10, ఫిబ్రవరి 2014, సోమవారం

పద్య రచన – 503

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. కనుల విందొనరించు గ్రామ సీమలు సదా
    ....ఆహ్లాదమును గూర్చు నందరకును
    పచ్చని చెట్లతో పసిడి పంటలతోడ
    ....పరితోషమును గూర్చు ప్రకృతి తోడ
    పశు సంపదల తోడ పాలు వెన్నల తోడ
    ....ప్రమదమ్ము గూర్చు గోష్ఠముల తోడ
    హంగులు పొంగారు రంగవల్లుల తోడ
    ....మురిపించు ముంగిళ్ళ వరుస తోడ
    మాయ లెరుగ నట్టి మనుజుల తోడను
    వాసయోగ్యములయి వసుధ యందు
    మన తెలుంగు జాతి ఘన సంస్కృతిని బోలు
    సరళి గాంచ నగునె జగతి యందు

    రిప్లయితొలగించండి
  2. అరటి కొబ్బరి తోటలు పెరటి సిరులు
    పాడి పంటల సమృద్ధి పల్లె సీమ
    అన్న పూర్ణగ నెలకొన్న నఖిల జగతి
    వెన్న మనసున్న వనితల వెన్నె లంట

    రిప్లయితొలగించండి
  3. శ్రీమతి రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. ఒక సూచన.
    సమృద్ధి అనుటలో స గురువు కాదు. అందుచేత గణభంగము. పాడి పంటల నిలయమ్ము అందామా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. కాయకష్టముఁజేసి కాపురమ్మొనరించు
    సిసలైన మనుజుల సిరుల కొలను
    పూరిగుడిసెలోన పొంగిపొరలుచుండు
    సాటిప్రాణులపైని సమరసమది
    గడ్డివాములును బంగారు వర్ణమునొప్పు
    బసవన్న క్షుద్బాధఁ బరగఁదీర్చు
    కష్టసుఖములందు కలిమిలేములయందు
    కలిసి యుండెడు పల్లె వెలుగు నాడు

    దేశభాగ్యగరిమ దిశలెల్ల ప్రభవించు
    శుభతరుణము రాగ సుమతులార!
    మనదుడెందమలరు మాయని కూరిమి
    భరతసీమయందు పైడి కురియు.

    రిప్లయితొలగించండి
  5. మన తెలుగు జనపదంబులు
    ఘనతరమగు శోభతోడ కమనీయములై
    మనముల కాహ్లాదము గూ
    ర్చునుగద! నిలయంబు లౌచు సుఖసంతతికిన్. 1.

    మనసంస్కృతి మనవిభవము
    మనమనముల నిండియున్న మమకారంబుల్
    కనదగు గ్రామంబులలో
    మనయాంధ్రమునందు సతము మాన్యత నిండన్. 2.

    ఉదయమె నిద్రను మేల్కొని
    ముదమందుచు పశులసేవ ముఖ్యమటంచున్
    సదమలహృదులై చేసెడి
    సుదతుల కార్యంబులెంతొ శోభాన్వితముల్. 3.

    అద్దిర! మనయాంధ్రమునం
    దెద్దుల బండ్లన్ని పూన్చి యింటికి పంటల్
    ముద్దుగ కొనితెచ్చెద రే
    ప్రొద్దది హర్షంబు నొసగు పురవాసులకున్. 4.

    పల్లెల నెచ్చట చూచిన
    నుల్లంబుల నలరజేయు చుండెడి పశువుల్
    చల్లని గాలులు, పైరుల
    కెల్లరు ముదమందుచుందు రీయాంధ్రమునన్. 5.

    మనములలో నాత్మీయత
    జనములలో సమత మమత సభ్యత లెందున్
    తనువులలో నైర్మల్యత
    జనపదముల గాంచదగును సకలాంధ్రమునన్. 6.

    గుడిసెల సౌందర్యంబును,
    వడివడిగా పనులుచేయు వనితల నేర్పున్
    కడు రమ్యమైన పరిసర
    మడుగడుగున కానిపించు నాంధ్రంబందున్. 7.

    ఇచ్చట సంస్కృతి కనబడు
    నిచ్చట ధర్మంబు, సుఖము లీపల్లెలలో
    నచ్చపు బాంధవ్యంబులు
    సచ్చరితయు కాంచదగును సకలాంధ్రమునన్. 8.

    రిప్లయితొలగించండి
  6. అచ్చపుపాడి ఆవులునుఅందముచిందెడి పండ్ల తోటలున్
    పచ్చని పైర్లతో వెలుగు పల్లెలపైకి మనస్సుపోవగా
    గ్రచ్చెర యూరికిన్ జనితి గాంచగ పల్లెలసోయగమ్ము నా
    నెచ్చెలి తోడుగా,మరల రేపు పురంబున కేను వచ్చెదన్

    రిప్లయితొలగించండి
  7. నేడు భీష్మ యేకాదశి,కోన సీమ రేడు అంరత్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణము
    ============*=============
    భీతి ద్రుంచ వచ్చె భీష్మ యేకాదశి
    భక్త జనుల గాచ పరుగు బెట్టు
    కోన సీమ రేడు యానతి గైకొన,
    రండు వడి వడిగను రమణు లార!

    రిప్లయితొలగించండి
  8. పాడిపంటల తులతూగు పల్లెసీమ
    పచ్చ చేలము గట్టిన పసిడి కోమ
    పాత కొత్తల కలనేత బాపు బొమ్మ
    పల్లె సంస్కృతి జాతికి బట్టుగొమ్మ

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని వారూ,
    గ్రామీణ జీవన మాధుర్యాన్ని చవి చూపారు మీ పద్యంతో. చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    అందమైన పద్యాన్ని (నేమాని వారి సవరణతో) చెప్పారు. అభినందనలు.
    నేమాని వారి సూచనను గమనించారు కదా!
    *
    లక్ష్మీదేవి గారూ,
    కవిత్వపు సిరులు కురిపించారు మీ పద్యంలో. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మన ఆంధ్రములోని పల్లెల అందాలను, గొప్పదనానీ వివరించిన మీ పద్యాలు చాలా బాగున్నవి. ఈ ‘పద్యరచన’ శీర్షిక మీ చేత అద్భుతమైన ఖండకృతులను వ్రాయిస్తున్నందుకు ఆనందంగా ఉంది. అభినందనలు.
    *
    అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    ‘భీష్మైకాదశి’ని గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మంచి పద్యాన్ని రచించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ వరప్రసాద్ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    భీష్మ + ఏకాదశి = వృద్ధి సంధి ప్రకారము భీష్మైకాదశి యగును.
    కోనసీమ రేని యానతి గైకొని అందాము 3వ పాదమును.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. చల్లని పల్లెలలో పూ
    రిల్లును చూడండు ప్రక్కనెద్దుల బండిన్
    చల్లను, పాలను మోసెడు
    తల్లుల గన తెనుగు సీమ తత్వము తెలిసెన్.

    రిప్లయితొలగించండి
  12. నాపద్యం నాలుగవ పాదం లో "రేపుపురంబున కేనువచ్చెదన్" మార్చి "నేడు పురంబున కేను వచ్చితిన్" అని చదవవలెను.

    రిప్లయితొలగించండి