7, ఏప్రిల్ 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1016 (కుంతి మగఁడు శూలి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కుంతి మగఁడు శూలి కొడుకు వాలి.

35 కామెంట్‌లు:

  1. నాటకోత్సవములు నానావిధములందు
    నొక్కొకరికి పాత్ర లెక్కువయ్యె
    వివిధ పాత్ర లటుల వేయు వారల జూడ
    కుంతి మగడు శూలి కొడుకు వాలి

    రిప్లయితొలగించండి

  2. నిండుమనము గల్గు పాండురా జెవ్వఁడు?
    విఘ్నవారకుఁడగు వేలు పెవఁడు?
    రామబాణ మెవని ప్రాణమ్ముఁ దీసెను?
    కుంతి మగఁడు; శూలి కొడుకు; వాలి.

    రిప్లయితొలగించండి
  3. ప్రక్క వీధి లోని పార్థుడు గారికి
    కుంతి మగఁడు, శూలి కొడుకు, వాలి
    తమ్ము పేర్ల తోడ తనయులు గలరయ్య
    వారి పేర్లు జెప్పు వారు గలరె ?

    రిప్లయితొలగించండి
  4. ఒకే సమయంలో రెండు విధముల పూరణలతో నలరించారు... గురువర్యుల పూరణలు బాగున్నవి.

    రిప్లయితొలగించండి
  5. కుంతి, మగడు, శూలి, కొడుకు, వాలియు బురి
    నొక్క ప్రాంతమందు నుండు వారె
    శంకరాభరణపు సాహిత్య ప్రక్రియల్
    విందులగును వారి కందరకును

    రిప్లయితొలగించండి
  6. పాండు రాజు ,షణ్ము ఖుండును, సుగ్రీ వు
    గుం తి మగడు , శూ లి కొడుకు ,వాలి
    వరుస జూడ తెలియు వారల బంధము
    లెఱు గు డ య్య లార ! యెవరొ వారు ?

    రిప్లయితొలగించండి
  7. నాగు లనెడి వాడు నాటకాలను వేయు
    పల్లెలోని ప్రముఖ పాత్రధారి
    మూడు వేషములను వాడె ధరించును
    కుంతి మగడు, శూలి కొడుకు, వాలి

    రిప్లయితొలగించండి
  8. మిత్రులకు శుభాశీస్సులు.
    ఈనాటి సమస్య రసప్రశస్తములైన పూరణలు చేయుటకు అవకాశము కల్పించినది. మంచి మంచి పూరణలు వచ్చుట ముదావహము. ఇంకా మంచి పూరణలను కూడా ఆశించుదాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. ఆత్మ నెఱుగు వాడు హరుని నంతట గాంచు
    కుంతి మగడు, శూలి, కొడుకు వాలి
    వార లొక్కటి గను పాటించు మదిలోన
    బ్రమసి నట్లు గనురు పరులు వాని,

    రిప్లయితొలగించండి
  10. మాన్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి
    నమస్కృతులతో,

    మేదురమైన మీ ఆదరానికి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు. నిన్నటి ప్రసంగానికి సమాధానాన్ని ఆ ప్రస్థలిలో చూడరేమో అని ఈనాటి భాగంలో చేర్చినందుకు పెద్దలు మన్నింప ప్రార్థన.

    శతపథ బ్రాహ్మణంలోని కథ ఇది:

    విశ్వకర్మ కొడుకు త్వష్టృప్రజాపతి అసురుడై ఇంద్రునియెడ శత్రుత్వం వహించి ఆభిచారమనే క్షుద్రమైన మారణహోమం చేశాడట. అందులో “ఇంద్రుడనే శత్రువు హతమారు గాక” అనే అర్థంలో “ఇంద్రశత్రుర్వర్ధస్వ” అని హవిస్సును వేల్చాడట. అయితే ఉచ్చారణలో “ఇంద్ర” అని “ఇ” అనే అక్షరంపై ఊనికను నిలుపవలసి ఉండగా అజ్ఞానం వల్ల “శ” అనే అక్షరంపైని నిలిపి మంత్రాన్ని పలకటం మూలాన “ఇంద్రునియొక్క శత్రువు హతమారు గాక” అని అర్థం వచ్చి అతనే ఇంద్రునితో యుద్ధంలో ఓడిపోయి మరణించాడట.

    మును రక్షోధిపుఁ “డింద్ర”-శ’త్రునకు నిర్మోకంబు సంధిల్ల వే
    ల్మినిఁ గావించుచు నింద్ర-“శత్రుఁ”డని వేల్చెన్; దానిచేఁ దాన హా
    నినిఁ జెందెన్; పద ముచ్చరించు తఱి భ్రాంతిం జెందినన్ దత్కృత
    ధ్వనిచేఁతన్ రసభంగమౌను; పరమార్థం బెల్ల వ్యర్థం బగున్.

    ఒక్కొక్క అక్షరాన్ని స్పష్టంగా, అర్థవంతంగా, జాగ్రత్తగా పలుకకపోతే ఎన్ని అనర్థాలు వాటిల్లుతాయో ఈ కథ స్పష్టీకరిస్తున్నది.

    రెండవ పద్యాన్ని పండిత శ్రీ నేమాని గురువుల సూచనాదేశానుసారం ఈ విధంగా సవరించుకొన్నాను:

    అనుమోదింప సహృత్కవీంద్రతతి కావ్యార్థప్రకాశంబు వ్యం
    జనచే నౌచితిఁ గాంచి రీతిగుణవచ్ఛయ్యానువృత్తుల్ దమం
    తన నొప్పారఁ గృతార్థమై వినుతిఁ జెందన్; గూఢనేయార్థభా
    గ్ధ్వనిచేతన్ రసభంగమౌను, పరమార్థం బెల్ల వ్యర్థం బగున్.

    కవి ప్రయత్నంచే గాక దైవదత్తమైన ప్రతిభచే తమంతతాముగా ప్రకటమయ్యే రీతి, శయ్య, గుణములు, వృత్తుల మొదలైన సామగ్ర్రి వల్ల కావ్యార్థం సహృదయులు, సుకవులు అనుమోదించే విధంగా ప్రకాశిస్తుందని; గూఢము, నేయార్థము (కవి తనకు తానై కల్పించుకొన్న సంకేతాలతోడి కవిత్వం వల్ల – ఉదాహరణకు “సాగరకర్ణయాన” సాగర = మదము, కర్ణ = చెవులలో స్రవించే (అంటే ఏనుగు) ఏనుగువంటి, యాన = నడక గలిగిన ఆమె – గజగమన అని అర్థం) వలన కవిత్వంలోని ధ్వనిప్రతీతి భగ్నమై, రసభంగకారకం అవుతుందని, అందువలన కావ్యపరమార్థం నిరర్థకం అవుతుందని భావం.

    పూజ్యశ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి, శ్రీ మిస్సన్న గారికి, మీకు పునఃపునర్ధన్యవాదాలతో,

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  11. పాండు నృపతిఁ జూడ పత్నులిద్దరు గల్గె
    భవుని రీతి; భీమ బలముఁ జూడ
    వాలి పగిదినుండె;పద్దతులను జూడ
    కుంతి మగఁడు శూలి, కొడుకు వాలి!!

    రిప్లయితొలగించండి
  12. శ్రీ మురళీధరరావు గారికి,
    మీరు ఇక్కడ సవివరమైన వ్యాఖ్య చేసియుండడం గమనించక నేను వ్రాసి ఉన్నాను.
    మన్నించండి.

    రిప్లయితొలగించండి
  13. దివిజాధిపతి గోర కవచాదికములిచ్చు
    దానకర్ణుని గన్న తల్లి యెవరు?
    కర్ణుని మాతకు కమనీయచరితకు
    పాండురాజేమౌను? పలుకవలయు,
    ఆకుంతి కొమరున కర్జునాఖ్యునకిచ్చె
    పాశుపతాస్త్రంపు భాగ్యమెవడు?
    మఘవున కేమౌను మహితతేజుండౌచు
    వైభవంబును గన్న ఫల్గునుండు?
    "వాలి యుండె నౌర! బాణాలశయ్యపై
    భీష్ము" డన్నమాట విన్నయపుడు
    మొదటిపదమదేది మోదంబునం జూడ?
    కుంతి, మగడు, శూలి, కొడుకు, వాలి.

    రిప్లయితొలగించండి

  14. తనయు ప్రతిభ మెచ్చి తండ్రియు, భక్తుని
    కొరకు స్వామి, యనుజు కొరకు నింద్రు
    డనుప ; పోరు సలుపు నర్జునుఁ జూడరే
    కుంతి మగఁడు, శూలి, కొడుకు వాలి.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు పాదాభివందనములు జేయుచూ

    రాయల సీమలో గౌరవముగా పంతులమ్మ అని పలుకుదురని విని యుంటి వారిపై
    ======*======
    వాలి భార్య, పితృడెవరను ప్రశ్నలడుగ
    కుంతి మగడు,శూలి కొడుకు వాలి
    పంతులమ్మ యనుచు వింతలు గొల్పు జ
    వాబు జెప్పె నొకడు,బాగు బాగు

    శూలి సుతుడ,నీకు వాలిదమ్ముడు దెల్పె
    నుగద స్వప్న మందు,నూరు మార్లు
    వ్రాసి దెమ్ము,పోయి రాతి పైన
    నిలిచి యుండు శిష్య నీలకంఠ
    ( శూలి సుతుడ = నక్క సుతుడ)

    రిప్లయితొలగించండి
  16. శ్రీయుత ఏల్చూరి మురళీధరరావు గారికి నమస్సులతో - ఈనాటి మీ వివరణకు సంబంధించిన ఒకానొక సందేహాన్ని నివృత్తి చేసెదరని విన్నపం .

    ఇంద్రశత్రుర్వర్ధస్వ కు సంబంధించి - వర్ధస్వ లోట్ విధ్యాశీరర్థకముగా వాడబడినదా ? అలా అయినచో మధ్యమ పురుష ను తెలియజేస్తుంది కదా !

    " ఇంద్రశత్రుః " ప్రథమైకవచన లోట్ "వర్ధతాం" రూపము గొనదా ? లేక ఇతర మర్మమేదేని కలదా ?

    ఇంద్ర శత్రుః (ఇంద్రునకు శత్రువు ) నకు , ఇంద్రః శత్రుః ( శత్రువైన ఇంద్రుడు ) నకు గల భేదమెరిగినదే , కాని ఏదేమైనా ప్రథమైకవచనమే కదా !

    రిప్లయితొలగించండి
  17. వృత్రాసుర కథా ప్రాసంగికముగా ఈ పై కథ నుదహరించడం కద్దు .

    రిప్లయితొలగించండి
  18. గుగ్గిలమన నేమి ? కుజకు రాము డెవరు ?
    కడుపు నొప్పి తోడ బడలు నెవడు ?
    ఎవడు యంగజు డన ? నెవడు యంగదు నయ్య ?
    కుంతి, మగడు, శూలి, కొడుకు, వాలి

    పాండురాజు, విఘ్నపతి, తార - వీరలే
    కుంతి మగడు, శూలి కొడుకు, వాలి
    భార్యలు ; వివరింప పర్యాయ పదములౌ
    తెలుగు పదము లిట్లు తేట పరచె

    రిప్లయితొలగించండి
  19. మాన్యమిత్రులు డా. విష్ణు నందన్ గారికి నమస్కృతులతో,

    “వర్ధస్వ” లోణ్మధ్యమపురుష విధ్యాశీరర్థకంగానే వాడబడింది. మీరన్నట్లు “త్వం ఇన్ద్రశత్రుర్వర్ధస్వ” అనే అర్థంలోనే యజించటం జరిగింది. “(అసురులకు) శత్రుడవైన ఇంద్రుడవు నీవు వృద్ధినొందెదవు గాక!” అనే అక్కడి ఉద్దిష్టార్థం. అయితే, ఊనిక లోపం వల్ల “ఇంద్రునికి శత్రుడవైన నీవు వృద్ధినొందెదవు గాక!” అన్న అర్థం వచ్చి దేవతలు ఓడిపోయారు. తైత్తిరీయ సంహిత (2.5.2.1-2) లోనూ; జైమినీయ బ్రాహ్మణం (2.155) లోనూ దేవతలే మారణహోమం చేసి అపశబ్దోచ్చారణ వల్ల ఓడిపోయినట్లుగా ఉన్నది: "తతో యః సోమో త్యారిచ్యత తం అగ్నా వుపప్రావర్తయత్ స్వాహేన్ద్రశత్రుర్వర్ధస్వ. ఇతీన్ద్రస్యాహైనం అచికీర్షద్ ఇన్ద్రస్య శత్రుం అకరోత్ తథా వాక్ స్వయమేవ" అని.

    శతపథ బ్రాహ్మణం (1.6.3.8-10)లో త్వష్ట మీరన్నట్లు వృత్రాసుర వధ సన్నివేశంలో అపోచ్చారణ చేసి ఇంద్రునిచేతిలో హతమారినట్లు "స త్వష్టా చుక్రోధ కువిన్మేనుపహూతః సోమం అబభక్ష దితి స స్వయం ఏవ యజ్ఞవేశసం చక్రే స యో ద్రోణకలశే శుక్లః పరిశిష్ట ఆస తం ప్రవర్తయం చకా రేన్ద్రశత్రుర్వర్ధస్వేతి. అథ యద్ అబ్రవీ దిన్ద్రశత్రుర్వర్ధస్వేతి. తస్మాద్ ఉ హైనం ఇన్ద్ర ఏవ జఘానాథ యద్ ధ శశ్వద్ అవక్ష్యద్ ఇన్ద్రస్య శత్రుర్వర్ధస్వేతి శశ్వద్ ఉ హ స ఏవేన్ద్రం అహనిష్యత్.” అని ఉన్నది.

    “ఇన్ద్రశత్రుర్వర్ధస్వ” - “ఇంద్రునికి శత్రుడవైన నీవు వృద్ధినొందెదవు గాక!” అని యజింపగా “ఇంద్రుడను శత్రుడవు నీవు వృద్ధినొందెదవు గాక!” అని అర్థం వచ్చి అసురులు ఓడిపోయారు.

    కశ్యప ప్రజాపతికి అదితియందు త్వష్ట జన్మించాడు. అతనికి రేచనయందు సన్నివేశ విశ్వరూపులని ఇద్దరు కొడుకులు. విశ్వరూపునికే త్రిశిరుడని కూడా పేరున్నది. విశ్వరూపుడు తపోదీక్షితుడై ఉండగా ఇంద్రుడు అతనిని మట్టుపెట్టాడు. అందుకు ఆగ్రహించి త్వష్ట వృత్రాసురుని సృష్టించి ఈ హోమాన్ని చేశాడని; హోమం వికటించినందువల్ల వృత్రాసురసంహారం జరిగిందని పురాణకథ.

    కథ వేర్వేఱు చోట్ల వేర్వేఱు తీరుల ఉన్నది. ఇక్కడ మనకు ఆవశ్యకమైనదల్లా అపశబ్దోచారణం తగదన్నంత వఱకే కదా.

    “స్వాహా” ప్రయోగం జరిగింది కాబట్టి ఇది క్షుద్రమైన ఆభిచారిక హోమం కాదని; వైదికమేనని కొంతమంది వ్యాఖ్యాతలు వ్రాశారు.

    మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞుణ్ణి. పైని వివరణలో నా అవగాహనలోపాన్ని తప్పక సరిచేయండి.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  20. డా. ఏల్చూరివారికి నమస్సులు. మీ పూరణ అద్భుతం, లక్ష్మీదేవికి పార్వతీదేవికి అన్వయిస్తూ చేసిన పదప్రయోగం విజ్ఞానదాయకం. అయితే సందేహం - మగడూ, కొడుకూ వరకు అచ్చుగుద్దినట్లు సరిపోయినది పోలిక. మరి తండ్రి (సముద్రుడు), తమ్ముడు (చంద్రుడు) ఒక ప్రక్క, మరి సేనాని (వీరభద్రుడు) రెండో ప్రక్క - దీనిలో దాగిన మర్మమేమైనా ఉన్నదా?

    రిప్లయితొలగించండి
  21. తల్లి పేరు కుంతి తండ్రి శూలి యటంచు
    వారి తనయు డనగ వాలి గలసి
    మువ్వు రొక్క నాడు ముదముగా పయనించి
    కంది వారి యింట విందు కేగె 1

    రిప్లయితొలగించండి
  22. శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారికి ధన్యవాదములు. ఇదివరలో ఎక్కడో చదివిన కధే గాని మఱచి పోయాను. రెందు పద్యాల వివరణలు ఉపయుక్తముగా నున్నాయి.డా.శ్రీ విష్ణునందనుల వారికి కూడా ధన్యవాదములు.ఇచ్చట నీ పండితుల మధ్య, అద్భుతమైన కవిత్వము నందిస్తున్న మిత్రుల మధ్య దూరుతున్నప్పుడు కలహంసల మధ్య కాకి ననే భావము కలిగినా ' ద్విజుడునే ' యను సంతృప్తి కూడా కలుగుతుంది.

    రిప్లయితొలగించండి
  23. మాన్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి ,

    క్లిష్టమైన సమస్య కావటం వల్ల ఎన్నడూ లేనిది, ఒకటికి మూడుసార్లు వ్రాయవలసి వస్తే నాకు "ద్విజత్వానికి" తోడు శంకరాభరణంలో "త్రిజత్వం" కూడా సిద్ధించినట్లుంది, ఈ రోజు!

    రిప్లయితొలగించండి
  24. తల్లి పేరు కుంతి తండ్రి శూలి యటంచు
    కుంతి మగడు శూలి కొడుకు వాలి
    మువ్వు రొక్క నాడు ముదముగా పయనించి
    కంది వారి యింట విందు కేగె !

    రిప్లయితొలగించండి
  25. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
    నమస్సులతో,

    ఇందాక పొరపాటున ఆటవెలది సమస్యను తేటగీతిలో పూరించాను. మాన్యతములు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సౌజన్యపూర్ణమైన సూచనాదేశం మూలాన ఇప్పుడు సవరించుకొన్నాను.

    శ్రీ నరసింహమూర్తి గారికి నా హృదయకపూర్వకమైన ధన్యవాదాలు. ఇన్ని తప్పు పాఠాలకు శ్రీ శంకరయ్య గారు మన్నింపగలరని సంప్రార్థన.

    సింధురాజదుహిత శ్రీలక్ష్మి కొడు కిక్షు
    ధన్వి; మగడు చక్రి; తండ్రి పాశి;
    తుహినశైలరాజదుహిత దుర్గాదేవి
    కుంతి; మగడు శూలి; కొడుకు వాలి.

    లక్ష్మీదేవి కొడుకు ధన్వి, భర్త చక్రి, తండ్రి పాశి.
    దుర్గాదేవి కుంతి (కుంతాయుధధారిణి), శివుడు శూలపాణి, ముమ్మొనవాలు కలిగిన కుమారస్వామి వాలి.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  26. ' పెద్దల పొరబాట్లు కూడా వృధ్ధికే ' అన్నట్లు శ్రీ ఏల్చూరి వారి నుంచి మరో మంచి పద్యము నాస్వాదించ గలిగాము.వారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. ఈనాటి సమస్య ఎన్నో వైవిధ్యమైన, మనోహరమైన పూరణలు చెప్పి అలరించిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    గన్నవరపు నరసింహమూర్తి గారికి,
    జిగురు సత్యనారాయణ గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    వరప్రసాద్ గారికి,
    నేదునూరి రాజేశ్వరి అక్కయ్యకు,
    ఏల్చూరి మురళీధర రావు గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    సందేహాలు... వాటికి సాధికార సమాధానాలు... వాటిపై సంస్కారవంతమైన చర్చ... వీటితో ‘శంకరాభరణం’ బ్లాగును జ్ఞాన వేదికగా చేస్తున్న మిత్రులు నేమాని వారికి, గన్నవరపు వారికి, డా. విష్ణువందన్ గారికి, ఏల్చూరి వారికి, తదితర మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాంజలి!

    రిప్లయితొలగించండి
  28. శ్రీ ఏల్చూరి మురళీధరరావు మహోదయులకు పునరభివాదములతో - " త్వమింద్రశ్శత్రుర్వర్ధస్వ " అని లోణ్మధ్యమ పురుషైకవచన ప్రయోగమేనని వక్కాణించినందులకు ధన్యవాదాలు. మన తెలుగు శ్రీ చంద్రశేఖర్ గారు , శ్రీ గన్నవరపు నరసింహ మూర్తి గారు చెప్పినట్లుగా ఈ నాటి మీ పూరణలో మీరు చూపించిన నేర్పు ఊహింప శక్యము కానిది , అభినందనలందుకోండి !

    రిప్లయితొలగించండి
  29. పద్మనాభు డిట్లు పల్కె తా నత్తతో
    వల్లి కాయె విను వివాహ మపుడు
    కుంతి! మగడు శూలి కొడుకు! వాలిశుడును,
    నలువ, శివుడు దీవెనలను కురియ.

    రిప్లయితొలగించండి
  30. గుంపు జేరి రచట గోలజేసెడువారు
    'కుంతి మగడు శూలి కొడుకు వాలి'
    'సీత యత్త మాద్రి శేషశయనుచెల్లి'
    యిట్టి కేక లెట్టి రెగసి వారు

    రిప్లయితొలగించండి