26, ఫిబ్రవరి 2014, బుధవారం

పద్య రచన – 519

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

26 కామెంట్‌లు:

 1. వందే శ్రీరమణీ హృదంబుజ రవిం వందే కృపాసాగరం
  వందే సర్వ జగత్పతిం భవహరం వందే సరోజేక్షణం
  వందే వేద పురాణ శాస్త్ర వినుతం వందే సురారాధితం
  వందే భక్త జనప్రియం శుభకరం వందే ముకుందం హరిం

  నను బాలింపగ వచ్చినావె వరదా! నారాయణా! కేశవా!
  వనజాతాసన వాసవాది వినుతా! భక్తావనా! మాధవా!
  వనజాతేక్షణ! నేను ధన్యుడను నా భాగ్యంబులుం బండెనో
  జన హృన్మందిర! వాసుదేవ! కరుణా సాంద్రా! ముకుందా! హరీ!

  అమరులకునైన దుర్లభమైన నీదు
  దివ్య దర్శన భాగ్యమొందితిని దేవ!
  కామితములేల నోదేవ! నా మనమ్ము
  నందు నీ భక్తి నిండుగా నలరు గాక!

  రిప్లయితొలగించండి
 2. శ్రీమహావిష్ణువును స్థిరమైన భక్తితో
  చిత్తమందున నిల్పి సేవించినంత
  అవతారపురుషుడౌ ఆయాదిదెవుండు
  కనులముందుగ నిలిచె కరుణజూపి.

  రిప్లయితొలగించండి
 3. జనకుని తొడపై కూర్చొన
  పినతల్లి వచ్చి దిగుమన వేడెను ధృవుడే
  తనతల్లి కోర్కె మేరకు
  వినతజ వాహను జపించి వెలిగెను నభమున్.

  రిప్లయితొలగించండి
 4. మేఘవిలసితము

  నే కంటిన్ హరిని కమల నయనున్
  శ్రీకాంతాశ్రితు స్థిరమతిని! మదీ
  యాకాంక్షాఫలమనుచు మురిసి నే
  నా కంజాతపు యడుగులఁ బడితిన్.

  గురువుగారు,
  ఈ పాదము సమస్యకు అనుకూలంగా నున్నచో పరిశీలింపగలరు.
  ఏమీ చేయని గాడిదద్భుతముగా నేన్గెక్కు కాలమ్మహో!

  రిప్లయితొలగించండి
 5. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో.

  హాస్యము ఈ మధ్య కరువైనది, అందుకు హాస్య ప్రధానముగా

  భక్తుని ప్రార్థన
  =============*===============
  దేవదేవ!వాసుదేవ!కరుణ జూపి
  కరిని గాచి నట్టి కంజ నేత్ర!
  కరుణ జూపవయ్య!కరి వలె నామది
  కరుగు చున్నదయ్య!కంజ నేత్ర!

  శ్రీ హరి భక్తునితో

  కనులు దెరచి నన్ను గనుడు,భక్తికి మెచ్చి
  వేగ వచ్చితి వర విప్ర వర్య!
  కోరిన వరములను కూరిమి తోడను
  వేగ మిడగ వచ్చె విప్ర వర్య!

  భక్తుడు శ్రీ హరితో

  వలదు వలదు స్వామి వరము లిచ్చుటకును
  రావలదు వసుధకు రయముగాను
  రాక్షస తతి నేడు రక్షక భటులైరి
  ఖైదు జేయ గలరు కంజ నేత్ర !

  రిప్లయితొలగించండి
 6. హరికై తపమొనరించెను
  కరుణించమనుచు దృవుండు కైటభవైరిన్
  వరమిచ్చెనుగద శ్రీహరి
  కరములు జోడించిదృవుడు భక్తిన్ గొలిచెన్

  రిప్లయితొలగించండి
 7. తనకు ప్రత్యక్ష మైనట్టి దైవ విభుని
  రెండు చేతులు జోడించి మెండు గైన
  భక్తి యినుమ డించగ నట బాలు డొకడు
  వేడు చుండెను జూడుడు వినయ ముగను

  రిప్లయితొలగించండి
 8. ధృవుడు దైత్యారి గొల్వగా ధీక్ష తోడ
  దర్శనంబిచ్చె విష్ణువు ధరకు వచ్చి
  కోరినట్టివరములను హరియొసంగ
  నమరపురికేగెను ధృవుడు అమ్మ తోడ

  రిప్లయితొలగించండి
 9. శ్రీ నాగరాజు రవీందర్ గారికి శుభాశీస్సులు.
  మీ ప్రయత్నము అభినందనీయము. సంస్కృతములో నమః శబ్దముతో చేర్చునపుడు చతుర్థీ విభక్తి ప్రత్యయము వాడవలెను. నమో వాసుదేవం అనరాదు - నమస్తే వాసుదేవాయ అనుట సాధువు. మీ భావమును 2 అనుష్టుప్పు శ్లోకములలో సవరించినాను:

  నమస్తే వాసుదేవాయ
  శ్రీనివాసాయ తేనమః
  నమస్తే పద్మనాభాయ
  విశ్వరూపాయ తేనమః

  నమస్తే రామచంద్రాయ
  నారసింహాయ తేనమః
  నమస్తే వేదసారాయ
  భక్తపాలాయ తేనమః

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. బాలుడ నంచు నెంచకుము భక్తిని నీ కొఱకై తపించితిన్
  మాలిమి జూడవే ధ్రువుని మాధవ! దీనజనావనా! హరీ!
  ఏలను రాజ్యభోగము లికేలను సంపద లేల బంధువుల్ ?
  చాలదె నీ పదంబు లిడు శాశ్వత దివ్య పదంబు కేశవా!

  ********************************

  బాల్యము నందు నన్ మదిని భావన జేయుచు వీడి లోని దౌ-
  ర్బల్యము, సంయమీంద్రులను రాయిడి పెట్టెడి యింద్రియాల చా-
  పల్యము త్రొక్కి పట్టి, కడు భక్తి తపంబొనరించినావు కై-
  వల్యము గోరి, మెచ్చితి ధ్రువా! పరమార్థము నీకు నిచ్చెదన్.

  *********************************

  భక్తి హరిని గొల్వ బాల్యమ్ము గీల్యమే
  అతని జేరు తపన యంకురింప
  దివ్య పదము నిచ్చి దీవించి పంపడే
  హరి కరుణకు నెన్న హద్దు గలదె?

  రిప్లయితొలగించండి
 11. శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  కొన్ని సవరణలు. ధృవుడు సాధువు కాదు - ధ్రువుడు అనవలెను.
  3వ పాదములో ప్రాస యతి సరిగా వేయబడలేదు. మీ భావమునకు సరియైన పద్యమును ఈ విధముగా మార్చేను:

  ధ్రువుడు తపమొనర్పగ దీక్ష తోడ, మెచ్చి
  దర్శనం బిచ్చి విష్ణువు ధరకు వచ్చి
  వాని కిచ్చె నత్యున్నత మైన పదము
  తల్లితో జేరె నాతడు తత్పదమును

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ మిస్సన్న గారూ!
  శుభాశీస్సులు. ముచ్చటగా నున్నవి మీ 3 పద్యములు. అభినందనలు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 13. పసివాని భక్తి మెచ్చ్చిన
  వసుదేవుడు సంత సించి వరమీ యంగా
  వెసదీ రగగగ నంబున
  యశమొందుచు వెలుగుమంచు తారగ ధ్రువుడై

  రిప్లయితొలగించండి
 14. శ్రీమతి రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యమును ఇలాగ సవరించు చున్నాను:

  పసివాని తపోదీక్షకు
  నసురారి ముదాన వరము నాతనికిడ నా
  కసమున తారగ నలరుచు
  నసదృశ మగురీతి ధ్రువుడు యశమును గాంచెన్

  రిప్లయితొలగించండి
 15. పూజ్యులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరిచ్చిన సవరణకు కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 16. మిత్రులారా!
  శుభాశీస్సులు. ఈనాటి పూరణలన్నియును అలరించుచున్నవి. అందరికి అభినందనలు.

  శ్రీ రఘుకుమార్ గారు:
  మీ పద్యమును ఇలాగ సవరించుచున్నాను:

  శ్రీ మహావిష్ణువును స్థిర చిత్తమందు
  నిలిపి సేవింప ధ్రువుడు వినిర్మలుండు
  ఆదిదేవుండు మెచ్చి సమాదరమున
  దర్శనమొసంగె వానికి దయ మెరయగ

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
  మీ పద్యమును ఇలాగ సవరించుచున్నాను:

  జనకుని తొడపై గూర్చొన
  గని దిగుమనె సవతి తల్లి క్రన్నన ధ్రువుడున్
  తన తల్లి దీవెనల గొని
  యొనరించి తపమ్ము పొందె నున్నత పదమున్

  శ్రీమతి లక్ష్మీ దేవి గారూ!
  మీ పద్యము ఆఖరి పాదములో ఇలాగ సవరణ చేయాలి:
  నా కంజాతపు టడుగుల బడితిన్

  శ్రీ వరప్రసాద్ గారు:
  హాస్యమునకు భగవత్ సన్నిధి వేదిక కాకూడదు:

  మీ 1వ పద్యము ఆఖరి పాదమును ఇలాగ మార్చండి:
  కరగు చున్నదయ్య పరమపురుష!

  2వ పద్యమును ఇలాగ మార్చండి:
  కనులు తెరచి నన్ను గనుము ధ్రువా నీదు
  భక్తి చాల మెచ్చి వచ్చితినిదె
  కోరుకొనుము వరము కూరిమి తోనిత్తు
  ననుచు విష్ణువనగ నాదరమున

  శ్రీమతి శైలజ గారు: ధ్రువుడు అనుట సాధు ప్రయోగము.

  శ్రీ సుబ్బా రావు గారు: మీ పద్యము బాగుగ నున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  త౦డ్రి తొడపైన గూర్చుండ తగవ టంచు
  సవతితల్లి విదల్చంగ వివశుడగుచు
  తల్లి ఆదేశమున హరి నుల్లమందు
  నిలిపి తపమును గావించె నిశ్చలుడయి
  హరియు ప్రత్యక్షమయి గోరు వర మనంగ
  నిన్నుస్తుతియింప వాక్శుద్ధి నిచ్చి నీదు
  చరణములపై న భక్తి కరుణ నిమ్ము
  అనిన శ్రీహరి మెచ్చి భక్తునకు నరసి
  తారకాభ్రమున ధ్రువస్థానమిడెను
  మలయుచుoడగ సప్తర్షి మండలమ్ము
  విశ్వమందున వెలయoగ శాశ్వతముగ

  రిప్లయితొలగించండి
 18. గురువుగారు,
  తప్పిదమునకు మన్నించండి. దిద్దుకుంటాను.

  రిప్లయితొలగించండి
 19. తండ్రి యొడిలోన బాలుడు తగడటన్న
  తండ్రి హరిజేరి మురిసెడు తరుణ మెంచ
  కనులు మూసి వేడిన స్వామె కరుణ జూపి
  దివిని ధ్రువతారగా వెల్గు తేజమొసగె

  రిప్లయితొలగించండి
 20. మాస్టరుగారూ ! నమస్కారములు..ఉదయం హడావుడిగా జేసిన నాపూరణములో రెండవపాదములోని గణదోషమును ఇప్పుడె సరిజేయబోవుచు మీరు చేసిన చక్కని సవరణను చూచినాను..చాల బాగున్నది ధన్యవాదములు..

  రిప్లయితొలగించండి
 21. కవిమిత్రులకు వందనాలు.
  పనుల ఒత్తిడిలో ఈరోజు పద్యాలను సమీక్షించలేకపోయాను. నేమాని వారు దయతో పద్యాల గుణదోషాలను పరిశీలించి, తగిన సూచనలు చేశారు. వారికి ధన్యవాదాలు.
  చిత్రానికి తగిన పద్యాలను రచించిన మిత్రులు....
  పండిత నేమాని వారికి,
  రఘుకుమార్ గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  కందుల వరప్రసాద్ గారికి,
  శైలజ గారికి,
  సుబ్బారావు గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  మిస్సన్న గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  సహదేవుడు గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 22. జనకాంకపీఠికంటెను
  ఘనమున్నతమైన స్థానగౌరవమందన్
  మునినాన్ ధ్రువుడు తపంబున
  తనిసెన్ హరిభక్తుడనగ తారాపథమున్

  రిప్లయితొలగించండి
 23. "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
  బహుకాలానికి మామీద దయకలిగింది. సంతోషం!
  ధ్రువచరిత్రను చిన్న కందపద్యంలో ఇమిడ్చి మీ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి