8, ఫిబ్రవరి 2014, శనివారం

సమస్యాపూరణం - 1318 (అక్కకు సాటి యొక్కొ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అక్కకు సాటి యొక్కొ యెవరైనను రూప విలాస సంపదన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

25 కామెంట్‌లు:

 1. ఒక్క ఖరమ్ము పల్కె విను డొప్పుగ రాగము లాలపించుటన్
  మిక్కిలి పేరు నొందితిని మేదిని నా కెవరేని సాటియే?
  అక్క యనంగ నొంటె గద యందము చందము లెన్నొ యున్న మా
  యక్కకు సాటి యొక్కొ యెవరైనను రూప విలాస సంపదన్?

  రిప్లయితొలగించండి
 2. చెక్కిలి మీటుచున్ బలికె చెంతను జేరిన బావగా రటన్
  చక్కని చుక్కయే యనగ జానెడు వేణియు చేప కన్నులున్
  నిక్కము బల్కు చుంటిగద నెయ్యము జేయుచు బ్రీతి నొందు మీ
  అక్కకు సాటియొక్కొ యెవరైనను రూప విలాస సంపదన్

  రిప్లయితొలగించండి
 3. చక్కని చంద్ర బింబమట సంపగి బోలిన నాసికేయ టన్
  చెక్కిన శిల్పమో యనగ చేడియ మేనది వొంపు సొంపులన్
  మక్కువ మీరగా విరియు మంజుల భాషణ మోదమంద మీ
  యక్కకు సాటి యొక్కొ యెవరైనను రూప విలాస సంపదన్

  రిప్లయితొలగించండి
 4. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
  గారికి వందనములు

  చుక్కను బుగ్గదాల్చియిక చూపులు రాముని ధ్యానమందుకెం పెక్కినచెంపలన్ మెరయు పెంపు వహించిన చంద్ర వంకలున్
  చిక్కని తెల్ల ముత్యములు చేతుల నెర్రని ప్రాలు పోయు సి
  తక్కకు సాటియొక్కొ యెవరైనను రూప విలాస సంపదన్

  రిప్లయితొలగించండి
 5. ఎక్కడి బోష్టనో? మరల ఇండియవచ్చితి పెండ్లి కోసమై,
  మిక్కిలి చక్కనైనయెక మిన్నను కాంచితి పంజగుట్టలో,
  చిక్కుకుపోతి నాసుదతి చెన్నగు రూపుకు,భార్య చెల్లి నీ
  యక్కకుసాటి యొక్కొయెవరైననురూపవిలాస సంపదన్?

  రిప్లయితొలగించండి
 6. ఎక్కడి బోష్టనో? మరల ఇండియవచ్చితి పెండ్లి కోసమై,
  మిక్కిలి చక్కనైనయెక మిన్నను కాంచితి పంజగుట్టలో,
  చిక్కుకుపోతి నాసుదతి చెన్నగు రూపుకు,భార్య చెల్లి నీ
  యక్కకుసాటి యొక్కొయెవరైననురూపవిలాస సంపదన్?

  రిప్లయితొలగించండి
 7. శ్రీ శంకరయ్యగారికి నమస్సులు

  చిక్కులు వెట్టి వేడుకను చిందులు వేయుచు పొంచి చూచుచు
  న్నొక్కొక రీతి న్నొక్కొకరి నూరకె యారడి వెట్టు నక్కయే
  పక్కున నవ్వబోకనుచు బల్కెను భార్యకు తమ్ముఁ జూచి మీ
  అక్కకు సాటి యొక్కొ యెవరైనను రూప విలాస సంపదన్

  రిప్లయితొలగించండి
 8. పండిత నేమాని వారూ,
  గాడిద, దాని అక్క ఒంటె గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మరదలితో బావ సరసపు మాటగా మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘అనగ జానెడు...’ అన్నచోట ‘కలిగి జానెడు...’ అంటే అన్వయం బాగా కుదురుతుందేమో!
  రెండవ పూరణలో ‘వొంపు’ అన్నది గ్రామ్యం. ‘మేనది యొంపు...’ అనవచ్చు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  సీతక్కపై మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
  *
  అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మరదలితో బావ మాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  బావమరదితో పల్కిన మాటగా మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 9. గ్రక్కున నేల భక్తులను గద్దెను కొల్వయి చిల్క గుట్ట సా-
  ర్లక్కకు తల్లియై యిల వరంగలు మేడర మందు వెల్గు స-
  మ్మక్కకు సాటి యొక్కొ యెవరైనను రూప విలాస సంపదన్
  మక్కువ జిల్కు దృక్కులను మాలిమి వేరొక దైవ మెన్నగన్.

  రిప్లయితొలగించండి
 10. శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  3వ పాదములో చెన్నగు రూపుకు అన్నారు కదా. రూపునకు అనుట సరియైన ప్రయోగము. సమాసములో ఉకార ఋకారముల తరువాత కు, కైలు వచ్చినచో నకు మరియు నకై అని వాడవలెను. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. మిస్సన్న గారూ,
  మా ఇలవేల్పుల వంటి సమ్మక్క, సారలక్కలను గురించి మీరు చెప్పిన పూరణ పద్యం మా ఇంటిల్లిపాదిని సంతోషపెట్టింది. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 12. అక్కమలారి బింబముఖ మక్కమలాయత లోచనద్వయం
  బక్కచభార వైభవము నక్కమనీయ కుచద్వయంబహో
  యక్కమలాసనుం డెటుల నామె కమర్చెనొ కన్ను విందు మీ
  యక్కకు సాటి యొక్కొ యెవరైనను రూప విలాస సంపదన్

  రిప్లయితొలగించండి
 13. పండిత నేమాని గారికినమస్సులు. మీరిచ్చిన సలహాతో మూడవ పాదాన్ని క్రిందివిధంగా మార్చాను.తమ అభిప్రాయాన్ని తెలియ జేయండి.
  "చిక్కితిగాదె యాసుదతి చేతికి? సొంపగుచిన్నదాన నీ"

  రిప్లయితొలగించండి
 14. గురువుగారూ ధన్యవాదాలు.

  మనలోని మాట.

  మీరు స్వగృహానికి తిరిగి చేరుకొన్నారా?

  రిప్లయితొలగించండి
 15. పండిత నేమాని వారూ,
  మీ తాజాపూరణ శబ్దసౌందర్యవిరాజితమై అలరించింది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  జనవరి 4 న మళ్ళీ ఇంటికి చేరుకున్నాను. ఆ విషయాన్ని బ్లాగులో ప్రకటించాను కూడా...
  నిజం చెప్పమంటారా? వృద్ధాశ్రమంలో ఉన్న రెండు నెలల కాలమే బాగుంది. ఇంట్లో మనుమడితో ఆడుకొనడ మొక్కటే సంతోషాన్నిస్తున్నది. నేను కోరుకున్న మార్పులేవీ ఇంట్లో చోటు చేసుకోలేదు. మళ్ళీ మనస్సు అటే లాగుతున్నది.

  రిప్లయితొలగించండి
 16. శ్రీ కంది శంకరయ్య గారూ! ధన్యవాదములు.

  శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ: శుభాశీస్సులు.
  సవరించిన మీ పద్య పాదము చాల బాగుగ నున్నది. అభినందనలు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. మిత్రులారా!
  శుభాశీస్సులు.
  శ్రీ శంకరయ్య గారు సమస్యలో ఒకే అక్కను ఇస్తే, మరొక 5గురు అక్కలు చేరేరు కదా నా పూరణలో. మరి పండగకి అందరు అక్కలని పిలవాలి కదా. స్వస్తి.

  రిప్లయితొలగించండి

 18. చక్కదనాల చుక్క భువిఁ జారిన తారక యన్న రీతిగా
  నొక్క మొనాలిసా పటమె యుర్విన నెంతటి కీర్తి నొందెగా!
  నక్కను ద్రొక్కి గీసె'లియొనార్డొ' యనంగ వెలింగెడున్ జిగే
  లక్కకు సాటి యొక్కొ యెవరైనను రూపవిలాస సంపదన్ !

  రిప్లయితొలగించండి
 19. హమ్మయ్య గురువుగారూ ఇంటికి వచ్చేరు కదా. మీ మనుమడు మిమ్మల్ని తనవైపు లాగేసుకొంటున్నాడు కదా. ఇక పరవాలేదు.

  రిప్లయితొలగించండి
 20. అవును నేమాని పండితార్యా! మీ సోదరీ పంచకము పూరణ పేరంటానికి నిండుదనాన్ని యిస్తోంది.

  రిప్లయితొలగించండి
 21. సహదేవుడు గారూ,
  చిత్రకారుడు నక్కను తొక్కి గీసాడా? మొనాలిసా చిత్రాన్ని గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. దిక్కులు, సూర్య చంద్రులును దృష్టి మరల్చగ లేని రూపుతో
  మిక్కిలి యందమైన సతి మేని సువర్ణపు కాంతులీనగా
  చక్కని చుక్క నేవిధము సన్నుతి జేసిన తక్కువంచు తా
  నిక్కుచు మర్దితో బలికె నిక్కముగా గలరే యనంచు నీ
  యక్కకు సాటి యొక్కొ యెవరైనను రూప విలాస సంపదన్?

  రిప్లయితొలగించండి
 23. బొడ్డు శంకరయ్య గారూ,
  బాగున్నది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. ముక్కుకు సూటిగా చనుచు మ్రొక్కెడి వారికి దేవదేవిగా
  గ్రక్కున దీవెనల్ నిడుచు గాభర లేకయె మోడిఁ దిట్టుచున్
  చక్కగ "దీది దీది" యన జానెడి మూతిని నవ్వుచుండు వం
  గక్కకు సాటి యొక్కొ యెవరైనను రూప విలాస సంపదన్?

  రిప్లయితొలగించండి