4, ఏప్రిల్ 2013, గురువారం

పద్య రచన – 301 (తేనె పూసిన కత్తి)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“తేనె పూసిన కత్తి”

17 కామెంట్‌లు:

 1. తేనెపూసిన కత్తి మించిన ధీరులెందరొ నేతలై
  పైని తీయగ మాటలాడుచు వంచనల్ తమ వృత్తిగా
  బూనుచుందురు క్రౌర్యముల్ ధనముల్ గడింతురు మన్నుమిన్
  గానకుందురు దేశద్రోహులు కష్టపెట్టుచు సాధులన్

  రిప్లయితొలగించండి
 2. తేనెపూసిన కత్తులుండుగ తీపి మాటలు నమ్మినన్
  లేనివానిని నున్నరీతుల లీలఁ జూపఁడె యల్పుఁడున్
  వాని వాక్కులు నమ్ముటేలను భ్రాంతి నొందక యాశలన్
  దాను నేర్చిన విద్య నమ్మిన ధాత్రి గల్గు జయమ్ములున్ !

  రిప్లయితొలగించండి
 3. తీయ తీయని మాటల మయ జేయు
  మెత్త మెత్తగ కుత్తుక నుత్తరించు
  ' నాక ' మంచును తలపించు పోకడలును
  తేనె బూసిన కత్తుల జూసి మెలగు.

  రిప్లయితొలగించండి
 4. తేనె పూసిన కత్తి యే తెచ్చు ముప్పు
  ఏల యంటివ ? విను మఱి యీ శ ! నీవు
  దేశ నాయకు లందఱు దీ పి బలికి
  మోస గింతురు బ్రజలను మొండి గాను .

  రిప్లయితొలగించండి
 5. తేనెలు పూసిన కత్తులె-
  వీనుల విందగు కపటపు పేరిమి తోడన్
  జాణల పొగడ్తలవెపుడు,
  జ్ఞానము కలిగిన సుజనులు సైపరు గదరా!

  జాణలు = మాట నేర్పు ప్రదర్శించే స్త్రీ/పురుషుడు

  రిప్లయితొలగించండి
 6. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు,
  మీ పద్యము 1వ పాదములో టైపు పొరపాటు - "మాయ జేయు" అని ఉండాలి. 4వ పాదములో యతి మైత్రి లేదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 7. కూర్మి బల్కుచు గొంతులు కోయుచుండు
  తేనెపూసిన కత్తులౌ మానవులను
  వినుడు గోముఖవ్యాఘ్రంబు లనగవచ్చు,
  ధర బయోముఖవిషపాత్రలరయ వారు.

  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
  =========*=========
  మలిన రాజ్యమందున ముఖ్య మంత్రి పదవి
  తేనె బూసిన కత్తని దెలియ జనులు
  రాజకీయ రుచిని గాంచ రాక్షసులను
  మించి పోరు సలుపు చుండె మెండుగాను

  రిప్లయితొలగించండి
 9. తీయని మాటలఁ జెప్పుచు
  మాయలు మంత్రాలుఁజేసి మన సేమంబే
  ధ్యేయంబటంచుమెలగుచు
  దూయగ తేనియల కత్తి ద్రోహము తెలియున్!

  రిప్లయితొలగించండి
 10. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు. సవరణతో నా పూరణ...

  తీయ తీయని మాటల మాయ జేయు
  మెత్త మెత్తగ కుత్తుక నుత్తరించు
  ' నాక ' మంచును తలపించు పోకడలును
  తేనె బూసిన కత్తుల దెలిసి మెలగు.

  రిప్లయితొలగించండి
 11. తేనె పూసిన కత్తులే కానబడును
  కోనకోనలందీనాడు గాన తేనె
  పూయని చురకత్తియగుబో మోసగించ
  క బ్రతుకుము హంసఁ బోలుచు కాకి గాక!

  రిప్లయితొలగించండి
 12. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
  అంతరంగమంత విషము, సుంత యైన
  చింత లేకయె పాపపు చింత తోడ
  వనితలకు వలపుల వల పూని వేయు
  వాడు తేనె పూసిన కత్తి, పాడు వాడు.

  రిప్లయితొలగించండి
 13. నేమాని పండితార్యా! నాదొక సందేహం. దేశద్రోహులు అన్నపుడు శ గురువు కాదా.

  రిప్లయితొలగించండి
 14. భారతమ్మున తేనె పూసిన బాకులెన్నియొ చూడగా
  మేర లేదిట విచ్చుకత్తుల మించు ధాటికి సోదరా
  చేరి తీయని పల్కులొల్కుచు స్నేహమున్ నటియించుచున్
  జేరి వెన్నును జీల్చి పోదురు చివ్వునన్ గనకుండినన్.

  రిప్లయితొలగించండి
 15. శ్రీ మిస్సన్న గారికి శుభాశీస్సులు.
  రేఫతో కూడిన సంయుక్తాక్షరములు వచ్చినపుడు దాని ముందరి అక్షరముపై దాని ఊనిక ఒకచో ఉండవచ్చు ఒకచో లేకపోవచ్చు. అది చాల తేలికైనది కాబట్టి. అందుచేత ప్ర హ్ర మొదలైన శబ్దములకు ముందున్న అక్షరము అవసరమును బట్టి గురువుగా గాని లేక లఘువుగా గాని వాడుకొనవచ్చును. దేశద్రోహులు అనే చోట కూడ ఈ వెసులుబాటును ఉపయోగించుకొన వచ్చును. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. ఇచ్చిన అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు.....
  పండిత నేమాని వారికి,
  గన్నవరపు నరసింహమూర్తి గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  సుబ్బారావు గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
  వరప్రసాద్ గారికి,
  సహదేవుడు గారికి,
  ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారికి,
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
  మిస్సన్న గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 17. నేమాని పండితార్యా! సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి