28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

సమస్యాపూరణం - 1337 (తలఁ దొలఁగించిన శుభమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తలఁ దొలఁగించిన శుభమ్ము తప్పక కలుగున్.

25 కామెంట్‌లు:

  1. వలవేసి బట్టి మృగముల
    సల సలమను నూనెలోన సరి జేయంగా
    నిల నేలెడు నరియడునే
    తల దొలగించిన శుభమ్ము తప్పక కలుగున్

    నరియడు = నక్క

    రిప్లయితొలగించండి
  2. ఇలలో దోచిన దంతయు
    కలుగులలో దాచుకొనెడి కల్మష మతులన్
    వలవేసి బట్టి ఘననే
    తల దొలగించిన శుభమ్ము తప్పక కలుగున్

    రిప్లయితొలగించండి
  3. కలలను మంచివి గనుచును
    ఇలలో నెరవేర్చు కొనుట కెంతయు కృషితో
    కలవర పడకను చెడు నడ
    తల దొలగించిన శుభమ్ము తప్పక కలుగున్.

    రిప్లయితొలగించండి
  4. కలవరముమాని జగమున
    బలసామర్థ్యములతోడ పనిచేయుచు మీ
    రలు మీకు యున్న యీ కల
    తలఁ దొలఁగించిన శుభంబు తప్పక కలుగున్.

    రిప్లయితొలగించండి
  5. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    =============*=============
    కలకంఠిని తిలకించుడు
    కలరవమున నామె ముఖము కమిలెను జూడన్,
    తొలు దొలుత కల్లు గల ముం
    తల దొలగించిన శుభమ్ము తప్పక గలుగున్!

    రిప్లయితొలగించండి
  6. తల రాతలు మార్చెదరని
    బలపరచగ గద్దె నెక్కి వంచన జేయన్
    గలతలు మిగులంగ నియం
    తలఁ దొలఁగించిన శుభమ్ము తప్పక కలుగున్

    రిప్లయితొలగించండి
  7. కలతల తోడను జంటలు
    కలవరపడుచున్ సతతము క్రాలుట కంటెన్
    మలినమనసులఁ గడిగి కల
    తల దొలగించిన శుభమ్ము తప్పక కలుగున్

    రిప్లయితొలగించండి
  8. రాజేశ్వరి అక్కయ్యా,
    నక్కజిత్తుల నేతల విషయంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    కల్మషనేతలను తొలగించుమన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    వెతలను తొలగించుమన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చెడు నడతను తొలగించుమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కనుచును + ఇలలో’విసంధిగా వ్రాసారు. అక్కడ ‘కలలను మంచివి కనుచు మ/హిలోన నెరవేర్చు..." అందాం.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    కలతలను తొలగించుమన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మీకు + ఉన్న’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘మీకు నున్న’ అనండి.
    *
    వరప్రసాద్ గారూ,
    కల్లుముంతలను తొలగించుమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    కలతల తొలగించుమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. తలవ్రాతను తనె మార్చగ
    పలుగంతులు వేయు నేత ప్రజలకు రోతై
    నిలువడు పదవిని; చెడు నే
    తలఁ దొలఁగించిన శుభమ్ము తప్పక కలుగున్.

    రిప్లయితొలగించండి
  10. భాగవతుల కృష్ణారావు గారూ,
    ప్రజలకు రోతైన నేతల గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. కలకాలము సుఖ ముండను
    కలవరములు లేకయుండు కాపురమందు
    న్నిల మనల నలుముకొనిన వె
    తల దొలగించిన శుభమ్ము తప్పక గలుగున్

    రిప్లయితొలగించండి
  12. సుబ్బారావు గారూ,
    వెతలను తొలగించుమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పలు కష్టములఁ బడుచు తా
    మిల పంటలఁ గాచుచుంద్రు హెచ్చరికను రై
    తులు పెరుగు కలుపులనుఁ గో
    తలఁ దొలఁగించిన శుభమ్ము తప్పక కలుగున్.

    రిప్లయితొలగించండి
  14. లక్ష్మీదేవి గారూ,
    కలుపుమొక్కల కోతలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    తలలో తలపులలో చే
    తల నడతల దేశ భక్తీ .తత్పరతయు నే
    తల మది ధన దాహపు చిం
    తల తొలగించిన శుభమ్ము తప్పక కల్గున్

    రిప్లయితొలగించండి
  16. తల రాతలు మార్చెదరని
    బలపరచగ గద్దె నెక్కి వంచన జేయన్
    గలతలు మిగులంగ నియం
    తలఁ దొలఁగించిన శుభమ్ము తప్పక కలుగున్

    రిప్లయితొలగించండి
  17. మాస్టరు గారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు...మీరు చూపిన సవరణతో...


    కలలను మంచివి గనుచు మ
    హిలోన నెరవేర్చు కొనుట కెంతయు కృషితో
    కలవర పడకను చెడు నడ
    తల దొలగించిన శుభమ్ము తప్పక కలుగున్.

    రిప్లయితొలగించండి
  18. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    ధనదాహపు చింతల తొలగించమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    నియంతల తొలగించాలన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. మీ బ్లాగు చాలా బాగుంది శంకరయ్య గారూ . ముఖ్యంగా సమస్యా పూరణ టపాలు ఇంకా బాగున్నాయి . ఈ రోజుల్లో కూడా ఇంత మంది శ్రద్ధగా కామెంటు చేస్తున్నారంటే గొప్పే !

    రిప్లయితొలగించండి
  20. Helle Y గారూ,
    ధన్యవాదాలు. ఈ గొప్ప అంతా తెలుగు భాషది, ఆంధ్రభాషాభిమానులది.

    రిప్లయితొలగించండి
  21. ఇల నెన్నిక దినములలో
    కలలూరించెడి నుడువుల కమ్మని సుడిలో
    పలు రకముల నేతల కో
    తలఁ దొలఁగించిన శుభమ్ము తప్పక కలుగున్

    రిప్లయితొలగించండి
  22. కలవర మేలర మోడీ!
    వలపుల రాణులును త్రోసి వంటల గదిలో
    పల, మాయా సోనియ మమ
    తలఁ దొలఁగించిన శుభమ్ము తప్పక కలుగున్

    రిప్లయితొలగించండి