14, ఏప్రిల్ 2013, ఆదివారం

పద్య రచన - 311 (వాగ్భూషణము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“వాగ్భూషణము”

17 కామెంట్‌లు:

  1. వాక్కను భూషణ మున్న న
    వాక్కగుదురు జూచు వారు వహ్వాయనుచున్
    చక్కని పలుకుల ముందర
    తక్కిన నగలన్ని గూడ తక్కువ గాదే !

    రిప్లయితొలగించండి
  2. భూషణంబులు కాబోవు పుడమిలోన
    మనిషి కేనాడు హారాలు, మణులు, విరులు
    స్నాన వస్త్రాదు లనుపమ సంపదలును
    భూషణంబైన దొక్కవా గ్భూషణంబె

    రిప్లయితొలగించండి
  3. కేయూరాణి న భూషయంతి పురుషం .....

    దండ కడియములు తెలి ముత్యాల సరులు
    స్నాన లేపనాలు విరులు జాను కురులు
    పురుషునకు గావు తొడవులు పుడమి యందు
    వాక్కు నిజమైన భూషయౌ వన్నె విడదు

    రిప్లయితొలగించండి
  4. భూషణ మన్నిటి కంటెను
    భూషణ మే వా క్కు నిలను భూరిగ నిచ్చున్
    భూషణ మనబడు పరువము
    వేషముల కిట తావు లేదు వివరించంగన్ .

    రిప్లయితొలగించండి
  5. భావమ్మందున ధర్మమొప్పగ సదా వాగ్భూషణమ్మట్లు మా
    రావమ్ముల్ బహు కర్ణపేయముగ నీ వాశీర్వదింపంగదే,
    శ్రీవాణీ! కలహంస వాహనముగా, జేజే ధ్వనుల్ మ్రోగగా,
    సేవాతత్పర భక్తకోటిని కటాక్షింపంగదే, భారతీ!

    రిప్లయితొలగించండి
  6. వాఙ్మహా సంపద ప్రాణి కోటుల లోన
    ....వరమగు రీతి సంప్రాప్తమయ్యె
    మానవ జాతికి మాత్రమే యయ్యది
    ....భగవాను సత్కృపా ఫలవరమ్ము
    వర్ణముల్ పదములు వాక్యమ్ములను రీతి
    ....వర్ధిల్లి రూపొందు భాషలగుచు
    భాషాభివృద్ద్ఝితో వ్యాపించు జ్ఞానమ్ము
    ....తరతరమ్ముల దాక పెరుగుచుండు
    జ్ఞాన సంపద చేతనే నాగరికత
    క్రమక్రమమ్ముగ నభివృద్ధి గాంచుచుండు
    సకల సదుపాయములు శాంతి సౌఖ్యములను
    గనుచు విశ్వమ్ము శోభతో దనరుచుండు

    వాగర్థమ్ములు సదా పావనమ్ములటంచు
    ....భావించునెడల సత్ఫలములొదవు
    ఐతరేయశ్రుతి అగ్నియే వాక్కుగా
    ....నొప్పుగా పరిణామ మొందుననును
    వాఙ్మహా సంపద భాసిల్లు సద్గుణ
    ....భూషణులగునట్టి పురుషులందె
    వినయాది గుణములే వెలయు వాక్పుష్పాల
    ....పరిమళమ్ముల రీతి సరసగతుల
    స్వర్ణ రత్న సుమాది భూషలు నశించు
    కాని వాగ్భూషణము వృద్ధిగాంచుచుండు
    వాక్కు దైవమ్ము మిత్రమ్ము భాగ్యదమ్ము
    పుష్కల యశఃకరమ్ము వాగ్భూషణమ్ము

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘వేషముల కిట తావు లేదు’ అన్నప్పుడు గణదోషం. ‘వేషములకు తావు లేదు’ అంటే సరి!
    *
    లక్ష్మీదేవి గారూ,
    మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    భగవత్ప్రసాదమైన వాక్కు ప్రాశస్త్యాన్ని అన్ని కోణాల్లో స్పృశిస్తూ మనోహరమైన పద్యాలు చెప్పారు. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. అమ్మా శ్రీమతి లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు.
    చక్కని పద్యము చెప్పేరు. అభినందనలు. 2వ పాదములో మీరు యతి నియమమును గమనించి నటుల లేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. పెదవి దాటిన మాటలు ముదము గూర్చ
    కవుల కవితా సుధలె రాజ కాన్క లందె
    పల్లకీ మోత కంకణ భాగ్యమిచ్చె
    నమ్ము మధుర భాషణ భూషణమ్ము ధరణి!

    రిప్లయితొలగించండి
  10. వాగ్భూషణమ్ముచే వాయుతనూజుండు
    ----------రఘురామదూతగా రహి వహించె!
    వాగ్భూషణమ్ముచే పౌరాణికోత్తమ
    ----------స్తుతికి పాత్రుండాయె సూతమునియు!
    వాగ్భూషణమ్ముచే వందనీయుం డాయె
    ----------విదురుడు కౌరవసదన మందు!
    వాగ్భూషణమ్ముచే వాగ్గేయకారులై
    ----------త్యాగ రాజాదులు ధన్యులైరి!

    వాక్కు వేదమ్ము! వాణీనివాస మనఘ!
    వాక్కు మానవ జాతికే వరము ధరను!
    వాక్కు సద్వినియోగమై వరలెనేని
    వాడు దైవ స్వరూపుడే వసుధలోన.


    రిప్లయితొలగించండి

  11. గురువుగారు, పండితులవారు
    మన్నింపమని ప్రార్థన. మనసులో వా, భాలు నిల్చి పోవడంతో ఆ పాదమందు పొరబాటు దొరలినది.

    భావమ్మందున ధర్మమొప్పగ సదా వాగ్భూషణమ్మట్లు మా
    రావమ్ముల్ బహు కర్ణపేయములుగా రంజిల్లఁ జేయంగదే!
    శ్రీవాణీ! కలహంస వాహనముగా, జేజే ధ్వనుల్ మ్రోగగా,
    సేవాతత్పర భక్తకోటిని కటాక్షింపంగదే, భారతీ!
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. పెదవి దాటిన వాక్కది పృధివి దాటు
    మంచి మాటలు భూషణ మెంచి చూడ
    రాజ్య మేలెడి రాజైన రజకు నోట
    పెక్కు యిడుముల పాలయ్యె నిక్క మనగ

    రిప్లయితొలగించండి




  13. నగలు నాణెమ్ములును భూషణములు కావు
    పాండితీ ప్రకర్షయుగాదు ,వస్తుచయము
    సంపదలు కావు నరులకు;సత్ప్రవర్త
    నమ్ము,మధురమౌ వాగ్భూషణమ్మె యగును.

    రిప్లయితొలగించండి
  14. సహదేవుడు గారూ,
    మంచి పద్యం వ్రాసారు. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    వాగ్భూషణ విరాజితులను గురించిన మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. మిస్సన్నగారు,
    ప్రశంసనీయమైన పద్యము చెప్పినారు.

    రిప్లయితొలగించండి
  16. రవీందర్ గారూ, సాహిత్యాభిమాని గారూ చాలా అందమైన శ్లోకాన్ని ఉటంకించారు. ధన్యవాదాలు.
    ఆకాశవాణిలో సంస్కృత పాఠం కార్యక్రమారంభంలో యీ శ్లోకం ఎంతో మధురంగా ఉచ్చరింప బడుతూ ఉండేది.

    రిప్లయితొలగించండి