5, ఏప్రిల్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1014 (తగినది గాదయ్య వేద)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తగినది గాదయ్య వేదధర్మము మనకున్.
ఈ సమస్యకు ఆధారం“తగినదేది? విడువదగిన దేది?” అన్న మంద పీతాంబర్ గారి ‘సరదాకి చిరుకవిత’. 
వారికి ధన్యవాదాలు.

27 కామెంట్‌లు:

 1. తెగ మెచ్చి పరుల ధర్మము
  తెగబడి పోయెదవదేల తెలియక నిజమున్
  అగణిత గుణములు గలదిది
  తగినది గాదయ్య వేదధర్మము మనకున్?

  రిప్లయితొలగించండి
 2. నిగమంపు సార మన్నది
  యగణిత మౌ, జనులు వాటి నాచరణంబున్
  సుగతుల నొసంగగ విడువఁ
  దగినది కాదయ్య వేద ధర్మము మనకున్!

  రిప్లయితొలగించండి
 3. నగుబాటు నొంద దగునే?
  తగినది కాదయ్య వేద ధర్మము మనకున్
  జగతి ననుచు సుగుణాఢ్యా!
  నిగమంబుల నిందసేయ నేర్చుట తగునే?

  రిప్లయితొలగించండి
 4. సహదేవుడు గారూ ! చక్కని పూరణ చేశారు. నొసగంగ( లేక) బడయంగ అంటే ఇంకా బాగుంటుందేమో... .

  రిప్లయితొలగించండి
 5. గోలి వారికి ధన్యవాదములు.మనో ఫలకంపై బడయంగ అనే లిఖించు కొన్నా,టైపు చేసే సమయానికి నొసంగగ అని టైపు చేయడం జరిగింది.

  రిప్లయితొలగించండి
 6. నిగమమ్ములు దా నెఱుగక
  సుగమములౌ హరిని జేరు సుద్బోధనలన్
  విగుణుడు వినకయె పలుకును
  'తగినది కాదయ్య వేద ధర్మము మనకున్ '

  నిగమము = వేదము, సుగమము = సుళువైన, విగుణుడు = గుణహీనుడు

  రిప్లయితొలగించండి
 7. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
  జగతిని పరధర్మంబెటు
  తగినది గాదయ్య, వేదధర్మము మనకున్
  తగినది యని భగవానుడు
  గతి తప్పక నడువమనుచు గతమునె నుడివెన్.

  రిప్లయితొలగించండి
 8. పగతో గూడిన బలుకుల ?
  తగినది గాదయ్య వేద ధర్మము మనకున్
  తగినది జెప్పగ నార్యుల
  వగతో మ ఱి వేడుకొనుదు వారిని నిపుడే .

  రిప్లయితొలగించండి
 9. భగవంతుని నమ్మని వా
  రు గణన సేయరు నిగమము రోయుదు రెపుడున్
  ఎగతాళి చేసి యందురు
  “ తగినది గాదయ్య వేద ధర్మము మనకున్ "

  రిప్లయితొలగించండి
 10. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
  ==========*======
  పగలు,ప్రతీకారములను పాడి పంటలపైన జూపి
  గగన విహారము జేయు ఘనులకు,ప్రజల ధనమును
  పగటి పూట దినెడి వారి వాలములకు,కుత్సుకులకు
  తగనిది గాదయ్య వేద ధర్మము మనకిల లోన ।
  =========*======
  పగలు,ప్రతీకారముల ము
  నిగి దేలు మనుజులు బల్కు నీతి నిగమముల్
  సగము సగము గల,భువిలో
  తగనిది గాదయ్య వేద ధర్మము మనకున్

  రిప్లయితొలగించండి
 11. తగదీ పరిహాసమ్ముల్,
  తగినది గాదయ్య వేదధర్మము మనకున్
  నగుబాటునకున్ , ధరలో
  తగు విధముగ కర్మకాండ, ధర్మము నేర్పెన్.

  రిప్లయితొలగించండి
 12. నిగమంబుల నిందించుచు
  వగచుచు పాషండు లంత పలుకుదు రిటులన్
  “తగనివి సవనములు భువిని
  తగినది గాదయ్య వేద ధర్మము మనకున్"

  రిప్లయితొలగించండి

 13. నిగమమ్ముల నెపుడొ మరచి,
  యగణితపాపములొనర్చి యాధునికత యన్
  సొగసగు ముసుగుల దాల్తుము
  తగినది గాదయ్య వేదధర్మము మనకున్.

  రిప్లయితొలగించండి
 14. పూరణ : శ్రీమతి పంతుల జయమహేశ్వరి
  సెగలుగ విలయపు మనుగడ
  తగినది గాదయ్య, వేద ధర్మము మనకున్
  జగతికి , మేలును గూర్పగ
  తగు విలువల నిచ్చి శాంతితన్యతబెంచెన్ ||

  రిప్లయితొలగించండి
 15. నిగమంబుల దూషించుట
  తగినది కాదయ్య, వేదధర్మము మనకున్
  తగునని దుర్మార్గుండగు
  జగపతి యను సుతునితోడ శర్మార్యుడనెన్.

  రిప్లయితొలగించండి
 16. జగడము జీవన ప్రగతికి
  తగినది గాదయ్య !వేదధర్మము మనకున్
  జగతినగలవారలకున్
  తగినది!తగుదారిచూపు తడబడువేళన్ !!!

  రిప్లయితొలగించండి
 17. శ్రీ తోపెల్ల శర్మ గారి పద్యము బాగుగనున్నది. 4వ పాదములో ప్రాస పాటింపబడలేదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 18. శ్రీపండిత నేమాని గురువులకు ధన్యవాదములతో
  ప్రాస సవరించుచూ
  జగతిని పరధర్మంబెటు
  తగినది గాదయ్య, వేదధర్మము మనకున్
  తగినది యని "భగవద్గీ
  త" గతము నందునె నుడివెను తరచి జూడన్.

  రిప్లయితొలగించండి
 19. గగనము నంటిన కోర్కెల
  కెగబడి యలవాటు బడిన కీడొన రించున్ !
  నిగమములు మరచి మనుగడ
  తగినది గాదయ్య వేద ధర్మము మనకున్ !

  రిప్లయితొలగించండి
 20. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
  ========*========
  జగమొండి కిరణు వారికి
  తగినది గాదయ్య,వేదధర్మము మనకి
  మ్ముగ వరముల నొసగెడి యా
  భగవంతుని మృదు మధురపు బలుకులె నేస్తం
  =====*====
  పై పద్యములో(పగటి పూట = అధికారమునందు, వాలములకు=వారి కుడా తిరిగేది వారికి)

  రిప్లయితొలగించండి
 21. నిగదతి పాషండు డిటుల
  “తగినది గాదయ్య వేద ధర్మము మనకున్"
  నిగదతి శ్రోత్రియు డిట్టుల
  “తగునిది గాదయ్య వేద ధర్మము మనకున్"

  నిగదతి ( సంస్కృతం) = పల్కును

  రిప్లయితొలగించండి
 22. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  సమస్యను ప్రశ్నగా మార్చి చక్కని పూరణ చేసారు. బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  ‘విడువఁదగినది’ కాదంటూ మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  అయినా నిగమాలను నిందించినవాడు ‘సుగుణాఢ్యు’డెలా అవుతాడు? ‘దుర్గుణఖని’ అవుతాడు కదా!
  *
  గన్నవరపు నరసింహమూర్తి గారూ,
  గుణహీనుని పలుకులుగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  సమస్యకు విరుపు నిచ్చి మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  సవరించిన పూరణలో ‘తరచి చూడన్’ అన్నప్పుడు గణదోషం. ‘తరచి కనంగన్’ అందాం.
  *
  సుబ్బారావు గారూ,
  పగవాడి పలుకులుగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  నాస్తికుల. పాషండుల మాటలుగా మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  మూడవ పూరణ వైవిధ్యంగా ఉంది. కానీ ‘నిగదతి’ అనే సంస్కృతక్రియారూపాన్ని తెలుగుపద్యంలో వాడవచ్చా?
  *
  వరప్రసాద్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  ‘కుత్సుకులకు’ కాదు... ‘కుత్సితులకు’.
  మీ మూడవ పూరణలో జగమొండి కిరణ్‍కు, తరువాతి పూరణకు సంబంధం ఏమిటి? ‘నేస్తం’ అని వ్యావహారికం ప్రయోగించారు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  సమస్యను పరిహాసవాక్యంగా నిరసిస్తున్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కమనీయం గారూ,
  ఆధునికత ముసుగులో నిగమాలను నిరసిస్తున్నారన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పంతుల జయమహేశ్వరి గారూ,
  విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  ‘శాంతితన్యత’...?
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  మంచి విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  సమస్యను విరిచి మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 23. భగవంతు డెవడు విష్ణువె ?
  తగదిది మన యసుర జాతి తల దించుకొనున్
  నిగమమ్ము లేల పుత్రా?
  తగినది గాదయ్య వేద ధర్మము మనకున్.

  రిప్లయితొలగించండి
 24. రగిలెడి హోమము నందున
  సెగనార్పి మఖమును పాడు సేయగ వలయున్
  సిగ బట్టి మౌని కాంతలఁ
  దగులుచు మానహరణమున తనరంగ వలెన్
  ఖగధర భక్తులఁ జంపుచు
  వగఁ గూర్చు చు హింసఁ జేయ వలెను సతతమున్
  పగగొని యనిమిషులనడచి
  జగములనేల వలె నీవు చండాకృతినన్
  తగనిది తగినిదిగ తలచి
  తగవిదియని తగవుకు మరి తరలుట తగునే?
  వెగటగునిది ప్రహ్లాదా!
  తగినది గాదయ్య వేదధర్మము మనకున్!!

  రిప్లయితొలగించండి
 25. మిస్సన్న గారూ,
  మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
  మనలో మనమాట... అది హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో చెప్పిన మాటా? లేక మీరు మీ పుత్రునకు చేసిన హితబోధా? (అయినా మనది అసురజాతి కాదు కనుక మొదటిదే సరియైనది లెండి!)
  పూరణకు ముందు ... ప్రహ్లాదునితో హిరణ్యకశిపుడు.... అని పేర్కొంటే బాగుండేది.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీరూ మిస్సన్న గారి బాట పట్టారు. మూడో పద్యంలో “ప్రహ్లాదా” అని సంబోధించి అనుమానం రాకుండా చేసారు. బాగున్నది మీ మూడు పద్యాల పూరణం. అభినందనలు.
  మూడవ పద్యం చివర ‘చండాకృతినన్’ అన్నదానిని ‘చండాకృతితోన్’ అంటే బాగుంటుందేమో!

  రిప్లయితొలగించండి
 26. గిరీశం ఉవాచ:

  పొగచుట్టలు మెలిపెట్టుచు
  వగవక బుచ్చెమ్మ బ్రతుకు వ్యర్ధమ్మనుచున్
  నిగమమ్మిదెయని కూసెడి,
  తగినది గాదయ్య, వేదధర్మము మనకున్

  రిప్లయితొలగించండి
 27. భగవంతు గొల్చి వోట్లకు
  తగవులతో కోవెలలను తన్నుకు చావన్
  మిగిలెను బొచ్చెయె రాహుల్!
  తగినది గాదయ్య వేదధర్మము మనకున్

  రిప్లయితొలగించండి