2, ఏప్రిల్ 2013, మంగళవారం

పద్య రచన – 299(తారక మంత్రము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“తారక మంత్రము”

28 కామెంట్‌లు:

  1. తారక మంత్రమున్ బడసి ధన్యత పొందిన రామదాసు, తా
    నేరక జేసినట్టి పలు నేరము లెంచక తన్ను గావగా
    శ్రీరఘురామునిన్ దలచి పాడెనహో, జన మెల్ల మెచ్చుచున్
    ధారణ జేసి నేటికిని ధాత్రిని కీర్తినిఁ బెంపుఁ జేయగా.

    రిప్లయితొలగించండి
  2. శ్రీ రఘురామ నీతలపు శ్రీకరమౌగద మానవాళికిన్
    భారము బాపు దీనజన బంధువువీవని మాటిమాటికిన్
    నీరము గ్రోలి నీ విమల నీరజనామము నుచ్ఛరించెడా
    యార్తుని మల్లయన్నిలను కాచిన నీదయ చెప్పనేర్తునే.

    కూలిన భవన శిధిలాలో వారం రోజుల పాటు బందీ అయిన మల్లయ్య అనునతడు "అందుబాటులో ఉన్న నీరు త్రాగుతూ, రామ నామ స్మరణ చేసుకుంటు ఉండేవాడిని" ఇన్ని రోజులు శిధిలాల మధ్య ఎలా ఉండగలిగావు? అనే ప్రశ్నకు సమాధానంగా చెప్పడని వార్తాపత్రికలోని వార్త ఈ పద్యానికి స్ఫూర్తి. ( చివరి పాదంలో ప్రాసాక్షరం వద్ద సందేహం ఉంది. గురువులు సందేహ నివృత్తి చేయగలరు ! ).

    రిప్లయితొలగించండి
  3. తారలు సూర్యుడు చంద్రుడు
    తీరుగ ఝరి గిరులు నిలచి తీరెడు వరకున్
    మీరుచు జగమును బ్రోచెడు
    తారక మంత్రమ్ము "రామ" తలపన్ రారే !

    రిప్లయితొలగించండి
  4. సారవిహీనమయ్యు సుఖసార విరాజితమట్లు దోచు సం
    సార మహాసముద్రమున జ్ఞానము కోల్పడి మున్గి తేలుచున్
    బారము జేరలేక పలు బాధలనొందుచు నున్న వారికిన్
    దారక మంత్రమే గతి సదా యొనరింతు జపమ్ము నవ్విధిన్

    రిప్లయితొలగించండి
  5. అమ్మా! శ్రీమతి ప్రభల రామలక్ష్మి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో 3, 4 పాదములను ఇలాగ మార్చుదాము:

    నీరము గ్రోలుచున్ జపము నిత్యమొనర్చుచు మల్లనాఖ్యుడా
    దరమున రక్ష నొందె గద తావక మంత్రముచే పరాత్పరా!

    రిప్లయితొలగించండి
  6. తారక మంత్రపు పఠనము
    పారము నిక జేయు మనల భవముల నుండిన్
    పారా యణ మహి మమయది
    పారాయణ జేయు మార్య ! ప్రతి దిన మందున్ .

    రిప్లయితొలగించండి





  7. తారకమంత్రము మనమున
    గోరిన వెంటనె దొరకెను కూరిమి వెలయన్
    శ్రీరమణుని కృప మోక్ష
    ద్వారము తెరచుకొని జన్మ తరియింపంగన్.

    రిప్లయితొలగించండి
  8. బోయడు పల్కగ మంత్రము
    వ్రాయగ రామాయణంబు వరముల నందెన్!
    రాయై పల్కగ మంత్రము
    స్త్రీయై పాదమ్ము సోక దీవెన లందెన్!

    రిప్లయితొలగించండి
  9. దివిజులఁ బ్రోచిన రామా!
    భువిలో దశరథసుతునిగ పుట్టిన రామా!
    హవనముఁ గాచిన రామా!
    దవమున రక్కసినిఁ దునుమి తనరెడు రామా!

    శిల సతిఁ జేసిన రామా!
    మలహరు చాపము విరిచిన బలయుత రామా!
    ఇలసుత నేలిన రామా!
    అల భార్గవరాముని దుడుకడచిన రామా!

    పితృవాక్పాలక రామా!
    శ్రితమునినుత వననివాస శ్రీరఘురామా!
    హతఖరదూషణ రామా!
    జితమతి పరదారవిముఖ సీతారామా!

    సీతాన్వేషక రామా!
    భాతసుతవయస్య పతితపావన రామా!
    వాతాత్మజనుత రామా!
    పూతక్రతునందనుఁ బొరిపుచ్చిన రామా!

    శరనిధి దాటిన రామా!
    శరమున దశముఖునిఁ దునిమి చను శ్రీరామా!
    శరణార్థి గాచు రామా!
    ధరణిజపతి ధర్మమూర్తి తారకనామా!

    రిప్లయితొలగించండి
  10. వారికి శాశ్వతంబగు శుభంబులు, సంతతసౌఖ్యసంపదల్
    వారికి ధర్మజీవనము, వైభవదీప్తియు, మోక్షసిద్ధి యె
    వ్వారలు సర్వకాలముల పాపవినాశినియౌచు వెల్గు యీ
    తారకమంత్రరాజమును తప్పక భక్తి జపింతురెల్లెడన్.

    రిప్లయితొలగించండి
  11. పండిత శ్రీనేమాని గురువులకు నమస్సులతో
    శ్రీరఘు రామచంద్ర పద సేవయె జీవన సారమంచు నె
    వ్వారల కైన నా పరమ పావన మూర్తియె రక్షయంచు మ
    ద్భారము మ్రోయగన్ పరమ భాగవతోత్తముడాంజనేయునిన్
    చేరగ వేడెదన్ హృదయ సీమల నిల్పగ రాఘవేంద్రునిన్.

    రిప్లయితొలగించండి
  12. అయ్యా! శ్రీ హరి వారూ! శుభాశీస్సులు.
    బహుకాల దర్శనము.
    మీ పద్యములో వెల్గు + ఈ అనుచోట = వెల్గునీ అని నుగాగమము చేయవలెను కదా. వెల్గు యీ అని యడాగమము చేసేరు. పద్యము మొత్తము మీద ఎక్కడా "ప్రాప్తించును" అనే అన్వయము ఇచ్చే పదము కనుపించుట లేదు. పరిశీలించండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. భారము భువికే పాపులు
    సారము గ్రహియించి మదిని సాధన జేయన్ !
    మారణ హోమము వీడిన
    తారక మంత్రమును మించి తరుణము గలదే ?

    రిప్లయితొలగించండి
  14. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
    కాంగ్రేస్ పెద్దలకు సోనియా నామమే తారక నామమ్ము
    =====*=======
    తారక మంత్రము నిత్యము
    పౌరులు బలుకుచు నిలుచును పరదేశిని క
    ర్పూరపు హారతు లిడుచున్
    వారికి గల్గును విడువని పదవీ యోగం

    రిప్లయితొలగించండి

  15. ఆర్యా! నమస్కారములు. మీరు గతంలో కూడా ఒకటి రెండుసార్లు నుగాగమ, యడాగమాల విషయంలో హెచ్చరించారు. ఎప్పటికప్పుడే పొరపాటు జరుగుతున్నది. క్షమించ ప్రార్థన. తరువాత "మోక్షసిద్ధి" అన్నప్పుడు "సిద్ధి” అనే పదంతో అన్వయం సరిపోతుందని భావించాను. మీ సూచన వల్ల సరిపోలేదని గ్రహించాను ఇలా మారుస్తున్నాను.

    వారికి శాశ్వతంబగు శుభంబులు, సంతతసౌఖ్యసంపదల్
    వారికి ధర్మజీవనము, వైభవ మాదట మోక్షమబ్బు నె
    వ్వారలు సర్వకాలముల పాపవినాశినియౌచు వెల్గు నీ
    తారకమంత్రరాజమును తప్పక భక్తి జపింతురెల్లెడన్.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ రఘురామ నీ చరణ శ్రీకర యుగ్మము మానవాళికిన్

    నేరుగ త్రోవ ముక్తికిని! నీ కృప దాట భవాబ్ది నావ యౌ!

    తారక నామ మౌ దురిత తాపము బాపెడు మందు! దీనినిన్

    నేరని వారి కేది గతి నిత్యము పుట్టుటొ చచ్చుటో గదా .

    రిప్లయితొలగించండి
  17. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
    ప్రణామములు!

    ఏ మంత్రరాజంబు శ్రీ మానినీ చిత్త
    ............. రాజీవపంజర రాజహంసి
    ఏ మంత్రరాజంబు వామదేవమునీంద్ర
    ............. హృద్ధ్యానగమ్యమౌ నిద్ధపదవి
    ఏ మంత్రరాజంబు కామసందోహని
    ............. ర్మూలకాలానలకీల రీతి
    ఏ మంత్రరాజంబు శ్రీమత్ప్రభాసచ్చి
    ............. దానందకందైకతానఫణితి

    తారకబ్రహ్మరాజీయతత్త్వచింత
    నా రహస్యశ్రుతిశిరోధిసారమైన
    మంత్రరాజ మది! రఘురామ సుగుణాభి
    రామ శ్రీరామ దివ్యనామామృతంబు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  18. శబరి తారకమంత్రము శక్తి కొలది
    చేసి చూసెను రాముని చోద్యముగను
    మహిని రాముని నామముమనుజునకును
    భారమంతయు బాపెడి బంధువేగ.
    ...తోపెల్ల శ్రీతేజ.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ గురువులకు ప్రణామములు!
    మీ సూచనతో ఇలా మారుస్తున్నాను.

    శ్రీ రఘురామ నీతలపు శ్రీకరమౌగద మానవాళికిన్
    భారము బాపు దీనజన బంధువువీవని మాటిమాటికిన్
    నీరము గ్రోలుచున్ జపము నిత్యమొనర్చుచు మల్లనాఖ్యుడా
    దరమున రక్ష నొందె గద తారక మంత్రముచే పరాత్పరా!

    శ్రీమతి ప్రభల రామలక్ష్మి

    రిప్లయితొలగించండి
  20. తారకనామము చేయుచు
    తారకరాముని పిలిచెను తాపసులంతా
    భారము బాపగ రమ్మన
    కోరిక నెరవేర్చవచ్చె కూరిమి తోడన్.

    రిప్లయితొలగించండి
  21. తారకనామము చేయుచు
    తారకరాముని పిలిచెను తాపసులంతా
    భారము బాపగ రమ్మన
    కోరిక నెరవేర్చవచ్చె కూరిమి తోడన్.

    రిప్లయితొలగించండి
  22. ఈరోజు కేవలం నా అభ్యాసంకోసం - పెద్దల పద్యాలకు చిన్ని చిన్ని సవరణలు చేశాను, శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి క్షమార్పణలతోనూ, పెద్దలు సహృదయంతో స్వీకరింపగలనే విశ్వాసంతోనూ -

    శ్రీమతి లక్ష్మీదేవి గారు -
    తారక మంత్రమున్ బడసి ధన్యతఁ గాంచిన రామదాసు, తా
    నేరక జేసినట్టి పలు నేరము లెంచక తన్నుఁ గావఁగా
    శ్రీరఘురామునిన్ దలఁచి పాడెనహో, జన మెల్ల మెచ్చుచున్
    ధారణ జేసి నేఁటికిని ధాత్రినిఁ గీర్తినిఁ బెంపుఁ జేయఁగా.

    శ్రీమతి ప్రభల రామలక్ష్మి గారు –
    (శ్రీ నేమాని వారి సవరణ ఆధారంగా)
    శ్రీ రఘురామ! నీ తలఁపు శ్రీకరమౌ గద మానవాళికిన్
    భారము బాపు దీనజనబంధుఁడ వీవని భక్తిపెంపునన్
    నీరముఁ గ్రోలుచున్ జపము నిత్య మొనర్చుచు మల్లనాఖ్యుఁ డా
    ధారముఁ గాంచి రక్షఁ గనెఁ దావకమంత్రముచేఁ బరాత్పరా!

    శ్రీ సుబ్బారావు గారు –
    తారక మంత్రపుఁ బఠనము
    పారముఁ గూర్చును భవార్ణవనిమగ్నుల; కా
    పారాయణమహిమం బది;
    పారాయణ జేయు మార్య ! ప్రతిదిన మందున్ .

    శ్రీ కమనీయం గారు –
    తారకమంత్రము మనమునఁ
    గోరిన వెంటనె దొరకెను కూరిమి వెలయన్
    శ్రీరమణుని కృప మోక్ష
    ద్వారము తెఱచుకొని జన్మ తరియింపంగన్.

    శ్రీ సహదేవుడు గారు –
    బోయఁడు పల్కుచు మంత్రము
    వ్రాయఁగ రామాయణంబు వరమును గాంచెన్!
    ఱాయియు రామపదంబున
    స్త్రీయై జీవింపనోఁచి దీవెన లందెన్!

    శ్రీ వి.యస్.యన్.యమ్. హరి గారికి –
    వారికి శాశ్వతంబుగ శుభంబులు, సంతతసౌఖ్యసంపదల్
    వారికి ధర్మజీవనము, వైభవ, మాదట మోక్షమబ్బు నె
    వ్వారలు సర్వకాలముల పాపవినాశినియౌచు వెల్గు శ్రీ
    తారకమంత్రరాజమును తప్పక భక్తి జపింతు రెల్లెడన్.

    శ్రీమతి నేదునూరి రాజేశ్వరి గారు –
    భారము పాపులు భువి; కీ
    సారము గ్రహియించి మదిని సాధన జేయన్ !
    మారణ హోమము వీడఁగఁ
    దారక మంత్రమును మించి తరుణము గలదే ?

    శ్రీ మిస్సన్న గారు –
    శ్రీ రఘురామ! నీ పదకుశేశయయుగ్మము మానవాళికిన్
    నేరుగ ముక్తి త్రోవ; భవనీరధిఁ నీ కృప నౌక దాఁటెదన్;
    తారకనామమే దురితతాపముఁ బాపెడు మందు! దీనినిన్
    నేరని వారి కేది గతి? నిత్యముఁ బుట్టుట, చచ్చుటే గదా.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  23. చి. డా. ఏల్చూరి మురళీధర రావు గారికి శుభాశీస్సులు.
    మీరు చక్కని పద్యమును "రామ తారకముగా" అందించేరు. శుభాభినందనలు. అలాగే మిత్రులు కొందరి పద్యములు సవరించి వానికి మంచి వన్నెలు గూర్చేరు. చాలా సంతోషము. స్వస్తి

    రిప్లయితొలగించండి
  24. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న హైదరాబాద్ వెళ్ళి వచ్చిన కారణంగా పూరణలను, పద్యాలను సమీక్షించే అవకాశం లేకపోయింది. మన్నించడి.
    తారక మంత్రం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ చక్కని పద్యాలను రచించిన......
    లక్ష్మీదేవి గారికి,
    డా. ప్రభల రామలక్ష్మి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    కమనీయం గారికి,
    సహదేవుడు గారికి,
    ఫణిప్రసన్న కుమార్ గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    వరప్రసాద్ గారికి,
    మిస్సన్న గారికి,
    ఏల్చూరి మురళీధర రావు గారికి,
    చి. తోపెల్ల శ్రీతేజకు,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    ఏల్చూరి వారూ,
    మిత్రుల పద్యాలకు సవరణలను సూచించి నాకు మహోపకారం చేసారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. డా. ఏల్చూరి వారికి కృతజ్ఞతలు.
    నా తారక రాముని సుందరంగా మలచారు.

    రిప్లయితొలగించండి