11, ఫిబ్రవరి 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1321 (మగని జడలోన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మగని జడలోన మందార మాల ముడిచె.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

25 కామెంట్‌లు:

 1. ఆలు మగలు శృంగారాల దేలు వేళ
  తన్మయత్వమ్ము నొందుచు తనువు మరచి
  యలరు చుండగ క్రీడల యందు మధురి
  మగని జడలోన మందార మాల ముడిచె

  రిప్లయితొలగించండి
 2. భరతనాట్యంబు చేయుట కరుగువేళ
  సుదతి యొక్కర్తె మిక్కిలి ముదముతోడ
  పెద్దదైనట్టి యద్దాన స్వీయభంగి
  మ గని జడలోన మందార మాల ముడిచె.

  రిప్లయితొలగించండి
 3. ప్రాణనాథుని కన్నను పడతి కిలను
  వేరు దైవంబు లేనట్టి కారణమున
  నతని కానందమునుగూర్చ నతివ మ్రొక్కి
  మగని, జడలోన మందార మాల ముడిచె.

  రిప్లయితొలగించండి
 4. సింహబలుని తాజంపంగ సిద్ధమైన
  భీము మేనిపై చీరను వేగ చుట్టి
  కట్టి స్వయముగా కుట్టిన పట్టు రవిక
  మగని జడ లోన మందార మాల ముడిచె

  రిప్లయితొలగించండి
 5. నిగమ అడ లోన 'ఐదార'మాల ముడిచె
  గనిమ పొడ లోన పందార మేళవింప జేసె
  గమగమ అడపొడల దార జూపుల ప్రే
  మగని జడలోన మందార మాల ముడిచె !!


  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. వెండి వెన్నెల సొగసుల వెలుగు లందు
  నలుక జెందిన సతినేమొ పలుక రించ
  కులుకు లొలికెడి కోమలి కొంటె గాను
  మగని జడలోన మందార మాల ముడిచె

  రిప్లయితొలగించండి
 7. సొగసు గనియగు వనితకు శోభగూర్ప
  కొనుచు దెచ్చెను పూల చేకొనగ నిచ్చె
  మగువ మెచ్చుచు మురిపింప మగనిమది ప్రే
  మగని జడలోన మందార మాల ముడిచె

  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  నాట్య విద్యను నేర్చిన నటుడొకండు
  సత్యభామగ చక్కని నృత్యమాడ
  గద్దె నెక్కుచునున్నంత,గనిన సతియె
  మగని జడలోన మందార మాల ముడిచె.

  రిప్లయితొలగించండి
 9. పెళ్లి రోజున పనిజేయ వెడలి నతడు
  తిరిగి వచ్చెను వెంటనే తెలసి కొనియు
  వనజ లోచని తా గాంచి వచ్చు చున్న
  మగని, జడలోన మందార మాల ముడిచె

  రిప్లయితొలగించండి
 10. పూర్వపు రోజుల్లో ఇదేమీ వింతగాదుగదా!

  పతిని కూర్చుండ బెట్టి సంపంగి నూనె
  రాసి చిక్కులు విడదీసి రమ్యమలర
  నల్లని కురుల ముడివేసి నలువ తానె
  మగని జడలోన మందార మాల ముడిచె.

  రిప్లయితొలగించండి
 11. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
  గారికి వందనములు

  మల్లెలన్నియు వాడెను మధువు సమసె
  తేటులిక చేర రావని బోటి తెలిపి
  మరల కుసుమించినంతనే మధువు యనుచు
  మగని జడలోనమందార మాల ముడిచె

  రిప్లయితొలగించండి
 12. పండిత నేమాని వారూ,
  మధురిమ గనిపింపజేసిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  భంగిమ గనిన మీ మొదటి పూరణ. విరుపుతో రెండవ పూరణ చాలా బాగున్నవి. అభినందనలు.
  *
  అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  వలలుడిని అలంకరించిన సైరంధ్రి విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘స్వయముగా కుట్టిన పట్టు రవిక’ కు అన్వయం లేదు. ఆ పాదాన్ని ‘కట్టి తొడిగెఁ దాఁ గుట్టిన పట్టు రవిక’ అందామా?
  *
  జిలేబీ గారూ,
  మీ భావం అవగాహన కాలేదు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  కొంటె పనిగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మగని ప్రేమ గనిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  వన రమను గనిపింపజేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  నటుడు విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  నిజమే... పూర్వం పురుషులు కూడా సిగముడిచి పూలను అలంకరించుకొనేవారట.
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మధువు + అనుచు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘మధు వటంచు’ అనండి.

  రిప్లయితొలగించండి
 13. శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు నమస్సులు. తమరిచ్చిన సూచనలకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 14. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  3వ పాదము చివరిలో ప్రే అని గురువు రాదు కదా - గణభంగము. సవరించండి.

  రిప్లయితొలగించండి
 15. పెరటి లోనికి జనినట్టి విరులబోడి
  నేను నాటిన మందార నిండుగాను
  విరగ బూసెను ప్రియతమా! అరయు మనుచు
  మగని, జడలోన మందార మాల ముడిచె.

  రిప్లయితొలగించండి
 16. మల్లెలడుగగ మందార మాల తెచ్చి
  చేతి కీయగ నతనిని చేర బిలిచి
  పంటి బిగువున వవ్వెడు పతిని నిరుప
  మ,గని జడలోన మందార మాల ముడిచె

  రిప్లయితొలగించండి
 17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ మూడవ పాదాన్ని ఇలా మారుద్దాం. ‘మగువ మురిపించెఁ దనపతి మనసున పెరి/మ గని..."
  *
  మిస్సన్న గారూ,
  విరుపుతో మంచి పూరణ చెప్పినారు. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  నిరుపమ అన్న పత్ని విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. కనక కనకాంబరమ్ముల వెనుక తురుమ
  జాజి మల్లెల సొబగుగా జమున దాల్చ
  తీసి పోనని వారికిఁ దెలియగా ను
  మ గని జడలోన మందార మాల ముడిచె

  రిప్లయితొలగించండి
 19. పెండ్లికై వెళ్ళ దలచిన వెలది యొకతి
  ఆభరణములను ధరించి నంతలోన
  తన్మయత్వము నొందుచు తన ముఖ గరి
  మ గని జడలోన మందార మాల ముడిచె.

  రిప్లయితొలగించండి
 20. మాస్టరుగారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు.
  క్రొత్త సవరణతో...


  సొగసు గనియగు వనితకు శోభగూర్ప
  కొనుచు దెచ్చెను పూల చేకొనగ నిచ్చె
  మగువ మెచ్చుచు క్రీగంట మగని భంగి
  మగని, జడలోన మందార మాల ముడిచె

  రిప్లయితొలగించండి
 21. సహదేవుడు గారూ,
  ఉమతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  ముఖగరిమతో మీ పూరణ అందంగా ఉంది. అభినందనలు.
  *
  హనుమచ్ఛాస్త్రి గారూ,
  సంతోషం! నా సవరణ కంటే మీ సవరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. నవ వధువును చేరి చెలుడు తళుకు బెళుకు
  వన్నెలిడు కెంపు చెక్కిళ్ళ, పడతి సిగ్గు,
  గాంచుచూ, పాడ మది, సరాగాల "సరిగ
  మగని", జడలోన మందార మాల ముడిచె

  రిప్లయితొలగించండి
 23. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి, పండిత నేమాని గురుదేవులకు నమస్కృతులు......
  దయచేసి భావ, గణదోషములను సవరించ మనవి..

  ఇంటి పనులన్ని తీరిన ఇంతి యొకతి
  పనికి వెళ్ళిన మగనికై కునుకు లేక
  దారి కాచుచు కూర్చుండి తాను గాంచి
  మగని, జడలోన మందార మాల ముడిచె.

  రిప్లయితొలగించండి