30, ఏప్రిల్ 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1039 (కన్నెలవంకఁ జూచి మెటికల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కన్నెలవంకఁ జూచి మెటికల్ విఱిచెన్ నగజాత భీతయై.
(దగ్గుపాడు అష్టావధానము - ‘అవధాన వాణి’ గ్రంథమునుండి)

25 కామెంట్‌లు:

  1. కన్నె గులాబియౌ గిరిజ కానలఁ జేరి తపంబు జేసి, స
    న్మన్ననలంది యా శివుని నాధునిగా వరియించి చేరె సం
    పన్నుని వామ భాగముఁగ.వంగి కనుంగొను దుష్ట దృష్టి సో
    కన్ నెలవంకఁ జూచి మెటికల్ విఱిచెన్ నగజాత భీతయై.

    రిప్లయితొలగించండి
  2. వహ్! ఆధ్భుతమైన పూరణ. రామక్రుష్ణారావు గారికి వందన పూర్వక అభినందనాలు.

    రిప్లయితొలగించండి
  3. సన్నుతులంది యింటికి వెసన్ జనుదెంచుచు వారణాస్యుడా
    తెన్నున నయ్యయో పడిన తీరును గాంచి వినోదమొందగా
    వెన్నెలరేడు, తీవ్రముగ వేదన జెందుచు మండుచున్న కా
    కన్నెల వంక జూచి మెటికల్ విరిచెన్ నగజాత భీతయై

    రిప్లయితొలగించండి
  4. అవధాని నారాయణం సుబ్రహ్మణ్యం గారి పూరణ.....

    సన్నుత పాత్రమైన తన శక్తుల చేత జగమ్ము నెప్పుడున్
    కన్నుల బెట్టి చూచుకొను కాంతుఁడు శాంతుఁ డనాదిమూర్తి యా
    క్రొన్నెలవంక దాల్చి తన కొప్పున మెల్లన రాజదృష్టి సో
    క న్నెలవంక జూచి మెటికల్ విఱిచెన్ నగజాత భీతయై.

    రిప్లయితొలగించండి
  5. కన్నులనార్పకుండ తన కాంతునిఁ గాంచుటఁ గాంచి రాధ యా
    కన్నెలవంకఁ జూచి మెటికల్ విఱిచెన్; నగజాత! భీతయై
    యున్నది నామనంబు, మనమూరడిలంగను దారి చూపుమా!
    మన్నన సేయుమంచనుచు మానిని వేడెను పార్వతీసతిన్.

    రిప్లయితొలగించండి
  6. పింగళి కేశ శోభిత, నవీన సుధా శశి ధారి పొంగుచున్
    పింగళి వంశ వర్ధనుఁడు విజ్ఞుఁడు శ్రీ శశి ధారి రూపునన్
    నింగికి నంట చేసె నను నేర్పగు పల్కుల మెచ్చుకోలుతో.
    వంగి నమస్కరింతు వరణీయుని కే ముదమార. శంకరా!

    రిప్లయితొలగించండి
  7. సన్నుతుడాదిదేవుడు ప్రసన్నతఁ భక్తుల కాలవాలమై
    వెన్నుడునాదిగా గల సవిస్తర దేవగణార్చితుండుగా
    నున్న మహేశు వక్త్రము సమున్నత పీఠము గల్గినట్టి పో
    కన్ నెల వంకఁ జూచి మెటికల్ విఱిచెన్ నగజాత భీతితో.

    రిప్లయితొలగించండి
  8. నేమాని పండితుల పూరణ, చింత రామకృష్ణా రావు గారి పూరణ
    హృద్యంగా ఉన్నాయి.

    ఇన్ని మృగాల దెచ్చి బలి యిచ్చిరె నాకని మూఢ భక్తులై
    నన్ను గ్రహింపరే నరులు నాదగు బిడ్డలు కాదె యీ పసుల్
    కన్నులు చెమ్మగిల్ల ననె గ్రామపు ముంగిలి దేవళమ్ములో
    ' కన్నె' ల వంక జూచి మెటికల్ విరిచెన్ నగజాత భీతయై.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ చింతా రామకృష్ణారావు గారి పద్యము బాగుగనున్నది. అభినందనలు.
    సత్ + మన్నన = సన్మన్నన అని సంధి చేసేరు. ఈ ప్రయోగము సాధువు కాదు. కాస్త పరిశీలించ గలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ మిస్సన్న గారి పద్యము బాగుగ నున్నది. అభినందనలు. కన్నె అంటే జంతువు మెడలోని త్రాడు అనే అర్థములో చక్కగా ప్రయోగించేరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. శ్రీమతి లక్ష్మీ దేవి గారి పద్యము బాగుగనున్నది. అభినందనలు. 4వ పాదములో " సాయము చేయమంచనుచు" అనే ప్రయోగములో అనుచు అనే భావము పొరపాటున 2 మార్లు పడినట్టుల నున్నది. కాస్త సవరించగలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
    ప్రణామములు!

    వెన్నెలవంకఁ జూచి మది వెన్నడి గొన్నది; గన్నువిల్తు గో
    ర్కె న్నెలవంకఁ బొంకమునఁ గీల్కొలుపన్ వలవంత రిక్కరా
    కన్నెల వంకఁ జూచి ఘటికల్ మఱచెన్ హరిణాంకుఁ డన్న వం
    క న్నెలవంకఁ జూచి మెటికల్ విఱచెన్ నగజాత భీతయై.

    ((పార్వతీదేవి పరమశివుని ఒడిలో ఉన్నది. పరమశివుడు ఆమె తనువున ప్రేమతో (కన్నువిల్తు కోర్కెన్) నెలవంక (నఖక్షతము)ను పొందికగా (పొంకమున) గీల్కొలుపబోయాడు. అంతలో చంద్రోదయమైంది. శివుడు ఉదయిస్తున్న తారకలకేసి చూస్తూ ఉన్నాడు. ఆయన మనసు నిజానికి తలపై ఉన్న వెన్నెలవంక (గంగాదేవి)పై ఉన్నదని, ఆయన ఆ నఖక్షతముల వంటి (రిక్క రాకన్నెల వంక) తారకలకేసి మన్మథవ్యథ (వలవంత)తో చూస్తూ ఉండిపోయాడు (ఘటికల్ మఱచెన్) అని, తనను విస్మరించాడని పార్వతికి కోపం వచ్చింది. భర్త ఇక తనను మఱచిపోతాడేమో అన్న భయంతో (భీతయై) నెలవంకను చూసి మెటికలు విఱిచింది - అని భావం)

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి

  13. సమస్యలో "విఱిచెన్" అని ఉన్నది కాబట్టి, ఆ ప్రకారంగా సవరించుకోవచ్చును:

    వెన్నెలవంకఁ జూచి మది వెన్నడి గొన్నది; గన్నువిల్తు గో
    ర్కె న్నెలవంకఁ బొంకమునఁ గీల్కొలుపన్ వలవంత రిక్కరా
    కన్నెల వంకఁ జూచి ఘటికల్ మఱిచెన్ హరిణాంకుఁ డన్న వం
    క న్నెలవంకఁ జూచి మెటికల్ విఱిచెన్ నగజాత భీతయై.

    రిప్లయితొలగించండి
  14. ధన్యవాదాలండి.

    సవరించిన పద్యము

    కన్నులనార్పకుండ తన కాంతునిఁ గాంచుటఁ గాంచి రాధ యా
    కన్నెలవంకఁ జూచి మెటికల్ విఱిచెన్; నగజాత! భీతయై
    యున్నది నామనంబు, మనమూరడిలంగను దారి గానగా
    మన్నన సేయుమా" యనుచు మానిని వేడెను పార్వతీసతిన్.

    మురళీధరరావుగారు ఆవిష్కరించిన దృశ్యమద్భుతముగా నున్నది. అమ్మవారికి మెటికలు విఱవవలసిన ఆవశ్యకతను బాగా నిరూపించినారు.

    రిప్లయితొలగించండి
  15. వన్నెలు చిందు లేయ మది వారిజమై వికసించి నంతనే
    సన్నగ పాట పాడుచును సంజ వెలుంగుల సోయగ మ్ములన్
    కన్నుల విందు జేయగను కౌముది రాకకు వేచి చూడ రా
    క న్నెలవంకఁ జూచి మెటికల్ విఱిచెన్ నగజాత భీత యై !

    రిప్లయితొలగించండి



  16. సన్నుతరీతి నందనుడు చక్కగ నృత్యముసేయుచుండగా
    పన్నగభూషణుండు,సురభర్తయు మెచ్చి కనుంగొనంగ నా
    వెన్నెలరేడు పక్కుమని విఘ్ననివారణు గాంచి నవ్వ కా
    కన్నెలవంక జూచి మెటికల్ విరిచెన్ నగజాత భీతయై .

    రిప్లయితొలగించండి
  17. శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో

    పున్నమనాటి రేయి ఘనపూజలు సల్పగ వారిజాక్షులున్
    వన్నెల వృక్షవాటికన ఫల్యములంతట కోయుచుండగన్
    నన్నిక గొందురే యనుచు నమ్ముచు వచ్చుచునున్న వారలన్
    కన్నెలవంకఁ జూచి మెటికల్ విఱిచెన్ నగజాత భీతయై.
    (నగజాత=పుష్పము)

    రిప్లయితొలగించండి
  18. ధన్యవాదములు రామకృష్ణారావుగారూ,
    మీ వాత్సల్యానికి కృతఙ్ఞతలు. మీ లాంటి వారి ఆశీస్సులే మాకు బలం. నమస్కారలతో...

    రిప్లయితొలగించండి
  19. చిన్నది కొండ కన్య మరి చీపురులమ్మగ పట్నమేగె తా
    వన్నెలు చిన్నెలున్న తగు వల్వలు గట్టని నాగరీకులన్
    కన్నులు మూయకుండ గను కాంచుచు నవ్వెను, వ్రేలు చూపగా
    కన్నెలవంక జూచి మెటికల్ విరిచెన్ నగజాత భీతయై .

    రిప్లయితొలగించండి
  20. ("నగలు" తమ బాధకు మూలమైన ఆడవారిని జూసి మెటికలు విరిచాయి అనే భావములో)

    పొన్నును మంటలో నిలిపి పుత్తడి నిగ్గును తేల్చి పిమ్మటన్
    వెన్నున సుత్తి దెబ్బలను వేయుచు కోరిన రీతి హారముల్
    మిన్నగ జేయ, కన్నియలు మేలగు భంగులఁ దాల్చు వాటినిన్
    కన్నెలవంకఁ జూచి మెటికల్ విఱిచెన్ "నగ" జాతభీతయై!!

    జాతభీత = భీతితో కూడిన పుట్టుక కలిగినది

    రిప్లయితొలగించండి
  21. మనోహరమైన పూరణలు చెప్పిన కవిమిత్రులు...
    చింతా రామకృష్ణా రావు గారికి,
    పండిత నేమాని వారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    మిస్సన్న గారికి,
    ఏల్చూరి మురళీధర రావు గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    కమనీయం గారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    జిగురు సత్యనారాయణ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. భర్త ఎవరి వెంటపడతాడో ననె పార్వతి భావించినట్లు :

    పన్నగ భూషణుండు తను వంకలు వంపుల మెచ్చి దాల్పగన్!
    వెన్నుడు మోహినీ వలెను వేషము మార్చగ వెంట బోవగన్!
    చిన్నెల దేవకన్నియలు చేరెడు నద్భుత దివ్య సీమయౌ
    'కన్నెల వంకఁ' జూచి మెటికల్ విఱిచెన్ నగజాత భీతితో!

    రిప్లయితొలగించండి
  23. వెన్నెల రేయినిన్ శివుని వేడ్కను రెచ్చ హిమాలయమ్మునన్
    మిన్నగ జేరుచున్ ముదము మీరగ నల్పపు పచ్చడమ్ములన్
    సన్నని నడ్ములన్ బిగువు చన్నుల శ్రోణుల నూపుచుండెడిన్
    కన్నెలవంకఁ జూచి మెటికల్ విఱిచెన్ నగజాత భీతయై 😊

    రిప్లయితొలగించండి