1, ఫిబ్రవరి 2014, శనివారం

సమస్యాపూరణం - 1311 (రామ యనెడి నోరు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రామ యనెడి నోరు ఱాతిరోలు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

46 కామెంట్‌లు:

 1. ఆకలిదీర్చునుఅమ్మవలెనె ఱోలు
  ..........రామనామమువలె రామరామ
  కఠినమగునవిచెక్కలుజేయునీఱోలు
  ..........రామనామమువలె రామరామ
  నెరయునేస్థితినున్న నిశ్చలతను ఱోలు
  ..........రామనామమువలె రామరామ
  కన్నయ్యనింటిలోకట్టివైచును ఱోలు
  ..........రామనామమువలె రామరామ

  తీసియిచ్చు తిరిగితిరిగిపదార్ధ సా
  రమును ఱాతిరోలు రామనామ
  మునుపలుకఁయదార్ధమునుబోధ జేయును |
  రామయనెడినోరు ఱాతిరోలు |

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరింప నున్నవి !

  ఒకదానితో - పుణ్యం
  యింకోదానితో - పిండి
  లభిస్తాయి;సరిగ్గా వాడుకుంటే :

  01)
  ____________________________

  మొదటి దాని వలన - పుణ్యంబు పెరుగును
  రామ రామ రామ - రామ యనుట
  పిండి కొట్ట వీలు - రెండవ దానితో
  రామ యనెడి నోరు !- ఱాతిరోలు !
  ____________________________

  రిప్లయితొలగించండి
 3. నిర్మల మైన ఆత్మతో పరమాత్మను కీర్తించాలి గాని
  చిలుక పలుకులు పలికితే - ఱాతి రోలే మరి :

  02)
  ____________________________

  పవలు రేలు మిగుల - పాపంబు జేయుచు
  పలుక రామ యనుచు - చిలుక పోల్కి ,
  నాత్మ శుద్ధి లేక - నా రాము తలపోయు
  రామ యనెడి నోరు - ఱాతిరోలు !
  ____________________________

  రిప్లయితొలగించండి
 4. "భక్తి లేని పూజ - పత్రి చేటు"
  అని ఊరికే అన్నారా :

  03)
  ____________________________

  నిర్మలాత్మ తోడ - నియమ నిష్టల తోడ
  భక్తి పల్లవించ - పలుక వలెను !
  భక్తి సుంత లేక - భగవాను గీర్తించు
  రామ యనెడి నోరు - ఱాతిరోలు !
  ____________________________

  రిప్లయితొలగించండి
 5. రామ యనుచు మలచె రాతిని యాశిల్పి
  రామ యనెడి నోరు , ఱాతి రోలు
  కాదు పలికి పలికి కరుడు గట్టెనేమొ
  తినగ తినగ వేము తీపి వలెను

  రిప్లయితొలగించండి
 6. పాపాలు చేస్తూ రామా అంటే
  ఫలితముంటుందా ?

  04)
  ____________________________

  సత్య నిష్ఠ తోడ - సంసార యాత్రంబు
  ధర్మ మార్గమునను - తనర వలెను !
  పాప మెపుడు జేయు - పాపిష్ఠి పలికిన
  రామ యనెడి నోరు - ఱాతిరోలు !
  ____________________________

  రిప్లయితొలగించండి
 7. ప్రాణుల్ని ప్రేమించాలి సేవించాలి
  అదేమీ లేకుండా" రామా "అంటే సరి పోతుందా ?

  05)
  ____________________________

  నిన్న మొన్న నేడు - నీతితో జీవించి
  భూత దయను గలిగి , - చేత నైన
  సాయములను జేయు - సౌజన్య మదిలేక
  రామ యనెడి నోరు - ఱాతిరోలు !
  ____________________________

  రిప్లయితొలగించండి
 8. భవ్యమౌచు వెలుగుభక్తితో సతతంబు
  రామ యనెడి నోరు, ఱాతిరోలు
  తనివిదీర కొంత తడవైన శ్రీరామ
  యనని నోరు సత్య మవనిలోన.

  రిప్లయితొలగించండి
 9. రామ నామమెపుడు రాజిల్లు మనమందు
  శాంతిఁ గూర్చు చింత వంతఁ దీర్చు
  రక్తి తోడ నెపుడు రమణినిఁ దలచుచు
  రామ యనెడి నోరు ఱాతిరోలు.

  రిప్లయితొలగించండి

 10. రామ యనెడి నోరు, రాతి రోలు
  జీవనమున కలిగించు సకల మేలు
  మరామరామ యని రాతి రోలు
  వలె జీవనమును సాగించు జిలేబి !

  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. దీనజనుల కాస్థ, మానితంబుగ ప్రేమ,
  మమత సమత సాటి మానవులకు
  పంచకుండ సతము భక్తుండ నేనంచు
  రామయనెడి నోరు ఱాతిరోలు.

  రిప్లయితొలగించండి
 12. రామనామ జపము రసమయంబనుచును
  రామ భక్తుడనని గోముగాను
  భామ పొందు గోర భక్తి మాటున “రామ
  రామ“ యనెడి నోరు ఱాతిరోలు

  రిప్లయితొలగించండి
 13. దంచి నపుడు తలచు ధన్యోశ్మి యనుమాట
  బాధ మరువ నెంచి బరువు గాను
  రామ యనెడి నోరు ఱాతి రోలనువారు
  మలిన మైన భక్తి వెలితి యనగ

  రిప్లయితొలగించండి
 14. గూడ రఘురామ్ గారూ,
  చక్కని సీసపద్యంతో శుభోదయాన్ని కలిగించారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘తీర్చును + అమ్మ’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘ఆకలి దీఱుచు నమ్మవలెనె నోరు’ అనండి.
  *
  వసంత కిశోర్ గారూ,
  రామనామమే పలికించిందో, రోలు చెప్పించిందో కాని అడ్డులేని ఐదు పూరణలను ఇచ్చారు. అన్నీ బాగున్నవి. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  కాని భావం సందిగ్ధంగా ఉంది.
  రెండవ పూరణ చాలా బాగున్నది. ‘ధన్యోస్మి’ !
  ‘ధన్యోశ్మి’ టైపాటా?
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  విరుపుతో మొదటి పూరణ చక్కగా ఉంది.
  మీ రెండవ పూరణ కూడా బాగున్నది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  జిలేబీ గారూ,
  మంచి భావాన్ని అందించారు. అభినందనలు.
  మీ భావానికి నా ఛందోరూపం.....
  రామ యనెడి నోరు, రాతి రోలును మన
  జీవనమున మేలు చేయగలవు,
  రాతిరోలు వలె మరా మరా యనుచును
  నిటుల బ్రతుకుచుండె నీ జిలేబి!
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. రామభక్తి అనే మూలికను వేసి రామ నామమనే రోకలితో నోరు అనే రాతి రోటిలో తిప్పితే రామరసం వస్తుంది.. అది సేవిస్తే కలికల్మషాన్ని హరిస్తుంది...


  రోకలందు కొనుడురో ! కలిని కొట్టుడు
  రోకలిదియె " రామ " నీకు, పలుకు
  ' రామ భక్తి ' దంచి రసము ద్రాగుడు మీరు
  రామ యనెడి నోరు ఱాతిరోలు.

  రిప్లయితొలగించండి
 16. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ చక్కగా ఉంది. ‘రాముఁ డేయ శర మరాతి ఱోలు’ అనడం బాగుంది. అభినందనలు.
  అరాతిని అఱాతి అన్నారు.

  రిప్లయితొలగించండి
 17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  గోసాయి చిట్కా చెప్పినట్లు చక్కని పూరణ చెప్పారు. చాలా బాగుంది. అభినందనలు.
  ‘రోకలి యందుకొనుడు, రోకలి నందుకొనుడు’ అని ఉండాలి. అదే విధంగా గణదోషమూ ఉన్నది. ఆ పాదాన్ని ‘రోకలిని ధరింపరో కలిఁ గొట్టుఁడు’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 18. అవునండీ ..నిజమే..రోకలందుకునే తొందరలో..తప్పు దొర్లినది..చక్కని సవరణకు ధన్యవాదములు.మీరు చూపిన సవరణతో...

  రోకలిని ధరింపరో! కలిఁ గొట్టుఁము
  రోకలిదియె " రామ " నీకు, పలికి,
  ' రామ భక్తి ' దంచి రసము ద్రాగుమ నీవు
  రామ యనెడి నోరు ఱాతిరోలు.

  రిప్లయితొలగించండి
 19. రామ యనెడి నోరు రాతి రోలును మించు
  ....గుండె నేనియు మార్చు కోమలముగ
  రామ నామము భవ్య రత్న దీపంబయి
  ....ప్రజ్ఞాన కాంతుల వ్యాప్తి జేయు
  రామ నామ మనోభిరామ సుమారామ
  ....సీమా విహారమ్ము శ్రేయములిడు
  రామ నామ చిదగ్ని ప్రజ్జ్వలించుచు కర్మ
  ....చయములనెల్ల భస్మమ్మొనర్చు
  రామ శ్రీరామ శ్రీరామ రామ యనుచు
  భవ విమోచన మొందిరి భద్రమతులు
  శబరి వాల్మీకి ముఖ్యులు సాధుతతులు
  అద్భుతము రామ మహిమ మహానుభావ!

  రిప్లయితొలగించండి
 20. పండిత నేమాని వారూ,
  తారకమంత్రమైన రామనామం యొక్క ప్రాశస్త్యాన్నీ, మహిమను వివరించిన మీ సీసపద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 21. శ్రీ కందిశంకరయ్య గారికి నమస్సులు

  కారు చిచ్చు వెట్టు కధనాల కర్తగ
  నూరు వాడలందు పేరు గాంచి
  తేనె లొల్క బల్కి తీసియుసురు,రామ
  రామ! యనెడి నోరు ఱాతిరోలు.

  రిప్లయితొలగించండి
 22. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

  రావణుని తో విభీషణుడు
  =============*================
  రామ నామ మంత్ర మహిమ రమ్య మైనది ధరలో
  ప్రేమ తోడ బలుకు చుండ ప్రీతి బుట్టె నన్నయా!
  భామ సీతను జెర బట్టి బాధ పడకు నన్నయా!
  రామ రామ!యనెడి నోరు ఱాతిరోలు గాదురా!
  నామనవిని గైకొనుము ఘ నముగ నిప్పు డన్న యా!

  విభీషణుని తో రావణుడు .
  =============*================
  రామ రామ!యనెడి నోరు ఱాతిరోలు తమ్ముడా!
  ప్రేమ తోడ బలుక వలదు రేయి పగలు తమ్ముడా!
  భామ పైన ప్రీతి పెరిగె,వారిని గన తమ్ముడా!
  పామరుడను గాను నేను పట్టు వీడు తమ్ముడా!
  రామ రావణ రణ మందు రావణుండు గెల్చురా!

  రిప్లయితొలగించండి
 23. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్యగారికి వందనములు
  పాపకృత్యములనుపచ్చడి జేయును
  రామనామ మనెడి రాతిరోలు
  పాపమంటు కొనును పాషాణములకును
  రామజోగి మందు రసము గ్రోల

  రిప్లయితొలగించండి
 24. అందరి పూరణలు అద్భుతముగా నున్నవి, తారకమంత్రమైన రామనామం యొక్క ప్రాశస్త్యాన్నీ, మహిమను వివరించిన శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
  ============*==============
  పలుక రామ యనుచు పంచదార లొలుకు,
  బలుకు బలుకు లందు బలము బెరుగ
  రామ యనెడి నోరు ఱాతిరోలని బల్క
  వలదనవరతమ్ము వసుధ లోన!

  రిప్లయితొలగించండి
 25. శ్రీ తిమ్మాజీ రావు గారు పద్యము బాగున్నది కానీ సమస్య ?
  ============*==============
  పొందు గౌరవమ్ము పొంకమలర నేడు
  రామ యనెడి నోరు,ఱాతిరోలు
  రమణి యయ్యె గాద రామపాదము దాకి,
  రామ రసము గొనుడు రమణు లార!

  రిప్లయితొలగించండి
 26. రామ యనెడి నోరు, ఱాతి రో లును రెండు
  మేలు జేయు మనకు బాల! వినుము
  ముక్తి నిచ్చు నిజము మొదటిది, ఱోలుతో
  పప్పు రుబ్బ వచ్చు బాగు గాను


  రిప్లయితొలగించండి
 27. రామ యనెడి నోరు ఱాతిరోలయినను
  రాతి నైన గాచు రామ జపము
  పాతకముల దంచు పావన నామము
  రామ రామ యనుచు రాయు కోటి

  రిప్లయితొలగించండి
 28. చిత్త శుద్ధి లేని చిలుకపలుకులేల
  రామ యనెడి నోరు ఱాతి ఱోలు
  భక్తి తోడ బలుక భగవంతు డేమెచ్చు
  యంత రించునఘము హనుమ సాక్షి

  రిప్లయితొలగించండి
 29. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
  గారికి వందనములు .రామధ్యానములోసమస్య మరచాను గుర్తుచేసినవరప్రసాదు గారికిధన్యవాదములు
  పూరణచిత్తగించండి
  రామయనెడి”నోరు” రాతి రోలుగమారి
  పాపముల నొనర్చు పచ్చడిగను
  రామజోగి మందు రసమును గ్రోలుచు
  ముక్తి నిలయ మేగ శక్తి నొసగు

  రిప్లయితొలగించండి
 30. హాయిరి రాగము- చాపు తాళము
  ===============*============
  రామాయని మిమ్ము దలుచని నోరు! రాతి రోలన వలెను! ముమ్మాటికి రాతి రోలన వలెను! బ్రతికినన్నాళ్ళు నీ భజన జేయుట! రామా! భవ బంధ మోచనము! అతి దయా పరుడని యార్త రక్షకుడని యానంద పడవలెను వో!రామా! రామా యని కన్నులున్నందుకు ఘనమై మి మూర్తిను గొంటి భాగ్యమున! పన్నగ భయము లేకున్న రక్షకుడని యున్నదే సార్ధకము శ్రీ రామా! రామా! వాసిగ భద్రాచలేశుడవని నిన్ను వాసనెరింగితిని న్నాసించిన నరసింహ దాసుడనని దోసిలొగ్గి వేడితి శ్రీరామా! రామా!

  రిప్లయితొలగించండి
 31. శ్రీ తిమ్మాజీ రావు గారికి ధన్యవాదములు
  =============*====================
  రామ రామ యనెడి నోరు రాతి రోలు
  గాదు! రామ రామ యనని ఖలుల నోరు
  రాతి రోలన వలె గాద! రామ భజన
  జేయ పాపము హరియింప జేయునయ్య!
  =============*====================
  నేను నాది యనుచు నిజము మరచి నేడు
  చేర రాని వారి జెంత జేరి
  కారు మాటలాడు వారు,దొరను రామ
  రామ యనెడి నోరు రాతి రోలు

  రిప్లయితొలగించండి
 32. చి.వరప్రసాదు[గారికి]తమరుచక్కనికీర్తనరచించారు
  చాపుతాళము నెరుగుదును గాని హాయిరిరాగము
  తెలియదు అయినా నాగయ్యగారి[భక్త పోతన]
  "సర్వమoగళనామా"పాట రాగములో పాడుకొంటున్నాను
  మరల ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 33. అంత రంగ లోన నపరాధ చింతన
  పైకి జూ డ దైవ భక్తి భజన
  చిత్త శుద్ధి లేక శ్రీరామ తారక
  రామయనెడినోరు ఱాతిరోలు .

  రిప్లయితొలగించండి
 34. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  సంవాదాత్మకమైన మీ మొదటి రెండు పూరణలూ బాగున్నవి. మూడవ నాల్గవ పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.
  ‘అన్నయ్యా’ అనడం నాకు తెలిసినంతవరకు వ్యావహారికమే. అక్కడ ‘అన్నరో’ అనడం బాగుంటుందేమో!
  మీరు వాగ్గేయకారులు కూడా అని తెలిసి ఆనందం కలిగింది. మీ కీర్తన చాలా బాగుంది.
  చివర వ్రాసిన రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  బాగున్నవి మీ రెండు పూరణలు. అభినందనలు.
  వ్రాయుము అనే అర్థంలో ‘రాయి’ అనడం గ్రామ్యం. ఆ పాదాన్ని ‘రండు రామకోటి వ్రాయవలెను’ అందామా?
  రెండవ పూరణలో ‘మెచ్చు/ నంతరించు’ అనండి.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  సవరించిన మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 35. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మంచి పూరణ రచించారు. అభినందనలు.
  ‘అంతరంగ లోన’ అన్నచోట ‘అంతరంగమందు’ అనండి.

  రిప్లయితొలగించండి
 36. రామ రామ యనెడి నోరు ఱాతి ఱోలు గాదుగా
  రామ రామ యనుచు బోయ రామ చరిత వ్రాసెగా
  రామ భజన చేయు చోట రక్ష హనుమ నీయుగా
  రామ నామ మనెడి మధుర రసము గ్రోలు సోదరా

  రిప్లయితొలగించండి
 37. ర - ఱ లకి యతి కానీ ప్రాస కానీ చెల్లదని గుర్తు.... నా సందేహాన్ని పెద్దలు తీర్చాలి.

  రిప్లయితొలగించండి
 38. గురువుగారికి ధన్యవాదములు,
  ఆ కీర్తన శ్రీ తూము నృసింహదాసుగారు వ్రాసినది.
  శ్రీ తిమ్మాజీ రావుగారు మీరు కీర్తన ఏ రాగము నందైనను పాడుకొనవచ్చును.
  నా దగ్గర మరి కొన్ని కీర్తనలు గలవు, సమయము దొరికినపుడు బ్లాగున పెట్టెదను !

  రిప్లయితొలగించండి
 39. గురువులకు నమస్కారములు
  అసలు మొదటి పద్యమే బాగుంటుం దనుకున్నాను కానీ రెండవ పద్యం బాగుంది ధన్యోస్మి
  " స్మి " అనుమానం వచ్చింది ప్చ్ ~ మంద గించిన దృష్టితో నిఘంటువు చూడలేక అలాగే రాసాను .క్షమించ గలరు
  ఇక అన్వయం అంటే నా అభిప్రాయము
  రామ అంటూనే రాతిని రాముని శిల్పం గా మార్చాడు కదా ఇక నోరు రాయి ఎలా అవుతుంది ? వేప తీపి ఐనట్లు
  పలికి పలికి రాయి గడ్డ కట్టిం దేమో అని ...అదన్నమాట అసలు సంగతి

  రిప్లయితొలగించండి
 40. కొప్పున నెమలీక సౌరు, గున్నయేన్గు పొగరు , "నన్
  విప్పర చెర దీని నుండి వీపు రాచె నెంతయో
  నొప్పిర బలరామ " యనెడు నోరు, ఱాతిరోలు పెన్
  ముప్పుగ తలపోయు తీరు, ముచ్చటైన లీలలే !

  రిప్లయితొలగించండి
 41. శైలజ గారూ,
  మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
  *
  ఆదిత్య గారూ,
  ఏకతరయతి ర, ఱలు దేనికదే యతి చెల్లుతుందనీ, రెంటికి యతి చెల్లదనీ చెప్పింది. లాక్షణికులలో దాదాపు అందరూ దీనిని అంగీకరించారు. కాని లింగమగుంట తిమ్మన కవి ‘ఱావడి’ పేరుతో ర, ఱలకు యతి చెల్లుతుందని చెప్పాడు. ఈ అభిప్రాయాన్నే శారదాదర్పణంలోను, ఆనందరంగరాట్ఛంచములోనూ చెప్పబడింది. కాని సాధారణంగా రఱలకు యతి చెల్లదనియే నిశ్చయం.
  లాక్షణికులు ‘ప్రాసవైరము’ పేరుతో రఱల ప్రాసమైత్రిని నిషేధించారు. కాని ఆధినిక కాలంలో లఘ్వలఘురేఫల భేదాన్ని అంతగా పాటించపోవడంతో ఈ ప్రాస గ్రాహ్యమే అనవచ్చు. తిక్కనాదులు కూడా ఈ ప్రాసను పాటించారు. చూడండి...
  ఊఱక - నేరవు (భార. అరణ్య. ౪-౧౯౯)
  ఉఱవడి - మద్రే/శ్వరుఁడు.. (భార. ద్రోణ. ౧-౧౭౫)
  కొఱకు - పురుష (భాగ. ౩-౭౭౪)
  నరవర - కొఱకగు (ఆముక్త. ౩-౮౬)
  తరుణి - సూక్ష్మ/మెఱిఁగి (కాశీ. ౩-౬౯)
  బలరాముణ్ణి సంబోధించి చేసిన మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 42. ఆ యహల్య శిలగ రోట నమరెనేమొ?
  తాత మిగులమెచ్చికొనె నీ ఱాతి రోలు
  రామ యని దంచ రంజిల్లి రామ యనుచు
  పోటు పోటున కొకసారి పాట గాను
  రామ రామ యనెడి నోరు ఱాతి రోలు

  రిప్లయితొలగించండి
 43. ఆ యహల్య శిలగ రోట నమరెనేమొ?
  తాత మిగులమెచ్చికొనె నీ ఱాతి రోలు
  రామ యని దంచ రంజిల్లి రామ యనుచు
  పోటు పోటున కొకసారి పాట గాను
  రామ రామ యనెడి నోరు ఱాతి రోలు

  రిప్లయితొలగించండి
 44. రామ రామ యనుచు రాగాలు తీయుచు
  భామ భామ యనుచు పరుగు లెత్తు
  నట్టి వారి గూడి హారామ దశరథ
  రామ యనిడి నోరు ఱాతి రోలు
  a.satyanarayana reddy

  రిప్లయితొలగించండి
 45. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మంచి పూరణ రచించారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి