5, ఏప్రిల్ 2013, శుక్రవారం

పద్య రచన – 302 (భువన విజయము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“భువన విజయము”

28 కామెంట్‌లు:

  1. భువనవిజయము పేరిట మున్ను కృష్ణ
    దేవరాయలు కవు లష్ట దిగ్గజముల
    సత్కరించుచు నొనరించె సరస సభల
    సాహితీ ప్రియులకు విందు జరుపుచుండి

    రిప్లయితొలగించండి
  2. కవిదిగ్గజంబు లందరిఁ
    భువన విజయమనెడి పేర మోదము నీయన్
    సువిధముగ రాయలుఁ గలుప
    కవిత్వ ఝరులెల్ల పార ఖ్యాతిని బొందెన్!

    రిప్లయితొలగించండి
  3. తేటి రాయలు నిలిపెగా తెలుగు నేల
    కవన సుధలను తా గ్రోలి భువన విజయ
    మనెడి వాడని పద్మమ్ము నందు కలవు
    రేకులెన్మిది రసమూరు రేబవళ్ళు.

    రిప్లయితొలగించండి
  4. శంకరాభరణమ్మున సభయు జేసి
    సత్కవులు సెప్ప రసమయ చారు కవిత
    భువన విజయము ననరె యీ భువిని యందు
    సరస కవితకు నింకేమి సాటి యగును ?

    రిప్లయితొలగించండి
  5. భువన వి జయ మను సభ యది
    కవివరు లెనమండ్రు తోడ గనిపించెనుగా
    అవనీ శుడు రాయలు మ ఱి
    నవులను జిందించు చుండె నవ వరుని వలెన్ .

    రిప్లయితొలగించండి
  6. భువన విజయము......

    రసజ్ఞున్ హృదిన్ దా విలాసమ్ము తోడన్
    విశేషమ్ముమీరంగ విస్తారరీతిన్
    రసాప్లావమున్ జేయు రమ్యమ్ముగా,నిం
    క సాటేదియున్ లేదు, కావ్యంపు సృష్టిన్.

    రిప్లయితొలగించండి






  7. కవుల ,గాయక,నర్తక,కళల నెపుడు
    రాయలసమక్షమందు విరాజమాన
    భువనవిజయమనెడి రాజభవనశోభ,
    విభవ మూహింప మనమందు వేడుకౌను.

    రిప్లయితొలగించండి
  8. ఏసభాస్థలిలోన వాసికెక్కిన కవుల్
    దిగ్గజంబులరీతి దీర్చియుందు
    రేసభాభవనాన నేవేళ జూచిన
    సాహితీస్పర్థలు జరుగుచుండు
    ఏసభాంగణమునం దెన్నెన్నొ కావ్యంబు
    లుద్భవించుచునుండు నుత్సవముగ
    నేసభాస్థలమునం దెల్లకాలంబుల
    కవులసన్మానంబు కాంచగలము
    "దేశభాషల లెస్స యీ తెలుగ”టంచు
    పలికియుండిన కర్నాట ప్రభుని సృష్టి
    భువనవిజయంపు నామాన పుడమిపైన
    ఖ్యాతినందిన సత్కళాఖండ మద్ది.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ హరి గారి పద్యం విన సొంపుగా నున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగనున్నది. శ కి స కి ప్రాస వేయుట మంచి విధానము కాదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. అట్లాగా? సరేనండి. ఇప్పుడే సవరించటానికి ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  12. శ్లేషార్థరచనవిశ్లేషించె ప్రథితుడై
    భట్టుమూర్థ్యాఖ్యాన పండితుండు
    ఆంధ్రవాఙ్మయమునందాదిప్రబంధ స
    త్కవి యల్లసాని సంతసమునొందె
    శ్రీకాళహస్తీశు చింతనామృతధార
    సద్భక్తి గ్రోలు ధూర్జటికవీశు
    చాటుపద్యంబు ముచ్చటగొల్పుతెఱగుల
    రాణించెను తెనాలి రామకృష్ణు

    డరయ నయ్యలరాజు రామాభిధాను
    డలఘు నైపుణ్య మూర్తి పింగళికవీంద్రు
    డలరె మల్లన తిమ్మనాప్యాయతముల
    భువనవిజయద్రుమాశాఖభూషణములు.

    రిప్లయితొలగించండి
  13. భువన విజయము......

    రసజ్ఞున్ హృదిన్ దా విలాసమ్ము తోడన్
    ససూక్తమ్మునొప్పంగ సాహిత్యసీమన్
    రసాప్లావమున్ జేయు రమ్యమ్ముగా,నిం
    క సాటేదియున్ లేదు, కావ్యంపు సృష్టిన్.

    రిప్లయితొలగించండి
  14. అష్ట దిగ్గజమ్ము లనెడి స్రష్టలైన
    కవులు యుండిరి రాయల కాలమందు
    కొలువు దీర్చెను రాయలు పిలిచి కవుల
    భువన విజయ మను సభను బుధులు మెచ్చ

    రిప్లయితొలగించండి
  15. కవివరులున్న జగమ్మున వెల్గుచు,కాంతినిఁ బంచి సుకావ్యములన్;
    భువన జయమ్మును పొందిన వారలు పుణ్యపు రాశులు పూజ్యులదో...
    దివిఁ జని యచ్చట దేవతలెల్లర దీవనలందిన దృశ్యము,నేఁ
    కవనము వ్రాయుటఁ గాంచితి నిద్దుర కన్నుల స్వప్నముఁ గంటినిదే!

    రిప్లయితొలగించండి
  16. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
    నమస్కారములు!

    విషయవాంఛానీకవిషధిలోలుపతకు
    విషపానభోగంబు వీనుమిగిలె
    విశ్వవిజేతృత్వవేళాసముజ్జ్వలి
    తైశ్వర్యదీపిక లాఱిపోయె
    ప్రియసఖీపరిజనప్రేమపరీమళ
    మహిఫేనగంధంబు నవఘళించె
    కొనిపోవునవి లేవు ధనధాన్యములు నాఁగ
    శవపేటి రిక్తహస్తంబు దోఁచె

    సకలరాజన్యకోటిమస్తకకిరీట
    కాంతినీరాజనములందఁ గడఁగినట్టి
    యవనసామ్రాజ్యనేత దుర్యాగఫలిత
    భువనవిజయాభిలాషంబు ముగిసిపోయె.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  17. కవుల పోషించి పండించె కవన ములను
    బుధులు నిండిన కొలువుల ముదము నొంది
    భాష లందున తెలుగువి శేష మనుచు
    అవని తలమున విలసిల్లె భువన కీర్తి

    రిప్లయితొలగించండి
  18. నిజంగా ఈరోజు ‘శంకరాభరణం’ బ్లాగు భువనవిజయ సభనే తలపించింది. మధురమైన పద్యాలను వ్రాసిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    సహదేవుడు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    గన్నవరపు నరసింహమూర్తి గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    కమనీయం గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    ఏల్చూరి మురళీధర రావు గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి, సహృదయులకు
    వేఱొక తీరు నివేదన ...

    పూఁతమెఱుంగుల చేఁత దోఁపని కైత
    విన్నవించునఁట పెద్దన్న గారు
    ముద్దుపల్కులఁ బల్కుముద్దియ గద్దియ
    మన్నింప వచ్చెఁ దిమ్మన్న గారు
    మల్లీవల్లిమతల్లి మొల్లంబు మల్లాడ
    నెన్ను మల్లేశు మల్లన్న గారు
    కమ్రోక్తి ముక్తాముక్తముగ నాముక్తమా
    ల్యద వినుపించు రాయప్రభుండు

    తెనుఁగు కైతకుఁ బెండ్లిపందిళ్ళు గప్పి
    సుకవిరాజుల సత్కరించు సుదినమ్ము
    గలిగె, రండు! రం! డని జనుల్ గొలువుతీరు
    భువనవిజయంబు విజయంబు వొందుఁ గాక.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  20. సహదేవుడు గారూ,
    ప్రథమపాదాంతంలో అరసున్నా ఎందుకు?
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ‘భట్టుమూర్థ్యాఖ్యాన పండితుండు’ అన్నదాన్ని ‘భట్టుమూర్తి యనెడు పండితుండు’ అనీ, ‘ద్రుమాశాఖ’ను ‘ద్రుమపు శాఖ’ అనీ మార్చితే బాగుంటుంది.
    ‘ఆప్యాయతముల’...?
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    ‘కవులు + ఉండిరి’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘కవులు వెలసిరి’ అందాం.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ స్వప్నకవిత మధురంగా ఉంది.
    *
    ఏల్చూరి వారూ,
    భువనవిజయ కాంక్షతో బయలుదేరిన అలెగ్జాండర్ చరమస్థితిని ప్రౌఢపదగుంఫనంతో అద్భుతంగా చిత్రించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. భువనవిజయ సభావిజయాన్ని సమర్థపదప్రయోగౌచిత్యాన్ని ప్రదర్శిస్తూ మధురంగా కావ్యగానం చేసారు. అభినందనలు.
    సీసం మూడు, నాల్గు పాదాల పూర్వార్ధంలో టైపాటు వల్ల గణదోషం దొర్లింది.

    రిప్లయితొలగించండి
  22. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
    ధన్యవాదాలతో,

    అలెగ్జాండరు అంతిమస్థితి వర్ణన మీకు నచ్చినందుకు ఆనందంగా ఉన్నది. రెండవ పద్యంలో మీరన్నట్లు గణభంగాలు కలిగాయి. అవి టైపు తప్పులు కావు; నా పొరపాట్లే.

    పద్యాన్ని మళ్ళీ సరిచేసికొన్నాను:

    పూఁతమెఱుంగుల చేఁత దోఁపని కైత
    విన్నవించునఁట పెద్దన్న గారు
    ముద్దుపల్కులఁ బల్కుముద్దియ గద్దియ
    మన్నింప వచ్చెఁ దిమ్మన్న గారు
    మల్లీమతల్లిక మొల్లంబు మల్లాడ
    నెన్ను మల్లేశు మల్లన్న గారు
    కమ్రోక్తి నుక్తముక్తముగ నాముక్తమా
    ల్యద వినుపించు రాయప్రభుండు

    తెనుఁగు కైతకుఁ బెండ్లిపందిళ్ళు గప్పి
    సుకవిరాజుల సత్కరించు సుదినమ్ము
    గలిగె, రండు! రం! డని జనుల్ గొలువుతీరు
    భువనవిజయంబు విజయంబు వొందుఁ గాక.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  23. పెద్దలు , అన్నలు,మిత్రుల పూరణలు అద్భుతముగా నున్నాయి. శ్రీ ఏల్చురి మురళీధర రావు వారి రెండు సీస పద్యాలు భువన విజయానికి దీప్తి కలిగించాయి. అందఱికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    గండడై పెద్దన కవితన్ గడియించె / గండపెండేరము ఘనముగాను

    ప్రభంధ కవితకు ప్రతినిధి యగుచు/ ప్రబలెను మనుచరిత్ర యిటనే జూడ

    ముద్దు పల్కులొలుకు ముక్కు తిమ్మకవి/ పద్దెంపు శయ్యను పరవశించె నిట

    అయ్యలరాజ రామాభ్యుదయమ్ము/ నుయ్యాల జవ్వాడ నొప్పారె నిచట

    శ్రీకారముంజుట్టె శ్రీ ధూర్జటి యిట / శ్రీకాళహస్తీశ్వరేతివృత్త్తంబు

    రాజశేఖర చరిత్ర రచించి మల్ల/ న జయఘంటిక నొత్తె నరులు మెచ్చనిట

    వర్ణించె పింగళి పద్యాల నిచట / పూర్ణ కళల కళా పూర్ణోదయమున

    వసుచరిత్రను వ్రాసె భట్టుమూర్తి యిట/ వసుధాధిపుడు తగ ప్రస్తుతింపగను

    రామలింగని పాండు రంగ మహాత్మ్య/ మామతిల్లె నిచట హ్లాదనంబిడుచు

    విజయనగరరాజ్య విఖ్యాత” భువన/ విజయము” కవివర విజిగీష తలము.

    రిప్లయితొలగించండి
  25. సవరణ:

    అష్ట దిగ్గజమ్ము లనెడి స్రష్టలైన
    కవులు వెలసిరి రాయల కాలమందు
    కొలువు దీర్చెను రాయలు పిలిచి కవుల
    భువన విజయ మను సభను బుధులు మెచ్చ

    రిప్లయితొలగించండి