23, ఏప్రిల్ 2013, మంగళవారం

పద్య రచన - 320 (కావ్య కన్యక)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“కావ్య కన్యక”
ఈ అంశాన్ని పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

12 కామెంట్‌లు:

 1. మిత్రులారా! శుభాశీస్సులు.

  కావ్య కన్యక గురించి శివానందలహరిలో శ్రీమదాది శంకరులు రచించిన ఒక శ్లేషాలంకార శోభితమైన శ్లోకమును వ్రాయుచున్నాను:

  సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం
  సద్భిస్సంస్తూయనాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం
  ఉద్యద్భూషా విశేషా ముపగతవినయాం ద్యోతమానార్థ రేఖాం
  కళ్యాణీం దేవ! గౌరీప్రియ! మమ కవితా కన్యకాం త్వం గృహాణ

  ఈ శ్లోకమునకు (1) కవితా కన్యక అనే అర్థములో (2) కన్యకామణి అనే అర్థములోను తాత్పర్యమును చెప్పుకొనవచ్చును:

  1. ఈ కావ్య కన్యకలో ఎన్నో ఉపమా, రూపక, శ్లేష మొదలైన అలంకారములు కలవు. సరళమైన పదములు, మంచి ఇతివృత్తము, సొగసైన అక్షరముల సముదాయములు కలిగి పండితుల ప్రశంసల నందుకొనుచున్నది. రసమయమైనది; గొప్ప గుణములు కలిగినది, బాగుగ నుదహరింపదగినది. మంచి మంచి స్పష్టములైన అర్థములు కలది కళ్యాణ లక్షణములు కలది.

  2. కన్యకగా - ఎన్నో అలంకారములు కలది, కోమలములైన పదములు గలది, ఉత్తమమైన నడవడిక కలది, గొప్ప తేజస్సుకలది, మంచి వారలచేత పొగడబడుచున్నది, మంచి గుణములు కలది. ఎంతో ఆదర్శవంత మైనది. కళ్యాణ లక్షణములు, సద్భూషణములు, స్పష్టమైన భాగ్యరేఖ కలది - మంగళ రూపము కలది.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 2. ఆశ్రిత్య సత్కవివరం కవితేవ కన్యా
  సాలంకృతీ మృదుపద గభీర భావా |
  సుశ్లోక రంజిత తనూః కమనీయ వృత్తా
  జీయాత్ వధూ రుచిరమన్వయ సౌష్టవేన ||

  - కీ.శే. "ఉభయభాషావధాన శేఖర"
  శ్రీ రాంభట్ల జగన్నాథ శాస్త్రి గారి రచన.

  రిప్లయితొలగించండి
 3. కవితాలంకృత! గౌణజృంభిత! లసద్గాంభీర్య వస్త్వన్వితా!
  నవభావ ప్రధిథ ప్రభాసిత! రసానందాబ్ధి సమ్మోహితా!
  శ్రవణామోద వచోవిలాస మహితా! సాహిత్య సంశోభితా!
  స్తవనీయస్థితి కావ్యకన్య - యిటులన్ వర్థిల్లులోకంబునన్

  రిప్లయితొలగించండి
 4. సేకరణ: సాహిత్యాభిమాని
  బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్
  కూళల కిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్
  హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూలగౌ
  ద్దాలికులైన నేమి నిజ దార సుతోదర పోషణార్థమై !!

  రిప్లయితొలగించండి
 5. కావ్య కన్యక జూడగ నవ్య మల రి
  భావ లాలిత్య సొగసులు భద్ర ప ఱచి
  కుందనపు బొమ్మ బో లె డి యంద మునన
  కవి వరుల లే హృ దయాల గలత బ ఱచె .

  రిప్లయితొలగించండి
 6. సకలాంధ్రసాహితీ సాగరంబునకెల్ల
  ........నగ్రజుడై వెల్గు నాదికవికి
  నన్నపార్యున కెట్లు నానావిధంబులౌ
  ........యశము లబ్బెను నాడు దిశలనిండ,
  ప్రేమతో తిక్కన్న సోమయాజిని తాను
  ........"మామ"యంచును బిల్చి మనుమసిద్ధి
  అత్యుత్తమంబైన ఆదరంబును జూపి
  ........చేరదీయుచు నేల గారవించె,
  ఇంపుగా కవియైన ఎర్రనార్యుం డెట్లు
  ........పరమేశ్వరత్వంబు పడయ గలిగె,
  కవిసార్వభౌముడై యవనీతలంబందు
  ........కింకవీంద్రులనెల్ల హుంకరించు
  శ్రీనాథకవిరాజు కానందమున జూడ
  ........స్వర్ణాభిషేకంబు జరిగెనేల,
  కర్షకవృత్తితో కాలయాపన చేయు
  ........పోతనామాత్యుండు పూర్వమునను
  సహజపండితుడంచు, సద్భక్తకవి యంచు
  ........ఖ్యాతినందుట కేమి కారణంబు,
  గండపెండేరాది ఘనమగు సన్మాన
  ........మల్లసానికి రాయ లందజేసి
  సురుచిరమౌరీతి పురమేగ జేయించి
  ........పల్లకి తనచేత పట్టెనేల,
  విశ్వనాథయు నేటి విజ్ఞ సీ.నా.రెడ్డి
  ........జ్ఞానపీఠమునెక్కి మానితమగు
  యశము నందంగ కారణ మయ్యదేమి?
  సుందరంబైన యితివృత్త మందియుండి
  పలురకంబుల ఛందాలు, భవ్యమైన
  రీతులు, గుణంబు లందరి చేతమలర
  చేయగలయట్టి శైలులు, హాయినొసగు
  భావసంపత్తి మధురమౌ పలుకులుంచి
  రచన కావించబడి యుండి ప్రచురములగు
  ధర్మవిషయాలు వ్యవహార మర్మములును
  బోధ చేయుచు, సన్మార్గ సాధనంబు
  నగుచు ధరవారి కెల్లర కనవరతము
  శుభములను గూర్చి బహువిధ విభవమొసగు
  "కావ్యకన్యక"యేగాదె కారణంబు.  రిప్లయితొలగించండి
 7. నేమాని పండితార్యుల శివానంద లహరి, అవధాన సుధాకరుల సుశ్లోక రంజిత, సాహిత్యాభిమానుల కోమల కన్యక, హరివారి సీస మాలిక బ్రహ్మానంద దాయకములు.


  చదివెడు వారికి చక్కిలిగిలి వెట్టి
  ...........సరసమ్ము చవిజూపు సన్నుతాంగి!
  నవరసమ్ములు నిండి నాల్కపై చవులూరి
  ...........దండి రుచుల జూపు పిండి వంట!
  హృదయ నేత్రమ్మున కింపగు శిల్పంపు
  ...........రమణీయతను జూపు రమ్య సృష్టి!
  ఆదరించెడు వారి యక్కున నొదుగుచు
  ...........మారాము జేసెడు మంచి బాల!

  భావ జాలంపు కడవలో పాల పొంగు!
  మనసు తోటలో విరబూయు మల్లె పూవు!
  అంద చందాల కెనలేని హంస గమన!
  కవికి గారాల పుత్రిక కావ్య కన్య!

  రిప్లయితొలగించండి
 8. కావ్య కన్యక సొగసులు కవన మందు
  మధుర భావన సుమములు యెదను జల్లి
  సుధలు కురిపించు రచనల సోయగములు
  కవులు వర్ణించి నింపిరి కలము లందు

  నాకు మంచి ప్రమోషన్ ఇచ్చి నందుకు మరిన్ని ధన్య వాదములు తమ్ముడు ! ప్రియ మైన అమ్మ కంటె మించిన అనుబంధం మరెక్క డుంది ?

  రిప్లయితొలగించండి
 9. కడుపున బుట్టిన గన్యక
  యడుగిడ గుణవంతునింట నానందమదే!
  నుడివిన సుకావ్య కన్యకఁ
  బడసిన సుచరితుని కీర్తి పలుకగ తరమే?

  రిప్లయితొలగించండి
 10. ఆడ పిల్ల కిప్పుడాదరంబది లేదు
  కవిత వ్రాయ మెచ్చు ఘనులు లేరు
  కన్యకైన మంచి కావ్య కన్యకనైన
  కనగ ముందు వెనక కనుచు నుంద్రు.

  రిప్లయితొలగించండి
 11. కలకాలము నిలువగల న
  చలమగు కీర్తినిడు; సప్త సంతానములన్
  విలువయినదియగు; భళిరే,
  కలుషతఁ జేరనిది కావ్యకన్యక గాదే!

  రిప్లయితొలగించండి
 12. ఆది శంకరుల శ్లోకాన్ని తెలిపి, అందలి శ్లేషను వివరించిన పండిత నేమాని వారికి ధన్యవాదాలు.
  *
  "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
  శ్రీ జగన్నాథ శాస్త్రి గారి శ్లోకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
  *
  కావ్యకన్యక వైభవాన్ని సీసమాలికలో వివరించిన హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ ముగ్ధ మనోహర కావ్యకన్యక అలరిస్తున్నది. అభినందనలు.
  *
  కావ్యకన్యకపై సరసమైన పద్యాలను రచించిన కవిమిత్రులు....
  సుబ్బారావు గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  సహదేవుడు గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి