23, ఫిబ్రవరి 2014, ఆదివారం

శివ అష్టోత్తర శత నామావళి

శివ అష్టోత్తర శత నామావళి
రచన
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
సీసమాలిక:
శ్రీమన్మహేశాయ, శ్రీమహాదేవాయ,
    శ్రీకంథరాయ, గౌరీప్రియాయ,
ఆదిదేవాయ, దేవాధిదేవాయ, లో
    కాధినాయక నిచయార్చితాయ,
ప్రణవ స్వరూపాయ, పరమార్థ ఫలదాయ,
    సచ్చిదానందాయ, శాశ్వతాయ,
కైలాసవాసాయ, కరిచర్మ వసనాయ,
    భూతనాథాయ, సనాతనాయ,
చంద్రరేఖావిభూషాయ, గిరీశాయ,
    పంచ వక్త్రాయ, శుభంకరాయ,
నందీశ వాహాయ, నాగేంద్ర హారాయ,
    అభ్రకేశాయ, దిగంబరాయ,
ఆద్యాయ, వేదాంత వేద్యాయ, హృద్యాయ,
    జ్ఞాన నిధానాయ, శంకరాయ,
రుద్రాయ, జగదేక భద్రాయ, కరుణా స
    ముద్రాయ, బంధ విమోచనాయ,
అక్షర రూపాయ, రక్షాయ, సాంబాయ,
    కాలకాలాయ, జగద్ధితాయ,
ఆనంద సాంద్రాయ, మౌనిసంభావ్యాయ,
    వేదస్వరూపాయ, విధినుతాయ,
మృత్యుంజయాయ, సంశ్రితపారిజాతాయ,
    వైద్యనాథాయ, శుభంకరాయ,
నాద ప్రమోదాయ, నటరాజ రూపాయ,
    సకల కళాద్భుత సంచయాయ,
త్రిభువన నాథాయ, త్రిపురాసురహరాయ,
    లయకారకాయ, పరాత్పరాయ,
సర్వాంతరాత్మనే, సర్వ స్వరూపాయ,
    శర్వాయ, యక్షేశ సంస్తుతాయ,
దక్షాత్మజేశాయ, దక్షాధ్వరఘ్నాయ,
    దీక్షితాయ, హరాయ, త్రిణయనాయ,
కామవినాశాయ, కామిత వరదాయ,
    కామేశ్వరాయ, గంగాధరాయ,
అష్టరూప ధరాయ, శిష్టలోక హితాయ,
    సింధురాస్య షడాస్య సేవితాయ,
తాండవలోలాయ, తాపత్రయఘ్నాయ,
    ప్రమథార్చితాయ, సంపత్ప్రదాయ,
దివిజేంద్ర వినుతాయ, తేజోనిధానాయ,
    పూర్ణాయ, భువనేశ పూజితాయ,
సారంగ హస్తాయ, శరభేంద్ర వేషాయ,
    పరమేశ్వరాయ, సద్గురువరాయ,
దీనార్తి నాశాయ, దివ్యస్వరూపాయ,
    వాగీశవినుతాయ, భవహరాయ,
శాంతస్వరూపాయ, సాధులోక హితాయ,
    భక్తప్రియాయ, సౌభాగ్యదాయ,
విశ్వాధినాథాయ, విద్యాస్వరూపాయ,
    విబుధార్చితాయ, సంవిత్ప్రదాయ,
సత్యాయ, నిత్యాయ, సర్వ శరణ్యాయ,
    శూలాయుధధరాయ, సురహితాయ
సోమాయ, భీమాయ, శుద్ధాయ, బుద్ధాయ,
    భర్గాయ, పార్వతీ వల్లభాయ,
తే.గీ.
మంజునాదప్రియాయ, నమశ్శివాయ
మారదర్ప హరాయ, నమశ్శివాయ
మంగళ ఫలప్రదాయ, నమశ్శివాయ
మన్మనోమందిరాయ నమశ్శివాయ

9 కామెంట్‌లు:

  1. శివనామంబులు పలుకగ
    భవహరణములగును నరుల బాధలు దీరున్
    స్తవమది నామంబులతో
    నవలీలగ సీసమందహాహా యమరెన్.

    రిప్లయితొలగించండి
  2. నేమాని పండితార్యా!
    నీమముతో శివ జపమ్ము నెరపిన ఘనుడా!
    మేమిడు జన్మదినపు శుభ
    కామనలను స్వీకరింపు ఘనకవి చంద్రా!

    రిప్లయితొలగించండి
  3. నేడు పర్వదినము ! నేమాని పండిత
    జన్మదినము దెచ్చె సంబరమ్ము !
    నియతి గనుచుఁ బుణ్య నేమాని దంపతు
    లాది దంపతులుగ నంజలింతు !

    మా యన్నగారు మధుర కవి బిరుదాంచితులు శ్రీమదధ్యాత్మ రామాయణ కృతికర్త శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు , శ్రీమతి బాలాత్రిపురసుందరి దంపతులకు పాదాభివందనము లొనరిస్తూ వారలకు నా యీ శుభాకాంక్షలు !

    శుభమస్తు! శుభమస్తు !! శుభమస్తు !!! మీకెల్ల
    నాయుస్సు దీర్ఘమై యజుడు గూర్చు !

    శుభమస్తు ! శుభమస్తు !! సుభగత యింపార
    నారోగ్య సంపదల్ హరి యొసంగు !

    శుభమస్తు ! శుభమస్తు !! నభమునఁ గాంచుచు
    శివము లెన్నియొఁ బ్రీతి భవుడు పేర్చు !

    శుభమస్తు! శుభమస్తు !! విభవమ్ము వర్ధిల్ల
    శ్రీదేవి సమగూర్చు సిరులుఁ బెక్కు !


    జన్మదినమున నాతల్లి శాంభవి కృప
    వఱలు మీ పైన, నేమాని వంశజులను !
    వాణి నర్తింప రసనాగ్ర ప్రాంత మందు
    పాఱు మీ కీర్తి భువిలోన పండితాద్య !

    - గన్నవరపు వరాహ నరసింహమూర్తి

    రిప్లయితొలగించండి
  4. మూర్తి మిత్రమా! నేమాని పండితార్యులను ఉచిత రీతిని సత్కరించారు.

    రిప్లయితొలగించండి
  5. మూర్తి మిత్రమా! నేమాని పండితార్యులను ఉచిత రీతిని సత్కరించారు.

    రిప్లయితొలగించండి
  6. శివ అష్టోత్తర శత నామావళి ప్రతిదినము పఠించుకొనుట కనువుగా నున్నది.అన్నగారికి గురువులకు వందనములు. మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  7. నమస్కారములు
    అవధాన సరస్వతి శ్రీ పండిత నేమాని గురువుల జన్మదిన సందర్భముగా అద్భుత మైన శివ అష్టోత్తర శతనామావళిని మా కందించి నందులకు కృతజ్ఞతలు
    జన్మ దినసందర్భముగా పార్వతీ పరమేశ్వరులకు పాదాభి వందనములు

    రిప్లయితొలగించండి
  8. శివనామములు చెప్పి సీసమాలికలోన
    ..........హర్షమందగ జేసి రనఘ యిప్పు
    డఘవినాశకమౌచు నత్యంత మహిమతో
    ..........నీస్తోత్రరాజమీ యిలను వెలుగు
    ధన్యత గన్నారు తమరు పండితవర్య!
    ..........రమ్యమైనట్టి యీ రచనచేత
    ఆయురారోగ్యంబు లామహేశ్వరు డిచ్చి
    ..........పుణ్యాత్మ! మిమ్ములన్ బ్రోచుగాత
    నిత్యసుఖములొదవ నేమాని వంశజా!
    జన్మదినములిట్లె జరుపుకొనుచు
    శుభము గాంచు డెల్ల విభవంబులం బొంది
    చిరము యశములంది గురువరేణ్య!

    ఆర్యా!
    నమస్కారములు, జన్మదినశుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  9. సీసమాలికలో శివాష్టోత్తరశత నామావళిని భక్తకోటికి అందించిన పండిత నేమాని వారికి ధన్యవాదాలు.
    వారిని ప్రశంసించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    మిస్సన్న గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి