19, ఫిబ్రవరి 2014, బుధవారం

సమస్యాపూరణం - 1328 (అమృతమ్మో ప్రాణఘాతము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అమృతమ్మో ప్రాణఘాత మగు గరళమ్మో?

28 కామెంట్‌లు:


 1. వచ్చే వచ్చే రెండు రాష్ట్రములు
  ఆంధ్ర తెలంగాణా అభ్యుదయ పథము గోరి
  ఇక కాలగతిన చూడవలె వీటి పురోగతి
  అమృతమ్మో ప్రాణఘాత మగు గరళమ్మో?

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. గణికెన్ పెండ్లాడియొకడు
  త్యాగమను పొగడ్తలందితనయుచు నుండెన్
  జీవిత మేమౌనోగద?
  అమృతమ్మో? ప్రాణఘాతమగు గరళమ్మో?

  రిప్లయితొలగించండి
 3. శ్రమియించి క్షీరసాగర
  మమరులు దానవులు తరియ నాసమయమునం
  దమరిన దెయ్యది ప్రథమం
  బమృతమ్మో, ప్రాణఘాతమగు గరళమ్మో? 1.

  తమపంతము నెరవేరగ
  సమతను పాటించకుండ సకలాంధ్రంబున్
  క్రమముగ జీల్చిన కార్యం
  బమృతమ్మో, ప్రాణఘాతమగు గరళమ్మో? 2.

  రిప్లయితొలగించండి
 4. జిలేబీ గారి భావానికి నా పద్యరూపం...

  సమకూడె రెండు రాష్ట్రము
  లమరఁగ నభ్యుదయపథమునందు చరించన్
  దమకొన నీ విభజన మది
  యమృతమ్మో? ప్రాణఘాతమగు గరళమ్మో?

  రిప్లయితొలగించండి
 5. జిలేబీ గారూ,
  మంచి భావాన్ని అందించారు. ధన్యవాదాలు.
  *
  అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మంచి భావంతో పూరణ చెప్పే ప్రయత్నం చేశారు. సంతోషం.
  కాని గణ ప్రాస దోషాలున్నాయి.
  కందం మొదటి పాదం లఘుగురువులలో దేనితో ప్రారంభమౌతుందో మిగిలిన పాదాలూ దానితోనే ప్రారంభించాలి.
  *
  హరి వేంకట సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. ఆర్యా!
  నమస్కారం.
  శ్రీ అన్నపురెడ్డి వారితోపాటు నన్ను కూడా రెడ్డిని చేశారు. గమనించ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 7. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  నిజమే... పొరపాటు... అంతకుముందే మా బాల్యమిత్రుడు వెంకటరెడ్డితో ఫోన్‍లో మాట్లాడాను. తరువాత అన్నపురెడ్డి గారి వ్యాఖ్యలో రెండు సార్లు రెడ్డి టైపు చేశాను. ఆ ఊపులో మిమ్మల్ని రెడ్డిని చేశాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 8. సమరము జేసిన ఫలమిది
  సమరస భావమ్ములేదె సకలాంధ్రమునన్
  దమరిన విభజనయికనిది
  యమృతమ్మో, ఫ్రాణఘాతమగు గరళమ్మో?

  రిప్లయితొలగించండి
 9. సమతా వైఖరి కొందరు
  సమయంబిది విభజనలకు సరికొందరనన్
  క్రమముగ జీలెగ నాధ్రం
  బమృతమ్మో ప్రాణఘాతమగు గరళమ్మో?

  రిప్లయితొలగించండి
 10. శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సకలాంధ్రమునం / దమరగ...’ అనండి.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. పూజ్య గురువర్యులు కంది శంకరయ్య గారికి నమస్సులు. క్షమించండి. నిదురమొఖంతో తప్పులతో కందము వ్రాసి పంపాను. ఇప్పుడు సవరించి పంపుచున్నాను. తప్పులుంటే సవరించ ప్రార్ధన.

  కమలముల వంటి కన్నుల
  కమనీయంబగు గణికను కనుగొని వీధిన్
  తమకమున జేకొనెనొకడు
  అమృతమ్మో ప్రాణఘాతమగు గరళమ్మో

  రిప్లయితొలగించండి
 12. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  అమృతం బంచునె సారా
  నమృత ప్రాయముగ నెంచి యాస్వాదించం
  గమృతులు కొల్లలు ; కానరు
  అమృతమ్మో ప్రాణఘాత మగు గరళమ్మో?

  రిప్లయితొలగించండి
 13. అమరెను రెండవ రాష్ట్రము
  అమృ తమ్మో ప్రాణ ఘాతమగు గరళ మ్మో
  నెమ్మది దెలియును భావిని
  మమతలతో మెలగ నొప్పు మహిలో నిరువుర్

  రిప్లయితొలగించండి
 14. అమృతం బంచునె మద్యము
  నెమృతిని పొందెడు వరకును నెమకిం
  చిమృతిని జెందెద రెరుగరు
  అమృతమ్మో ప్రాణఘాత మగు గరళమ్మో?

  రిప్లయితొలగించండి
 15. సమతుల్యత చెడునంచును
  సమైఖ్యమే మేలు మేలు సర్వులకనినన్
  సేమమ్మని విభజించుట
  యమృతమ్మో! ప్రాణఘాతమౌ గరళమ్మో!

  రిప్లయితొలగించండి
 16. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  అమృతము పంచు మనంగను :
  అమృతము కేంద్రమ్ముత్రాగి యాంధ్రుల కిడె మ
  ద్యము విభజన పేరున యది
  యమృతమ్మో ప్రాణఘాత మగు గరళమ్మో

  రిప్లయితొలగించండి
 17. అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘కానరు + అమృతము’, ‘ఎరుగరు + అమృతము’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘కానక యమృతమ్మో’, ‘ఎరుగక యమృతమ్మో’ అందాం.
  *
  సుబ్బారావు గారూ,
  మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  ‘రాష్ట్రము + అమృతము’ ఇక్కడ సంధి నిత్యం. దానిని ‘రాష్ట్ర/ మ్మమృతమ్మో’ అనండి.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  అందరిలా ‘సమైక్య’ శబ్దాన్ని మీరూ ‘సమైఖ్య’ అన్నారు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘అనంగను + అమృతము’ అని విసంధిగా వ్రాయరాదు కదా. అక్కడ ‘పంచుమటంచన/ నమృతము...’ అనండి.

  రిప్లయితొలగించండి
 18. అమరులు గ్రోలంగ సుధను
  మమతల కోయిలలు పాడె మానస గీతిన్
  కమలాక్షుల చిలుక పలుకులం
  దమృతమ్మో ప్రాణ ఘాతమగు గరళమ్మో

  రిప్లయితొలగించండి
 19. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
  nedu samtosha vishaadaalaku madhyamu draagi, kashta kaalamuna adi nannu paadu jesinadi yanutanu
  ===============*=================
  అమృతమ్మును ద్రాగి నొకడు,
  యమ బాధలు జెంది యొకడు నమరావతిలో
  నమవస నాడు బలికె రది
  యమృతమ్మో? ప్రాణ ఘాత మగు గరళమ్మో?

  రిప్లయితొలగించండి
 20. మమతల పైనను మంత్రాం-
  గమునదె పైచేయి నిలచె ఘనముగ, నిక కా-
  లము మన కేమిడునో గద
  అమృతమ్మో ప్రాణఘాత మగు గరళమ్మో?

  రిప్లయితొలగించండి
 21. సుబ్బారావు గారి పూరణలో 3వ పాదంలో ప్రాసను సరిజేసుకోవాలి.

  రిప్లయితొలగించండి
 22. సుబ్బారావు గారూ,
  మీ పూరణలో మూడవపాదంలో ప్రాస తప్పిన విషయాన్ని మిస్సన్న గారు చెప్పేవరకు నేను గమనించలేదు. ఆ పాదాన్ని ‘సమయము గడచినఁ దెలియును’ అందామా?
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం. దానిని ‘కమలనయనల పలుకులం’ అనండి.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటి పాదాన్ని ‘అమృతమును ద్రాగి యొక్కడు’ అనండి, బాగుంటుంది.
  *
  మిస్సన్న గారూ,
  సుబ్బారావు గారి పద్యంలోని లోపాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. కలిసుంటే కలుగు సుఖము
  కలహించిన శాంతినాస్తి కలలో నైనన్
  దృతముగ సలిపిన ఫలము
  అమృతమ్మో ప్రాణఘాత మగు గరళమ్మో?

  రిప్లయితొలగించండి
 24. కమనీయమ్మీ జగడము:
  డిమానిటైజేషణమది డెవిలో? గాడో?
  తిమిరమ్మో? తేజమ్మో?
  అమృతమ్మో? ప్రాణఘాత మగు గరళమ్మో?

  రిప్లయితొలగించండి


 25. రమణీ ణిసిధాత్వర్థ
  మ్మమృతమ్మో ప్రాణఘాత మగు గరళమ్మో?
  కమనీయంబని సేవిం
  చి,మదిరనయనా జిలేబి చిక్కున పడితిన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి