9, ఏప్రిల్ 2013, మంగళవారం

మంగళ వారం 9 ఏప్రిల్ 2013


కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?.

31 కామెంట్‌లు:

  1. పన్నగధరుతో పోరిన
    మన్నన, నింద్రుని జగమున మాయని కీర్తిన్,
    దన్నును గలిగిన విజయుని
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?

    రిప్లయితొలగించండి
  2. అన్నియు తానై నడుపును
    మన్నును తిన్నట్టి వాడె మన్నన బొందెన్
    కన్నయ్య, నంద నందను
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?

    రిప్లయితొలగించండి
  3. చిన్నగ సుభద్ర కడుపున
    నాన్న పలుకులన్ గ్రహించి నడచె న్యూహం
    బెన్నగ నిల నభిమన్యుని
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే!

    రిప్లయితొలగించండి
  4. తోపెల్ల వంశ తిలకుడ!
    చీ పుగ గొట్టేసి యీ వు సింహా సనమున్
    మా పాలిట గురు వైతివి
    ఏపుణ్య ము జేసినామొ యీ శున కె ఱు కన్ .

    చదివితిని దెలుగు కోర్సును
    చదివెను మీ నాన్న కూడ చదువులు నచట న్
    ముదమున మోడే కు ఱ్ఱు న
    అదియే మా స్నే హ మునకు నాధా ర మయ్యెన్ .


    పద్మ నాభుని పుత్రుడ ! బాల .... శర్మ !
    మీ దు మిక్కిలి మిత్రుడు నీ దు తండ్రి
    తండ్రి మించిన కొడుకువు తలచి జూడ
    అందు కొనుమయ్య ! ఆ శీ స్సు లందు కొనుము .


    రిప్లయితొలగించండి
  5. మిన్నుడ నని గర్వించుచు
    పన్నుగ మ ఱి గంసు డపుడు బాధలు వెట్టెన్
    ఎన్నగ పన్నగ శయనుని
    కన్నను శూరుం డు ముజ్జగంబుల గలడే ?

    రిప్లయితొలగించండి
  6. శ్రీ తోపెల్ల గారికి,

    నమస్సులు. నిన్నటి మీ వ్యాఖ్యానానికి ధన్యుణ్ణి.

    మున్నీరు దాటి లంకను
    మున్నెరుగనెరీతి నగ్ని ముంచిన ప్రౌఢం
    బెన్నగ తరమే మారుతి
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలఁడె.

    రిప్లయితొలగించండి
  7. వెన్నుని సారథిగా గొని
    క్రన్నన చేబూని భవ్య గాండీవంబున్
    మన్నిక నేగెడు ఫల్గును
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?

    మన్నించబోను నేనని
    పన్నెను సత్యాగ్రహంబు బహువిధములుగా
    నెన్నంగ నికను గాంధీ
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?

    రిప్లయితొలగించండి
  8. కన్నని దైవము కన్నను
    కన్నులు మూడున్నవానికన్నను విషమున్
    దిన్నట్టి విశ్వనాథుని
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే !!!

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు పాదాభివందనములు జేయుచూ
    శ్రీ శర్మ గారికి ధన్యవాదములు,టైపాటు జరిగినది క్షమించగలరు
    ======*=======
    పన్నగము పైపరుండు
    త్పన్న మగు కడు సమస్య వాలము లెల్లన్
    కన్నుల గూల్చు ముకుందుని
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే ?

    రిప్లయితొలగించండి
  10. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
    హనుమ శ్రీరాముని గూర్చి రానణునితో
    పన్నుగ నుండుము రావణ
    నిన్నన్నువ జేసి యంత నిర్జించుచు నా
    పన్నుల గాచెడి రాముని
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?.
    (పన్ను= యుద్ధానికి సిద్ధపడు; అన్నువ = బలహీనుడు)

    రిప్లయితొలగించండి
  11. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు పాదాభివందనములు జేయుచూ
    =====*=======
    విన్నపము జేయ భక్తుల
    వెన్నంటి వరములిడు మన వేంకట రమణున్
    కన్నుల జూడగ మనుజుని
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే ?

    రిప్లయితొలగించండి

  12. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు పాదాభివందనములు జేయుచూ
    =======*=======
    3.విన్నపమున వరముల నిడు
    పన్నగ ధరుని సకుటుంబ పరివారమునన్
    కన్నుల జూడగ మనుజుని
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే ?

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు పాదాభివందనములు జేయుచూ
    =======*=========
    4. చిన్నగ దనయుని కోరిక
    కన్నడ జేయక ఘనులను గనులను గూల్చెన్
    నిన్నటి త్రిలింగ రాజుని
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే ?

    రిప్లయితొలగించండి
  14. పన్నగ ద్రోణుడు వ్యూహము
    నున్నానని పార్థ సూను డురికెను పెద
    నాన్నాయని! యెన్న నతని
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?



    రిప్లయితొలగించండి
  15. చిన్న తన మందె చంపడె
    యెన్నగ! తారకుని లీల నీ బాలుండే!
    అన్నా! 'సుబ్రహ్మణ్యుని'
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?


    రిప్లయితొలగించండి
  16. అన్నులు మెచ్చెడి యందము
    క్రొన్ననలే బాణతతియు, కొంటె దనమ్మున్
    గన్నుల బొడమడు ! మదనుడి
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?.

    రిప్లయితొలగించండి
  17. అన్నున లవణము జేయుచు
    మిన్నగఁ బోరాడె దొఱల మెచ్చి యహింసన్
    సన్నుతుడౌ మన గాంధీ
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?.

    రిప్లయితొలగించండి
  18. తిన్నని మించిన భక్తుడు
    వెన్నుని మరపించు సఖుడు విదురుని సరియౌ
    విన్నాణియు భీభత్సుని
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?

    రిప్లయితొలగించండి
  19. కన్నులు మూయక ఘన హిమ-
    వన్నగముల గాచుకొంచు వైరుల సతమున్
    మన్నన గొను సైనిక! నీ
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?

    రిప్లయితొలగించండి
  20. మన్నున బ్రదుకుచు రేబవ-
    లన్నము బెట్టంగ మనకు నాపదలైనన్
    వెన్నుం జూపని కృషికుని
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?

    రిప్లయితొలగించండి
  21. కన్నియ మనసును దోచిన
    చెన్నుని గెలువంగ నెంచి చేటొన రింపన్ !
    మిన్నగు ప్రేమను గెలుచుట
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే 1

    రిప్లయితొలగించండి
  22. శ్రీ గురువులకు, పెద్దలకు ప్రణామములు!

    పాఠశాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న శ్రీ తోపెల్ల వారికి అభినందనలు!

    “కన్నను” అంటే “కంటెను” అన్న ఒక్క ప్రత్యయార్థంలోనే గాక ఇతరార్థాలలోనూ పూరించాలని ప్రయత్నం:

    కన్నియగాఁ గర్ణునిఁ గనె
    విన్నుదొర వరమునఁ గుంతి; వెలఁదులు దా మా
    యన్నువ వలెఁ గనకున్నను
    గన్నను శూరుండు ముజ్జగంబులఁ గలఁడే?

    తనను అగౌరవించిన జమీందారు నీలాద్రిరాజుపై “చంద్రరేఖావిలాపం” అన్న నిందాకావ్యం చెప్పిన మహాకవి కూచిమంచి జగ్గకవి (1700-1765) ని గుఱించి:

    త న్నవమానించిన పె
    న్మన్నీనిన్ గావ్యమల్లి మ్రందించిన వి
    ద్వన్నుత కవిరాజగు జ
    గ్గ న్నను శూరుండు ముజ్జగంబులఁ గలఁడే?

    ఇక, “కంటె” ప్రత్యయార్థం:

    ము న్నఖిలాధ్వరరిపుఁ జం
    ప న్నా తారకు వధకయి పరమేశునిపై
    వన్నెను కదనము; మదనుని
    కన్నను శూరుండు ముజ్జగంబులఁ గలఁడే?

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  23. శ్రీనేమాని పండితులకు, శ్రీ ఏల్చూరి మహోదయులకు శ్రీశంకారార్యులకు మిత్రులకు ప్రణామములతో శ్రీశంకరార్య గురువుల పరోక్షమున ఈ సాహసము చేయుచున్నాను.
    *లక్ష్మీదేవి అక్కయ్యగారూ! శివునితో పోరాడి, ఇంద్రసభను గెల్చి “దన్ను” గలవాడర్జునుడని చాల బాగ చెప్పిన మీకు అభినందనలు.
    *గోలి హనుమచ్ఛాస్త్రిగారూ! కంటి చూపుతో కాల్చెస్తా” అన్నట్లు ఏ అస్త్ర శస్త్రములు అవసరంలేని శూరుడు సర్వాంతర్యామి శ్రీకృష్ణుని గూర్చి అందంగా చెప్పిన మీకు అభినందనలు.
    *సహదేవుడుగారూ! నూనూగు మీసాల వయసున “వంచనలేకుంటే” ఆరోజే భారతయుద్ధం పరిసమాప్తంచేయగల శూరుడభిమన్యుడు. చాల బాగున్నది మీ పూరణ. అభినందనలు. (టైపాటున నడచె న్యూహం అని ఉన్నది. వ వత్తు పడలేదు. లేదా వ్యూహం అనవచ్చు)
    *పోచిరాజు సుబ్బారావుగార్కి నమస్సులు. మాతండ్రిగారూ మీరూ చదువుకున్న సంస్కృతకళాశాల గూర్చి, మా తండ్రిగార్ని గూర్చి చెబుతూ ఆశీర్వదించిన మీకు పున: ప్రణామములు. మాతండ్రిగారి ముందు నేనెంతటి వాడను? మీ అభిమానము. మీరు చెప్పినట్లు ఇది ఏజన్మలో పుణ్యమో ఇందరు మహానుభావుల పూరణలు చూచు భాగ్యము శ్రీశంకరయ్య గారు కల్పించినారు. కంసుని సంహరించిన శ్రీకృష్ణునిపై మీ పూరణ భగున్నది. అభినందనలు.
    *సంపత్ కుమార్ శాస్త్రిగారూ! హనుమద్విషయకంగా సాగరలంఘనము, లంకను పరశురామప్రీతి చేయుట మున్నగు అంశములపై చెప్పిన మీపూరణ బాగున్నది అభినందనలు. “మున్నెరుగనె”(ని) టైపాటనుకొనుచున్నాను.

    *హరి వెం స న మూర్తి గారూ! శ్రీకృష్ణుని సారధ్యంలొని అర్జునుని మించువారెవరు? భారతమున పురాణపు/ ప్రకృతానికి చెందిన వారిపై చెప్పిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    *మందపీతాంబర్ గారూ! శివుణ్ణి మూడు విధాలుగా నకార ద్విత్వావృత్తితో చెప్పిన మీ పూరణ చాల బాగున్నది. అభినందనలు.
    *వరప్రసాద్ గారూ! ముకుమ్దునిపై, వేంకటేస్వరునిపై, శివునిపై చెప్పిన పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *మిస్సన్న మహోదయా! కంద పంచకాన్ని పంచినారు. వయోభేదంతో పని లేకుండా సమ్ర్థులైనవారు ఆపత్కాలంలొ ముందుకురికే లక్షణాన్ని చెబుతూ “అభిమన్యుని” పరంగానూ, కారణజన్ముడు తారకాసుర సంహారి సుబ్రహ్మణ్యేశ్వరుని గూర్చి, అర్జునుని గూర్చి, మన ప్రాణములకు వారి ప్రాణములు ఫణంగా పెట్టే సైనికులను గూర్చి, అన్నదాతను గూర్చి అద్భుతముగా చెప్పిన మీపూరణలకు అభినందనలు.
    * డా. గన్నవరపు వరాహ నరసింహమూర్తి గారూ! ఏమి పూరణ! అస్త్రమైనా శస్త్రమైనా తమకాఠిన్యంతో బాధించి చంపుతాయి. తద్విరుద్ధంగా పుష్పబాణం తీయని బాధకలిగించి పునరుత్పత్తికి దోహదం చేస్తుంది. అయినా ఆతని చే ఓడింపబడని వారెవ్వరు? మళ్ళీ వెంటనే జాతిపితను తెచ్చారు. ఈయనది కంటికి కనబడని అహింసాస్త్రం. రెండుపూరణలు చాల బాగున్నవి. అభినందనలు.

    *రాజేశ్వరి అక్కయ్యగారూ! ప్రేమించడంకంటే ప్రేమించబడడం గొప్పది అన్నట్లు చెప్పిన మీపూరణ బాగున్నది. అభినందనలు.
    **సరస్వతీ పుత్రులు, మహామహోపాధ్యాయ శ్రీ ఏల్చూరి మురళీధరరావుగార్కి ప్రణామములు. సూర్యునికి దివిటీ చూపడంలాంటి నేచేయు పని. మీ పద్యకవిత్వంపై విశ్లేషణ చేయ సామర్ధ్యం చాలకున్నవాడను.
    వరప్రసాదియైన కర్ణునిజననానికి (గుప్త పితృనామము) కలికాలపు పరిస్థితుల జననానికి మధ్య వ్యత్యాసాన్ని చూపుతూ వారిలోనూ గొప్పవారున్నారని తెలియజేసిన పూరణ, చంద్రరేఖావిలాసాన్ని “విలాపం” చేసిన “చచ్చు నీలాద్రి విభుని….”కి చిరస్థాయి బుద్ధిచెప్పిన కూచిమంచి తిమ్మకవి అనుజుడు జగ్గకవి మీద( కాకినాడ సమీపంలోని పిఠాపురం దగ్గర ఆతని స్వస్థలం) చెప్పిన పూరణ, మన్మధునిపై పూరణ ప్రశస్తములు. మీకు మిక్కిలి అభినందనలు.

    పై వ్రాతలోని గుణములన్నియూ పెద్దల ఆశీస్సులు. దోషములన్నియూ నావిగా భావించి మన్నింప ప్రార్థన.
    బుధజనవిధేయుడు,
    మీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.

    రిప్లయితొలగించండి
  24. పిన్నతనమ్మున భ్రాంతిడి
    మిన్నుకు వెస నెగసి పట్టి మిహిరుని మ్రింగెన్
    సున్నుండయ ! హనుమంతుని
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?.

    రిప్లయితొలగించండి
  25. ఓ ! సంపత్ కుమార్ శాస్త్రి గారు హనుమంతుని గురించి చెప్పారుగా. అయినా మరో పుష్పము మా హనుమకు !

    రిప్లయితొలగించండి
  26. అన్నయ్యగారూ! నమస్సులు. బాగున్నది మీపూరణ. సున్నుండయ అన్నారు. సున్నుండని కి బదులు టైపాటా!

    రిప్లయితొలగించండి
  27. సోదరులు శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యము గారికి ధన్యవాదములు. అదేమైనా సున్నుండా ? అనే అర్ధములో సున్నుండయ ? అని వ్రాసాను. మనస్సు సున్నుండ పైకి పోయిందంతే. మీ వ్యాఖ్యానాలు చాలా బాగున్నాయి. అభినందనలు !

    రిప్లయితొలగించండి
  28. ‘శంకరాభరణం’ బ్లాగుకు ఒక్కరోజు కూడా ఆటకం రాకూడదనే సదాశయంతో ముందుకు వచ్చి, నిన్నటి సమస్యను, పద్యరచనా శీర్షికను పోస్ట్ చేయడమే కాక, మిత్రుల పూరణలను పద్యాలను సహృదయంతో సమీక్షించిన శ్రీ తొపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు. వారి నిర్వహణాసామర్థ్యం ప్రశంసనీయం. సహకరించిన కవిమిత్రులందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. తిన్నగ జేరుచు మోడిని
    మిన్నగ తా కౌగిలించి మీదను బడుచున్
    కన్నును కొట్టెడి రాహులు
    కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?

    రిప్లయితొలగించండి