24, ఫిబ్రవరి 2014, సోమవారం

పద్య రచన – 517 (కుక్కతోక)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
కుక్కతోక.

14 కామెంట్‌లు:

  1. అక్క మగడని భావించి
    చక్కగాను, చేరి సరసమాడ చోటు లే
    దిక్కడ నంచు దిప్పె మూతి
    ఎక్కడైనను వంకరగద కుక్క తోక.

    రిప్లయితొలగించండి
  2. మంచి బుద్ధి వాని మార్చంగ వచ్చును
    మాట వినును మంచి బాట చనును
    బుద్ది వంక రయిన దిద్దుట సాద్యమా
    చక్క జేయ లేము కుక్క తోక

    రిప్లయితొలగించండి
  3. కవిమిత్రులకు వందనాలు.
    ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాను. ఈ నాలుగురోజులు నిరంతరప్రయాణాల వల్ల బ్లాగును చూసి, పూరణల పద్యాల సమీక్ష చేయడానికి అవకాశం దొరకలేదు. ఎందుకో ఈ మధ్య మిత్రుల భాగస్వామ్యం తక్కువైనట్లు తోస్తున్నది.
    ఇన్నిరోజులు పూరణలు, పద్యాలను రచించిన మిత్రులకు, తమ స్తుతిఖండికలతో మనలను అలరిస్తున్న పండిత నేమాని వారికి అభినందనలు, ధన్యవాదాలు.
    *
    రఘుకుమార్ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
    అన్నిపాదాలలోను గణదోషం. మీ పద్యానికి నా సవరణ....
    అక్కమగం డనుచు తలచి
    చక్కగ ప్రక్కకును చేరి సరసములకు చో
    టిక్కడ లేదనుచు తొలగు
    నెక్కడ గన కుక్కతోక నిటు వంకరయే.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. పుట్టి నప్పటి బుద్ధులు పుడకలందు
    బోవు, నన్న బుధులమాట పూర్తి నిజము
    వక్ర బుద్ధిని సరిచేయ చక్రి తరమె?
    శునక తోక సరియగుట చూడ తరమె?

    రిప్లయితొలగించండి
  5. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘శునకతోక’ అనరాదు. ‘శునకవాలము సరియౌట చూడ తరమె’ అనండి.

    రిప్లయితొలగించండి
  6. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    కుక్కతోక కోసి కుక్కకే మాంసమ్ము
    పెట్టురీతి ప్రజల పొట్టకొట్టి
    బిచ్చమేయు నేటి ఉచ్చ నాయకులెల్ల
    జనత సేవ యనుచు చాటు కొ౦ద్రు
    కుక్క తోక బట్టి గోదావరీదంగ
    బూను రీతి ప్రజలు బుద్ధి చెడగ
    నేత వెంట బడిన నీట ముంతురు లంక
    మేత యౌను గోద ఈత వలెను
    కుక్కతోక బట్టి జక్క సేయగ రాదు
    పామరులకు హితవు బల్క రాదు
    తోక జక్కబడదు దూకి మీద బడును
    జనము రెచ్చి పోయి చెనటి మిగులు .

    రిప్లయితొలగించండి
  7. కుక్క తోకకు గల ఖ్యాతి మిక్కుటముర
    దాని వంకర సరిజేయ తరము గామి
    వక్ర బుద్ధిని శ్వానపు వాలమనుట
    లోక మందున వాడుక నీకు తెలుసు.

    కుక్క తోక ప్రయోజన మొక్కటియును
    లేదు, యీగల త్రోలగా లేదు, దాని
    మాన మైనను కప్పగా బోని దగుట
    వ్యర్థు నందురు భైరవ వాల మనుచు.

    కుక్క తోకను చేబట్టి గొప్పదైన
    నదిని గోదావరిని దాట నగునె ధరణి?
    అల్ప బుద్ధుల యండతో సల్ప లేమి
    మంచి నట్టి వారిని కుక్క వాల మనుట.

    రిప్లయితొలగించండి
  8. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    చాలా బాగున్నాయి మీ పద్యాలు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణకు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  10. నేను కొత్తగా వ్రాయడం మొదలెట్టాను. అన్యధా భావించకండి.సవరణల కారణంగా ఇప్పుడిప్పుడే నేర్చుకొంటున్నాను. మీకు శతధా వందనాలు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ మిస్సన్న గారు! శుభాశీస్సులు.
    మీరు వ్రాసిన ఈ పాదములో యతి మైత్రి లేదు. సవరించవలెను:
    "మంచి నట్టి వారిని కుక్క వాల మనుట"
    స్వస్తి. (వంచి యనుటకు టైపు పొరపాటు అయినదా?)

    రిప్లయితొలగించండి
  12. పెక్కు దుష్టుల చిత్తమే కుక్క తోక
    చక్కగానెపుడుండదు కుక్క తోక
    పెక్కుసామెతలనిమిడె కుక్క తోక
    కుక్క నూపగ వార్తౌను కుక్క తోక

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని వారూ,
    మిస్సన్న గారి పద్యంలోని ఆ దోషాన్ని నేను గమనించలేదు. మీ రన్నట్టు అక్కడ ‘వంచి’కి బదులు ‘మంచి’ అని టైపాటు జరిగిందనుకుంటాను.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘కుక్కతోక’పై చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. నేమాని పండితార్యా! గురువుగారూ! పొరబాటుకు చింతిస్తున్నాను. సవరణకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి