19, సెప్టెంబర్ 2012, బుధవారం

పద్య రచన - 117

కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు
వినాయక చవితి శుభాకాంక్షలు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

  1. సువర్ణ గాత్రాయ నమోనమస్తే
    గిరీశ పుత్రాయ నమోనమస్తే
    దయార్ద్ర నేత్రాయ నమోనమస్తే
    భుజంగ సూత్రాయ నమోనమస్తే

    రిప్లయితొలగించండి
  2. సువర్ణ గాత్రాయ అని చెప్పునపుడు సువర్ణము అర్థములులు చెప్పుకొనవచ్చును.
    1. మంచి అక్షరములు
    2. మంచి రంగు
    3. బంగారము
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. గురువర్యులకు, కవి మిత్రులకు, బ్లాగు వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

    గజముఖ నీదయ లేకను
    గజమైనను బ్రతుకు నడుప గలమా దేవా !
    గజమాల వైచి గొలుతును
    గజ గజ వణకుచును బార ఘన విఘ్నములే !

    రిప్లయితొలగించండి
  4. కొలుతును నే గణనాథుని
    కొలుతును నే గౌరి సుతుని కొలుతును దంతున్
    కొలుతును నే విఘ్నేశ్వరు
    కొలుతును నే శంభు తనయు కూర్మిని సతమున్.

    రిప్లయితొలగించండి
  5. గురువులందరికి మరియు
    కవిమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

    మ్రొక్కెద మనస్సు నందున్

    ముక్కంటీశుని పసుపతి ముద్దుల బిడ్డన్

    మక్కువగా నుండ్రాళ్ళను

    మ్రెక్కెడు బొజ్జగణపతిని మేటి చదువరిన్!

    రిప్లయితొలగించండి

  6. శ్రీవిఘ్నేశ్వరాయనమ:

    గురువుగారికి, కవిశ్రేష్ఠులకు, మిత్రకవిబృందానికి శ్రీవినాయకచవితి శుభాకాంక్షలు.

    శ్రీకరుడు సర్వశుభకరు
    డాకారమునందుప్రణవమద్భుతరీతిన్
    చేకొని వెలసెను జగతిన
    గైకొను మావందనముల గణపతి దేవా.

    రిప్లయితొలగించండి
  7. గౌరి తనయుఁడాతడు కోరి కదలి వచ్చె,
    భువిని జనులను రక్షింప బూని; గరిక
    పత్రి గొని దీవనలనిచ్చు; భక్తి తోడ
    పూజ జేయంగ రారండు బుద్ధి గలిగి

    రిప్లయితొలగించండి
  8. కవి పండిత మిత్రు లందఱకును వినాయకచతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!

    శా.
    హే విఘ్నేశ! గజాస్య! లంబ జఠరా! హేరంబ! భాండోదరా!
    హే విశ్వగ్దృశ! మంగళస్వర! సఖా! హే బ్రహ్మచారీ! కృతీ!
    హే విష్ణు! ప్రభు! విశ్వనేత్ర! వరదా! హే జిష్ణు! సర్వాత్మకా:
    హే విద్యా ధన శక్తి యుక్తి మహితా! హే సుప్రదీపా!నమ:!! (1)

    తే.గీ.
    ఏకవింశతి పత్రాల నెలమి నునిచి,
    స్వాదు ఫలములు, పుష్పాల సరము లిచ్చి,
    పంచభక్ష్య, పాయసముల భక్తి నిడియు,
    నర్చ సేతుము విఘ్నేశ, యాదుకొనుము! (2)


    ఆ.వె.
    ప్రతిదినమ్ము మేము ప్రార్థింతు మో యయ్య!
    విఘ్నములనుఁ ద్రోల వినతి సేతు;
    రుగ్మతలనుఁ బాపి, ప్రోవు మో విఘ్నేశ!
    భక్తితోడ నీకుఁ బ్రణతు లిడుదు! (3)

    కం.
    నీ పాద ధ్యానముచే
    మా పాపమ్ములను డుల్చు మహితాత్ముఁడవే!
    హే పార్వ తీశ నందన!
    యీ పర్వ దినమ్ము నందు నీకిడుదు నతుల్! (4)

    చక్రవాకము:
    వరగజాస్య! విఘ్నహంత్రి! భానుతేజ! సౌఖ్యదా!
    ధరనిభోదరా! విచిత్ర! దంతివక్త్ర! శాంకరీ!
    సురనరాది సేవితాంఘ్రి! శూర్పకర్ణ! హేరుకా!
    కరిపలాద గర్వహారి! కావుమయ్య మమ్మిఁకన్!! (5)

    -:శుభం భూయాత్:-

    రిప్లయితొలగించండి
  9. షోడశ నామము లమరెను
    వేడుక నా రే ఖలందు వికటుని చూపన్
    వేడెదనా దేవు నెపుడు
    కీడెంచక నాదు మదిన క్రీడించుటకున్

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని గారూ,
    ‘వర్ణగాత్రుని’ పై మీ ఉపేంద్రవజ్ర మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మిస్సన్న గారూ,
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    లక్ష్మీదేవి గారూ,
    గుండు మధుసూదన్ గారూ,
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ ,
    మీ మీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయమే. కాని రెండవ పాదం కొద్దిగా మార్చవలసి ఉంది. ‘ముక్కంటి తనయు గిరిసుత ముద్దుల బిడ్డన్’ అందామా?

    రిప్లయితొలగించండి