27, ఫిబ్రవరి 2014, గురువారం

శివస్తోత్రము

శివస్తోత్రము
రచన
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు


వందనమ్ము సుధాంశుశేఖర! వందనమ్ము కృపాకరా!
వందనమ్ము హిమాద్రిమందిర! వందనమ్ము శుభంకరా!
వందనమ్ము భుజంగభూషణ! వందనమ్ము సనాతనా!
వందనమ్ము జగత్త్రయీశ్వర! పార్వతీ హృదయేశ్వరా!

వందనమ్ము సురేంద్రవందిత! వందనమ్ము జగత్పితా!
వందనమ్ము శ్రితార్తినాశక! వందనమ్ము పరాత్పరా!
వందనమ్ము భవామయాపహ! వందనమ్ము త్రిలోచనా!
వందనమ్ము జగత్త్రయీశ్వర! పార్వతీ హృదయేశ్వరా!

వందనమ్ము సరోజబాంధవ వార్ధిజానల లోచనా!
వందనమ్ము మహాఫలప్రద! వందనమ్ము శ్రితావనా!
వందనమ్ము సురాగపాధర! వందనమ్ము సదాశివా
వందనమ్ము జగత్త్రయీశ్వర! పార్వతీ హృదయేశ్వరా!

13 కామెంట్‌లు:

  1. ప్రణామములు
    పూజ్య గురువుల శివ స్తోత్రమును మధుర మైన మత్త కోకిల రవమున స్తుతించి తరించ గల అదృష్టమును మహా శివరాత్రి పర్వ దినాన లభించడం మా జన్మ సుకృతం
    శివ రాత్రి సందర్భముగా సోదరు లందరికీ శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  2. వందనమ్ము సదాశివా! హర! వందనమ్ము పరాత్పరా!
    వందనమ్ము సురేశపూజిత! వందనమ్ము జగత్పితా!
    వందనమ్ము పురారి! శంకర! వందనమ్ము జగన్మయా!
    వందనమ్ము హిమాద్రిజాపతి! వందనమ్ము మహేశ్వరా!

    రిప్లయితొలగించండి
  3. అందరికి శివరాత్రి పర్వ దిన శుభాకాంక్షలతో.....

    శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో..శివ స్తోత్రమును స్తుతించి తరించ గల అదృష్టమును మహా శివరాత్రి పర్వ దినాన లభించడం మా పూర్వ జన్మ సుకృతం

    సకల వృత్తము లందు
    హరుని నామపు విందు
    వారికి ప్రణతు లందు !ఓ.. కూనలమ్మ!

    రిప్లయితొలగించండి
  4. శివరాత్రి పర్వ దినమున
    సవినయముగ వేడు కొనుదు సహ కవుల గమిన్
    శివ నామము జపియించుడు
    భవుడే మిము గాచు నెపుడు భవ్యత గలుగన్

    రిప్లయితొలగించండి
  5. శివ రాత్రి పర్వ దినమున
    శివ శివ యని బలుక గలుగు శివ సాయుజ్యం
    భవుడే యిట్లని జెప్పెను
    శివ నామము పలుకుడెపుడు సేమము కొఱకున్

    రిప్లయితొలగించండి
  6. గురువులు శ్రీకందిశంకరయ్యగారికి, శ్రీనేమాని పండితవర్యులకు మరియు నితర కవిమిత్రులకు శ్రీమహాశివరాత్రి శుభాకాంక్షలు.

    గరళము మ్రింగి లోకములఁ గాచినవాఁడవు, భక్తకోటికిన్
    వరములనిచ్చి శాంతమయ భావములన్ కలిగించువాఁడవం
    తరములనెంచబోక సురనాథులఁ దైత్యుల కల్పవృక్షమై
    పరగెడు నీదురూపమును భావన జేసెదె మన్మనంబునన్.

    రిప్లయితొలగించండి
  7. దండము పార్వతీపతికి దండము హైమవతీవినోదికిన్
    దండము సాంబశంభునకు దండము గౌరికి నైనవానికిన్
    దండ ముమామహేశునకు దండము దక్షుని కూతు భర్తకున్
    దండము మేనిలో సగము దారను దాల్చిన విశ్వమూర్తికిన్.

    రిప్లయితొలగించండి
  8. దండము మూషికాసురుని దండన జేసిన వాని తండ్రికిన్
    దండము తారకాసురుని దర్పము బాపిన వాని తాతకున్
    దండము దగ్ధమన్మధుని తండ్రిగ నేలిన చిచ్చు కంటికిన్
    దండము సర్వలోకముల ధారుణి జీవుల కన్నతండ్రికిన్.

    రిప్లయితొలగించండి
  9. దండము శూలహస్తునకు దండము బాలకురంగ పాణికిన్
    దండము దుష్టకోటులను దండన జేయగ మించు ధన్వికిన్
    దండము భక్తిభిక్ష గొన దాల్చి కపాలము చూచు వానికిన్
    దండము శిష్టరక్షణకు దన్నుగ హస్తము జూపు వానికిన్.

    రిప్లయితొలగించండి
  10. దండము నాగహారునకు దండము బాలశశాంక ధారికిన్
    దండము నీలకంఠునకు దండము గంగను దాల్చు వానికిన్
    దండము భస్మగాత్రునకు దండము చిచ్చర కంటి వానికిన్
    దండము కృత్తివాసునకు దండము చేతు శ్మశాన వాసికిన్.

    రిప్లయితొలగించండి
  11. చక్కగా స్పందించిన మిత్రులు --

    శ్రీమతి రాజేశ్వరి గారికి
    శ్రీ మిస్సన్న గారికి (పద్యములతో అలరించేరు)
    శ్రీ నాగరాజు రవీందర్ గారికి (పద్యములతో అలరించేరు)
    శ్రీ వర ప్రసాద్ గారికి (కూనలమ్మ పదము వ్రాసేరు)
    శ్రీ సుబ్బా రావు గారికి (కందముతో), మరియు
    శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారికి (పద్యముతో)
    అభినందనలు.
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  12. పండిత నేమాని వారూ,
    ఈరోజు శివునిపై భక్తితో, మాపై వాత్సల్యంతో మీరందించిన నమశ్శివాయ, శివస్తోత్రము అద్భుతంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
    *
    మహాశివరాత్రి పర్వదినాన శంకరాభరణం బ్లాగును తమ పద్యాలతో శివమయం చేసిన కవిమిత్రులు...
    పండితా నేమాని వారికి,
    మిస్సన్న గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    కందుల వరప్రసాద్ గారికి,
    సుబ్బారావు గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి