20, ఏప్రిల్ 2013, శనివారం

సమస్యాపూరణం – 1029 (వనము సుఖము నొసఁగు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వనము సుఖము నొసఁగు జనుల కెపుడు.

17 కామెంట్‌లు:

  1. అద్దె కొంప లోన నగచాట్లు పడలేక
    చేరెడంత భూమి చేరి కట్ట
    పిట్ట గూడు బోలు పిసరంత దైన భ
    వనము సుఖము నొసఁగు జనుల కెపుడు.

    రిప్లయితొలగించండి
  2. శాశ్వతమగు సుఖము జగతిలోని విషయ
    సుఖము లొసగ లేవు సుమతులార!
    తనరు నిగమ శీర్ష వనములో సౌఖ్య జీ
    వనము సుఖము నొసగు జనుల కెపుడు

    రిప్లయితొలగించండి
  3. కరవు కాటకాలు కష్టాలు కన్నీళ్లు
    పేదరికము లేక భీతి లేక
    దైవభక్తి గల్గి తనరు ప్రశాంత జీ
    వనము సుఖము నొసగు జనుల కెపుడు

    రిప్లయితొలగించండి
  4. అంతు లేనియాశలు పెంచి నధిక చింత ,
    దుఃఖ సాగరమున ద్రోయు మనల
    కోర్కెలనువీడి శ్రీరాము గొలువ ప్రశాంత జీ
    వనము సుఖము నొసగు జనుల కెపుడు

    రిప్లయితొలగించండి
  5. మనమునందు హరిని స్మరణమ్ము జేయుచు
    ధనవిమోహబుద్ధిఁ దనర కుండ
    తనువునందు నాత్మతత్త్వమ్ము కనెడె భా
    వనము సుఖము నొసఁగు జనుల కెపుడు.

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చిన్నదైనా సొంతిల్లు సుఖాన్నిస్తుందన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    అది లేక బాధలు పడుతున్నవాణ్ణి నేను!
    *
    పండిత నేమాని వారూ,
    ‘నిగమ శీర్ష వనములో సౌఖ్య జీవన’మన్న మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ ‘ప్రాశాంత జీవన’ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది.. కాకుంటే కొద్దిగా తొందరపడ్డట్టున్నారు.
    మొదటి పాదం తేటగీతి, రెండవ పాదం ఆటవెలది. మూడవ పాదం ఎదీ కాదు. మీ పద్యానికి నా సవరణ....
    అంతులేని యాశ లధిక చింతను పెంచి
    దుఃఖ సాగరమున ద్రోయు మనల
    కోర్కె లుడిగి రాము గొలుచు ప్రశాంత జీ
    వనము సుఖము నొసగు జనుల కెపుడు.
    *
    “అవధాన సుధాకర” రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    బహుకాలానికి మా పట్ల దయ చూపారు. సంతోషం, ధన్యవాదాలు.
    ముందుగా విజయవంతంగా అవధానాలను చేస్తూ “అవధాన సుధాకర” బిరుదు నందినందుకు నా పక్షాన, బ్లాగు కవిమిత్రుల పక్షాన శుభాభినందనలు.
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. ఇరుగు పొరుగు వారికిష్టంబుగా నుండి
    ధరఁ బరోప కార ధర్మమెఱిఁగి
    భక్తి భావ ముండి పరమాత్మఁ దలచు జీ
    వనము సుఖము నొసగు జనుల కెపుడు

    రిప్లయితొలగించండి
  8. దైవచింతనంబు జీవకారుణ్యంబు
    ధర్మ నిరతి గలుగు దార్శనికుల
    అడుగు జాడలందు నడిచెడు వారిజీ
    వనము సుఖము నొసగు జనులకెపుడు !!!

    రిప్లయితొలగించండి
  9. చెట్టు చేమ పురుగు పుట్టల కలయికే
    వనము , సుఖము నొసగు జనుల కెపుడు
    శివుని పూజ సేయ శివునిం దలచినను
    భుక్తి నిచ్చు మఱియు ముక్తి నిచ్చు .

    రిప్లయితొలగించండి

  10. పార్వ తీ శ్వర శర్మ !


    పార్వ తీ శ్వర !యవధాన పటిమ గరిమ !
    తెలుగు తేజమ ! నీ కివె దెలుపు చుంటి
    సకల శుభములు గలిగించు శంక రుండు
    ఆయు రారోగ్య సంపద లన్ని యిడును .

    రిప్లయితొలగించండి
  11. వనము స్వేచ్ఛ నొసఁగు పక్షి జాతులకు
    వనము
    ప్రీతి నొసఁగు పాండితికి
    వనము
    ముదము నొసఁగు ఘన సురలకును జీ
    వనము
    సుఖము నొసఁగు జనుల కెపుడు!!

    రిప్లయితొలగించండి
  12. వనము జీవనంబు వారిజ తతికి
    వనము
    జీవనంబు ప్రాణులకు చ్య
    వనము
    తినగఁ గలుగు బలములు దంత ధా
    వనము
    సుఖము నొసఁగు జనుల కెపుడు!!

    రిప్లయితొలగించండి

  13. ధర్మవర్తనమ్ము, దాతృత్వమును, సంప్ర
    దాయ పాలనమ్ము, తల్లిదండ్రు
    లందు భక్తి మరియు హరిహర పాదసే
    వనము సుఖము నొసఁగు జనుల కొపుడు.

    రిప్లయితొలగించండి
  14. కేసరి గిరి(కీసరగుట్ట) లో జరుగు అతిరాత్ర హోమసందర్శనభాగ్యము కలిగినది.

    దేవతలనుఁ బిలిచి దివ్యహోమములను
    జరుపుచుంద్రు పుణ్యజనులు భువిని;
    దేవఋణము నెల్ల దీర్చు గొప్ప దగు హ
    వనము సుఖము నొసఁగు జనుల కెపుడు.

    రిప్లయితొలగించండి
  15. యశము ధనము నిచ్చు, వ్యవహారవిదు జేయు
    శుభము లందజేయు, సుందరివలె
    బోధచేయుచుండు పుడమిని కాన క
    వనము సుఖము నొసగు జనుల కెపుడు.

    రిప్లయితొలగించండి
  16. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    అనుప్రాసతో శోభిస్తున్న మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ ‘హవన’ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. రాజ కీయ హింస రాత్రి బవలనక
    భీతి చెంది మదిని బెగడు బడుచు
    ప్రాణ హాని లేని పాలితులు గలజీ
    వనము సుఖము నొసఁగు జనుల కెపుడు !

    రిప్లయితొలగించండి