16, ఏప్రిల్ 2013, మంగళవారం

శ్రీమాతృ స్తోత్రము (సీసమాలిక)





శ్రీమాతృ స్తోత్రము (సీసమాలిక)

శ్రీమాత! శ్రీవిద్య! శ్రీమన్మహారాజ్ఞి!
సింహాసనేశ్వరీ! చిత్స్వరూప!
శ్రీమాత! శ్రీసదాశివ భామినీ! మణి
ద్వీపవిహారిణీ! వేదమాత! 
శ్రీమాత! నీ దివ్య నామ మంత్రంబును
జపమొనర్చుచునుందు స్వాంతమందు
శ్రీమాత! నీ దివ్య నామ సహస్రమున్
పారాయణ మొనర్తు భక్తి మీర
శ్రీమాత! నీ దివ్య నామమ్ము లాత్మలో
ధ్యానమ్మొనర్తు దయానిధాన!
శ్రీమాత! నీ దివ్య నామ విశేషముల్
భావించి హర్షంబు బడయుచుందు
శ్రీమాత! నీ దరస్మేర ముఖాబ్జమున్
తిలకించనెంతు నో దివ్య గాత్రి!
శ్రీమాత! నీ పదశ్రీ పంకజయుగమ్ము
నర్చించుచుందు నే ననవరతము
శ్రీమాత! మీ మహాలీలా విశేషముల్
గానమ్మునొనరింతు  జ్ఞానదాత్రి!
శ్రీమాత! నీ చరిత్రామృత పానమ్ము
గావించుచుందు నో దేవవినుత!
శ్రీమాత! నీ గుణశ్రీవైభవమ్మును
స్తోత్రమ్మొనర్తు ప్రస్తుత చరిత్ర!
శ్రీమాత! నీభక్త బృందంబు తోడ సాం 
గత్యమ్ము నొనరింపగా దలంతు
శ్రీమాత! నీ మహాక్షేత్ర రాజమ్ముల
కేగుచు నిన్ను సేవించుచుందు
శ్రీమాత! నీ పద శ్రీయుగ్మ సన్నిధి
వ్రాలి గావింతును వందనములు
శ్రీమాత! నీ సచ్చరిత్రంబు విరచింతు 
సచ్చిదానంద లక్షణ సమేత!
శ్రీమాత! సర్వసంసిద్ధి ప్రదాయినీ!
ఆనందవర్షిణీ! అమృతరూప!
శ్రీమాత! త్రిభువన శ్రేయఃప్రదాయినీ!
ఆశ్రిత వత్సలా! అభయ వరద!
శ్రీమాత! జయ జయ శ్రీ నినాదంబుల
నొనరించుచుందు నీ యొద్ద నిలిచి
జయము శ్రీమాత! లలిత! శ్రీచక్రనిలయ!
జయము శ్రీమాత! జనని మోక్షప్రదాత్రి!
జయము శ్రీమాత! జ్ఞాన విజ్ఞానదాత్రి!
జయము శ్రీమాత! భువన రక్షైక దక్ష!
జయము శ్రీమాత! సంఫుల్ల సారసాక్షి!
జయము శ్రీమాత! చిద్రూప! జయము జయము 

పండిత రామజోగి సన్యాసి రావు

9 కామెంట్‌లు:

  1. పండితార్యులకు వందనములు. మీ రచన అద్భుతం అనడం కాళిదాసు గొప్ప కవే సుమా! అన్నట్లు ఉంటుంది. ఎవరు అంగీకరించిన అంగీకరించకపోయిన ఆయన గొప్ప కవి అనడంలో సందేహం లేదు కదా !
    మీ మాలికను చదివే వారు అమ్మ దయను అపారంగా పొదుతారనడంలో అతిశయోక్తి లేదు.

    కల్లొలొల్లసితామృతాబ్ధిలహరీమధ్యే విరాజన్మణి-
    ద్వీపే కల్పకవాటికాపరివృతే కాదమ్బవాట్యుజ్జ్వలే|
    రత్నస్తంభసహస్రనిర్మితసభామధ్యే విమానొత్తమే
    చిన్తారత్నవినిర్మితం జనని తే సింహాసనం భావయే||౧||
    ఒ జనని| కల్లొలమైన అమృత సముద్ర తరంగముల మధ్యలొ విరాజిల్లుచున్న మణి ద్వీపము నందు కల్పవృక్షముల తొటలతొ చుట్టి ఉన్న, కాదంబ (కడిమి చేట్లు) వృక్షముల తొటలతొ ప్రకాశించుచున్న , వేలాది రత్న స్తంబములచే నిర్మించబడిన సభాభవనమును నందలి విమానము నందు చింతామణులతొ నిర్మించబడిన నీ సింహాసనమును మనస్సు నందు భావించుచున్నాను.
    ఈశానాదిపదం శివైకఫలకం రత్నాసనం తే శుభం
    పాద్యం కుఙ్కుమచన్దనాదిభరితైరర్ఘ్యమ్ సరత్నాక్షతైః|
    శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం
    కారుణ్యామృతవారిధే తదఖిలం సంతుష్టయే కల్పతామ్||౩||
    ఈశానుడు-రుద్రుడు-విష్ణుమూర్తి-బ్రహ్మ అను నలుగురు నాలుగు కొళ్లుగా కలదీ, శివతత్త్వము ప్రధానమైన ఫలముగా నున్నదీ, శుభకరమైనదీ అగు రత్నాసనము, కుంకుమ-చందనము మొదలగు వాటితొ నిండిన నీటితొ ఆచమనము భక్తిగా నా చేత కల్పించబడినది.ఒ కరుణామృత సముద్రమా| ఇదంతా నీకు సంతొషము కల్గించుగాక.
    శ్రీమన్త్రాక్షతమాలయా గిరిసుతాం యః పూజయేచ్చేతసా
    సంధ్యాసు ప్రతివాసరం సునియతస్తస్యామలం స్యాన్మనః|
    చిత్తామ్భొరుహమణ్టపే గిరిసుతానృత్తం విధత్తే రసా-
    ద్వాణీ వక్త్రసరొరుహే జలధిజా గేహే జగన్మఙ్గళా||౧౬||
    శ్రీ మంత్రాక్షతమాలికతొ పార్వతీ దేవిని ఏవడు నిశ్చలమైన మనస్సుతొ నియమవంతుడై ప్రతిదినము మూడు సంధ్యల యందు పూజించునొ వాని హృదయము నందు పార్వతీ దేవి ఆనందముతొ నృత్యము చేయును. సరస్వతీ దేవి ముఖమునందు నివసించును. జగన్మంగళకారిణియగు లక్ష్మీదేవి అతని గృహమునందు విలసిల్లును.

    రిప్లయితొలగించండి
  2. మాతృ మూర్తిని గూరిచి మాలి కంబు
    రచన జేసిన గురువర ! రామ జోగి !
    సాటి యెవరయ్య ! నీ కిల ? సాటి లేరు
    అందు కొనుమయ్య ! వందనా లందు కొనుము .

    రిప్లయితొలగించండి
  3. అన్నయ్య గారికి సాహిత్యాభిమాని గారికి నమస్సులు. చక్కని ప్రార్ధనల నందించి నందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  4. నేమాని పండితార్యా! అమ్మ కృపకందరినీ పాత్రులను చేశారు.

    రిప్లయితొలగించండి
  5. గురువు గారికి నా యొక్క ప్రణామములు :

    పరగు సద్భావనా ప్రస్ఫుట కాంతుల
    పండిత నేమాని వారి పలుకు

    చెరగు నాల్గు దిశల శేముషీ విభవమ్ము
    పండిత నేమాని వారి పలుకు

    కరగి శిలల జాఱు గంగా ప్రవాహమ్ము
    పండిత నేమాని వారి పలుకు

    సరిపోల్చ వచ్చు రసాల ఫలమునకు
    పండిత నేమాని వారి పలుకు

    స్తోత్ర మాలికా రచనల సోయగమ్ము
    ముక్తి మోక్ష మార్గము జూపి పొంగుచుండు
    భక్తిభావ బంధురమగు పద్యములను
    పంచు పండిత నేమాని వారి పలుకు

    రిప్లయితొలగించండి
  6. నమస్కారములు
    భక్తి పూర్వక మైన స్తోత్రమును మా కందించిన పూజ్య గురువులకు శిరసాభి వందనములు

    రిప్లయితొలగించండి
  7. ఆర్యా!
    నమస్కారములు,

    సీసమాలికలోన చిన్మయరూపిణీ
    స్తవము పలికి రార్య చక్కగాను,
    జగదంబ నామంబు సకలలోకాలకు
    నానందమును గూర్చు ననవరతము
    చేరి సద్భక్తితో శ్రీమాత నర్చించ
    సిద్ధించు సంపద లిద్ధరిత్రి,
    పరమందు సౌఖ్యంబు నిరతంబు లభియించు
    ననుటలో సందేహ మందనేల?
    కాన లోకమాత కమనీయ చరితకు
    స్తోత్రరూప మొసగి శుద్ధమతిని
    చదువుకొనుటకొరకు ముదముతో నందించు
    పండితార్య! మీకు వందనములు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీమాతృస్తోత్రమ్మును
    ప్రేమ మెయిన్ మెచ్చుకొనిన ప్రియ హిత తతికిన్
    కామితము లిచ్చి ప్రోచును
    శ్రీమాత దయానిధాన చిత్తము లలరన్

    రిప్లయితొలగించండి