శ్రీమాతృ స్తోత్రము (సీసమాలిక)
శ్రీమాత!
శ్రీవిద్య! శ్రీమన్మహారాజ్ఞి!
సింహాసనేశ్వరీ! చిత్స్వరూప!
శ్రీమాత! శ్రీసదాశివ
భామినీ! మణి
ద్వీపవిహారిణీ! వేదమాత!
శ్రీమాత! నీ దివ్య
నామ మంత్రంబును
జపమొనర్చుచునుందు స్వాంతమందు
శ్రీమాత! నీ దివ్య
నామ సహస్రమున్
పారాయణ మొనర్తు భక్తి మీర
శ్రీమాత! నీ దివ్య
నామమ్ము లాత్మలో
ధ్యానమ్మొనర్తు దయానిధాన!
శ్రీమాత! నీ దివ్య
నామ విశేషముల్
భావించి హర్షంబు బడయుచుందు
శ్రీమాత! నీ
దరస్మేర ముఖాబ్జమున్
తిలకించనెంతు నో దివ్య గాత్రి!
శ్రీమాత! నీ
పదశ్రీ పంకజయుగమ్ము
నర్చించుచుందు నే ననవరతము
శ్రీమాత! మీ
మహాలీలా విశేషముల్
గానమ్మునొనరింతు జ్ఞానదాత్రి!
శ్రీమాత! నీ
చరిత్రామృత పానమ్ము
గావించుచుందు నో దేవవినుత!
శ్రీమాత! నీ
గుణశ్రీవైభవమ్మును
స్తోత్రమ్మొనర్తు ప్రస్తుత చరిత్ర!
శ్రీమాత! నీభక్త
బృందంబు తోడ సాం
గత్యమ్ము నొనరింపగా దలంతు
శ్రీమాత! నీ
మహాక్షేత్ర రాజమ్ముల
కేగుచు నిన్ను సేవించుచుందు
శ్రీమాత! నీ పద
శ్రీయుగ్మ సన్నిధి
వ్రాలి గావింతును వందనములు
శ్రీమాత! నీ సచ్చరిత్రంబు
విరచింతు
సచ్చిదానంద లక్షణ సమేత!
శ్రీమాత!
సర్వసంసిద్ధి ప్రదాయినీ!
ఆనందవర్షిణీ! అమృతరూప!
శ్రీమాత! త్రిభువన
శ్రేయఃప్రదాయినీ!
ఆశ్రిత వత్సలా! అభయ వరద!
శ్రీమాత! జయ జయ
శ్రీ నినాదంబుల
నొనరించుచుందు నీ యొద్ద నిలిచి
జయము శ్రీమాత!
లలిత! శ్రీచక్రనిలయ!
జయము శ్రీమాత!
జనని మోక్షప్రదాత్రి!
జయము శ్రీమాత!
జ్ఞాన విజ్ఞానదాత్రి!
జయము శ్రీమాత!
భువన రక్షైక దక్ష!
జయము శ్రీమాత!
సంఫుల్ల సారసాక్షి!
జయము శ్రీమాత!
చిద్రూప! జయము జయము
పండిత రామజోగి సన్యాసి రావు