8, ఏప్రిల్ 2013, సోమవారం

పద్య రచన – 305 (జనన మరణములు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“జనన మరణములు”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

13 కామెంట్‌లు:

 1. కన్ను తెరిచిన జననమ్ము కనును అమ్మ
  కన్ను మూసిన మరణమ్ము కనెదరొరులు
  మనకు తెలియదు రెండును, మధ్య లోన
  కనుచు బ్రతుకును దిద్దుకో ఘనము గాను.

  రిప్లయితొలగించండి
 2. జనించు వారలెల్ల పృథ్విఁ జావకుండనున్నచో
  గణింప సాధ్యమౌనె, భూమి కాంత భారమెన్నడున్?
  జనించు బాధ, మృత్యుబాధ- సంధికాల బాధలున్
  మునీంద్రునైన వీడునే? యభూత కల్పనల్ కదా?

  రిప్లయితొలగించండి

 3. జననము మరణము లయ్యవి
  అనయము మఱి వచ్చు చుండు నాశా జీ వీ !
  మనమున శంభుని దలచిన
  జననములే యుండ కపుడు సాకల్య మె యౌన్ .

  రిప్లయితొలగించండి
 4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘కనును + అమ్మ’ అన్నప్పుడు సంధి జరగాలి కదా! ‘కనును తల్లి’ అందాం.
  *
  లక్ష్మీదేవి గారూ,
  అద్భుతమైన పద్యం వ్రాసారు. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. ( జాతస్య హి ధ్రువో మృత్యు: ధ్రువం జన్మ మృతస్యచ: .....)

  గిట్టిన వానికి జననము
  పుట్టిన వానికి మరణము పొలుచును ; పవనుం
  డెట్టుల తావిని మోయునొ
  యట్టుల వాసనలు గల్గు నాత్మకు నెపుడున్.

  రిప్లయితొలగించండి
 6. ఊపి రాడె నేని యూసులు బోలెడు
  యూపి రాడ కున్న నులుకు లేక
  జనన మరణ చక్ర ఝంజాట ముండును
  హరిని నమ్మి కొలువ నాగు జన్మ

  రిప్లయితొలగించండి
 7. ఊపి రాడె నేని యూసులు బోలెడు
  యూపి రాడ కున్న నులుకు లేక
  జనన మరణ చక్ర ఝంజాట ముండును
  హరిని నమ్మి కొలువ నాగు జన్మ

  రిప్లయితొలగించండి
 8. జననము మరణము సహజము
  మనుజులకున్ ప్రాణులకును మహిలో నెపుడున్
  ఘనదు:ఖమేల? మృతుగని
  యనుచితమది బ్రతుకు కాంక్ష యనవరతంబున్.

  ధనమదము కూడ దెందును
  మనుజున కెప్పుడును జూడ, మరణమునందున్
  జననంబందున సంపద
  తనతో కనిపించబోదు ధరనెవ్వరికిన్

  పుత్రుని జననం బందున
  నాత్రుతనుత్సవముజేయు నతి హర్షమునన్
  గాత్రంబు వణకుచుండును
  చిత్రముగా మరణమందు సిద్ధము భువిలో

  పుట్టిన ప్రతిమానవుడును
  పట్టినదంతయును మేలి బంగారముగా
  నెట్టైన మార్చదలచును
  కట్టా! తానుండగలడె కలకాలమిలన్.

  జననము శుభమని యెంచును
  తనవారల మరణమన్న తగనిదిగా తా
  ననయంబు తలచుచుండును
  మనుజుడు కారకుడె జనన మరణంబులకున్.

  రిప్లయితొలగించండి
 9. మాస్టరు గారూ ! దోష సవరణకు ధన్యవాదములు.

  కన్ను తెరిచిన జననమ్ము కనును తల్లి
  కన్ను మూసిన మరణమ్ము కనెదరొరులు
  మనకు తెలియదు రెండును, మధ్య లోన
  కనుచు బ్రతుకును దిద్దుకో ఘనము గాను.

  రిప్లయితొలగించండి
 10. జననమరణ చక్రమ్మది
  యనవరతము దిరుగుచుండు నాగదు మనకై
  జననము సార్థక మొనరిచి,
  చనిపోవుటమేలు ,తగిన సమయము నందున్.

  రిప్లయితొలగించండి
 11. శ్రీనేమాని పండితులకు, శ్రీ ఏల్చూరి మహోదయులకు శ్రీశంకారార్యులకు మిత్రులకు ప్రణామములతో శంకరాభరణ బ్లాగు పాఠశాలకు ఒక దినమైనా సెలవు ప్రకటింప రాదనెడి సంకల్పముతో, పంచాయితీ ఎన్నికల ప్రారంభసన్నాహ ముమ్మర కార్యక్రమున ఉన్ననూ శ్రీశంకరార్య గురువుల పరోక్షమున ఈ సాహసము చేయుచున్నాను. గుణములన్నియూ పెద్దల ఆశీస్సులు. దోషములన్నియూ నావిగా భావించి మన్నింప ప్రార్థన.
  బుధజనవిధేయుడు,
  మీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.
  నాగరాజు రవీందర్ గారూ! వాసనారహిత స్థితిని జేరినగదా ముక్తి. చాల బాగ చెప్పారు. అభినందనలు
  సహదేవుడుగారూ! ఊసు పలుకు లతో శ్రీహరినామస్మరణ ద్వారా జన్మరాహిత్యం పొందవచ్చునని చాల చక్కగా చెప్పారు. అభినందనలు. బోలెడు యూపిరాడక అని యడాగమంచేసారు. ఉత్త్వంపై యడాగమం రాబోదు. బోలెడు నూపిరాడక అనవచ్చుననుకుంటాను. ఝంజాట ముండును కన్నా ఝంజాట మందున అన్న ఇంకా బాగుండునేమో ఆలోచించండి.
  హరి మూర్తి గారూ! ఆహా! ఏమి మీ కంద పంచకం. చాల బాగున్నవి. ప్రత్యేక పద్యాభివందనములు.
  హనుమచ్ఛాస్త్రిగారూ! సవరించిన మీ పద్యం ఒక సినిమా భాషణ గుర్తుకు వస్తోంది. బహుశః ప్రచూరి బ్రదర్స్ అనుకుంటా. “ కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం. రెప్పపాటు కాలం జీవితం”. దీన్ని జ్ఞ్జాపకం చేస్తూ చెప్పిన మీపద్యం హృద్యంగా ఉంది. మిక్కిలి అభినందనలు.
  డా. కమనీయంగారూ! జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు. అట్టి మానవ జన్మను సార్థకంచేసికుని వెళ్ళుట ఉత్తమం, వెళ్ళక తప్పదని చాల బాగ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. నిన్న జనన మైన నేడు జీవితమౌను
  పొరలివచ్చురేపు మరణ మౌను
  జనన మరణ గతులు జగదీశు క్రిడయౌ
  వగయతగునెవాటి వశముకొఱకు !!!

  రిప్లయితొలగించండి
 13. గురువుగారికి ధన్యవాదములు. తమరి సూచిత సవరణలతో పద్యం:

  ఊపి రాడె నేని
  యూసులు బోలెడు
  నూపి రాడ కున్న
  నులుకు లేక
  జనన మరణ చక్ర ఝంజాట
  మందున
  హరిని నమ్మి కొలువ
  నాగు జన్మ

  రిప్లయితొలగించండి