పద్యం చెప్పారు. బాగుంది. కాని నేమాని వారు చెప్పినట్లు ‘త్రియర్ఘ్య’ మనడం దోషమే.
    *
    పండిత నేమాని వారూ,
    స్వప్నకల్పనతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ‘పొద్దెఱుగని...’ అని సామెత చెప్పినట్లుగా ఉన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    మంచి భావానికి అభినందనలు. మీ భావానికి నా పద్యరూపం....
    గ్రామమందు మొదటగా నర్ఘ్య మిచ్చి వి
    మాన మెక్కి చనెను, మఱుదినమున
    నమెరికాకుఁ జేరె, నట వేకువ, మనకు
    రాత్రి, యర్ఘ్య మిడెను రవికి ద్విజుఁడు.

    రిప్లయితొలగించండి
  8. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి,
    శ్రీ గురువులకు _/\_

    "త్రియంబకం సంయమినం దదర్శ" అని కుమారసంభవంలో శ్రీ కాళిదాసు ప్రయోగించినదానికి మల్లినాథసూరి "త్రియంబకం యజామహే" అన్న వైదికప్రయోగాన్ని ప్రమాణీకరించి, ఇది ఛందోమర్మవిదుడైన మహాకవి లోకానికి ఉపదేశించిన విధివిధానం అన్నాడు. త్రియంబక శబ్దం వలెనే త్రియర్ఘ్యము తిరస్కరణీయం కాదనుకొంటాను.

    పైగా, రా! త్రియర్ఘ్యము అని సరికొత్త పదచ్ఛేదం చేసి శ్రీ రఘురాం గారు అందమైన సమస్యాపూరణ చేశారు.

    భానునిగతి కడ్డుపడుచున్న మందేహ
    రాక్షసభయమును దెరపఁగ గంగ
    స్నాన మాచరించి, సద్భక్తితో భళి
    రా! త్రియర్ఘ్యమిడెను రవికి ద్విజుఁడు |

    అంటే, సలక్షణంగానూ ఉంటుంది!

    వారికి సర్వాభినందనలతో,

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  9. ఏల్చూరి మురళీధర రావు గారూ,
    వివరణాత్మకమైన పరిష్కారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.
    *
    గూడ రఘురామ్ గారూ,
    ఏల్చూరి వారి యోగ్యతాపత్రాన్ని పొందారు. అదృష్టవంతులు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    గంటలారు జూపి గడియారమాగగా
    తెల్లవారె ననుచు తెలివి మీరి
    నిశిని నిద్ర లేచి నియతితో నుతియించి
    రాత్రి యర్ఘ్య మిడెను రవికి ద్విజుఁడు.

    రిప్లయితొలగించండి
  11. అమెరికాకు చేరి యచటనే నివసించు
    భారతీయ బమ్మ భాస్కరునకు
    నుదయ మర్ఘ్య మిడగ నుక్తించె నొకడిట
    “రాత్రి యర్ఘ్యమిడెను రవికి ద్విజుడు“.

    రిప్లయితొలగించండి
  12. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మందేహుల గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    భ్రాంతిమూలకమైన తప్పిదముగా మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘భారతీయ బమ్మ’? అక్కడ ‘భారతీయుఁ డొకఁడు’ అంటే సరిపోతుంది కదా!

    రిప్లయితొలగించండి
  14. ప్రొద్దు పొడిచినంత పుణ్యదినమటంచు
    దలఁచి నిదురలోకి తరలి పోయి
    రాత్రి, యర్ఘ్య మిడెను రవికి ద్విజుఁడు భక్తి
    భావమెసగ తెల్లవారినంత

    రిప్లయితొలగించండి
  15. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
    =============*================
    పూజ జేసె మిగిల పుణ్య తిథి యనుచు
    హారతి నిడి రాత్రి, యర్ఘ్య మిడెను
    రవికి ద్విజుడు సొక్కి వ్రతము ముగిసెనని
    బలుక సంతసించె భక్త వరులు!

    (సొక్కి= మ్రొక్కి)

    (మ్రొక్కి యను పదము వేసిన 'డు' గురువు నగునా ? యన్న సందేహముతో సొక్కి యను పదము వాడితిని. గురుదేవులు నాసందేహమును తీర్చగలరు )

    రిప్లయితొలగించండి
  17. వెలుగు దుస్తు లేసి వేయిచేతులసామి
    తూర్పు తలుపు తీసి తొంగి జూడ
    పక్క దులుపు కొనుచు పరుగుతీసెనుగద
    రాత్రి! యర్గ్య మిడెను రవికి ద్విజుడు

    రిప్లయితొలగించండి
  18. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య గారికి వందనములు

    సంధ్య గడచె ననుచు సంతాపమందుచు
    స్నానమాచరించి సంధ్య వార్చె
    అవధిదాట దోషమపచితమొనరింప
    రాత్రి అర్ఘ్య మిడెను రవికి ద్విజుడు

    రిప్లయితొలగించండి
  19. రాత్రి యర్ఘ్య మిడెను రవికి ద్విజుడు మఱి
    రాత్రి పగలు పగలు రాత్రి యగును
    కనుక సరియె యమెరి కాయందు శంకర !
    వలదు సంది యంబు నలతి యైన .

    రిప్లయితొలగించండి
  20. వరప్రసాద్ గారు,
    రెండు సంస్కృతపదాలతో సంధి ఏర్పడినపుడే ఉత్తరపదములోని సంయుక్తాక్షరము పూర్వపదమును ప్రభావితం చేస్తుంది. ఇక్కడ రెండు తెలుగు పదములు పైగా ద్విజుడు మ్రొక్కి అనుచోట సంధి జరగడం లేదు. రెండు విడివిడి పదాలు.

    వేదవిద్యనేర్చి విధిని యనుసరించి
    బ్రదుకు గడపుచుండు భాగవతుడు.
    చింత విడిచి నిదుర చేసి, గడచినంత
    రాత్రి, యర్ఘ్య మిడెను రవికి ద్విజుఁడు.

    రిప్లయితొలగించండి
  21. మకర మందు చేరి మంగళకరమూర్తి
    సకలజనుల బ్రోచు సమయ మందు
    శుభకరములు తాకుచు తెలవారిన సంకు
    రాత్రి యర్ఘ్యమిచ్చె రవికి ద్విజుడు

    ర - ఱ యతి ప్రాసల గురించి మీరు సోదాహరణంగా వివరించినందుకు ధన్యవాదాలు. నిజానికి వాటి మధ్య మైత్రి లేదని చదివినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. అందుకే ఆ విషయం బాగా గుర్తుండిపోయింది. తిక్కనాదులు వేసిన తరువాత ఇంక తిరుగేముంది!

    రిప్లయితొలగించండి
  22. సందేహము నివృత్తి జేసిన శ్రీ లక్ష్మీ దేవి గార్కి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  23. శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు నమస్సులు, బమ్మ అను పదం ద్విజునికి పర్యాయముగా (ఆంధ్ర భారతి నుండి) వ్రాయటం జరిగింది గురువు గారు.
    మీ సూచించినట్లు మొదట వ్రాసి యుంటిని అన్వయం కొరకు బమ్మ అను పద ప్రయోగం చేశాను. తమరు సూచించిన సవరణతో.

    అమెరికాకు చేరి యచటనే నివసించు
    భారతీయు డొకడు భాస్కరునకు
    నుదయ మర్ఘ్య మిడగ నుక్తించె నొకడిట
    “రాత్రి యర్ఘ్యమిడెను రవికి ద్విజుడు“.

    రిప్లయితొలగించండి
  24. తీర్థ యాత్రలెల్ల తిరుగుచు విప్రుడు
    ముఖ్య తటిని యందు మునిగి మదిని
    వేడు కొనెను శివుని, నాడు మహా శివ
    రాత్రి , యర్ఘ్య మిడెను రవికి ద్విజుడు.

    రిప్లయితొలగించండి
  25. వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    లక్ష్మీదేవి గారి వివరణతో మీ సందేహం తీరిందనుకుంటాను.
    *
    శైలజ గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    ‘విధిని + అనుసరించి’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘విధ్యుక్తమగు రీతి’ అందామా?
    వరప్రసాద్ గారి సందేహాన్ని తీర్చినందుకు ధన్యవాదాలు.
    *
    ఆదిత్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ ప్రయోగం సాభిప్రాయమే. కాని ‘భారతీయ బమ్మ’ అని సమాసం చేయరాదు కదా!
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. రఘురాం గారి పూరణ, శైలజ గారి పూరణ అద్భుతంగా ఉన్నాయి.

    శైలజ గారి పూరణలో 'దుస్తులేసి' కి మారుగా 'తొడవు దాల్చి' అంటే బాగుంటుంది.


    మాఘమాస మందు మహితమౌ సుదినమ్ము
    శివుని పూజ చేయ చిత్త మలర
    స్నానమాడి యుదయ సంధ్య వేళను శివ-
    రాత్రి యర్ఘ్య మిడెను రవికి ద్విజుఁడు

    రిప్లయితొలగించండి
  27. స్నహితులను గూడి సినిమాకు వెడలనా
    రాత్రి.యర్ఘ్య మిచ్చె రవికి ద్విజుడు
    గా నమరిన మన కథానాయకుండట
    నుదుట బొట్టు బెట్టి మొదట గాను

    రిప్లయితొలగించండి
  28. నూత్న వటువు వేడ్క నుదయమ్ము కోసమై
    యెప్పుడెప్పుడనుచు నెదురు జూచె
    ప్రొద్దు పొడువ గడచి పోవగా నాపాడు
    రాత్రి, .యర్ఘ్య మిచ్చె రవికి ద్విజుడు

    రిప్లయితొలగించండి
  29. తొల్లి మంచు కరుగ తూర్పున తెలవారె
    అస్తమించె నంత పశ్చిమాన
    సంధ్య వార్చు కొనగ "శానోసె"లొ నపుడు
    రాత్రి యర్ఘ్య మిడెను రవికి ద్విజుడు

    రిప్లయితొలగించండి
  30. మిస్సన్న గారూ,
    మీ శివరాత్రి పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    రాత్రి చూసిన సినిమాలో ఘటనగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఆత్రపు వటువును గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    గతంలో మొట్టమొదట మీ పూరణ ఉండేది. ఈమధ్య ‘లాస్ట్ బెంచ్ స్టుడెంట్’ అవుతున్నారు!
    *
    మాజేటి సుమలత గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పద్యం సలక్షణంగా ఉంది. పూరణ బాగున్నది. సంతోషం! అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    గతములో ప్రశ్నాపత్రం ఇచ్చేసమయానికి నేను వచ్చే వాడిని...ఇప్పుడు ఆ సమయానికి నేను రాలేక పోతున్నాను...అయినా శంకర "ఆభరణం " లో ఏ మూల పూస అయితేనేం...ఆనందమే....

    రిప్లయితొలగించండి
  32. గురువుగారు,
    పూరణలోని దోషమును గ్రహించుకున్నాను. ధన్యవాదాలు.
    శైలజ గారి పూరణ బాగున్నది.

    రిప్లయితొలగించండి
  33. ఉదయకాలమందు నిదురలేచి, రవిని
    పూజ చేయు నట్టి పుణ్య జనుడు
    కలువరాయ గాంచి కలువ వైరిగ నెంచి
    రాత్రి యర్ఘ్య మిడెను రవికి ద్విజుడు

    రిప్లయితొలగించండి
  34. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కలువరాయు గాంచి’ అనండి.

    రిప్లయితొలగించండి