6, ఏప్రిల్ 2013, శనివారం

సమస్యాపూరణం – 1015 (ధ్వని చేతన్ రసభంగమౌను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ధ్వని చేతన్ రసభంగమౌను పరమార్థం బెల్ల వ్యర్థం బగున్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

34 కామెంట్‌లు:

 1. ధ్వనిచేతన్ రసభంగమౌను పరమార్థంబెల్ల వ్యర్థంబగున్
  మునివృత్తిన్ గొని చేయగానిట తపంబున్ కాదు సాధ్యంబు ని
  ర్జనమౌ వేరొక సీమ కేగెద నవశ్యంబంచు భావించుచున్
  జని యోగీంద్రుడొకండు చేరె హిమవఛ్ఛైలంబు నత్యాదృతిన్

  రిప్లయితొలగించండి
 2. మనమున్ లగ్నము జేసి మాధవునిపై మౌనమ్ముగా ప్రార్థనం
  బనువౌ వేళను సల్పవచ్చు పెరవా రమ్మో యనన్ నిత్యమున్
  ధ్వని యంత్రమ్ముల పాటలన్, భజనలన్ దండించుటల్ భక్తియే?
  ధ్వనిచేతన్ రసభంగమౌను పరమార్థంబెల్ల వ్యర్థంబగున్.

  రిప్లయితొలగించండి
 3. స రస ధ్వని జేసిన శ్రీ నేమాని వారికి, శ్రీ మిస్సన్న గారికి అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. పెద్దలిరువురూ రమ్యమైన పూరణలఁ జేసినారు. కానీ చిన్న సందేహము. అధిక ప్రసంగమైనచో మన్నించగలరు.
  ఇంద్రియములచేతనే రసాస్వాదన,రసభంగము కలిగే అవకాశము ఉంటుంది. మరి ఇంద్రియములను నియంత్రించి చేయదగిన ధ్యానాదులలో(రసాస్వాదన లేనప్పుడు) "రస"భంగము జరిగే అవకాశమెట్లు?
  సమస్యలో నా సమస్య... పరమార్థసాధన లో రసభంగానికి అవకాశమేమున్నదో యని.

  రిప్లయితొలగించండి
 5. ఇక్కడ పరమార్థం అంటే Purpose అనే అర్థం తీసుకొంటే సమస్య అర్థవంతంగా ఉంటుందని నా భావన.

  రిప్లయితొలగించండి
 6. జనసమ్మోహన శక్తి చేత, వినగా సంగీతమెల్లప్పుడున్,
  విని యాస్వాదనఁజేయగల్గినను వెన్వెంటన్ ధ్వనుల్ పెచ్చుమీ
  రినచో భక్తినిఁ బాడు గీతమయినన్, రెట్టింపు గానున్నచో
  ధ్వని చేతన్ రసభంగమౌను పరమార్థం బెల్ల వ్యర్థం బగున్.

  రిప్లయితొలగించండి
 7. లక్ష్మీదేవి గారికి నమస్సులు. శ్రీచంద్రశేఖర్ గారు నుడివినట్లు ఏ ఉద్దేశ్యముకొరకై తా చేయు పని మధ్యలో భంగమెర్పడునప్పుడు గా తీసికోనినచో సరిపొవచ్చును. మీ భావన ఆధ్యాత్మిక పరముగా గావచ్చును.ఇంద్రియనిగ్రహము చేసినను మనోఫలకముమీద ఇదివరలో ముద్రింపబడిన విషయములప్రభావము స్ఫురణకు తగులుచు ఏకాగ్రతాభంగము చేయు అవకాశముగలదుగదా! ఇక్కడ ధ్వని అనగా కారణముగా కూడ తీసికోనవచ్చునేమో! పెద్దలు మీకు చెప్పదగినంటటి వాడను గాను. ఇది నా అభిప్రాయముగా గ్రహించగలరు

  రిప్లయితొలగించండి
 8. వనమున్ఁ సొచ్చి ముముక్షువై సకలసంభావానుతర్షంబులన్
  మనమందున్ విడనాడి నిశ్చలగతిన్ భస్మాంగునామంబు చిం
  తన చేయందగుకాలమందున సగాత్రంబందు నా కాకలీ
  ధ్వనిచేతన్ రసభంగమౌను పరమార్థం బెల్ల వ్యర్థంబగున్.

  సంభావ+అనుతర్షము = సంభవించే కోరిక
  కాకలీధ్వని = కోకిలధ్వని

  రిప్లయితొలగించండి
 9. ధ్వనిచేతన్ రసభంగమౌను పరమార్థంబెల్ల వ్యర్థంబగున్
  మునివృత్తిన్ గొనియున్నవాడ కనుకన్ మూర్ఖాగ్రణుల్! పొండు మీ
  రనయం బిచ్చట గోలసేయకుడురా! యంచాడువాడేవిధిన్
  ముని కానేరడు, ధీరతన్ గనడికన్ మోదింపలేడెప్పుడున్.

  రిప్లయితొలగించండి
 10. ఘనులౌ చోరుల బట్టువేళ, సుఖముల్ కాంక్షించి సంఘంబునన్
  ధనరాశుల్ భుజియించువారి నిలలో దండించు సత్కార్యమం
  దనయంబున్ విధిగా రహస్యమె తగున్, హర్షంబు చేకూర్చెడున్
  ధ్వనిచేతన్ రసభంగమౌను పరమార్థంబెల్ల వ్యర్థంబగున్.

  రిప్లయితొలగించండి
 11. నిను సేవించదలంచి నామనసులో నీమూర్తినిర్మించితిన్
  మనసేచంచలమై నటున్నిటులుగామారాముజేసెన్ గదా
  యినవంశోత్తమ నెందుబోగలనునిన్నేరీతి ధ్యానింతు, సెల్
  ధ్వనిచేతన్ రసభంగమౌను పరమార్థంబెల్ల వ్యర్థంబగున్!!!

  రిప్లయితొలగించండి
 12. అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
  "రసము" అనే పదమునకు అనేకమైన అర్థములు నిఘంటువులో కలవు. రసము అంటే తారా స్థాయి లోని ఆనందము అని మీ భావము. రసము అంటే పరమాత్మ అనే అర్థము కూడా ఉన్నది. రసము అంటే సారము (ప్రయోజనము) అనే అర్థములో నేను నింపేను. మీరు చక్కగా మరికొన్ని అర్థములను గుర్తు చేసినందులకు చాల సంతోషము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 13. శ్రీమతి లక్ష్మీదేవి గారికి
  నమస్కారాలు!

  అనశ్వరమై, ఇంద్రియాతీతమైన పరవస్తువును నశ్వరములైన ఇంద్రియాలతో కనుగొనటం సాధ్యమేనా? అని మీరడిగిన ప్రశ్న చాలా విలువైనది. క్లిష్టమైన ఈ సమస్యకు పరిష్కారాన్ని తత్త్వవేత్తలలో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరున బోధించారు.

  నేను మీకు వివరిస్తున్నది అద్వైతశాస్త్రంలో ఉన్న ప్రకారం -

  ధ్యానం సగుణధ్యానమని, నిర్గుణధ్యానమని రెండు విధాలు. హృదయపద్మంలో తటస్థలక్షణస్వరూపుడయి విరాట్పురుషుని నిలిపి, మనస్సుచేత సమస్తవస్తువులను కల్పించి, ఆ బ్రహ్మమును షోడశోపచారాలతో ధ్యానించటం సగుణధ్యానం. పద్మాసనంలో ఉండి, శరీరాన్ని నిక్కించి, తొడలపై చేతులనుంచి, కన్నులను మూసికొని “ఈ iస్థూలశరీరం – ఈ సూక్ష్మశరీరం - కారణశరీరం; సకలేంద్రియాలు (మనస్సు); దశవిధప్రాణాలు; బాహ్యగోచరములైనవి, అంతర్దృష్టితో చూడదగినవి అయిన సమస్తదృశ్యాలు - ఆ దేహేంద్రియప్రాణాలు ఏవీ నేను కాను - నేను వీక్షించే సాక్షిని మాత్రమే” అని సాధన చేయాలి. "సాక్షిని నేను" అనే వృత్తికూడా దృశ్యమే కనుక ఆ వృత్తిని చూచే సాక్షిని మాత్రమే నేను - అని అనుకొంటూ, చివఱికి మాయాకల్పితాలై, విజాతీయాలైన (యుష్మత్ ప్రతీతి ప్రత్యయగోచరాదులనే) బహిర్దృశ్యాలను; సజాతీయాలైన (అస్మత్ ప్రతీతి ప్రత్యయగోచరాదులైన) అంతర్దృశ్యాలను; ఆ దృశ్యాలకు సాక్షిని నేను అనే ఆ వృత్తిని కూడా అభ్యాసవశాన నిషేధించటం నేర్చుకొని, సత్యజ్ఞానానందము, నిర్మలము, అఖండస్వరూపము అయి, సమస్తాన్ని చూచే ఆ పరబ్రహ్మమును నేనే అనే గుర్తింపు కలిగేదాకా ఎల్లప్పుడు నిర్వికల్పబ్రహ్మనిష్ఠను కలిగి ఉండటమే నిర్గుణధ్యానం.

  ఈ వృత్తినిషేధాన్నే కవులు, వేదాంతులు "ఆత్మావలోకనం" అన్నారు. అది ఇంద్రియాతీతమైన అనుభవం కనుక దానిని 1) శుద్ధము 2) బుద్ధము 3) ముక్తము 4) కేవలము 5) అఖండము 6) సత్ 7) చిత్ 8) ఆనందస్వరూపము అని బ్రహ్మసూత్రభాష్యంలో శ్రీ శంకరాచార్యులవారు అన్నారు.

  ఇతర శాస్త్రకారులు ఇదే విషయాన్ని తమతమ పరిభాషలో వివరించారు. తటస్థభావం వల్ల ఇంద్రియాతీతము ఇంద్రియానుగతం కాగలదని తాత్పర్యం. దీనినే “స్వస్వరూపానుసంధానం” (పరవస్తువుతో ఆత్మానుసంధానం) అని శ్రీ శంకరులవారు భక్తిశాస్త్రనిరూపణలో అన్నారు.

  భక్తివల్ల కలిగే క్రమప్రథ ఇంద్రియాలకు గోచరింపని పరవస్తువును అనుభవగోచరం చేయగలదని తాత్పర్యం.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 14. కనులన్ మూయుచు కౌగిలించె శివునిన్, కందర్ప బాణంబుచే
  మనమున్ జిక్కినొ శైలజాత్మకుననన్ మాధుర్యమౌ వేళలో
  ఘన కార్యంబును జేయ నగ్ని పులుగై గానంబు సల్పంగ నా
  ధ్వని చేతన్ రసభంగమౌను పరమార్థం బెల్ల వ్యర్థం బగున్!

  రిప్లయితొలగించండి
 15. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
  నమస్కారములు!

  మును రక్షోధిపుఁ “డింద్ర”-శ’త్రునకు నిర్మోకంబు సంధిల్ల వే
  ల్మినిఁ గావించుచు నింద్ర-“శత్రుఁ”డని వేల్చెన్; దానిచేఁ దాన హా
  నినిఁ జెందెన్; పద ముచ్చరించు తఱి భ్రాంతిం జెందినన్ దత్కృత
  ధ్వనిచేఁతన్ రసభంగమౌను; పరమార్థం బెల్ల వ్యర్థం బగున్.

  మఱొకటి:

  అనుమోదింప సహృత్కవీంద్రతతి కావ్యార్థప్రకాశంబు వ్యం
  జనచే నౌచితిఁ గాంచి రీతిగుణవచ్ఛయ్యాపాకవృత్తుల్ దమం
  తన నొప్పారఁ గృతార్థమై వినుతిఁ జెందన్; గూఢనేయార్థభా
  గ్ధ్వనిచేతన్ రసభంగమౌను, పరమార్థం బెల్ల వ్యర్థం బగున్.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 16. పండిత నేమాని వారూ,
  ధ్వనికాలుష్యం వల్ల ఏకాగ్రత చిక్కని యోగీంద్రుడు విషయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మైకుల గోలకు సంబంధించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  అరిచి గోలపెట్టినట్లుండే భజనలను గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మీ సందేహానికి సవిరణాత్మక సమాధానాలు మిత్రుల నుండి లభించాయి కదా! సంతోషం!
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘వనమున్ + చొచ్చి’ అన్నపుడు గసడదవాదేశం లేదు. ‘వనమున్ జొచ్చి’ అని సరళాదేశం అవుతుంది.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ ‘సెల్’ధ్వని పూరణ బాగుంది. అభినందనలు.
  ‘ఇనవంశోత్తమ + ఎందు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
  *
  ఏల్చూరి మురళీధర రావు గారూ,
  జ్ఞానదాయకమైన మీ వివరణకు ధన్యవాదాలు.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. ఏల్చూరి మురళీధర రావు గారూ,
  మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 18. వినవిందౌనని పోయి చూచితిమి మా వీటన్,మహాగాయకుం
  డని పేరొందిన వాని గానము వినన్నత్యుక్స్తుతన్నచ్చటన్
  జనసందోహపు కేకలీలలును నా జంత్రంపు నానాయప
  ధ్వనిచేతన్ రసభంగమాయె , పరమార్థంబెల్ల వ్యర్థంబయెన్.

  రిప్లయితొలగించండి
 19. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
  ఘన ధీయుక్తిని రాచకార్యములు సాకారంబు సేయందగన్
  ఘన కీర్తిన్ బడయన్ నిబద్ధతకు నిక్కాలంబు వీరే యనన్
  జన సామాన్యులు మెచ్చ మంతిరిని, మాత్సర్యంబుతో నన్యులా
  తని చేరంగను చేవజాలక సదా దాష్టీకపుం వ్యంగ్యపుం
  ధ్వని చేతన్ రసభంగమౌను పరమార్థం బెల్ల వ్యర్థం బగున్

  రిప్లయితొలగించండి
 20. కమనీయం గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  రెండవ పాదాన్ని ఇలా సవరించాను.
  ’అని పేరొందిన వాని పాట వినగా నాసక్తితో నచ్చటన్’
  *
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘మెచ్చ మంతిరిని’ అన్నదానిని ‘మెచ్చ మంత్రులను’ అందామా?

  రిప్లయితొలగించండి
 21. కననీవేళ వరంబుగానమరె నేకాంతమ్ము, మోదమ్ముతో
  విన నీగానము కోర్కెగల్గె సఖియా విన్పింపవా యనన్
  కనులింతింతగ చేసిచూసి పలికెన్ కవ్వింపుతో భర్తతో
  ధ్వని చేతన్ రసభంగమౌను పరమార్థంబెల్ల వ్యర్థంబగున్

  రిప్లయితొలగించండి
 22. పింగళి శశిధర్ గారూ,
  ‘చేతల సమయంలో కూతలెందుకు?’ అన్నట్టు చమత్కారభరితమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  రెండవ పాదంలో ‘విన్పింపవా యనన్’ అన్నచోట గణదోషం. బహుశా ‘విన్పింపవా యంచనన్’ అన్నదానికి టైపాటు అనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 23. మునినాథుండు వనమ్ము జేరి తపమున్ భూతేశ్వరున్ గొల్వగా
  దన సిం హాసన భ్రష్టభ్రాంతి రతుడౌ దైత్యారియున్ బంపునన్
  జనుదెంచా సుర నర్తకీమణులకున్ సాయమ్మె పుష్పాసన
  ధ్వని చేతన్ రసభంగమౌను పరమార్థం బెల్ల వ్యర్థం బగున్.

  రిప్లయితొలగించండి
 24. తమ్ముడు చి. డా. నరసింహమూర్తి పద్యమును చిన్న చిన్న సవరణలతో:

  మునినాథుండు తపమ్మొనర్చుచు వనిన్ భూతేశ్వరున్ గొల్వగా
  దన సింహాసన భ్రష్ట భ్రాంతిమతియౌ దైత్యారి బంపన్ వెసన్
  జను స్వర్వేశ్యలకున్ సహాయపడు కంజాతాస్త్రు శస్త్రోదిత
  ధ్వని చేతన్ రసభంగమౌను పరమార్థంబెల్ల వ్యర్థంబగున్

  రిప్లయితొలగించండి
 25. డా. ఏల్చూరి మురళీధర రావు గారి పద్యములు తత్త్వ వ్యాఖ్యలు సర్వదా ప్రశంసనీయములే. బ్లాగు మిత్రులందరకు సుబోధకములే. ఈనాటి సమస్య 2వ పద్యము 2వ పాదములో యతి స్థానము దగ్గర 1 గురువు ఎక్కువగ నున్నది. సరిచేయవలసి యున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 26. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరన బాగుంది. అభినందనలు.
  నేమాని సవరణతో మీ పద్యం సర్వాంగశోభితమయింది. సంతోషం!

  రిప్లయితొలగించండి
 27. అన్నయ్యగారికి,గురువు గారికి నమస్సులు, ధన్యవాదములు, అన్నయ్యగారి సవరణలతో పద్యము చాలా బాగుంది .

  రిప్లయితొలగించండి
 28. గురువుగారూ ధన్యవాదాలు.
  లక్ష్మీ దేవి గారి సందేహం, దానికి
  డా. ఏల్చూరి వారి అమూల్యమైన వివరణ,
  వారి పూరణలు ప్రశంసనీయం.

  శశిధర్ గారి పూరణ మనోహరంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 29. శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి మొదటి పూరణలో నింద్రశత్రువు బలి చక్రవర్తి అని భావిస్తున్నాను. కాని కధ నాకు తెలియదు. వారి రెండవ పూరణకు వివరణ నిస్తే బాగుంటుంది.ఆయన చేసిన తత్వబోధనను పదిలముగా దాచుకొంటాను.
  నిర్మోకము నకు అర్ధాలు తెలిసాయి, ఆకాసము ( నాకము ) విడుపు, కుబుసము అని

  అన్నగారి వలన స్వర్వేశ్యలు , క్రొత్త పదము తెలుసుకొన్నాను.

  రిప్లయితొలగించండి
 30. గురువుగారికి ధన్యవాదములు.
  నా సందేహం మీద స్పందించిన మిత్రులు, పెద్దలందరికీ ధన్యవాదములు,
  నమస్కారములు తెలుపుకుంటున్నాను.
  శ్రీ మురళీధరరావు గారికి
  నమస్కారములు.
  అద్వైత శాస్త్రప్రకారం తమరు చెప్పినది మాత్రమే నా బుద్ధిలో ఉండడం వల్ల నాకు సందేహము కలిగినది.
  శ్రీ శంకరుల వారి భక్తిశాస్త్రనిరూపణం గురించి నేను వినియుండలేదు. ప్రత్యేకంగా వినకపోయినప్పటికీ సాధారణంగా భాగవతుల చరిత్రలో మనకు కనిపిస్తున్నది అదే అయి ఉంటుందని ఇప్పుడనిపిస్తున్నది.
  మీకు అనేక ధన్యవాదములు.
  మీ రెండు పూరణలూ ఎప్పటిలాగే అపురూపంగా ఉన్నాయి.
  రెండవపూరణ ఎంతో నచ్చినది. మొదటిపూరణలోని పదముల ఉచ్ఛారణ దోషాల వల్ల జరిగే అనర్థం గురించిన ఉదంతం దయతో విస్తారంగా తెలియజేయగలిగితే అందరికీ ఉపకారం అవుతుంది.

  రిప్లయితొలగించండి
 31. వినసొంపైన గళమ్ముతో ప్రభువ! రావే!కావవే? నీ దయా
  గుణమేమాయెయటంచు గానముననాగోపాల కృష్ణయ్యకే
  ఘన నీరాజన మందజేయ విన నాగాత్రంబునన్ దొషమౌ
  ధ్వని చేతన్ రస భంగమౌను పరమార్థంబెల్ల వ్యర్థంబగున్!

  రిప్లయితొలగించండి
 32. ఘనులౌ తస్కర వీరులే తమమునన్ కంగారు లేకుండయే
  చనుచున్ కోవెల నందునన్ మురియుచున్ చౌర్యమ్ముకై మూర్తినిన్
  మొనగాళ్ళంచును కొల్లగొట్ట తఱినిన్ పోలీసుదౌ యీలలన్
  ధ్వని చేతన్ రసభంగమౌను పరమార్థం బెల్ల వ్యర్థం బగున్

  రిప్లయితొలగించండి